Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దళిత మహోద్యమం

-హుజూరాబాద్‌ వేదికగా దళితబంధు అవతరణ
-మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు
-లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు
-కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు
-తొలుత నిరుపేదలకు.. దళిత ప్రభుత్వ ఉద్యోగులకు ఆఖర్లో
-1.70 లక్షల కోట్లు ఖర్చు ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు
-నచ్చిన వ్యాపారం, వచ్చిన పని ఏ ఊర్లోనైనా చేసుకోవచ్చు
-ఇచ్చేటోడు సీఎం.. తీసుకొనేది దళితులు.. నడిమిట్ల ఉన్నోడికి కడుపుబ్బసం దేనికి?
-సామాజిక విప్లవానికి తెలంగాణలో తొలి అడుగు
-దళితులకు న్యాయం నా భార్య ఆకాంక్ష
-సెంటిమెంట్‌గానే హుజూరాబాద్‌ నుంచి
-15 రోజుల్లో హుజూరాబాద్‌కు 2 వేల కోట్లు
-ఇక్కడ అమలు దేశానికే ఆదర్శం కావాలె
-మనల్ని చూసి దేశ దళితజాతి మేలుకోవాలె
-కొత్త బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ
-అవకాశాల కల్పనకోసం వ్యాపారాల్లో కోటా
-బంధు, రక్షణ నిధి పర్యవేక్షణకు లక్ష సైన్యం
-రాహుల్‌ బొజ్జా పర్యవేక్షణలో పథకం అమలు
-సీఎంవోలో కార్యదర్శిగా నియామకం
-ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
-కులం.. తళతళ మెరిసే కరవాలమై బలం లేని వాళ్లను నరుకుతున్న వేళ..
-మతం.. పిచ్చెక్కిన మత్తగజంలా మనుషులను నలగదొక్కుతున్నవేళ..
-బడుగు జాతికి తెలంగాణలో నవోదయం మొదలైంది.
-నవశకానికి తొలి అడుగు పడింది.

వజ్రోత్సవ భారతదేశంలో మున్నెన్నడూ ఏ ఒక్క పాలకుడూ కల్పన కూడా చేయజాలని మహత్తరమైన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం హుజూరాబాద్‌ వేదికగా శ్రీకారం చుట్టారు. సమాజంలో అట్టడుగువర్గాల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని, దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని సంకల్పించిన దళిత బంధు పథకాన్ని సమస్త పరిపాలనా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సాక్షిగా.. లాంఛనంగా ప్రారంభించారు. రంగవల్లులు, మామిడి తోరణాలతో దళితవాడల్లో అన్ని పండుగలూ ఒకేరోజున వచ్చినంత సంబురాలు మిన్నంటాయి.

దళిత మహోద్యమం

వచ్చే మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారుమేడలు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. తెలంగాణను చూసి భారత దళితజాతి మేలుకోవాలన్నది తన కల అన్నారు. దళితబంధుకు లబ్ధిదారుల ఎంపిక ఉండదని, రాష్ట్రంలోని మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న దళితులకు కూడా ఈ పథకం వస్తుందని.. కానీ.. ముందుగా కడు పేదలకు అందించిన తరువాత.. చివరి దశలో ఉద్యోగులకు, ఆదాయపరంగా మెరుగ్గా ఉన్నవారికి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షల సహాయంతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సుల్లో ప్రత్యేక కోటా కల్పిస్తామని ప్రకటించారు. ఈ స్కీం పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జాను నియమిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో విప్లవాత్మకమైన దళితబంధు పథకాన్ని సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లిలోని ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

సెంటిమెంట్‌గానే హుజూరాబాద్‌ నుంచి
ఇంతకుముందు హుజూరాబాద్‌ నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టినం. అది వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగింది. కరీంనగర్‌ పట్టణంలో జరిగిన సభలో రైతుబీమాను ప్రకటించాను. ఇది కూడా చాలా బ్రహ్మండంగా అమలవుతున్నది. తెలంగాణ ఉద్యమం తర్వాత, నా జీవితంలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తున్న. ఈ పథకంద్వారా మహత్తరమైన, గొప్ప లక్ష్యాలు పెట్టుకొన్న. ఇది కొత్త చరిత్రను సృష్టిస్తుంది. తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందే మహా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న. కరీంనగర్‌ మొదట్నుంచీ రాష్ట్ర సాధనలో ముందున్నది. అందుకే ఈ జిల్లానుంచే దళిత ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించిన.

