Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాంగ్రెస్‌ను వంచాలె మోదీని దించాలె

-చౌకీదార్.. పేకేదార్ కాదు.. కేసీఆర్ లాంటి జిమ్మేదార్ రావాలి
-కాంగ్రెస్, బీజేపీ పెద్దసైజు ప్రాంతీయ పార్టీలు
-దక్షిణాది ఆరు రాష్ట్రాల్లో వాటికి 10 సీట్లుకూడా రావు
-150-170 సీట్లతో అతిపెద్ద కూటమిగా ఆవిర్భవిస్తాం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-25 శాతం మంది గిరిజనులకు సర్పంచ్‌గిరి కట్టబెట్టిన కేసీఆర్
-ఏప్రిల్ 11 తరువాత పోడుభూముల సమస్యలకు పరిష్కారం
-జోగుళాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు వికారాబాద్ జిల్లా
-మహబూబాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల ప్రచారంలో కేటీఆర్

దేశంలో జాతీయపార్టీల పని అయిపోయింది.. మోదీని దించాలి- కాంగ్రెస్‌ను వంచాలి అనే సంకల్పంతో ప్రజలు ఉన్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. దేశానికి నరేంద్రమోదీ లాంటి చౌకీదార్.. రాహుల్‌గాంధీలాంటి పేకేదార్ కాకుండా.. కేసీఆర్ లాంటి జిమ్మేదార్ అవసరమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయపార్టీలు కావని.. పెద్దసైజు ప్రాంతీయపార్టీలు మాత్రమేనని అన్నారు. దక్షిణ భారతదేశంలో130 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఆరు రాష్ర్టాల్లో కనీసం 10 సీట్లను గెలుచుకునే సత్తా ఆ పార్టీలకు లేదని చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ స్థానాలు అందిస్తే జాతీయ రాజకీయాలు కేసీఆర్ చేతుల్లోనే ఉంటాయని పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత తరఫున ములుగులో బహిరంగసభ, వరంగల్ జిల్లా నర్సంపేటలో రోడ్‌షో.. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి తరపున తాండూరు, వికారాబాద్ రోడ్‌షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. ములుగు బహిరంగసభతోపాటు రోడ్‌షోలలో జనం పోటెత్తారు. ఎండను సైతం లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ వెంట కదిలారు. ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో 2014 నాటి పరిస్థితులు నేడు లేవని.. నాడు మోదీ 280పైగా ఎంపీ సీట్లను గెలిచి ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని.. కానీ నేడు కనీసం 150 సీట్లు వచ్చే పరిస్థితిలో లేరని చెప్పారు. కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవని అన్నారు.

మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ గాడి తప్పిందని, దేశంలో నాన్ బీజేపీ కాంగ్రెస్‌యేతర పార్టీల హవా కొనసాగనున్నదని స్పష్టంచేశారు. 70 ఏండ్ల కిందట ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీహఠావో నినాదాన్నే రాహుల్‌గాంధీ ఇప్పుడు కూడా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో మోదీ మహిళల నోట్ల్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ఎన్ని డైలాగులు కొట్టినా ఎన్ని ఉడత ఊపులు ఊపినా తెలంగాణలో చేయగలిగిందేమీలేదని.. ఓట్లు రాబట్టేందుకు మందిరం, మసీదు అంటే తెలంగాణ ప్రజలు ఆగంకారని, వారు చైతన్యవంతులని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్టదని, వారు కేవలం ఒకరినొకరు నిందించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నట్టయితే కేంద్రంలో కీలకపాత్ర పోషించవచ్చునని.. బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీల నాయకులైన మమతాబెనర్జీ, నవీన్‌పట్నాయక్, జగన్మోహన్‌రెడ్డి, అఖిలేశ్‌యాదవ్‌తో జతకట్టి 150 నుంచి 170ఎంపీ సీట్లతో కేంద్రంలో అతిపెద్ద కూటమిగా ఆవిర్భవిస్తామని.. మన నాయకుడు కేసీఆర్ ఢిల్లీలో ఆత్మగౌరవ బావుటా ఎగురవేసి దేశ ప్రజలకు సేవచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, దేవాదుల ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించడంతోపాటు కేంద్రం మెడలు వంచి అవసరమైన నిధులను తెచ్చుకోగలమని స్పష్టం చేశారు.

ములుగును జిల్లా చేసి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాలోతు కవితను 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా ఇస్తానని ప్రకటించి మాట తప్పని ముఖ్యమంత్రికి ములుగు జిల్లా ప్రజలు అండగా ఉండాలని, ఈ ప్రాంతంలోని గిరిజన తండాలను, గూడేలను ఏ ప్రభుత్వాలు చేయని విధంగా గ్రామపంచాయతీలుగా మార్చి 25 శాతం మంది గిరిజనులకు సర్పంచ్ పదవులను కట్టబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఏప్రిల్ 11 తరువాత ముఖ్యమంత్రి స్వయంగా గిరిజన ప్రాంతాలను సందర్శించి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుసరిస్తుండటంతోపాటు, కేంద్రంలో మోదీ సైతం పీఎం కిసాన్ యోజన పేరుతో రైతుబంధు పథకాన్ని పేరుమార్చి పెట్టారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరుతో అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు కుట్రలు పన్నుతున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

సీఎం చేతులమీదుగా అటవీభూములకు పట్టాలు: ఎర్రబెల్లి
అటవీ భూములకు పట్టాలు అందించి రైతుబంధును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తండ్రిలాంటి వారైన సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని.. కేటీఆర్ తనకు సోదరుడితో సమానమని మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారని.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి రాష్ట్రంలో 16 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలకం కానున్నారని అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రచారంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ములుగు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు.. చేవెళ్ల నియోజకవర్గ ప్రచారంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి గట్టు రాంచంద్రరావు, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, నాగేందర్‌గౌడ్, కొండల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

పదహారు మంది ఎంపీలతో పాలమూరుకు జాతీయహోదా
చావునోట్లో తలపెట్టి సీఎం కేసీఆర్ ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చారని.. అదే 16 మంది ఎంపీలుంటే ఢిల్లీని శాసిస్తారని కేటీఆర్ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తారన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో జిల్లాకు సాగునీరు రాకుండా కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మనందరి బాగోగులు చూస్తున్నారని, ఇలాగే దేశ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసేవారు అవసరమని.. మన నేత ఢిల్లీలో చక్రం తిప్పితేనే దేశమంతా బాగుపడుతుందని చెప్పారు.

16 ఎంపీ స్థానాలు గెలిస్తే సీఎం కేసీఆర్‌కు కొత్త పదవి రాదు, వస్తే రావచ్చన్నారు. వికారాబాద్ జిల్లాను జోగుళాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలిపే బాధ్యత తీసుకుంటామని హామీనిచ్చారు. రాబోయే రెండేండ్లలోనే వికారాబాద్ జిల్లాకు కృష్ణానీరు అందించి ఈ ప్రాంత రైతుల కాళ్లు కడుగుతామని హామీఇచ్చారు. తాండూరు ప్రజల రుణం తీరుస్తామని, తాండూరుకు మెడికల్ కళాశాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. వికారాబాద్‌లోని అనంతగిరి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా, కోట్‌పల్లి ప్రాజెక్టును పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ 50 ఏండ్లలో చూడని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేండ్లలో చేసి చూపించిందని, అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.