Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కరెంటోళ్లపై వరాల జల్లు

కరెంటోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. విద్యుత్ శాఖలోని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30% ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అత్యంత ఉదారతతో వ్యవహరిస్తుందని సీఎం అన్నారు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. -30% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ -15 ఏండ్ల సర్వీసు దాటితే 3 ఇంక్రిమెంట్లు -15 ఏండ్లలోపువారికి 2 ఇంక్రిమెంట్లు -పెన్షనర్లకు కూడా 30% ఫిట్‌మెంట్ -ప్రభుత్వంపై రూ.600 కోట్ల భారం -సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్

KCR Review meeting with Electricity Department

ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజీ, రామిరెడ్డి, మోహన్‌రెడ్డి, సుధాకర్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకుల ప్రతిపాదనలను సీఎం పరిశీలించి సానుకూలంగా స్పందించారు. 30% ఫిట్‌మెంట్ ఇవ్వడం అత్యంత సముచితమని అన్నారు. 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాల్లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపట్ల విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖలోని పెన్షనర్లకు కూడా 30% ఫిట్‌మెంట్‌తో కూడిన పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో 26,894 మంది ఉద్యోగులున్నారు. వీరికి జీతాలకింద రూ.1233 కోట్లు చెల్లిస్తున్నారు. తాజా ఫిట్‌మెంట్ ప్రకారం సర్కారుకు రూ.500 కోట్ల అదనపు భారం పడనుంది. 19,292 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రస్తుతం రూ.583 కోట్ల మేర పెన్షన్ ఇస్తున్నారు. సవరించిన పెన్షన్లవల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్ల అదనపు భారం పడనుంది.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చూపించిన చొరవ, చైతన్యాన్ని పునర్నిర్మాణంలో కూడా చూపించాలని కోరారు. రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఉద్యోగులదే ముఖ్యమైన పాత్ర అని సీఎం అన్నారు.

తనకు ప్రభుత్వ ఉద్యోగులపైన ఎంతో నమ్మకం ఉందని, అందుకే విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిరంగాన్ని పెద్దఎత్తున విస్తరిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలోకూడా మెరుగుదల చూపాలని సూచించారు. అంతర్గత సామర్ధ్యాన్ని పెంచుకుని రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రతిష్ఠను పెంచాలని ఉద్యోగులను సీఎం కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.