దళిత మహోద్యమం
-ప్రభుత్వ కార్యక్రమం కాదు.. మహా ఉద్యమం
దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు కూడా. ఇది ఒక మహోద్యమం. కచ్చితంగా విజయం సాధించి తీరుతది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు కూడా అనుమానాలు, అపోహలు, రకరకాల మాటలు విన్నం. మీ అందరి దీవెనలతో రాష్ట్రం నలుమూలలా ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి, 14, 15 ఏండ్ల కృషి తర్వాత రాష్ర్టాన్ని సాధించుకొన్నాం. సగర్వంగా జీవిస్తున్నాం. పలు రంగాల్లో అద్భుత విజయాలు సాధించాం. 15 రోజుల క్రితం ఒక మిత్రుడితో మాట్లాడిన. తెలంగాణ ఉద్యమానికి పోయిననాడు కూడా అదే మిత్రుడితో మాట్లాడిన. ‘నీకు ఇద్దరు పిల్లలు.. ఇద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఏం పెట్టుకుంటవు? ఎన్ని తిడుతరో, ఎన్ని బద్నాంలు పెడుతరో, ప్రశాంతంగా ఉన్న జీవితంలో అగ్గి రాజేసుకుంటున్నవు’ అన్నడు. ఆ మిత్రుడు. నేను ఒకటే మాట అడిగిన ఆ మిత్రున్ని. ‘తెలంగాణ వస్తే ఎట్ల ఉంటది?’ అన్న. ‘బ్రహ్మండంగా ఉంటది’ అన్నడు. ‘అంతే.. అంతకే ఉండు, నీకు దండం పెడుత, భయాలు పెట్టకు’ అని అన్న. అదే మిత్రుడు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖ నాయకులతో వర్క్‌షాపు పెట్టిన వార్త పేపర్లో చూసి.. నవ్వుకుంటా ఒక్కటే మాట అన్నడు, ‘కేసీఆర్‌, నీకు తిన్నది అరగదారా, ఉన్న కాడ ఉండవు. మళ్లొకటి మొదలు పెట్టినవా’ అన్నడు. ‘మొదలు పెట్టింది బాగుందా?’ అన్న.. ‘బాగుంది’ అన్నడు. ‘ఈ పథకం అంతకంటే ఎన్నో రెట్లు బాగుంటది. నాలుగేండ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికే ఒక మార్గం చూపెడతది. నాలుగేండ్లు నేను బతకాలని మొక్కు. నువ్వు కూడా బతుకు’ అని చెప్పిన.

నాయకుడికి వాక్‌, లక్ష్య, చిత్తశుద్ధి కావాలి
రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్‌ ఇస్తమని చెప్పితే, అయ్యేదా పొయ్యేదా అన్నరు. గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి ఒక వేళ 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా వేసుకుంట అన్నరు. 24 గంటల కరెంటు ఇచ్చినం. జానారెడ్డి గులాబీ కండువా వేసుకోలేదు. మిషన్‌ భగీరథ మొదలు పెట్టిననాడు కూడా ‘కేసీఆర్‌ గుట్టకు ఎంట్రుక కడుతాండు’ అన్నరు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కృష్ణా, గోదావరి నీళ్లు దుంకుతున్నయి. కాళేశ్వరం కడుతామంటే ‘అయిన నాటికి లెక్క.. తీయ్‌’ అన్నరు. కాకతీయ కాలువ సంవత్సరానికి 8, 9 నెలలు నీళ్లతో పారుతున్నదా లేదా చూడాలి. ఒక నాయకుడికి, ఒక ప్రభుత్వానికి కావాల్సింది వాక్‌శుద్ధి, లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి. సాధించే గమ్యంమీద పట్టుండాలి. అవగాహన, ఆలోచన ఉండాలి. అప్పుడు లక్ష్యం నూటికినూరు శాతం విజయవంతమైతది. ఈ రోజు దళితబంధు కూడా అదే తరహాలో బ్రహ్మండంగా అద్భుతమైన విజయం సాధిస్తది. తెలంగాణలో ఇతర పార్టీలకు.. రాజకీయం ఒక గేమ్‌. కానీ టీఆర్‌ఎస్‌కు సామాజిక లక్ష్యాలను చేరుకొనే పవిత్ర కర్తవ్యం.

