Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్ వస్తే కరంట్ కట్

-వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్నం
-తలసరి విద్యుత్ వినియోగంలో మనమే టాప్
-మేధావి చంద్రబాబు కరంటు ఎందుకివ్వలేదు?
-మనం తెలంగాణ పోరాటయోధులం
-చంద్రబాబు పెత్తనం మనపై అవసరమా?
-నరేంద్రమోదీ, అమిత్‌షాకు మతం బీమారీ
-ఆరునూరైనా ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు సాధిస్తం
-ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
-ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష

తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని, కానీ.. వారందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఎలాంటి విద్యుత్‌కోతలు లేకుండా రాష్ట్రం దూసుకుపోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే.. కరంటు పోతదని ప్రజలను హెచ్చరించారు. వాళ్లకు తెలివిలేదు.. చెయ్యరాదు.. ఎటమటమైపోతం. ఆగమైపోతం. మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి. కొనుక్కుందామా? అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష అని సీఎం చెప్పారు. మోసపోతే గోసపడుతామని అన్నారు. 58 ఏండ్ల పాలనలో కాంగ్రెస్, 17 ఏండ్ల పాలనలో టీడీపీ ఏంచేశాయో.. పద్నాల్గేండ్లు రాష్ట్రంకోసం కొట్లాడి, సా ధించి.. నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ఎలా అభివృద్ధి చేసిందో గమనించి.. నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌కు పాజిటివ్ వేవ్ కనిపిస్తున్నదని చెప్పారు. సోమవారం కామారెడ్డి, డిచ్‌పల్లి, బోధన్, మోర్తాడ్, జగిత్యాల, కరీంనగర్, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, వరంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.

హైదరాబాద్‌ను తానే అభివృద్ధిచేశానని, ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను పెట్టానని చెప్పుకొనే మేధావి చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు కరంటు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబుకు 17 ఏండ్లు, కాంగ్రెస్‌కు 58 ఏండ్లు సరిపోలేదా కరంటు ఇవ్వటానికి? అని నిలదీశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉండే! సమైక్యాంధ్ర చివరి సీఎం! కట్టెపట్టి చూపించిండు. తెలంగాణ వాళ్లకు తెలివిలేదు.. తెలంగాణ ఏర్పాటు అవసరంలేదు. దబ్బున తెలంగాణ అయితే రాష్ట్రం చిమ్మచీకటి అయితది అన్నడు. నేను గర్వంగా చెప్తున్న.. కేంద్ర విద్యుత్ ప్రాధికారసంస్థ దేశంలో తలసరి విద్యుత్ వినియోగం.. అంటే ఒక్కోవ్యక్తి ఎంత కరంటు వినియోగిస్తున్నారో ప్రకటించింది. అందులో.. ఇండియా మొత్తంలో అతి ఎక్కువ వ్యక్తిగత విద్యుత్ తలసరి వినియోగం తెలంగాణలో ఉన్నదని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే నంబర్ వన్‌గా ఉన్నం. జాతీయసగటు కంటే కూడా ఎక్కువ ఉన్నం అని సీఎం వివరించారు. మన దగ్గర కరంటు వెలిగిపోతుంటే.. ఆంధ్రలో 24గంటల కరంటు లేదన్నారు. మొత్తం భారతదేశంలో రైతులకు వ్యవసాయం కోసం 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు.

