Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దళిత బంధు దండోరా

-నేడు వాసాలమర్రిలో ప్రారంభం.. మొత్తం 76 కుటుంబాల కోసం రూ.7.60 కోట్లు
-తొందరపడొద్దు.. పైసా వృథాపోవద్దు
-ఏం జెయ్యాల్నో కుటుంబ సభ్యులంతా.
-ఆలోచించుకొని పైసలు తీసుకోవాలె
-ఎటమటమైతే ఊరుకొనేది లేదు
-ఆరుగురితో గ్రామ దళిత బంధు కమిటీ
-మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు
-దళితుల పరిస్థితులపై పర్యవేక్షణ
-రూ.10 లక్షల్లో పదివేలు రక్షణ నిధికి
-దళితులే.. సంపద సృష్టికర్తలు
-సద్వినియోగం చేసుకొని పైకెదగాలి
-దళితులకే మిగులుభూమి పంపిణీ: సీఎం

సీఎం: నీ పేరేంది?
బొట్టు నరేశ్‌ సార్‌
సీఎం: నరేశ్‌ నీకు దళితబంధువస్తే ఏం చేస్తవ్‌?
డెయిరీ పెట్టుకుంట సార్‌
సీఎం: మరి దాంట్ల నీకు అనుభవం ఉన్నదా? పర్‌ఫెక్ట్‌గా చేస్తవా?
ఉన్నది సర్‌. మేము సెంటర్‌కు పాలు పోస్తం
సీఎం: ఇక్కడ మంచిగనే పాలు అయితున్నయా? సెంటర్ల ఎక్కువ తీసుకుంటున్నరా?
తీసుకుంటున్నరు సార్‌.. దళితబంధు డబ్బులు వస్తే మా బాయికాడ డెయిరీ పెట్టుకుంట.

దళిత బంధు దండోరా
ఊరోళ్లతోటి ముచ్చటంటే ..

పాదయాత్రలో ఓ స్థానికుడు: నాకు తిరిగి తిరిగి కాళ్లు గుంజుతున్నయి. ఆయినేమో ఇప్పుడే నడక మొదలువెట్టినట్టు పోతున్నడు.
మరో వ్యక్తి: అదే ఆయన స్పెషల్‌. ఊరోళ్లతోటి ముచ్చటంటే సంబురపడుతడు. కొత్త మనుషులను సూస్తుంటే.. వాళ్లతో మాట్లాడుతుంటే ఆయనకు కొత్త ఉత్సాహం వస్తది. ముచ్చట్లు పెట్టుకుంట పోతనే ఉంటడు. ఉద్యమం సంది సూస్తున్నం కదా.

తరతరాలుగా దళితులపై అనేక అపవాదులు మోపారని.. కానీ, సమాజంలో వారే సంపద సృష్టికర్తలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా పైకెదగాలని పిలుపునిచ్చారు. వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్‌ బుధవారం పర్యటించారు. వాడలన్నీ కలియదిరిగారు. గ్రామస్తులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రపంచం మొత్తం జరిగిన కొన్ని దుర్మార్గాలు, పనికిమాలిన విషయాల వల్ల కోట్ల మంది బాధలో ఉన్నారు.

