-తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ -హైదరాబాద్ రాష్ర్టాన్ని ముక్కలు చేసిన పాపి.. -తెలంగాణ పేరెత్తే అర్హతే ఆ పార్టీకి లేదు: సీఎం -రాష్ట్రంలో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం -స్వయంగా సీఎం పర్యవేక్షణలో కార్యక్రమాలు -ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్న ప్రభుత్వం -దళితుల వెనుకబాటు.. సమాజానికి సిగ్గుచేటు -అర్హులైనవారికి పింఛన్లు, రేషన్ కార్డులు -సెలూన్ల కోసం నాయీ బ్రాహ్మణులకు లక్ష -నల్లగొండ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన -13 లిఫ్టు స్కీంలకు భూమిపూజ -సభకు పొంగిపొర్లిన జనం -ఈలలు, కేరింతలతో ఉత్తేజభరితం -మార్చి తర్వాత 2 లక్షల కుటుంబాలకు గొర్రెలు -వచ్చే ఏడాది మరో రెండు లక్షల కుటుంబాలకు -కొత్త బిచ్చగాళ్లలా రాష్ట్ర బీజేపీ నేతల తీరు.. హద్దుమీరితే తొక్కిపడేస్తం, నశం చేస్తం -మేం తల్చుకుంటే దుమ్ము దుమ్మైపోతరు.. ముల్లు ఎక్కువుందంటే పొల్లు పొల్లు చేస్తం -చాలా మంది రాకాసులతోనే కొట్లాడినం.. ఈ గోకాసులు మా గోసి కిందకు లెక్కకాదు -ఢిల్లీ వోడో, ఇంకొకడో నామినేట్ చేసిన ప్రభుత్వం కాదిది. మాకు అధికారం ప్రజలిచ్చిండ్రు -పార్టీలు, నాయకత్వాలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలె.. ప్రతిపక్షాలకు కేసీఆర్ ఘాటు హెచ్చరిక

సమాజంలో కొంత వివక్ష జరిగింది కాబట్టి దళిత జాతి వెనుకబడి ఉన్నది. దళితులు వెనుకకు ఉన్నన్ని రోజులు సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంటది. కాలి వేలు నుంచి నెత్తి దాకా బాగుంటేనే శరీరం బాగుంటది. అట్లే అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటది. కాబట్టి దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మనమీదనే ఉన్నది.
రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా హాలియాలో బుధవారం జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళితుల అభ్యున్నతిపై సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘సమాజంలో కొంత వెలితి ఉన్నది. దానిని మనందరం ఒప్పుకోవాలె. కొంత వివక్ష జరిగింది కాబట్టి దళిత జాతి వెనుకబడి ఉన్నది. దళితులు వెనుకకు ఉన్నన్ని రోజులు సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంటది. కాలి వేలు నుంచి నెత్తి దాకా బాగుంటేనే శరీరం బాగుంటది. అట్లే అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటది. కాబట్టి దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మనమీదనే ఉన్నది. సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా పైకి రావాల్సి ఉన్నది. వాళ్లకోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పేరుతో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. రాబోయే రోజుల్లో ఈ నిధులను ఇంకా పెంచుతాం. దానిని నేనే స్వయంగా మానిటర్ చేస్తా. బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాం. కులం లేకుండా.. మతం లేకుండా.. వివక్ష లేకుండా.. తెలంగాణ కుటంబాలన్నీ మావేనని.. యావ త్ తెలంగాణను బంగారు తును క లాగా తయారు చేయాలని కష్టపడుతున్నాం. ఇతెలంగాణ మేధావిలోకం, యువలోకం, మహిళా లోకం ఇవన్నీ గుర్తించాలె.
త్వరలోనే కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నా.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత మంది పెద్దవాళ్లు, ఏరువడ్డవాళ్లు (వేరు కాపురం), ఇతరత్రా కారణాల వల్ల అవసరం ఏర్పడిన వాళ్లకు నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం.
నాయీ బ్రాహ్మణులకు లక్ష గ్రామాల్లో రోడ్డుమీదనో ఒడ్డుమీదనో గడ్డం గీసే పరిస్థితి పోవాలె. రాబోయే కొద్దిరోజుల్లో ఈ బడ్జెట్ తరువాత ప్రతీగ్రామంలో నాగరికంగా ఉండేవిధంగా.. సంస్కారవంతంగా ఉండేవిధంగా ఆధునిక క్షౌరశాలలు, మాడ్రన్ సెలూన్లకు నాయీబ్రాహ్మణ సోదరులకు లక్ష చొప్పున మంజూరు చేయబోతున్నం.