మూడున్నర నాలుగేండ్ల కింద ఎంత గోసపడ్డమో.. మోటర్లు ఎట్ల కాలిపోయినయో.. ట్రాన్స్‌ఫార్మర్లు ఎట్ల పేలినయో.. నేను కూడా కాపోన్నే.. నాకు కూడా తెలుసు! నేను కూడా బాధపడ్డ. హళ్లికి హళ్లి.. సున్నకు సున్న.. కాలిన మోటర్లకే సరిపోతుండె! అన్నారు. ఆరోజు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణవాళ్లు తెలివితక్కువోళ్లని చెప్తే.. విద్యుత్ ప్రాధికార సంస్థ నంబర్‌వన్‌గా గుర్తించింది! టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి.. ప్రజలు డిక్లేర్ చేయాలె.. మీరు సర్టిఫికెట్ ఇయ్యాలె.. మోటరు కాల్తలేదు అనే ముచ్చట మీరు చెప్పాలె.. ఆ విషయాన్ని ఓటు ద్వారా చూపెట్టాలె అని ప్రజలను కోరారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్న మనం యోధులమన్న సీఎం.. మనపై చంద్రబాబు పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. రైతులను ధనవంతులను చేయడమే తమ లక్ష్యమన్న కేసీఆర్, రాష్టంలో ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో అభివృద్ధి జరుగలేదని, స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలో అమలుచేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి మీ కండ్ల ముందే ఉందన్నారు. అటుపక్క టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయని, ఇటువైపు తెలంగాణ తెచ్చి, అభివృద్ధిపథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్ ఉందని, ఎవరిని గెలిపించాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వివిధ సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన సీఎం.. ఇన్ని ఉండగా ఎవరికో ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఆయా సభల్లో వివిధ అంశాలపై ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలువాలి
ఎన్నికలు రాగానే చాలా పార్టీలు, జెండాలు మీ ముందుకు వస్తయి. ఆగమాగం కావద్దు. అందరూ చెప్పేది వినాలె. మీ గ్రామాలకు, బస్తీలకు వెళ్లినంక.. ఏంచేస్తే మనకు లాభమనేది చర్చ చేయాలె. ప్రజాస్వామ్యంలో పార్టీలు, నాయకులు గెలుచుడు ముఖ్యంకాదు.. ప్రజలు, ప్రజల అభీష్టం గెలువాలె. ప్రజలు ఏం కోరుకుంటరో.. అది జరుగాలె. అది జరిగితే ఏమైతది.. ప్రజలు ఏ అజెండా మీద ఓట్లేశారో.. తర్వాత ఐదు సంవత్సరాలు అది అమలు జరుగుతది. ఆగమాగం ఓట్లేస్తే తీర్థం పోదాం తిమ్మక్కా.. అంటే నీవు గుల్లే.. నేను సల్లే.. అట్ల అయితది. కాంగ్రెస్‌పార్టీ, కాకరకాయపార్టీలకు 70 ఏండ్లు చాల్లేదట. ఇంకెన్ని ఏండ్లు కావాలి పరిపాలనకు? తెలంగాణకోసం కొట్లాడినోన్ని కాబట్టి కడుపు నొప్పి ఉంటది కాబట్టి చెప్పుతున్న. ఇంకెన్ని రోజులు ఆగమైతం? అమాయకుల్లెక్క ఉంటే ఆగమైతం.

ఇంకోనికి ఎందుకు ఓటెయ్యాలె..
ఆడపిల్ల పెండ్లి అయితే రూ. 1,00,116 ఇస్తరని అనుకున్నమా? వాళ్లు పంచుకతినుడు తప్ప.. రాలేదు కదా! బీడీలు చేసేటోల్ల గురించి ఆలోచన చేశారా? యూనియన్ లీడర్లు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకునుడు.. వాడింత ఇయ్యంగనే కీసలపెట్టుకుని పోవుడు. వాళ్లకు మంచిగ లేదని వేయి రూపాయల పింఛన్ ఇచ్చుకుంటున్నం. వాళ్లు ఒక పూట తింటున్నరు. బతికేటట్టు అయ్యారు. మళ్ల గవర్నమెంట్ వచ్చిన తెల్లారి పింఛన్‌ను రూ.2016 చేసుకుందాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అందరికీ రూ.2016 చేసుకుందాం. ఆడపిల్ల పుడితే 13వేల రూపాయలు ఇస్తరు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి మీ ఊర్లల్లో వస్తలేదా? మిషన్ భగీరథ పథకం మీ ఊళ్ల జరుగలేదా? 24 గంటల కరంటు వస్తలేదా? తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నంత కడుపునిండ కాపాడుకొని, సవరించుకొని ఒక పూల పొదరిల్లుగా చేసుకుంటున్నం. మరి ఇవన్నీ ఉండగా ఓటు ఇంకోనికి ఎందుకెయ్యాలి?