దేశంలో ఒక రకమైన నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైన జాతి దళితజాతి. ఆ కారణం వల్లే దళితులు పేదరికంలోనే ఉన్నారు. దళితులను ఆదుకొనేందుకు ఎవరూ ఏమీ చేసింది లేదు. అంబేద్కర్‌ మాత్రమే ప్రత్యేక చొరవచూపారు. ఆయన వల్లనే దళితులకు కొద్దోగొప్పో రిజర్వేషన్లు, సౌకర్యాలు అందుతున్నాయి. అటు తర్వాత ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. దళితులు పనులు చేయరా? సోమరిపోతులా అంటే కాదు. వారే సంపద సృష్టికర్తలు. మరెందుకు దళితులు పేదరికంలో ఉండిపోవాల్సివచ్చిందంటే గత ప్రభుత్వాలు సరైన పంథాను అవలంబించకపోవడం వల్ల. ఇట్లాంటి నేపథ్యంలోనే అనేక కోట్లాటల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరెంటు, తాగునీటి సమస్య సహా అనేక సమస్యలను పరిష్కరించుకున్నం. అనేక వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నం. తెలంగాణ సమాజం అనుభవిస్తున్న ఒక్కో బాధను తీర్చుకుంటూ వస్తున్నం. అందులో భాగంగానే ఈ మధ్యనే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టాం. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సి ఉండె. కరోనాతో రాష్ట్ర ఆదాయం పడిపోవడం వల్ల చేపట్టలేకపోయినం. ఆరు నూరైనా సరే మళ్లా ఎటమటం కావద్దు, కిందిమీద కావద్దు, నీరు కారి పోవద్దు.. నీరు కారిపోతే కేసీఆర్‌ సెప్పిండు కానీ, అంత వట్టిదే అయిపోయింది, చేసినా లాభం లేదు అంటరు. ఇది పెద్ద ప్రమాదం. పట్టుబట్టి, మొండి పట్టుదలతోని మనం పైకి వచ్చి చూపెట్టాలి. ఈ పథకాన్ని ఫెయిల్‌ కానీయొద్దు. దళిత యువత పట్టుబట్టి విజయవంతం చేయాలి. అందుకోసం అందరూ ఐకమత్యంతో ముందుకుపోవాలి. ఘర్షణలకు పోకుండా ప్రేమభావంతో మెలగాలి. దేశానికి వాసాలమర్రిని ఆదర్శంగా నిలబెట్టాలి.

గ్రామం సక్కగ లేదు
గ్రామమంతా తిరిగిన. ఇండ్లు సక్కదనంగ లేవు. అన్ని మట్టిగోడల ఇండ్లున్నయి. ఒక్కటన్న ఇటుకల ఇండ్లు కనపడుతలేదు. కొందరి ఇండ్లు కూలిపోతున్నయి, కొందరి ఇండ్లు మూలలు కూలుతున్నయి. వరద నీళ్లు ఇండ్లలోకి వస్తున్నయి. అయ్యకు, అవ్వకు పట్టనట్టు ఊరున్నది. మీరు ఒప్పుకొంటే మీ వాసాలమర్రి ఊరు మొత్తం కూలగొడుదాం. సక్కగా రోడ్లు, మోరీలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, రాత్రి కూడా పట్టపగలులా కనపడేటట్టు వీధి దీపాలు.. అన్నీ వేసుకుందాం. ఇందులో ఒకరికి 300 గజాల జాగా ఉంటది, ఒకయానకు 150 గజాలే ఉంటది, మరొకరికి ఆరు గజాలే ఉంటది. లే అవుట్‌ చేసుకొని మంచిగా కొత్త ఊరును కట్టుకుందాం. ఈ ఊర్ల ఇంకో కథున్నది. దళితులే పేదరికంల ఉన్నరంటే.. మిగిలిన ఊర్ల బీసీల్లో ఓ ఇరవైముప్ఫై కుటుంబాలకు భూములున్నయి. కడుమోళ్లది గొప్ప సక్కదనమేం లేదు. వడ్లోళ్లున్నరు.. పాపం వాళ్లు బాధల్నె ఉన్నరు. వాళ్లను కూడా ఆదుకుందాం. ప్రేరణనిద్దాం. మనతోపాటు ఊరుకూడ బాగుపడుతది. ఈ ఊర్ల గవర్నమెంట్‌ జాగ ఒక 612 ఎకరాలు ఉండే. 612 ఎకరాల భూమికి సర్టిఫికెట్లు ఇచ్చినమని చెప్తున్నరు. మరి దళితుల దగ్గర జాగ ఎంతున్నదంటే తక్కువున్నది. అట్ల ఉండొద్దు కదా.. మరెక్కడపోయింది జాగ. నేను మీ కలెక్టర్‌గారికి ఆర్డరిచ్చిన మొత్తం కబ్జాపెట్టినోడెవడు? గుంజుకున్నోడెవడు? వాడెవడో నవనిర్మాణ్‌ సంస్థ వాడొచ్చి 20 ఎకరాలు కొన్నడట.. దొంగ.. దొర మొత్తం బయటపెట్టాలిప్పుడు. వాసాలమర్రిల 49 దళిత కుటుంబాలున్నట్లు లెక్కకొచ్చింది. కానీ అండ్ల పెద్దగైనోళ్లున్నరు. పెండ్లిళ్లయినయి. ఏరువడ్డరు. కుటుంబాలైనయి. అట్ల లెక్క తీసినప్పుడు 76 కుటుంబాలైతున్నది. 76 దళిత కుటుంబాలు ఉన్నట్లు లెక్క. మరీ 76 మందికి భూమి ఉన్నదా.. అంటే అందరికీ లేదు. మరి పంచినప్పుడు ముందుగా దళితులకియ్యాలె కదా.. ఏం లేనోళ్లు కాబట్టి వాళ్లకే చెందాలె. ఎందుకియ్యలే అంటే ఏం జేసిండ్రో ఆ దొరల కథ మనకు తెలియదు. ఎవ్వలకియ్యకుంట ఉన్నది.

