వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవభవన్‌లో నిర్వహించుకునేలా ప్రభుత్వం క్రైస్తవభవన్ నిర్మాణాన్ని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ మారేడ్‌పల్లి మండలంలో ని మహేంద్రహిల్స్‌లో రెండెకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్రైస్తవభవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తొలుత భవన నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత భూమిపూజలో పాల్గన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

-వచ్చే ఏడాది క్రైస్తవభవన్‌లో క్రిస్మస్ వేడుకలు -మాటలు తగ్గించి మంచి పనులు చేద్దాం: సీఎం కేసీఆర్ మాటలు తగ్గించి మంచి పనులు చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. కేసీఆర్రాక సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎంకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫెక్సీలతో మహేంద్రహిల్స్ గులాబీమయమైంది. తెలంగాణ క్రైస్తవుల గుండెల్లో గూడుకట్టుకున్న సీఎం కేసీఆర్ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టీ రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీ పద్మారావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల నాగేశ్, మైనంపల్లి హనుమంతరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.
సెక్యులరిజానికి మారుపేరు కేసీఆర్ -టీఎన్జీవో రవాణాశాఖ ఫోరం కార్యదర్శి సామ్యూల్‌పాల్ సెక్యులరిజానికి సీఎం కేసీఆర్ మారుపేరని రవాణాశాఖ టీఎన్జీవో ఫోరం ప్రధానకార్యదర్శి ఎస్వీ సామ్యూల్‌పాల్ కొనియాడారు. ఇప్పటివరకు క్రైస్తవులను ఓట్ల యంత్రాలుగా వాడుకున్న రాజకీయ పార్టీలనే చూశామని, కానీ కేసీఆర్ మాత్రం క్రైస్తవుల మనోభావాలను గుర్తించి గౌరవిస్తున్నారని ప్రశంసించారు. క్రిస్మస్ను పురస్కరించుకొని 25, 26ను సెలవుదినాలుగా ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. క్రైస్తవభవన్ నిర్మించడం కేసీఆర్ సెక్యులరిజానికి నిదర్శనమన్నారు. సెలవులను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు, కృషిచేసిన టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రేచల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.