రైతుబీమా అమలుతో సంతోషంగా ఉన్నది
కరంట్ బాధ పోయింది. మంచినీళ్ల బాధ పోతున్నది, డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకుంటున్నం. పేదలను, రైతులను ఆదుకుంటున్నం. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా రైతుబంధు ఇస్తున్నం. నీటితీరువా రద్దుచేశాం. వ్యవసాయ ట్రాక్టర్లమీద టాక్స్ రద్దుచేశాం. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రంతోని కొట్లాడుతున్నం. రైతుబంధును ఎకరాకు రూ.5 వేలకు పెంచుతం. తర్వాత గెలిచేది మనమే కాబట్టి అన్నీ చేసుకుందాం. అన్నింటికంటే రైతుబీమా అమలు సంతోషంగా ఉన్నది. రైతు బీమాతో ఒక ధీమా! గుంట భూమి ఉన్న రైతైనాసరే.. చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నం. రూపాయి లంచం లేదు.. మధ్యవర్తులు లేరు. ఈ స్కీంతోని 3400 మందికిపైగా లబ్ధిపొందారు. అందులో 95% చిన్న, సన్నకారు రైతులే. ఆ కుటుంబాలవాళ్లు రెండు చేతులెత్తి దండం పెడతా ఉన్నరు. లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రి అయ్యాకే రైతుబంధు, రైతుబీమా వంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నయి.

పీఎఫ్ కటాఫ్ 2018 చేస్తాం..
బీడీ కార్మికులకు పీఎఫ్‌కు 2014 కటాఫ్ అంటున్నరు.. దానిని 2018 చేయాలని అడుగుతున్నరు. గ్యారెంటీగా 2018 కటాఫ్ చేస్తం. బీడీ పరిశ్రమలో పనిచేసేటోళ్లు టేకెదార్లున్నరు. వాళ్ల సక్కదనం ఏమీలేదు.. వాళ్లు మంచిగేమీ లేరు. వాళ్లకు కూడా ఈ రూ.1000 పెన్షన్ వర్తింపజేస్తం. బీడీకార్మికులు లక్షల్లో ఉంటే వీళ్లు వేలల్లో.. కొద్దిమందే ఉంటరు. ఇంతమందికి ఇచ్చినప్పుడు అది పెద్ద సమస్య కాదు. వాళ్లుకూడా దీంతోపాటు బతుకుతున్నరు కాబట్టి వాళ్లనుకూడ ఆదుకుంటం.

అన్ని నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
రైతుబీమా కొనసాగుతుంది. ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరుకుతయి. మీరు బ్రహ్మాండంగా పంటలు పండిస్తరు. కాళేశ్వరం నీళ్లుకూడ వస్తయి కాబట్టి పంటలు పండుతయి. పంటలు బ్రహ్మాండంగా పండితే గిట్టుబాటు ధర రావాలి. ఎట్ల రావాలె! దానికి మంచిమార్గం ఆలోచించిన. ఇక్కడే ఉండే మత్స్యకారులకు కూడ సంతోషకరమైన వార్త చెప్తున్న. ఎస్సారెస్పీల మునుపటిలాగా నీళ్లు తగ్గయి. ఎండిపోదు. ఒకసారి కాళేశ్వరం లింకైపోతే జూన్ తరువాత ఎప్పుడూ నిండుకుండలా ఎస్సారెస్పీ ఉంటది. పుష్కలంగా వేల టన్నుల చేపలు పండుతయి. ఆ చేపలను కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో భాగంగా కొనుగోలుచేస్తరు. మీ పసుపు కొమ్ము, మీ అల్లం కొమ్ము, మీ మొక్కజొన్న, ఎర్రజొన్న.. అన్నీ మహిళా సంఘాలే కొనేటట్లుగా, మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అప్పగిస్తాం. ఐకేపీ ఉద్యోగుల ద్వారా ఏ ఊరికి ఆ ఊర్లనే సెంటర్లల్ల మీ పసుపు, మీ ధాన్యానికి మంచి మేలురకం ధర ఇచ్చి కొనుగోలుచేసి, దాన్ని తయారుచేసి ఇస్తరు. ఇవ్వాల హైదరాబాద్‌లో పసుపు కొనుక్కోవాలంటే రంపపుపొడి, కెమికల్ కలుపుతరు! దుర్మార్గంగా ఉన్నది.. బీమార్లు వస్తా ఉన్నయి. మన దగ్గరనే మంచిగ బాల్కొండల, ఆర్మూర్ల పసుపు పండుతది.. ఎందుకు కొనుక్కొస్తున్నరు? అని నేను అడిగితే మనదేమో బయటకు పోతున్నది.. బయటినుంచి మనకు వచ్చి కల్తీ అవుతున్నది అని చెప్పిండ్రు. మనదగ్గర పండే పసుపు బ్రహ్మాండంగా ఇక్కడనే ప్రాసెసింగ్ చేసి, ప్రతి కుటుంబానికి రేషన్‌షాపుల ద్వారా అందించే పథకం ఆలోచన చేస్తున్నం. గిట్టుబాటు ధరలు కూడా బ్రహ్మాండంగా వస్తయి.