ఏ ప్రధానికీ ఈ ఆలోచన రాలేదేం?
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ దళిత కుటుంబాలను ఆదుకోలే. ఇంటికి పది లక్షలు ఇవ్వాలె అని ఎవరన్నా, ఎప్పుడన్నా మాట్లాడిండా! నేను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ, ఒక్కో వర్గం సంక్షేమానికి కృషి చేస్తున్న. ఏడాది క్రితమే దళితబంధును మొదలుపెట్టాల్సి ఉండె. కరోనా వల్ల సాధ్యపడలేదు. ఇవాళ ఆ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన. ఇగ నేను ఆ పథకం ప్రకటించిన్నో లేదో కిరికిరిగాళ్లు, కొండిగాళ్లు ఒకడు కా అంటే ఒకడు కీ అంటున్నరు. ఏకాణా కొత్తలియ్యనోడు. ఐదు రూపాయలియ్యాలె అని కూడా అడగనోడు ఇప్పుడు దళితబంధు ఎంతమందికి ఇస్తరు? ఎట్ల ఇస్తరు. ఒకడు ఇంతియ్యాలె.. ఇంకొకడు అంతియ్యాలె అంటూ మొదలుపెడుతున్నరు. ఎందుకు పక్కల బాంబులు పడ్డట్లు చేస్తున్నరు? అంటే దళితులు బాగుపడవద్దనేదే వారి ఉద్దేశం. ఇచ్చేది ప్రభుత్వం. తీసుకునేది దళితులు. నడిమిట్ల ఉన్నోళ్లకు కడుబ్బసం ఎందుకో? ఆ మతలబును దళితులు అర్థం చేసుకోవాలె. హుజూరాబాద్‌ వేదిక నుంచి దళిత యువతకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు పిలుపునిస్తున్నా. దళితబంధు పథకాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోయి విజయవంతం చేసే బాధ్యత మీపైనే ఉన్నది.

దళిత మహోద్యమం
-పాతికేండ్ల క్రితమే..
దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్‌మేట్‌ దానయ్యను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా చేశా. అదేకాదు నా మరో మిత్రుడు, ఆంధ్రభూమి విలేకరి చారితో ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులపై అధ్యయనంచేశాం. దానిప్రకారం ప్రపంచవ్యాప్తంగా దళితుల మాదిరిగానే 165 జాతులు సామాజిక వివక్షకు, అణచివేతకు గురై ఉన్నాయి. ఆస్తులు లేక, అవకాశాల్లేక అణగారి ఉన్నరు. దేశంలో అంబేద్కర్‌ చేసిన పోరాటాల ఫలితంగా దళితులకు కొద్దిమేర న్యాయం జరిగింది. కొన్ని పదవుల్లో రిజర్వేషన్లు వచ్చాయి. కొందరికి ఉద్యోగాలు లభించాయి. విద్యావకాశాలు దక్కాయి. కానీ ఇప్పటికీ 95% మంది దళితులు పేదరికంలోనే ఉన్నరు. గుండెలో బాధను అణచుకొని బతుకుతున్నరు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో ఏ ఒక్క పార్టీ ఈ కార్యక్రమాన్ని అమలుచేసినా నేడు ఈ పథకాన్ని చేపట్టాల్సిన అవసరముండేది కాదు. దళితబంధు ఒక్క హుజూరాబాద్‌తో ఆగిపోదు. ఈ పథకానికి హుజూరాబాద్‌ నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఈ పథకమేంది? ఉద్దేశమేంది? ఎట్ల చేస్తరు? పథకం లోతుపాతులను తెలుసుకొనేందుకే మంత్రివర్గం అంతా కదలివచ్చింది.