మిగులు భూమి మీకే..
ఇప్పుడో నూరు ఎకరాలు ఎల్లింది . దాన్ని దళితులకే ఇచ్చుకుందాం. ఇప్పుడు ఎవలకు ఎంతున్నదని చూస్తే 16 దళిత ఇండ్లకేమో మొత్తమే లేదని చెప్తున్నరు. మొత్తం మీద కనీసం అందరికీ ఓ ఎకరమో.. ఎకరంన్నరోనో కనీసం రెండెకరాలో ఉండేట్లు చేద్దాం. మొత్త గజం గజం కొలిచి సంగతేంది? ఎవడు కబ్జాపెట్టిండు.. ఎక్కడున్నది? లెక్కలు తీపిస్త. దీంట్ల మీరుకూడా సహాయం చేయ్యాలె. మరీ పాత దళితులకిచ్చిన భూమి దళితులకే ఉన్నదా.. ఇంకెవడన్న కొట్టేసిండా? దళితుల భూమి ఇంకెవడు తీసుకోవడానికి చట్టం అనుమతించది. మనకిప్పుడు నీళ్లత్తన్నయి.. మంచిగ వ్యవసాయాలు చెయ్యాలే. మనం రైతులం గావాలే. ఎందుగ్గాం! చేస్తే గామా? అయితం కదా! అయి చూపెట్టాలె! వాసాలమర్రిల కొత్త చరిత్ర లెవ్వాలే. కలెక్టర్‌గారు మంచి ఆఫీసర్‌. నేను అడిగిన ‘చేస్తవా అమ్మ!’.. అంటే ‘గట్టిగ చేద్దాం సార్‌.. వాళ్లను బాగుచెయ్యాలే. తప్పకుండా చేద్దా’మని చెప్పిండ్రు. నేను వచ్చినప్పుడు ఆ లక్ష్మమ్మ.. పక్కన కూర్చుండి భోజనం తింటుంటే.. ఎంతమందికున్నదమ్మా భూమి అని నేనంటే.. ‘కొందరికి లేదు సార్‌. అద్దెకరమో.. పావెకరమో ఉన్నద’న్నది. అట్లెట్లయితది? అండ్ల ఏదో గోల్‌మాల్‌ ఉన్నది. అదంత నేను బయటికి తీయిస్త. మీరు ఎవ్వనితోని పంచాయితీ పెట్టుకోనవసరం లేదు. ఆ భూమెంత..కొత్తగ వచ్చిన నూరెకరాల భూమెంత. మొత్తంగా 76 కుటుంబాలకు ఎంతొస్తది లెక్కలేసుకుదాం. దీంతో పాటు ఇంకొకటి కూడ చేసుకుందాం. నీకో పావెకరం గాడ ఉన్నదనుకో. నాకు ఇంకోకాడ ఉందనుకో. నాపక్కపొంట నీకోపావుందనుకో.. నీ పక్కపొంట నాకో పావుందనుకో. దాన్నంత రద్దుబదలు చేసుకుం దాం. కలుపుకుందాం. ఒక్కకాడికి తెచ్చుకుందాం. మంచిదే కదా అది. ఎనుకట ఇనాం దొయ్యలంటే.. గాడింతుండే.. ఈడింతుండే. ఉన్న ఎకరంన్నర నాలుగు పక్కలుంటే ఏం ఎవుసం చేస్తం? అ ఉండేదే ఒక్కకాడుంటే. మంచో చెడ్డనో జరుగుతది. దళితుల భూకమతాలు ఎక్కడెక్కడున్నా.. ఏకీకరణ చేసుకుందాం. ఫ్రెష్‌గా ఇగో ఫలాని మల్లయ్య.. ఆయనకు ఎకరంన్నర సర్టిఫికెట్‌ తీసుకుందాం. బాజాప్తా ధరణిల ఎక్కించుకుందాం.