కనీవినీ ఎరుగని సంక్షేమం..
సంక్షేమంలో గత ప్రభుత్వాలు ఏమి చేసినయి? ఈ ప్రభుత్వం ఎట్ల చేసిందన్నది మీ ముందట్నే ఉంది. గతంలో ఈ మేధావులు ఎందుకు పనిచేయలేదు. వారికి శ్రద్ధ లేదు. పేదలమీద, రైతులమీద పట్టింపు లేదు. వాళ్ల రాజకీయాలు వాళ్లే చేసుకున్నరు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలే. రైతులు, కార్మికులు, ప్రజలు, పేదలకోసం పనిచేసిన వారెవ్వరో చూడాలి. గతంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్లలో ఒక్కోరోజు పదిమంది, పదకొండుమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. షోలాపూర్, భీవండి, బొంబాయి పోయిండ్రు. కానీ ఈరోజు చేనేత కార్మికులను ఆదుకున్నం. ఆత్మహత్యలు ఆగిపోయినయి. 50% సబ్సిడీ మీద ఇండియాలో ఎక్కడా ఇవ్వనివిధంగా నూలు, రసాయనాలు ఇస్తున్నం. వారు నేసిన బట్టలను ప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నది. యాదవులు, గొల్లకురుమలు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1500 కోట్ల అదనపు సంపాదన ఆర్జించారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నం.

ఏడాదంతా నిండుకుండలా శ్రీరాంసాగర్
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల అసమర్థత, అవివేక చర్యలవల్ల ఎస్సారెస్పీ ఎండిపోయే పరిస్థితి. రెండు, మూడేండ్లకు కూడా నీళ్లు రాని పరిస్థితి. వచ్చే నీళ్లకు కూడా పెద్ద గందరగోళం. కాల్వల మీద కొట్లాటలు.. పంచాయితీలు. వరద కాల్వ మీద ప్రాజెక్టు నుంచి జగిత్యాల వరకు పది వేల కరంటు మోటర్లు ఉన్నయి. సర్, పది వేల మోటర్లున్నయి.. నీళ్లు ఇడిస్తే కిందకు వస్తలేవు.. అని ఆఫీసర్లు చెప్పినరు. వాటిని బంద్‌జేస్తమన్నరు. నేను ఎట్టి పరిస్థితుల ముట్టొద్దని చెప్పిన. వాళ్లు మన రైతులు, మన బిడ్డలు.. పంటలు పండియ్యడానికి నీళ్లు తీసుకుంటుర్రు తప్ప మరెక్కడికో కాదు. వాళ్ల స్వార్థంకాదని చెప్పిన. ఈ బాధ తర్వాత.. మమ్మల్ని ఎవరూ అడగలే.. ఎవరూ కాగితాలియ్యలే.. ధర్నా చేయలే. నాకు నేనుగ ఆలోచనచేసి, ఈ ప్రాంత రైతుల శాశ్వతమైన బాధ పోవాలనిచెప్పి, మీదికెళ్లి గోదావరి రాకున్నా ఎస్సారెస్పీ నింపాలని శ్రీరాంసాగర్ పునర్జీవన పథకాన్ని వెయ్యి కోట్లతో చేపట్టినం. పనులన్నీ జరుగుతున్నయి. రాజేశ్వరరావుపేట దగ్గర రెండోలిఫ్టు, చొప్పదండి నియోజకవర్గంల మొదటిలిఫ్టు కార్యక్రమాలు జరుగుతున్నయి. వచ్చే జూన్ తర్వాత ఎస్సారెస్పీ వరద కాల్వ 365 రోజులు నిండే ఉంటది. ఎస్సారెస్పీ ఎప్పుడూ నిండుకుండలా, వరప్రదాయినిలా ఉంటది.

రౌడీలను తొక్కుడు తొక్కితే..
రౌడీలకు ఎనిమిది చేతులు ఉండవు. వాళ్లు కూడా మనలాగే మనుషులే. మనం అణిగిమణిగి ఉన్నంతవరకే రౌడీల రాజ్యం. తొక్కుడు తొక్కితే వాళ్లు పాతాళానికి పోవాలి. తెలంగాణకోసం రాకాసితోనే పోటీపడ్డా.. ఈ గోకాసితో ఏం కాదు. ఇక్కడ రౌడీయిజం చెల్లదు.