మన పథకాలను ఎవరూ టచ్‌ చేయలేరు
రాజకీయాల్లో ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటయి. కేసీఆర్‌ కాకపోతే ఇంకో పీసీఆర్‌ సీఎం అయితరు. కానీ నేను పెట్టిన పథకాలను ఎవ్వరూ తీసేయలేరు. అలాంటి బలమైన పునాదులను ఏస్తున్నం. చావు అంచుదాకా పోయి ఈ రాష్ర్టాన్ని తెచ్చినం. కాబట్టి మా గుండెల్లో అనునిత్యం ఆ తపన, బాధ ఉంటయి. కండ్లారా ఈ రాష్ర్టాన్ని కళకళలాడే రాష్ట్రంగా చూడాలనే బలమైన కాంక్ష ఉంటది. దానికోసమే దేశంలో ఎక్కడా జరుగనటువంటి ఆవిష్కరణలు అవుతున్నాయి. హైదరాబాద్‌లో చాలా కష్టపడి తెలంగాణ భవన్‌ కట్టినం. తమిళనాడు పీఎంకే అధ్యక్షుడు రాందాసు నేను రిక్వెస్ట్‌ చేస్తే వచ్చి ఇనాగ్రేషన్‌ చేసిన్రు. ఈ సందర్భంగా భవనం జాగ ఎంత కేసీఆర్‌? అని అడిగిండు. ఒక ఎకరం అని చెప్పిన. నీకు ఎకరం జాగ ఇస్తేనే ఇంత అందమైన బంగ్లా కట్టినవు. తెలంగాణ ఇస్తే ఎట్ల చేస్తవు అన్నడు. తప్పకుండా మల్లా పదేండ్ల తర్వాత మిమ్మల్ని పిలుస్త సార్‌ అని చెప్పిన. సాధించుకున్న తెలంగాణలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోతున్నం. అలాగే నా దళిత జాతిని కూడానూరు శాతం విజయతీరాలవైపు నడిపించాలె.

దళిత మహోద్యమం
-ఇది సువర్ణావకాశం
దళిత మేధావులకు, రచయితలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. ఇది ఒక సువర్ణావకాశం. దీన్నుంచి భారత దళితజాతి మేల్కొంటది. వాళ్లకు ఉద్యమ స్ఫూర్తి వస్తది. అన్ని రాష్ర్టాల్లో అగ్గి రగులుకుంటది. దేశం మొత్తం పిడికిలెత్తి ‘తెలంగాణలో జరిగింది.. మా రాష్ర్టాల్లో ఎందుకు జరగద’ని అడుగుతది. భారతజాతిలోని దళితబిడ్డలందరికీ లాభం జరుగుతది. ఇక్కడ జరిగిందంటే.. ఈ ఉద్యమం చెలరేగిందంటే.. అణచివేతకు గురైన మొత్తం ప్రజానీకం చూసిందంటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం యొక్క పొటమరింపులు కనిపిస్తాయి. అదే నేను కలగనేది.

ఉద్యోగులకూ దళితబంధు..
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం హుజురాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలున్నాయని తేలింది. ఈ రెండు మూడేండ్లలో మరో 2, 3 వేల కుటుంబాలు పెరగవచ్చు. సర్కారు చేయకూసున్నంక, కేసీఆర్‌ ఇయ్యకూసుకున్నంక. ఏదైనా ఆగుతుందా? రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువుంటదా? హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికీ నెల, రెండు నెలల్లో తలా పది లక్షలను అందజేయనున్నాం. రైతుబంధు ఏ విధంగానైతే అందరికీ వర్తిస్తున్నదో దళితబంధు కూడా అందరికీ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులకు కూడా వర్తిస్తుంది. రెక్కలు, కాళ్లు మాత్రమే ఆస్తికలవారు చాలామంది ఉన్నరు. చాలా మందికి భూమి లేదు. జాగా లేదు. ఉండబోతే ఇల్లు లేదు. సరైన అవకాశం లేదు. నెత్తిమీద అప్పులున్నయి. అటువంటి వాళ్లకు, ఆకలితో ఉన్నవాళ్లకు మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి. రెండో వరుసలో కొంత మంచిగున్నవారు.. మూడో వరుసలో ఇంకొంత మంచిగ ఉన్నవాళ్లు.. చిట్టచివరిన ఉద్యోగస్తులు తీసుకోవాలి. ఉద్యోగస్తుల కుటుంబాలకు కూడా దళితబంధు ఇచ్చే బాధ్యత నాది. కానీ మీరంతా చివరి వరుసలో తీసుకోవాలని కోరుతున్నా. అది సామాజికంగా మన బాధ్యత.