అతి త్వరలో పోడు భూములకు పరిష్కారం నల్లగొండ గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే జిల్లా. మన గిరిజన సోదరులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చాలా సమస్యల మాదిరిగానే పోడు భూముల సమస్యను కూడా పెండింగ్‌లో పెట్టిండ్రు. పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అటవీశాఖ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటిరెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని మనవి చేస్తున్నా. ఇప్పుడే నాగార్జునసాగర్ నెల్లికల్ లిఫ్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసినా.. అక్కడి గ్రామాల ప్రజలు నాతో వారి సమస్యలు చెప్పారు. నెల్లికల్, చింతలపాలెం, ఆ చుట్టు పక్కన ఉన్నటువంటి ఐదారు గ్రామాల్లో నాలుగైదు వేల ఎకరాల భూమి వివాదం నడుస్తున్నది. రాబోయే రెండు మూడు రోజుల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా కూర్చొని మీకు పట్టాలు ఇస్తరు.. వాటన్నింటినీ ధరణిలోకి తీసుకొస్తరు. నెల్లికల్, చింతలపాలెం ఆ చుట్టు పక్కన గల ఐదారు గ్రామాల సమస్య రెండు మూడు రోజుల్లో తీరిపోతుంది. చింతించాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నా’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
మంచికి ఓటెయ్యండి ‘తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్ఎస్ జెండా ఎగురేయండి. టీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి జరుగుతది.
-ఈ దేశంలో కల్యాణలక్ష్మి ఎవరైనా ఇచ్చిన్రా? కనీసం ఎవరైనా ఇస్తారని అనుకున్నమా? పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు సమస్య కావొద్దని ఆలోచించి లక్ష రూపాయిలు ఇస్తున్నం. ఇదొక యూనిక్ పథకం. -యావన్మంది రాష్ట్ర ప్రజలను కంటి చూపు సమస్యల నుంచి దూరం చేయాలని కంటివెలుగు ద్వారా పరీక్షలు చేయించినం. 50-60 లక్షల మంది పేదలకు కండ్లద్దాలు ఇచ్చినం. -మా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ కింద ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేలు ఇస్తున్నం. గర్భం ధరించిన పేదింటి ఆడబిడ్డలు కూలీకి పోకుండా, వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా కేసీఆర్ కిట్ రూపంలో ఆదుకుంటున్నం. -ధరణితో లంచాల బాధ పోయింది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కూడా అయిపోయి రైతు గల్లా ఎగురేసుకొని పోతాఉన్నడు. అవసరమైతే కొత్త చట్టం తెచ్చి, ఎవరూ ఒక్క రూపాయి ఎవరికీ ఇచ్చే అవసరం లేకుండా.. భూ సమస్యలు రైతులకు లేకుండా చేసే బాధ్యత నాది. -30 లక్షల మంది గొల్లకురుమలున్న రాష్ట్రంలో గొర్రెలు దిగుమతి అయితే మనకు సిగ్గుచేటు. అందుకే రెండేండ్ల నాడు గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినం. 7.5లక్షల దరఖాస్తులు వచ్చినయ్. ఇప్పటికి 3 లక్షల 70వేల మందికి ఇచ్చినం. ప్రతీ యాదవకుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత కేసీఆర్‌దే -మత్స్యకారులను ఎవరైనా పట్టించుకున్నరా? 160 కోట్ల బడ్జెట్‌తో ఉచిత చేపపిల్లలు ఇస్తున్నాం. మత్స్యకారులను ఆదుకుంటున్నం. -అమెరికా వచ్చి అబ్బురపడేవిధంగా గ్రామాలు తయారు కావాలె. సర్పంచ్‌లు అందరూ బాగా చేస్తున్నరు ఇంకా బాగా చేయాలె. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఇవ్వబోతున్నం. -మీరిచ్చే దీవెనలే మాకు కొండంత బలం. నెల్లికల్లు లిఫ్ట్ ద్వారా 25 వేల నుంచి 30 వేల ఎకరాలకు నీళ్లిస్తాం. పెద్దదేవులపల్లికి గోదావరి నీళ్లు తెచ్చి నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఒక్క ఎకరా కూడా బీడు లేకుండా కుర్చీ ఏసుకొని కూసొని పనులు చేయించే బాధ్యత నాది. -రాజకీయ గుంటనక్కలు ఎప్పుడూ ఉంటయ్. వాటిని చూసి మోసపోతే ఆగమైతం. వాళ్లను చూసి మోసపోకుండా ఒకరికొకరం భుజం కలిపి ముందుకుపోదాం. నాకు అండగా ఉండండి. మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది. -ఊర్లు ఇయ్యాల పచ్చగా ఉన్నయ్. అన్నానికి ఎవరూ బాధపడుతలేరు. దాన్ని చూసి కాంగ్రెస్‌కు కండ్లు మండుతున్నయ్. ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నరు. వాళ్లకు మీరే సమాధానం చెప్పాలె. ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని గెలిపించాలె. – సీఎం కేసీఆర్