సిపాయిలం ఎట్లయితం
ఉదాహరణకి నువ్వో పది బర్లు తెచ్చుకున్నవు. ఆరు పాలిచ్చేటివి.. నాలుగు కట్టి ఉన్నవి. ఆరు ఐదుల 30 లీటర్లు పోసినవుకో. ఈ 30 లీటర్లకు రూ.40 పడ్డా కూడా రోజుకు రూ.1200. ఈ 1200ల్లో 12 పైసలు కూడా నువ్వు ఎవడికీ ఇచ్చే అక్కరలేదు. నీ బ్యాంకులో ఏసుకుంటవో, నీ దగ్గరనే ఏసుకుంటవో అవి నియ్యే. రోజుకు 12 వందల కాపాయం చేసుకుంటే నెలకు రూ.36వేలు. సంవత్సరానికి రూ.3,75,000. ఈ పది లక్షల ఉండి మళ్ల.. అది మూడులక్షల డబ్బు ఐదువేల పిల్లలు పెట్టాలె. అంతేనా! అయితేనే మనం సిపాయిలం అయితం. లేకపోతే కాము. పైసలచ్చినయి కదా అని ఆయింత.. ఏమయితది? నాలుగు రోజులు జల్సా అయితే వాడు అటు.. వీడు ఇటూ.. అంతేనా! మళ్లేం అంటరు.. ఏ.. కేసీఆర్‌ పిచ్చోడు.. అనవసరంగా ఇచ్చిండు. వాళ్లకు ఇచ్చినా లాభం లేదువయా.. అంటరు. నన్ను తిడ్తరు. మిమ్మల తిడ్తరు. తిట్ల పడతామా? గెలుద్దామా? పక్కా కదా? వాసాలమర్రి దళితబస్తీ చేసే పనిమీద మీ ఆలేరు నియోజకర్గ దళితుల కర్మ ఆధారపడి ఉన్నది. ఇతరుల జీవితాలు మీతో ముడిపడి ఉన్నవి కాబట్టి తప్పుచేసే అధికారం లేదు. అంత బాధ్యత, అంత బరువు మీ మీదున్నది. ఒక నియోజకవర్గం కాదు.. జిల్లా కాదు.. మొత్తం రాష్ట్రమే ఆధారపడి ఉన్నది.

