Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాపీ బాబు!

-తెలంగాణ పథకాలకే ఏపీలో పేరు మార్పు
-కేసీఆర్ అశోక చక్రవర్తి.. చంద్రబాబు నీరో చక్రవర్తి
-16 ఎంపీ సీట్లిస్తే ఢిల్లీని శాసించి రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తాం
-మోదీకి బిల్డప్ ఎక్కువ.. ప్రజలకు చేసిందేమీలేదు
-పాలమూరు ప్రజలు గండరగండులను ఓడించి బుద్ధిచెప్పారు: కేటీఆర్
-టీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకద్ర నియోజకవర్గ నేతలు

ముసుగు తీసేసి రండి.. తెలుగోడి సత్తా చూపిస్తామని చంద్రబాబు అంటున్నారు? అంటే తెలంగాణలో తెలుగోళ్లు లేరా?.. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలపై పేటెంట్ చంద్రబాబువే. బాబుకు కేసీఆర్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. – కేటీఆర్

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు ఓడిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేనిచోటే వారిని గెలిపిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ అదే జరిగిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీకి ప్రచార యావ, బిల్డప్ ఎక్కువని, ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీకొట్టి పేర్లు మార్చి ఏపీలో ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలపై పేటెంట్ బాబువేనని ఎద్దేవాచేశారు. కేసీఆర్ చక్రవర్తా కాదా అనేది ప్రజలు తేల్చిచెప్పారన్నారు. కేసీఆర్‌ను అశోకచక్రవరిగా, చంద్రబాబు నీరోచక్రవర్తిగా అభివర్ణించారు. చంద్రబాబును ఓడించడానికి ఏపీ ప్రజలే సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొగాలు విశ్వేశ్వర్, బాబుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇద్దరు ఎంపీలతో కేంద్ర రాజకీయాలను గడగడలాడించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, రేపు 16మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీ గడగడ వణుకుతుందని, హైదరాబాద్‌కు వచ్చి సలాం కొట్టి మనకు కావాల్సింది ఇచ్చి పోయే పరిస్థితి వస్తదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులను గెలిపిస్తే ఢిల్లీకి పోయి, అధిష్ఠానాల దగ్గర చేతులు కట్టుకొని జీ హుజూర్ అని తలవంచుకుని నిలబడుతారని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్ సభ్యులైతే పేగులు తేగేదాకా కొట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తారన్నారు. ప్రధాని గజ్వేల్‌కు వచ్చినప్పుడు ఏపీలోని పోలవరం మాదిరిగా రాష్ట్రంలో కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయహోదా ఇవ్వాలని కోరితే స్పందన లేదని, పార్లమెంట్‌లో ఎంపీలు గళమెత్తినా చలనం లేదని మండిపడ్డారు.మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఅయోగ్ సిఫారసు చేస్తే ఉలు కూ పలుకూ లేదని.. 16ఎంపీ సీట్లు చేతిలో ఉంటే మెడలు వంచి తీసుకొస్తారన్నారు.

ప్రాంతీయ పార్టీలకే పట్టం
వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్య పోరాటంగా కాంగ్రెస్ చెప్తున్నదని, మరో పార్టీకి తావులేదన్నట్టు అంటున్న మాట లు వారి అహంకారానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. వారిద్దరినే ఎంచుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని చెప్పారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పాత్ర కీలకమవుతుందన్నారు. ఇటీవలి అనేక సర్వేల్లో కాంగ్రెస్ మూడంకెల సంఖ్యకు కూడా చేరుకోదని చెప్తున్నాయని గుర్తుచేశారు. ఏదో ఉద్ధరిస్తడనుకొని 2014 లో మోదీని గెలిపిస్తే, ఐదేండ్లలో రెండుమూడు పనులు చేశారని, చీపురు ఇచ్చి స్వచ్చభారత్ పేరుతో ఊడ్చుకోమన్నారని.. పెద్ద నోట్లు రద్దు చేసి వ్యాపారుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు.