ఒక్కటే పనిచేస్తే విజయం సాధించలేం
అందరూ ట్రాక్టర్లే కొంటే నీది నడ్వదు.. నాది నడ్వదు. ఎవ్వారం మొదటికి వస్తది. దళితబంధు విజయవంతం కావాలంటే అందరం ఒక్కటే పని చెయ్యొద్దు. దళితబంధు స్కీంకు బ్యాంకుల లింక్‌లేదు. 10 లక్షలు వందశాతం గ్రాంట్‌గానే ఉంటది. కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఎవరో వచ్చి మళ్లా బాకీ ఇవ్వండి అని అడిగే బాధ లేదు. ఆ 10 లక్షలు ఎట్ల వాడాలి అంటే నీకు వచ్చినపని, నీకు నచ్చినపని, నీవు విజయం సాధించగల్గే పని చేసుకోవాలి. ట్రాక్టర్‌పైన డ్రైవర్‌గా ఉంటే దళితబంధు డబ్బులతోటి మీరే ట్రాక్టర్‌ ఓనర్‌ కావొచ్చు. ఒక షాప్‌లో పనిచేస్తూ ఉంటే సొంతంగా షాప్‌ పెట్టుకోవచ్చు. ఓ కార్ఖానాలో జీతం ఉండి ఉంటే, అది పెట్టుకోవచ్చు. హార్వెస్టర్‌ కొనుక్కోవచ్చు. లేదంటే ముగ్గురు, నలుగురు 30 నుంచి 40 లక్షలు ఒక్కదగ్గర పెట్టి ఓ ఆయిల్‌ మిల్లో, రైస్‌మిల్లో పెట్టుకోవచ్చు. ఎవరైతే వాళ్లకు వాళ్లు ఆలోచన చేసుకుంటారో ముందుకెళ్లండి సంతోషం. ఎవరికైతే ఆలోచన లేదో. వాళ్లకు మీ జిల్లా కలెక్టర్‌ సలహా ఇస్తారు. 10 లక్షలను ఏడాదినాటికి రూ. 20 లక్షలు చేసి చూపెట్టాలి. అదీ దళితబంధు ఉద్యమ విజయం. మా రసమయి తయారుచేసిన క్యాసెట్‌లో గోరటి వెంకన్న ఒక పాట రాసిండు. ‘మట్టిలోంచి సిరులు తీసె మహిమ నీకు ఉన్నది.. పెట్టుబడియే నిను వరిస్తే నీకు ఎదురేమున్నది.’ అని.