చంద్రబాబును అప్పుతెచ్చుకుంటరా?
చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబును అప్పుతెచ్చుకుంటారా? తెలంగాణ మొత్తం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నది. ఆంధ్రా చంద్రబాబుకు తెలంగాణలో ఏమి పని? పద్నాల్గేండ్లు కొట్లాడి, వందలమంది పిల్లలు చనిపోయి.. రాష్ట్రం సాధించుకుంటే.. ఇప్పుడొచ్చి చిల్లర రాజకీయాలు చేయాలని కుట్రచేస్తుండు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ఏమంటుండు చంద్రబాబు! మీ తెలంగాణలో గొర్రెలు ఉన్నయి. మీ ఇంటికొచ్చి మిమ్ముల్ని కొట్టిపోతా అంటుండు. ఎవరికోసం.. ఎందుకు భరించాలి? కుట్రలను తిప్పికొట్టాలి. పొరపాటున చంద్రబాబు గెలిస్తే ప్రమాదమే. ఇప్పుడు కూడా మనకు చంద్రబాబు పెత్తనం అవసరమా? కాళేశ్వరం మీద కేసు.. వరదకాల్వ నింపుకుంటమంటె కేసు.. పాలమూరు కడుతమంటే కేసు.. ఖమ్మంల సీతారామ కడతమంటే కేసు.. మిషన్ భగీరథ నీళ్లు తీసుకుంటమంటె కేసు.. దేవాదుల పూర్తిచేస్తమంటే కేసు.. తెలంగాణకు నీళ్లు తీసుకునే ప్రతి ప్రాజెక్టు మీద కేసులు వేసిండు. నీళ్లు రావద్దా? కాంగ్రెసోళ్లకు సిగ్గులేదు. మీకు చేతనైతే కొట్లాడాలె.. చీమూ, నెత్తురు, పౌరుషం లేదా? ఎందుకోసం ఇయ్యాల చంద్రబాబును అప్పు తెచ్చుకుంటున్నరు? పోరాటాల గడ్డపై టీడీపీ అభ్యర్థులు ఉండటం సిగ్గుచేటు. అధికారం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఎంత నీచానికైనా దిగజారుతమని ఈరోజు కాంగ్రెస్ రుజువు చేసుకున్నది. అందుకే నేనెప్పుడూ చెప్త.. ప్రజలు గెలువాలి.. ప్రజల అభీష్టం గెలువాలి. అందుకే.. వలసతాధిపత్యాన్ని మళ్లీ మన నెత్తిన రుద్ది, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌ను చావు దెబ్బకొట్టి, బుద్ధి చెప్పాలె. మీరు అద్భుతమైన ఫలితం ఇచ్చి.. మావద్ద వలస ఆధిపత్యం చెల్లదు.. ఈ కాలం చెల్లిన వ్యవహారం తెలంగాణ సహించదని రుజువు చేయాలి.

అప్పులు పోయి.. నిల్వకు వస్తేనే బంగారు తెలంగాణ
కచ్చితంగా ఉచిత కరంటు, రైతులకు పెట్టుబడి ఇస్తం. చనిపోయిన రైతులకు బీమా ఇస్తం. రెండు పంటలకు సరిపోను నీళ్లు ఇస్తం. ఒక పదేండ్లు అట్లా వస్తే రైతులు మొత్తం అప్పు కట్టేసి.. బ్యాంకులో ఐదారు లక్షలు సిలాకు అయితది. అదీ బంగారు తెలంగాణ! గది కావాలె! రైతులు బాగుంటే వాళ్లతోని రైతుకూలీలు బాగుంటరు. మొత్తం సల్లగ ఉంటది వాతావరణం. ఈసారి ప్రభుత్వంలో తప్పకుండా సాధిస్తం. కరంటు మంచిగుంటది. అన్ని జరుగుతయ్. గీత కార్మికుల గురించి ఎవడన్న పట్టించుకున్నడా? చెట్లపన్ను శాశ్వతంగా రద్దుచేసినం. గౌడన్నలకు ఎక్స్‌గ్రేషియా పెంచినం. చేనేత కార్మికులకు నూలు, రసాయనాలు సబ్సిడీపై ఇస్తున్నం. యాదవ సోదరులకు 80 లక్షల గొర్లను పంచినం. వృత్తిపనులను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నం.

