Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌ది..హంతక చరిత్ర

-సీఎం పదవికోసం రాజధానిలోమారణహోమం సృష్టించారు -చెన్నారెడ్డే ఈ మాట చెప్పారు -ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యంపై మాట్లాడటమా? -రాహుల్ పప్పు అని గూగుల్ ఘోషిస్తున్నది -వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం -లేదంటే రాజకీయాలనుంచి తప్పుకొంటా -ఉత్తమ్‌కు దమ్ముంటే సవాలు స్వీకరించాలి -అమలుస్థాయికి చేరుకుంటున్న పథకాలు -తాగే ప్రతి నీటిచుక్కలో కేసీఆర్ కనిపిస్తారు -కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది ఐదారువేల ఉద్యోగాలే -టీఆర్‌ఎస్ మూడున్నరేండ్లలో 30వేల ఉద్యోగాలు ఇచ్చింది -ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే మోదీ నుంచి స్పందన లేదు -ఐటీఐఆర్ ఊసే ఎత్తని కేంద్రమంత్రులు -బీజేపీ సంగతిని ప్రజలే చూసుకుంటారు -కేసీఆర్‌తో పోల్చుకునే సీన్ ఏ నేతకూ లేదు -మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి శ్రీ కే తారకరామారావు -ఐటీ కాంగ్రెస్ ముగింపు వేడుకలకు రాష్ట్రపతికి ఆహ్వానం

కాంగ్రెస్ నరహంతక పార్టీ అని, హత్యారాజకీయాల గురించి ఆ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. సీఎం పదవికోసం రాష్ట్ర రాజధానిలో నరమేధాన్ని సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉందని అన్నారు. ఇది తాము చెప్తున్న విషయం కాదని, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డే చెప్పారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటాన్ని ఎద్దేవాచేసిన మంత్రి.. దేశంలో ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్‌కాదా? దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను 356 ఆర్టికల్‌ను ప్రయోగించి కూల్చింది కాంగ్రెస్‌కాదా? రాష్ట్రంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గల్లీ హత్యను పెద్ద హత్యగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని పప్పు అని అభివర్ణించారు. గూగూల్‌లో పప్పు అని టైప్‌చేస్తే ఎవరి పేరు వస్తుందో అందరికీ తెలుసునని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తనను బచ్చా అంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌గాంధీ కూడా ఉత్తమ్‌కన్నా బచ్చానే అన్న విషయాన్ని మరువద్దన్నారు. కాంగ్రెస్ లోఫర్ పార్టీ అని, ఆ పార్టీ నేతల మాటలను చూసి దయ్యాలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందని మంత్రి చెప్పారు. మీడియా గొంతు కూడా నొక్కారని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనేకమార్లు టీఆర్‌ఎస్‌లో చేరడానికి తలుపుతట్టి పోయారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్.. ఒకవేళ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన సవాలును స్వీకరించాలని అన్నారు. తన సవాలును స్వీకరించకుండా తమ కుటుంబానికి ఉత్తమ్ ముడిపెట్టడాన్ని ఆయన ఎద్దేవాచేశారు. కుటుంబాల వెనుక దాక్కోవద్దని హితవుపలికారు. బుధవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయ పరిస్థితులు, పలు ఇతర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎకరానికి రూ.8వేల పెట్టుబడి పథకం ఒక యజ్ఞమని, ప్రతి రైతుకు చేరుతుందని చెప్పారు. నిరంతర విద్యుత్‌సహా అనేక కార్యక్రమాలను రైతులకోసం చేపడుతున్నామని తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మా బలం ఇంకా పెరుగుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడే అమలుస్థాయికి చేరుకుంటున్నాయి. వాటి ఫలితాలు త్వరలో ప్రజలకు అందుతాయి. అప్పుడు ప్రజల స్పందన ఇంకా అద్భుతంగా ఉంటుందని అంచనావేస్తున్నాం. ఇంటింటికీ నల్లానీటిని అందించాలనే ఆలోచన గత పాలకులకు రాలేదు. కానీ కేసీఆర్ మది నుంచి వచ్చిన ఆలోచనకు త్వరలో ఫలితంరానుంది. తెలంగాణ ప్రజలు తాగే ప్రతీ నీటి చుక్కలో కేసీఆర్ కనిపిస్తారు. మహిళల నీటి కష్టాలకు తెరపడుతుంది. గత ఎన్నికలకంటే టీఆర్‌ఎస్ మరింత బలోపేతమవుతుంది. 2014లోనూ ఒంటరిగానే పోటీచేశాం. రాబోయే రోజుల్లో కూడా ఒంటరిగానే పోటీచేస్తాం.

కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు ఐదారువేలే.. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్పప్పుడు ఐదారువేలకంటే ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నరేండ్లలో 30వేల ఉద్యోగాలు ఇచ్చింది. ఎవరు దద్దమ్మనో దీనిద్వారా అర్థమవుతుంది. ఎవరు దద్దమ్మ అన్నది ప్రజలు ఎన్నికల్లో తేలుస్తారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదు.

మిగిలినవి రెండే పార్టీలు.. రాజకీయపార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో అనేక పార్టీలు వచ్చాయి. అనేకమంది పార్టీలు పెట్టారు. కానీ వాటిలో రెండే మిగిలాయి. వీటిల్లో ఒకటి టీడీపీ అయితే రెండోది టీఆర్‌ఎస్. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు. దేశంలో జాతీయపార్టీలు ఏవీ లేవు. కేవలం పెద్దసైజు ప్రాంతీయపార్టీలు, చిన్నసైజు ప్రాంతీయపార్టీలు మాత్రమే ఉన్నాయి. దక్షిణాదిలో ఏ మాత్రం ప్రభావంలేని పార్టీలు ఏ విధంగా జాతీయ పార్టీలు అవుతాయి? ప్రాంతీయ పార్టీలు ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో, అభివృద్ధిలో ముందున్నాయి. ఎగుమతుల్లో టాప్ ఐదు రాష్ట్రాల్లో దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలే మూడు ఉన్నాయి. జీడీపీలోనూ, ఇతర ప్రామాణికాల్లోనూ దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి.

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు.. బాహుబలి కలెక్షన్లకన్నా తక్కువే.. బడ్జెట్‌ను చూసి బీజేపీ ఎంపీలే అసంతృప్తిగా ఉన్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలే నిధులకోసం గొడవచేస్తున్నాయి. శివసేన ఇప్పటికే బయటికివెళ్లింది. టీడీపీ అసంతృప్తితో ఉన్నది. శిరోమణి అకాలీదళ్‌కూడా అసంతృప్తిగా ఉంది. టీడీపీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవారు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించారు. ఆ పార్టీ ఎంపీలు సభలో గొడవచేస్తున్నారు. ప్రజలను, భాగస్వామ్యపక్షాలను, బయటిపక్షాలను సంతృప్తిపర్చక ఎవరికోసం బడ్జెట్ కేటాయించారు? కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు బాహుబలి కలెక్షన్లకంటే తక్కువగా ఉన్నాయి.

బీజేపీ సంగతిని ప్రజలే చూసుకుంటారు కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులపై ప్రజలకు చెప్తాం. అప్పుడు ప్రజలు గర్జిస్తారు. ఐఐఎం, ఎన్‌ఐడీ, పసుపుబోర్డు అడిగాం. ఒక్కటి కూడా కేటాయించలేదు. రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షంతో కలువడానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీ మెట్రో ప్రారంభానికి వచ్చిన సందర్భంగా అడిగితే నిరాకరించారు. గతంలో అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దుచేశారు. కేంద్రం తెలంగాణను దేశంలోని ఒక రాష్ట్రంగానైనా చూస్తుందో లేదోననే అనుమానం వస్తున్నది. కేంద్రంలో తెలంగాణ నుంచి ఉన్న ఒకే ఒక్క మంత్రి దత్తాత్రేయను తొలిగించారు. కిషన్‌రెడ్డి అంబర్‌పేట, లక్ష్మణ్ ముషీరాబాద్ దాటరు. వీరికి అక్కడ పరపతి లేక ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రానికి ఏం ఇచ్చారని బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తారు?

సీఎంగా కేసీఆర్ ప్రాతిపదికనే ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ ఉండాలా? లేక ఇంకా ఎవరైతే బాగుంటుందని ప్రజలు పోల్చుకొని చూసి ఓటువేస్తారు. సీఎం కేసీఆర్ కేంద్రంగానే ఓటింగ్ జరుగుతుంది. కేసీఆర్‌తో పోల్చుకునే సీన్ రాష్ట్రంలో ఇతరులకు ప్రస్తుతం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలతో పార్టీకి లాభం జరుగుతుంది. టీఆర్‌ఎస్ క్యాడర్ బలంగా ఉంది. జీహెచ్‌ఎంసీలో రాత్రికి రాత్రే ఫలితాలు రావు. నగర శివారులోని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చినా రెండు సంవత్సరాల వరకు ఎలాంటి పన్నులు విధించబోం. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీ సీట్లు పెరిగినా పెరుగకపోయినా టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను అమలుచేయడానికి కేంద్రానికి అభ్యంతరమేంటి? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్‌కు ప్రస్తుతం 65 సంవత్సరాలే. మరో 10-15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే సంపూర్ణ ఆరోగ్యం, సమర్థత ఉంది. ఆయన వారసత్వం సమస్య ఉత్పన్నం కాదు.

కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా.. త్రివర్ణ పతాకాన్ని కూడా మలినంచేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుంది. గతంలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనంచేయాలన్న ప్రతిపాదనలు వచ్చిన సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం. టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి టీడీపీ ఇంకా ఎక్కడుంది? తెలంగాణ, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టే పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయి. రియల్‌ఎస్టేట్ రంగం పుంజుకుంది. 7.50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ విక్రయాలు జరిగాయి.

సవాలుకు స్పందించకుంటే ఉత్తమ్ తోకముడిచినట్టే నేను ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మూడున్నరేండ్లుగా మంత్రిగా పనిచేస్తున్నాను. ఉత్తమ్ కూడా మూడు నాలుగు సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఉత్తమ్‌స్థాయికి నేను చాలు. ఒకవేళ సవాల్‌కు కేసీఆర్ స్పందించాలంటే మేము కూడా సోనియా, రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్‌చేయాల్సి వస్తుంది. నా సవాల్‌కు ఉత్తమ్ స్పందించకుంటే ఆయన తోకముడిచినట్టు భావించాల్సి ఉంటుంది. నేరుగా స్పందించకుండా ప్యాకేజీ మాదిరిగా మా కుటుంబం గురించి ఉత్తమ్ మాట్లాడటం ఛీప్ ట్రిక్. తెలంగాణ ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. వారి చైతన్యంపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నా అనుభవపూర్వకంగా రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్తున్నాను. గతంలో వివిధ ఎన్నికల సందర్భంలోనూ సవాల్ విసిరినా కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బల్దియాపై గులాబీ జెండా ఎగురకుంటే మంత్రిపదవికి రాజీనామాచేస్తానని చెప్పాను. ఆనాడు కాంగ్రెస్ నాయకులు స్పందించలేదు. పాలేరు ఉప ఎన్నికలో ఆ ఎన్నిక ఇంచార్జిగా అక్కడ టీఆర్‌ఎస్ గెలువనుందని సవాల్ విసిరాను. అప్పుడు కూడా మాట్లాడలేదు. నా 20 ఏండ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసిరాను. నారాయణ్‌ఖేడ్, వరంగల్ లోక్‌సభ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలనూ దక్కించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడానికి ఎలాంటి హేతుబద్ధత ఉంది?

రాష్ట్రపతికి ఆహ్వానం హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగే వరల్డ్ ఐటీ కాంగ్రెస్-2018 సదస్సు ముగింపు వేడుకకు హాజరుకావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికోసం గురువారం ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మైనింగ్ టుడే సదస్సుకు కేంద్ర మంత్రులు తోమర్, హర్షవర్ధన్‌లను ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే బయోఏషియా సదస్సుకు కేంద్రవాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ప్రభును ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ వివరించారు.

రాష్ట్రానికి కేంద్రం నిధులేవీ? కేంద్ర బడ్జెట్‌లో అనేకపథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెట్టినవే. 500 పట్టణాలకు తాగునీటి అందించే పథకం మిషన్ భగీరథలాంటిదే. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫార్సుచేసింది. కానీ ఒక్కపైసా కూడా కేంద్రం ఇవ్వలేదు. ఎయిమ్స్‌కు ఇంతవరకు నిధులివ్వలేదు. కేంద్రమంత్రులు ఇక్కడికి వచ్చి పథకాలను పొగుడుతారు కానీ వాటికి నిధులు కేటాయించమంటే ఒక్కపైసా అదనంగా ఇవ్వరు. రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకా రం రావాల్సిన నిధుల కంటే ఒక్కపైసా అదనంగా ఇవ్వలేదు. ఇస్తే వేటికి ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలి. ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ అనేకమార్లు కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి అనేకమార్లు కేంద్రమంత్రులను అడిగాం. బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీకి ఒక్కపైసా ఇవ్వలేదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా కేంద్రం వ్యవహారం ఉంది.

బాహుబలి కలెక్షన్ల కన్నా తక్కువే! కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన నిధులు బాహుబలి చిత్రం కలెక్షన్లకంటే తక్కువగా ఉన్నాయి. బడ్జెట్‌ను చూసి బీజేపీ ఎంపీలే అసంతృప్తిగా ఉన్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలే నిధులకోసం గొడవ చేస్తున్నాయి. శివసేన ఇప్పటికే బయటికివెళ్లింది. టీడీపీ అసంతృప్తితో ఉన్నది. శిరోమణి అకాలీదళ్‌కూడా అసంతృప్తిగా ఉంది. – మంత్రి కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.