దళిత మహోద్యమం
ఇంకో కవి రాసిండు ‘సుక్కల ముగ్గేసినట్టు సెల్లెల.. నువ్వు సక్కంగ కూడబెట్టు సెల్లెల’ అని. మీరు అట్ల కూడబెట్టాలి. ఉదాహరణకు నాకే దళితబంధు పథకం వచ్చిందనుకో.. ఓ 15 బర్రెలతో డెయిరీ పరిశ్రమ పెట్టుకున్న. అందులో సగం పాలు ఇస్తయ్‌.. సగం ఇయ్యవు. తెల్లారి నుంచి ఓ 50 లీటర్ల పాలు పోస్తున్నననుకో.. 50 లీటర్లకైనా ఓ రెండువేలు వస్తయ్‌. ఈ రెండు వేలు కూడా మీ బ్యాంక్‌ ఖాతాలనే ఉంటయ్‌. అట్లా జమచేస్తే నెలకు రూ.60 వేలు అయితయ్‌. ఏడాది జమచేస్తే రూ.7.20 లక్షలు అయితయి. ఇట్ల ఉండాలి మన ఇగురం. కలిగిన వాళ్లు ఎట్ల సంపాదిస్తున్నరో మనం కూడా అట్లా సంపాదించాలి. నిలబడి చూపించాలి. ఇదీ ఈ దళితబంధు పథకంలో జరగాల్సింది. ‘దళితులం దరిద్రులం కాదు.. మేము కూడా ధనవంతులమే.. మాకు ఇన్ని రోజులు అవకాశం లేక వెనుకబడి ఉన్నం.. ఇప్పుడు మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి వందశాతం గెలిచి చూపిస్తాం’ అని రుజువు చేయాలె.

ఏండ్ల వివక్షకు సమాధానం
ఎక్కడా ఏమీ లేనివారు.. తినడానికి తిండి లేనివాళ్లు.. ఒక పూట జ్వరం వచ్చి కూలి చేయకపోతే కడుపు నింపుకోలేనివారు లక్షలమంది ఉన్నరు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎస్సీలదే. ఇది ప్రజాస్వామ్య రాజ్యమే అయితే.. ప్రజలే ప్రభువులైతే.. దళితులు ఎందుకు ప్రభువులుగా లేరు? దళితుల పట్ల భారత సమాజం అవలంబిస్తున్నది వివక్ష కాదా? ఈ వివక్ష ఎన్ని యుగాలు? ఇంకెన్ని శతాబ్దాలు కొనసాగాలి? ఎన్నాళ్లు కునారిల్లాలి? అన్న ప్రశ్నకు సమాధానమే దళితబంధు.

హుజూరాబాద్‌లో పునాదిరాయి
మీ విజయం మీదనే దేశ దళిత ఉద్యమానికి బలమైన పునాది పడుతుంది. హుజూరాబాద్‌లో 21 వేల కుటుంబాలు ఉన్నట్టు లెక్క. ఇంకో రెండు మూడువేల కుటుంబాలు పెరుగొచ్చు. గవర్నమెంట్‌కు అదోలెక్క కాదు. ‘రూ.500 కోట్లే ఇచ్చిండ్రు.. కడ్మయి ఇస్తరా?’ అని ఎవడో ఒక పేపరాయన రాసిండు.. కడ్మయి ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదా మరి? రాబోయే 15 రోజుల్లో ఇంకో రెండువేల కోట్లు ఇస్తం.

దళితులకు రిజర్వేషన్లు పెడుతం
ప్రభుత్వంలో చాలా ఉంటయి. అన్నింటిలో దళితులకు రిజర్వేషన్లు పెడుతం. ఎరువుల షాప్‌లు పెట్టుకోవచ్చు. వందలో ఇన్ని షాప్‌లు దళితులకే ఇవ్వాలని రిజర్వేషన్‌ తెస్తం. మెడికల్‌ షాప్‌లు, వైన్స్‌, బార్‌షాప్‌లు పెట్టుకోవచ్చు. మిల్లులు పెట్టుకోవచ్చు. హాస్టళ్లకు, దవాఖానలకు సరుకులు సరఫరాచేసే కాంట్రాక్టుల్లో కూడా మీకు రిజర్వేషన్లు ఇస్తరు. పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, రోడ్లు భవనాల శాఖల్లో కాంట్రాక్ట్‌ వర్క్‌ల్లో దళితులకు రిజర్వేషన్‌ పెడుతం. పైసలు ఇయ్యంగనే మీరు ఆగమాగం కావొద్దు. ఎక్కడ పెట్టుబడి పెట్టుకోవాల్నో.. ఏది లాభసాటో తెలుసుకొని పెట్టాలి.