ధర్మం పక్షాన కొట్లాడుతాన..
రాష్ట్రమంతటికీ రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు అయితయి. పడరానోడు..పడి వచ్చినోడు.. నన్ను ఎన్ని రకాలుగ అంటాండ్లు టీవీలల్ల చూస్తలేరా? తెలంగాణప్పుడు అనలేదా నన్ను? నేను తెలంగాణ తెస్తా అంటే ఎవడన్న నమ్మిండా? కొసదాకా కూడా రాలేదు కొందరు. సరే ధర్మం పక్షాన కొట్లాడుతాన కాబట్టి పోయినం. తెలంగాణను గడ్డకేసుకున్నం. ఇయ్యాల మనం దళితజాతిని గడ్డకేసుకునేందుకు కూడా పోరాటం చేసుకుంటున్నం. ఎట్లయితే పట్టుబట్టి తెలంగాణను సంపాయించినమో.. ఇయ్యాల ఈ దళితబంధు ద్వారా మొత్తం తెలంగాణ దళితజాతిని గడ్డకేసుకొని దేశంలోనే గొప్పగ దళితులు ఎక్కడున్నరంటే ‘గా తెలంగాణ కాడున్నరు. పోయి చూసిరాపో’ అనాలె. ప్రపంచబ్యాంకోడో.. వాడో వీడో వస్త్తే.. యాడ చూడాల్నయా అంటే తెలంగాణలో చూడాలని అంటే.. ‘గా వాసాలమర్రి కాడ ఉన్నరు.. చూస్తువు పా కొడుకా’ అంటే మన ఇంట్లకొచ్చినా..మన బస్తీ చూసినా.. మన పల్లె చూసినా.. పరేషాన్‌ కావాలె. అది మనం చేసి చూపెట్టాలె. అది మన కర్తవ్యం.

మర్రికూడ చూడ..
మీకు పది లక్షలు రాగానే మీ మీద బరువు పడ్డది. మెడల పడ్డ పాము కరువ తప్పది. మీరేమన్నా ఎటమటం చేస్తే నేను ఇటు దిక్కు మర్రికూడా చూడ. అట్లా కానివ్వద్దు. నాలుగురోజులైనా మంచిదే.. ఎవల ఇంట్ల వాళ్ల్లు కూర్చొని అన్నీ విచారించుకోవాలె. ఇల్లు కట్టేది వేరు.. అది ఈ స్కీముల ఉండదు. ఇది మీరు బిజినెస్‌ చేసుకోవటానికి. అందరికీ ఇండ్లు వచ్చినప్పుడు మీ కొస్తవి. ఈ డబ్బు పైసకు పైస సంపాయించడానికి. ఏదో ఒక వ్యాపారంచేసి.. తోచిన మంచిపని చేసుకోవటానికి.. ఈ పదిలక్షలు అట్లనే ఉండాలె. దాని మీద వచ్చే ఆదాయంతోనే మనం పైకి రావాలె. ఖర్చు పెట్టుకోవాలె. ఇండ్ల రూపాయికూడా వేరే పెట్టె అవసరం లేదు. నల్లా అదే వస్తది. మోరీ వాల్లే కడ్తరు. పదేండ్ల దాకా మీ రేషన్‌ కార్డు అట్లనే ఉంటది. రైతుబంధు వస్తనే ఉంటది. అందరికీ వచ్చేటివి మనవి మనకూ వస్తయి. కరెంటు బిల్లు మాఫీ ఉంటది. మీకు ఇప్పుడున్న సదుపాయాలన్నీ అట్లనే ఉంటవి. ఎవడూ కొట్టేయడు. ఎందుకంటే చాలా వెనుకబడి వివక్షకు గురై..తరతరాల నుంచి దోపిడీకి గురై ఉన్నరు కాబట్టి కొద్దిగ లైన్‌కు రావాలె. నేనియాల ఒక్క దళితులకే చేస్తలేం. రైతులకు చేయలేదా? రైతుబంధు ఇస్తలేమా? ఎవుసం మొత్తం ఎటమటమై, తెలంగాణల ఆగమై, ఇచ్చుకపోయి పెద్దపరేషాన్‌! ఒగోడు ఉరిపెట్టుకొని సచ్చిపోయేది. దాన్ని నిలబెట్టాలనుకున్నం. వాళ్లకు కూడా దగ్గర దగ్గర రూ.70-రూ.80 వేల కోట్లు ఖర్చుపెట్టుకున్నం. రైతుబంధుతోని వ్యవసాయాన్ని చక్కదిద్దుకున్నమో దళితులు కూడా బాగుపడాలె.