తెలంగాణ రైతులు ధనవంతులు కావాలె..
కేసీఆర్ బతికున్నంతకాలం తెలంగాణ రైతులు ధనవంతులు కావాలె. నేనుకూడా కాపోన్నే.. ఇప్పటిక్కూడా నాకు వ్యవసాయం ఉంది. పేరుకు నేను రాష్ర్టానికి సీఎంను. మీరెవలన్న సూత్తామంటే రాండ్లి నా పొలం కాడికి. 60 ఎకరాల పొలం వట్టిగనే పడావున్నది. లెవల్‌చేసి బ్రహ్మాండంగా ఉంది. కనీ నీళ్లులేవు. ఏం జేయాలె! తుపాకి ఉన్నదిగనీ.. మందుగుండు లేదు. తెలంగాణ బతుకిది! వచ్చే సంవత్సరానికి డిచ్‌పల్లికి నీళ్లు ఎట్లొస్తయో నాక్కూడా అట్నే వస్తయ్. రావాలె. ఎవ్వలమైనా వస్తనే బతుకుతం.. లేకపోతే బతుకుదెరువు లేదు మనకు. అందుకే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి.. ఆరునూరైనా.. ఎంత కొట్లాడైనా సరే కాళేశ్వరం నీళ్లు తెచ్చి.. మా తెలంగాణ రైతుల కాళ్లు కడుగుత.

పన్జేసేటోళ్లను గెలిపిస్తే మంచి జరుగుతది
అన్ని కార్యక్రమాలు మీ ఊళ్లే ఉన్నయి. గతంలో ఏముండే.. ఈ రోజు ఏముండే అనేది గుర్తెరిగి, మనకోసం పన్జేసేవాళ్లను గెలిపిస్తేనే మనకు మంచి జరుగుతది. మన వ్యవసాయాలు నిలబడుతయి.. పేదలకు సంక్షేమం జరుగుతది. ఒకరు మంచిగ ఉంటేకాదు. దళితులు మంచిగుండాలె.. గిరిజనులు మంచిగుండాలె. మన రాష్ట్రంలో కన్ఫ్యూజన్ కూడా లేదు. కాంగ్రెస్, టీడీపీ ఓ దిక్కున్నయ్. పద్నాలుగేండ్లు కొట్లాడి.. తెలంగాణ తెచ్చి నాలుగేండ్లు సర్కారు చేసిన మేం ఒక దిక్కున్నం. మరి 58 ఏండ్ల వాళ్లకాలంలో ఏం జరిగిందో మీకు తెల్వదా! సమస్యలు పరిష్కారం అయినయా? కాలె! పెండింగ్ పెట్టిర్రు. వాళ్లుచేస్తే మామీద ఎందుకు పడుతుండే ఇవన్నీ? మీరు 50 ఏండ్లు ఉన్నప్పుడు ఏడ పన్నరు? ఎవ్వడన్న వద్దన్నడా మీరుచేస్తే! గిరిజనుల భూములున్నయ్.. ఒక నిజామాబాద్ కాదు.. డిచ్‌పల్లిల కాదు. వరంగల్‌లో, ఖమ్మంలో, ఆదిలాబాద్‌లోనూ ఉన్నయ్. గిరిజనులకు పోడు వ్యవసాయం ఉన్నది. అప్పుడు డబ్బులు తీసుకోని కొన్ని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిండ్లు. వారికి కొంత రైతుబంధు చెక్కులు రావాలె. న్యాయం జరుగాలె. పట్టాలు రావాలె. గిరిజన సోదరులకు ఒక్కటే మనవి.. ఈసారి ప్రభుత్వం వచ్చినంక.. ఆర్నెల్ల లోపల ప్రతి జిల్లాకు స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం తీసుకుని నేనే వచ్చి మీ భూములకు కూడా రైతుబంధు చెక్కులిప్పిస్తం. భూముల హక్కులు కూడా ఇప్పిస్త. ఆర్వోఆర్ పట్టాలను ఇప్పించే ప్రయత్నం చేస్త. తెలంగాణ అన్నిరంగాల్లో ఇయాల ముందుకు పోతా ఉన్నది. ఇంకా కూడా ముందుకు పోవాల్నంటే మీ దీవెన కావాలె. ప్రభుత్వం ఎంతమందిని ఆదుకున్నదో మీకు తెలుసు. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటది.