ఏవీ బంద్‌ కావు
దళితబంధు వల్ల ప్రభుత్వం ద్వారా మీకు వస్తున్న రేషన్‌కార్డు, బియ్యం, పెన్షన్లు బంద్‌ కావు. మీరు సంపాదించి గొప్ప వాళ్లు అయ్యేదాక ఇవన్నీ అందుతాయి. నాది హుజూరాబాద్‌ అనుకో 10 లక్షలు వచ్చినయి కాబట్టి హుజూరాబాద్‌లోనే షాప్‌ పెట్టాలి లేదా జమ్మికుంటలనే పెట్టు, వీణవంకలనే పెట్టు అనే కిరికిరీలు లేవు. మీకు ఇష్టముంటే వరంగల్‌లోనో, కరీంనగర్‌లోనో, హైదరాబాద్‌లోనో పెట్టుకోవచ్చు. హైదరాబాద్‌లో ఖోజా అనే కులమున్నది. ఇందులో అందరూ కోటీశ్వరులే. ఆ స్థాయికి మనం ఎదగాలి. అంటే ఏం జరగాలి? దీనికోసం నేనే స్వయంగా ఆలోచించి.. నా మెదడు కరగబెట్టి చేసిన గొప్ప ఆలోచన ఇది.

నా భార్య ఆశీర్వచనం ఇచ్చింది
తెలంగాణ ఉద్యమానికి పోయిన్నాడు హరీశ్‌ నాతో ఉండేవాడు. నేను ఉద్యమానికి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిదని నేను నా భార్యని అడిగాను. ‘మన పిల్లలు ఎలాగూ సెటిల్‌ అయ్యారు.. వారికి చేసేది ఏమీలేదు. నువ్వు నేను తినేది పావుసేరు బియ్యమే.. కాబట్టి కొట్లాడు. మంచిదే’ అని చెప్పింది. న్యాయం ఉన్నది కాబట్టి కొట్లాడమన్నది. నిన్న కూడా ‘దళితబంధు ఉద్యమం చేపడుతున్నం, నువ్వు ఏమంటవమ్మా?’ అని ఆమెను అడిగాను. ‘వాళ్ల పరిస్థితి నిజంగనే అన్యాయంగా ఉన్నది. నువ్వు ఏదైనా పడితే.. మొండిపట్టు పడతవ్‌ కదా.. ఇది కూడా తప్పకుండ చెయ్యి’ అని ఆమె కూడా ఆశీర్వచనం ఇచ్చింది.

దళిత ఉద్ధరణ మనందరి బాధ్యత
ఏడేండ్ల నుంచి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నది. ఏ రోజు కూడా వీటిని దళితులు వ్యతిరేకించలేదు. సార్‌.. మాకు కూడా ఏదన్నా చేయలని అడిగారే తప్ప వ్యతిరేకించలేదు. మిగతా సమాజానికి, తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి.. దండం పెట్టి అప్పీలుచేస్తున్నా.. వాళ్లను కూడా బాగు చేసుకుందాం. మన పక్కన్నే ఉండే దళితవాడలో వాళ్లు పేదరికంలో మగ్గుతుంటే మన గుండెలు కూడా ద్రవించిపోతున్నయి. సమాజంలో ఓ పెద్ద భాగం పేదరికంతో, వివక్షతో కునారిల్లడమనేది ఏ సమాజానికి మంచిది కాదు. కాబట్టి మనందరం పట్టుబట్టి, జట్టుకట్టి యావత్‌ తెలంగాణ జాతి.. మన దళిత జాతిని బాగు చేసుకొందాం.
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

మీ ఇంటికొచ్చి చాయ్‌ తాగుతా
-‘రాధమ్మా.. ఈ డబ్బుతో డెయిరీఫాం పక్కా
కదా.. మళ్లీ నేను మీ ఇంటికొచ్చి చాయ్‌ తాగుతా’ అని దళితబంధు సభలో మొదటి లబ్ధిదారు కొత్తూరి రాధమ్మను సీఎం కేసీఆర్‌ పలుకరించారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త మొగిలితో
కలిసి సీఎం చేతులమీదుగా చెక్కు, మంజూరు పత్రం అందుకున్నారు.

మొదటి చెక్కు అందుకున్న ,కొత్తూరి రాధమ్మతో సీఎం కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.