రైతుల మనసులో కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని చూసిన మోదీ, రాహుల్, చంద్రబాబుకు చరిత్రలో రైతులకు ఎవరూ చేయనంత మేలు కేసీఆర్ చేశారని అర్థమైందని చెప్పారు. కానీ అహం అడ్డొచ్చి రైతుబంధు పేరును మార్చి కేంద్రం లో పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి పేరుతో ప్రవేశపెట్టారన్నారు. రూ.2016 పింఛన్, ఎకరానికి రూ.5 వేలు రైతుబంధు, నిరుద్యోగభృతి వంటివి ఎన్నికల కోడ్ పూర్తయ్యాకే ప్రవేశపెట్టే అవకాశమున్నది. లేకపోతే కాంగ్రెసోళ్లు మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారుఅని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టాలని కోరారు. పాలమూరు పచ్చబడాలనేదే సీఎం కేసీఆర్ స్వప్నమని చెప్పారు.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ
అసెంబ్లీలో ఎన్నికల్లో పాలమూరు ప్రజలు చూపించిన చైతన్యానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నానని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఉండే మహామహులు చాలా ఎగిరెగిరిపడ్డారు. కేసీఆర్‌ను సీఎం అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిండ్రు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా పాలమూరు జిల్లాలో 14 సీట్లలో 13 చోట్ల ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించి చైతన్యాన్ని ప్రదర్శించారు. పాలమూరు పచ్చికట్టెలాంటిది. కొద్దిగా ఆలస్యంగా అంటుకుంటది. కానీ ఒకసారి అంటుకుంటే దశాబ్దాలపాటు మండుతదని సీఎం కేసీఆర్ అనే మాట నిజమైందిఅని కేటీఆర్ పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 133 పంచాయతీలు ఉంటే టీఆర్‌ఎస్ మద్దతుదారులు 103 మంది, మరో ఆరుగురు టీఆర్‌ఎస్ రెబల్స్.. మొత్తం 109 మంది గెలిచారని, మరికొందరు ఇప్పుడు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. మిగిలినవాళ్లు కూడా వస్తే నియోజకవర్గమంతా గులాబీజెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలి
మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాలమూరులో ఇప్పుడు వలసలు లేవని, ప్రాజెక్టుల నీటితో అందరూ సాగుచేసుకుంటున్నార ని చెప్పారు. ఎంపీ జీతేందర్‌రెడ్డి మాట్లాడు తూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఢిల్లీలో గర్వంగా తెలంగాణ ఎంపీలమని చెప్పుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, కోరుకంటి చంద ర్, సంగీత అకాడమీ చైర్మన్ శివకుమార్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

బాబుకు పొత్తు లేకపోతే బతుకులేదు
చంద్రబాబు తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిడుతారని, కానీ ఇక్కడి పథకాలన్నీ కాపీ కొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధును కాపీకొట్టి అన్నదాత సుఖీభవగా, కల్యాణలక్ష్మికి పసుపు కుంకుమ, అన్నపూర్ణ క్యాంటీన్లు పెడితే.. పూర్ణ తీసేసి అన్నక్యాంటీన్లు పెట్టారని ఎద్దేవాచేశారు. ముసుగు తీసేసి రండి.. తెలుగోడి సత్తా చూపిస్తామని బాబు అంటున్నారు? అంటే తెలంగాణలో తెలుగోళ్లు లేరా? ఇక్కడ నాలుగుకోట్ల తెలుగోల్లం ఉన్నం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు మాకు చేతకావు. ఆ పేటెంట్‌లన్నీ చంద్రబాబువే. సీఎం కేసీఆర్ చక్రవర్తిలా, వైసీపీ అధ్యక్షుడు జగన్ సామంతరాజులా వ్యవహరిస్తున్నారని బాబు అంటున్నారు.. కేసీఆర్ చక్రవర్తా? కాదా? అనేది ప్రజలు ఇటీవలే తీర్పు ఇచ్చారు. కేసీఆర్ చెట్లు నాటించిన ఆశోకచక్రవర్తి… రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో చక్రవర్తి మాత్రం చంద్రబాబే. బాబుకు, కేసీఆర్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టుకొని పొత్తులేకుండా రెండుసార్లు అధికారంలోకి వచ్చా రు. మామ పార్టీలోకి దూరి, వెన్నుపోటుపోడిచి పొత్తులతోనే గెలిచిన చరిత్ర చంద్రబాబుది. పొత్తు లేకపోతే బతుకు లేకపా యే, స్వయంప్రకాశం లేకపాయే.. మాట లు మాత్రం పెద్దగా మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రజల చైతన్యం దేశం మొత్తం చూసింది. టీడీపీని ఏపీలో మనం ఏమో చేయాల్సిన పనిలేదు. అక్కడ ప్రజలే ఈ దుర్మార్గం అంతం కావాలి, బాబు ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. బాబు పోతేనే జాబులు వస్తాయని వారికి అర్థమైందిఅని కేటీఆర్ చెప్పారు. బ్రహ్మంగారు కలియుగంలో విచిత్రాలు చూస్తారని చెప్పారని, పాము ముంగిస ఒక్కటైనట్టు రాహుల్, చంద్రబాబు ఒక్కటవడం అందులో భాగమేనని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.