నేను కాలర్‌ ఎగరేస్తా….
వాసాలమర్రిలో 76 మంది కనీసం 26 మంది ఏడాది వరకు 10 లక్షలను 20 లక్షలు చేసిర్రు అనుకో అప్పుడు నేను కాలర్‌ ఎగరేస్త. ఈ పని ఆడవాళ్లు ఎక్కువ చేయాలి. దుబారా చేయ్యనియవద్దు. కింది మీది చేస్తే లడాయి పెట్టాలి. ఎటమటం చేస్తే నాకు వచ్చి చెప్పాలి. మీ పరంగా వాళ్ల తోటి నేను వచ్చి కొట్లాడుతా. నా నోట్లకెళ్లి మాట ఎళ్లిన దగ్గరి నుంచి మీరు పది లక్షల శ్రీమంతులైర్రు. రేపు 11 గంటలు కొట్టేకల్లా డబ్బులు వస్తయి. పది లక్షల్లో పది వేలు మాత్రమే రక్షణ నిధికి పోతయి. మిగిలినవి అన్నీ మీవే. కిందికి పోకుండా కాపాడేందుకు నిధి ఉంటది. పక్కగా జరిగేటట్టు కావలి కాసేందుకు కేసీఆర్‌ ఉంటడు. రాబోయే 15-20 రోజుల్లో భూముల కథ తేల్చేస్తా. నేను ఆరు నెలల తర్వాత వాసాలమర్రికి వచ్చినప్పుడు దళితవాడలోనే అన్నం తింట. ప్రజలు మంచిగా అయితే నాయకునికి అంతకన్న తృప్తి ఏముంటది? పట్టుబడితే, జట్టుకడితే వాసాలమర్రి బంగారు వాసాలమర్రి అయితదో చెప్పినో అది జరిగి తీరాలి. మొత్తం రాష్ట్రంలో మీరే మొదటి బిడ్డలు. దళితబంధు మీ దగ్గర లాంచ్‌ అయిపోయింది. దళితబంధు హుజురాబాద్‌లో అయ్యేది లాంఛనమే.

తొందరపడొద్దు
మీరు దరిద్రులు కారు. మీరు పేదవాళ్లు కారు. పొద్దున లేస్తే మీ చేతులల్ల లక్ష్మి అమ్మవారు నాట్యం చేస్తది. సంపద సృష్టించేదే మీరు. పొద్దాక కష్టం చేసేదే మీరు.. సోమరిపోతులు దరిద్రంగా ఉంటరు కానీ, కష్టపోతులు దరిద్రంల ఎందుకుంటరు? అవకాశం లేక.. పెట్టుబడికి పైసలులేక.. నైపుణ్యం ఉన్నా.. చేయాలనే కోరిక ఉన్నా.. ఆసక్తి ఉన్నా.. అవకాశం లేక నీరుగారిపోయింది. ఇవ్వాళ అవకాశం మీచేతిలో ఉంది. పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలె. దయచేసి పదిలక్షలల్ల పది పైసలు కూడా వేస్ట్‌ చేయద్దు. ఎన్కట పెద్దలు చెప్పకపోదురా.. ‘రొట్టె కడుక్కొని తాగాలె కానీ రొట్టె తినొద్దు.. అని చెప్పినట్టే చేయాలె. ఆగమాగం కావద్దు. దళితబంధు పైసలు ఎక్కడికి పోవు. మీ కలెక్టర్‌ దగ్గరనే ఉంటయి. ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. నిలబడే స్కీం తీసుకోవాలి. నిలబడి చూపెట్టాలి. ఈ పథకాన్ని వందకు వంద శాతం విజయవంతం చేసి చూపెట్టాలి. ఒక్క యేడాది దాంకా పది లక్షల ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు పెట్ట్టొద్దు. జమ చేయాలి. అప్పుడే మనం నిలబడగలుగుతాం. పొదుపు చేసుకోవాలి.