మోదీ, అమిత్‌షాకు మతం బీమారీ
కేసీఆర్ ఏది మొదలుపెట్టినా యుద్ధంలో గెలిచిండు తప్ప.. ఓడిపోలే. తెలంగాణ తెస్తనని చెప్పిన.. తెచ్చిన. మీకు తెలుసు. గిరిజనుల, ముస్లింల రిజర్వేషన్లు కూడా సాధిస్తం. నరేంద్రమోదీకి మతం బీమారీ ఉండె. నిన్న వాళ్ల ప్రెసిడెంట్ కూడా వచ్చినాడు. ఆయన పేరు అమిత్‌షా అంట. ఆయనొచ్చి అడ్డంపొడుగు మాట్లాడి పోయిండు. మేం ఇయ్యం.. ముస్లింలకు రిజర్వేషన్లు రానియ్యం అని మాట్లాడిండు. బిడ్డా మళ్ల తాప నీ లాగు పలిగేదాక దంచుతం.. నువ్వే ఉండవ్ పవర్ల. నువ్వు ఇచ్చుడు మేం తీసుకునుడు కాదు. ఎవ్వర్నో భిక్షమెత్తుకుంటే ఎవరూ ఇయ్యరు. మన రిజర్వేషన్లుగానీ, మన హక్కులుగానీ వచ్చి తీరాలె. రావాల్నంటే దేశంలో ఫెడరల్ ప్రభుత్వం రావాలె. ఫెడరల్ ఫ్రంట్ రావాల్నంటే అసెంబ్లీ ఎలక్షన్లతోపాటు పార్లమెంట్ ఎలక్షన్లలో ఇక్కడున్న 17 ఎంపీలను మనమే గెల్వాలె. హైదరాబాద్‌లో ఎైట్లెనా అసద్‌భాయ్ గెలుస్తడు. మనం మిగిలిన 16 సీట్లు గెల్వాలె. 17 సీట్లు గెలిచి తీసుకోని పోతే.. ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నమో.. అట్లా రిజర్వేషన్లు తెచ్చుకుంటం. మీరేం రంది పడకండి.

అభివృద్ధిలో మనమే టాప్
రాష్ట్ర ఆదాయం పెంచాం. మనకు సమీపంలో ఏ రాష్ట్రం లేదు. 17.17% చొప్పున ఆదాయం పెరుగుతున్నది. ప్రస్తుత ఏడాదిలో 19.83% వృద్ధిరేటు ఉన్నది. ఇది అసాధారణం. అపురూపం. ఇలా కావాలంటే.. అవినీతి, లంచాలు బంద్ కావాలి. లా ఆర్డర్ బాగుండాలి. పేకాట క్లబ్బులు బంద్‌కావాలి. ఇలాచేశాం కాబట్టే ఆదాయం సమకూరుతున్నది. ఇసుకమీద గత పదేండ్లలో రూ.9.56 కోట్ల ఆదాయం రాగా, నాలుగేండ్లలో రూ.2,057 కోట్లు వచ్చింది. ఇదంతా ప్రణాళికబద్ధంగా వచ్చింది. ఇసుక స్మగ్లింగ్ అరికట్టాం. ఇంకా యాభై శాతం అరికట్టాలి. ఆదాయం పెంచి, సంపద పంచినం. రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేశాం. ఇంకా పెంచుతాం. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 20వేలు వెచ్చిస్తున్నది. ఈ క్రమంలో ప్రైవేటు విద్యాసంస్థలను కాదని పనిచేసే పరిస్థితిలేదు. వారినికూడా విశ్వాసంలోకి తీసుకొని వందశాతం భాగస్వామ్యం చేస్తం. ఒకసారి నేను విమానంలో ప్రయాణిస్తుంటే జర్మనీ అతను పక్కన కూసున్నడు. మా దేశంలో పుట్టినోడికి రూపాయి భారం లేకుండా చదువు పూర్తయితది. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభుత్వమే చూసుకుంటది. అమెరికాలో ప్రెసిడెంట్ కొడుకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటడు. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండటంవల్ల ఇది సాధ్యం అన్నడు. ఈ నేపథ్యంలో విద్యాపరంగా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలతో కలిపి తల్లిదండ్రులపై భారంలేకుండా విద్య అందుబాటులోకి తెస్తం. నేనే స్వయంగా పిలిచి వర్క్‌షాప్ పెట్టి ఏ విధంగా ముందుకు పోవాలో ఆలోచన చేస్తం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.