Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణ

– ఐటీ కంపెనీల సలహాలతో పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటుచేస్తాం.. – మొబైల్‌ఫోన్లతోనే సైబర్ దాడులు అధికం – కంపెనీలు కూడా భద్రతపై దృష్టిపెట్టాలి – కౌంటర్ సైబర్ క్రైమ్, కౌంటర్ సైబర్ టెర్రరిజం రావాలి – కలవరపెడుతున్న నిపుణుల కొరత – సీఐఐ సెమినార్‌లో మంత్రి కేటీఆర్

KTR 01 రాబోయే రోజుల్లో తెలంగాణను సైబర్‌సేఫ్టీ రాష్ట్రంగా మలుస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీల సలహాలు, సూచనలు తీసుకుని సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టంగా రూపొందిస్తామని తెలిపారు. దేశంలో సైబర్ వారియర్స్ సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీఐఐ నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ సెమినార్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యాకర్స్ నుంచి ఐటీని, దాని అనుంబంధ రంగాలను రక్షించడానికి పెద్దఎత్తున నిపుణుల అవసరం ఉందని అన్నారు. సైబర్ క్రైమ్, సైబర్ టెర్రరిజం ఙై పస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలని పేర్కొన్నారు. ఇందుకోసం కౌంటర్ సైబర్ క్రైమ్, కౌంటర్ సైబర్ టెర్రరిజం వ్యవస్థలను నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలు, ముందుకు రావాలని అన్నారు. మొబైల్ ఫోన్లతోనే సైబర్ దాడులు అధికంగా జరుగుతున్నాయని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటంతో.. సైబర్ ఎటాకర్స్ ఎక్కువ మనదేశానికి చెందిన కంపెనీలు, వ్యక్తిగత ఖాతాలపై కన్నేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం జూలై నాటికే నాలుగు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందన్నారు.

దేశంలో 22వేల మంది సర్టిఫైడ్ సైబర్ సైక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని.. వాస్తవానికి 77వేల మంది అవసరం ఉందన్నారు. ఈ విషయం దేశాన్ని కలవరపెడుతున్నదని అన్నారు. చైనాలో 2.5కోట్లమంది సైబర్ వారియర్స్ ఉన్నారని తెలిపారు. కంపెనీలు, వ్యక్తిగత వినియోగదారులు సైబర్ ఎటాక్స్ నిరోధంపై దృష్టిసారించాలని సూచించారు. అదే సమయంలో సైబర్‌క్రైమ్ సెల్‌ను కూడా విస్తృతపరుస్తామని తెలిపారు. ప్రపంచంలో హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా మారుస్తామని అన్నారు. ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయని, ఈ సమయంలోనే సైబర్ సెక్యూరిటీ కోసం ప్రొఫెషనల్స్‌ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం సైబర్ ఎటాక్స్ ఎక్కువగా జరిగే రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రెండోస్థానం కూడా ఉందని తెలిపారు. గత ఏడాది సైబర్ ఎటాక్స్ 73శాతం పెరిగాయన్నారు. అంతకుముందు సీఐడీ అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశంలో వెయ్యి మిలియన్ల మొబైల్ యూజర్స్ ఉన్నారని వీరంతా.. మొబైల్ సైబర్ దాడులను తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. కంపెనీలు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పెంచుకోవాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోసం రాష్ర్టాల మధ్య కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. 2010లో 164 సైబర్‌నేరాలు నమోదైతే 2013లో 635కు పెరిగాయని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

సీఐఐ చైర్మన్ సురేశ్ మాట్లాడుతూ సైబర్ దాడులను తట్టుకునేలా సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీఐఐ ప్రతినిధి వనిత దాట్ల మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఐఐ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.