మీ దగ్గరినుంచే దళితబంధు అమలు
తెలంగాణలో దళిత కుటుంబాలు ఒక పదిహేను పదహారు లక్షలున్నయి. చాలా మందికి కాళ్లురెక్కలు మాత్రమే ఆస్తి. మనం అక్కడి నుంచి మార్పుకు శ్రీకారం చుడుతున్నం. దళితబంధు కార్యక్రమం అసలే లేనోళ్లకు దక్కాలే. ధర్మంకదా! ఎటుగాకుంటున్నోళ్ల నుంచి మొదలుపెట్టుకుని ఓ తరికున్నోళ్ల నుంచి ఫైనల్‌కు చేరుకుంటం. నిన్న మీ సర్పంచ్‌ నాతో పెద్ద లడాయి. దళితబంధు రెండుసార్లు ఇస్తం తియవయా.. అంటే ‘లేదు ఒక్కపారే ఇయ్యాలే. మా ఊరు మొత్తం ఒక్కసారే తీసుకోవాలే’ అన్నడు. మీ ఎమ్మెల్యేగారిదో లడాయి. మంచిమాటమ్మా.. తీసుకుందాం అని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చినం. ఇయ్యాల్నే ఈ గంటలనే వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళితబంధు మంజూరుచేస్తున్నాం. రేపట్నుంటే మీ చేతుల డబ్బులుంటయి. రేపంటే రేపు పడుతయి. పది లక్షలు మీకొస్తయి అంటే.. 76 కుటుంబాలకు 7.60 కోట్లు మీకిస్తం. ఏ కుటుంబానికి ఆ కుటుంబమాయనే అధిపతి. నువ్వో ఆటో నడిపిస్త్తన్నవ్‌. ఇంకో రెండు ఆటోలు కొనుక్కుంటనంటే మొత్తం మూడు ఆటోలు కలిపి నేను రోజో వెయ్యి సంపాదించుకుంట అంటే సంపాయించుకో. లేదు యాన్నో ఓ ట్రాక్టర్‌ నడపుతున్నవు.. నా సొంత ట్రాక్టర్‌ ఉంటే నేను బ్రహ్మాండంగా చేస్త సార్‌.. నాకు నెలకు 20 రోజులు పనిదొరికిన సరే నేనో 20 వేలు సంపాయించుకుంటా అంటే కొనుక్కో. నీకు ఏ దాని మీద అనుభవముందో అదే పెట్టుకో.. ఫస్ట్‌ నీ చాన్సే.

చదువుకున్నవారికే బాధ్యత ఎక్కువ
ప్రతి దళిత బస్తీలో చదువుకున్న పిల్లలున్నరు. ఎవలకన్నా తెల్వకున్నా తెలియజెప్పే బుద్ధిమంతులున్నరు. దళితబస్తీల్లో చదువుకున్న పిల్లలే ఇవ్వాల కేసీఆర్‌ చేతిలో ఆయుధం. మీరే దీన్ని ముందుకు తీస్కపోవాలె. మీరే మన దరిద్రాన్ని బద్దలు కొట్టాలె. అప్పుడే మనం వంద శాతం విజయం సాధిస్తం. కేసీఆర్‌ గింతగనం చెప్పిపాయే మనకు ఆలోచన ఉండొద్దా? అని చెయ్యాలె. ఇయ్యాల్నె జీవో ఇష్యూ చేపిస్తా. నేను మాట్లాడుతున్నానంటే మీకు 7.60 కోట్లు మంజూరైనట్టే..అయిపోయినవి. కాగితం వస్తది. డబ్బులొచ్చి మీ కలెక్టరమ్మ దగ్గరుంటవి. ఇగ మీ ఎమ్మెల్యే.. మీ సర్పంచ్‌.. మిమ్ములను కోరుతున్న.. సునీతమ్మా.. మీరు ఇంటింటికి పోవాలె. ఒక్కో ఇంటిదగ్గర గంట.. అర్థగంట.. మాట్లాడి. ఏం చేద్దామనుకొంటున్నరు? అదెట్లా నడిపిస్తావ్‌? నీకు అనుభవం ఉన్నదా? మంచిచేసి వ్యవహారం చెడిపోకుండా నిలబడి ఉండేటట్టు చేసి పెట్టాలె.

డబ్బులు నీరుగావొద్దు
మొన్న హుజురాబాద్‌ వాళ్లను పిలిపించిన. పది లక్షలు వస్తన్నయి కదా.. మీ ఇంట్ల మాట్లాడుకున్నరా..డబ్బులు ఎట్ల వాడుకుంటరని ఒకామెను అడిగిన. ఒకామె లేసి నేను చికెన్‌ సెంటర్‌ పెడుత సార్‌ అన్నది. నాకు బాధ అనిపిచ్చింది. 10 లక్షలతో చికెన్‌ సెంటర్‌ పెడుతరా ఎవ్వరన్న! చికెన్‌ సెంటర్‌ యాబై అరవై వేలతో పెట్టుకోవచ్చు. ఏవో నూరు కోళ్లు కొనుక్కచ్చుకునుడు. అమ్ముడు. మల్ల కొనుక్కచ్చుకునుడు, అమ్ముడు. చికెన్‌ సెంటరంటే అంతే కదా.. దానికి పదిలక్షలెందుకు? గట్ల వేస్ట్‌ కావొద్దు. ఈ డబ్బుతో నువ్వు నిలబడాలే. మళ్ల కిందికిపోవద్దు. కిందికిపోకుండా మళ్లో ఉపాయం జేత్తన్నం. మీరు ఆలేరు నియోజకవర్గంలో 15 వేల దళిత కుటుంబాలు ఉన్నయనుకుందాం. ఈ ఏడు కొందరికిచ్చుకుంటం.. వచ్చే ఏడు మరికొందరికిచ్చుకుంటం. రెండు మూడేండ్లల కతం బట్టించుకుంటం. మన వాసాలమర్రి అదృష్టం బాగుంది. మీకందరికీ ఒకటే దెబ్బల వస్తున్నది. మీకిచ్చే పది లక్షల్ల ఓ 10 వేలు గవర్నమెంట్‌ కట్‌ చేస్తది. మళ్ల గవర్నమెంటు ఓ పది వేలు వేస్తది. మొత్తం 20 వేల రూపాయలైతయి. మన ఆలేరు నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలనుకుందాం. అన్ని గ్రామాలు కలిపి 30 కోట్ల రూపాయలైతయి. ఆ 30 కోట్లు మీ నియోజకవర్గానికి దళిత రక్షణనిధి. అనుకోకుండా ఒకరికి టక్కరయ్యి.. కాలి ఇరిగిపాయే. ఆ కుటుంబాన్ని వెనక్కిపోనియ్యద్దు. దానికి దళిత రక్షణ నిధి నుంచి సపోర్ట్‌ జేస్తరు. హఠాత్తుగా.. ఆపద వచ్చినవాళ్లు దెబ్బతినకుండా ఈ దళిత రక్షణనిధి అండగా ఉంటది.

నాలుగంచెల్లో కమిటీలు
దళితబంధుపై ఎవ్వల పెత్తనముండదు. దళితుల పెత్తనమే ఉంటది. గ్రామ దళిత కమిటీ వేసుకుంటం. ఆరుగురితో గ్రామ దళితబంధు కమిటీ, మండల దళితబంధు కమిటీ, భోనగిరి జిల్లా దళితబంధు కమిటీ ఉంటది. రాష్ర్టానికి తెలంగాణ దళితబంధు కమిటీ ఉంటది. ఏం చేస్తరిప్పుడు! మీకు పైసలిచ్చి వట్టిగనే ఇడిసిపెట్టరు. అట్లా అనుకునేరు సుమా? దీనికో ప్రత్యేకమైన కార్డు. ఆ కార్డు మీద ఎలక్ట్రానిక్‌ చిప్‌. ఈడ కంప్యూటర్ల పెడితే నీ కత హైదరాబాద్‌లో చూపిస్తది. వాసాలమర్రిల ఫలానా మల్లయ్య డెయిరీ పెట్టుకున్నడు. నడుస్తున్నదా?.. లేదా? ఎంత సంపాదిస్తున్నడు అన్నది దాంట్ల ఎక్కిస్తరు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.