Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దమ్ముంటే నాపై కేసు పెట్టండి

-అధికారులు, కార్మికులమీద కాదు..
-కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌
-రామరాజ్యం చేస్తమని రావణకాష్టం
-అగ్నిపథ్‌ పథకంతో యువత పొట్టగొట్టారు
-హైదరాబాద్‌కు వచ్చే రాజకీయ టూరిస్టులు తెలంగాణకు ఏం చేశారో చెప్పి రావాలి
-గుజరాత్‌ వరదలకు వెయ్యికోట్లిచ్చిన మోదీహైదరాబాద్‌కు ఎన్ని పైసలు ఇచ్చారు?

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా తనపై కేసు పెట్టాలని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సవాలు విసిరారు. ‘హైదరాబాద్‌ నగరంలోని ఐడీపీఎల్‌ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలిస్తున్నరంట.. అధికారులు.. కార్మికుల మీద కేసులు పెట్టడం కాదు.. నీకు చేతనైతే.. కేసు పెట్టాల్సివస్తే మున్సిపల్‌శాఖ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద కేసు పెట్టండి’ అని అన్నారు.

ఐడీపీఎల్‌ సంస్థకు వందల ఎకరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా కేటాయించిందని, చుట్టూ బస్తీలు, కాలనీలు ఏర్పడినప్పుడు ఐడీపీఎల్‌ నుంచి రోడ్లు వేయాలని స్థానికులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం కూకట్‌పల్లి పరిధి కైత్లాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌లు సాయి చంద్‌, పాటిమీది జగన్మోహన్‌ రావుతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ ఐడీపీఎల్‌ తరహాలోనే దిల్‌కుష్‌ ప్రాంతంలో రోడ్డు వేయాలనుకొన్నప్పుడు అనేక అడ్డంకులు సృష్టించారని, అయినప్పటికీ ప్రజలకు మేలైన వసతులకోసం ఆ ప్రాంతంలో రోడ్డు వేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు కడుతుంటే ప్రజలకు మెరుగైన రవాణా వసతులు కల్పిస్తుంటే, దురదృష్టవశాత్తు హైదరాబాద్‌ నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసులంటూ ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే, ప్రధాని మోదీ వద్ద పరపతి ఉంటే కంటోన్మెంట్‌, కరీంనగర్‌, రామగుండం, ఆదిలాబాద్‌ వైపు ఉండే రక్షణ భూములను అప్పగించాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌చేశారు. అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్లు కట్టి హైదరాబాద్‌ అంటే భారతదేశంలోనే అద్భుతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంచిపనులు చేస్తుంటే చేతనైతే సహాయం చేయాలే తప్ప అడ్డుకోవద్దని హితవు చెప్పారు.

రామరాజ్యమంటూ.. రావణ కాష్టం చేశారు
దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి.. రావణకాష్టం చేశారని మంత్రి కేటీఆర్‌ కేంద్రంపై విరుచుపడ్డారు. దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. బీజేపీ నేతలు కుల మతాల మధ్య పంచాయతీ పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కులాలకు, మతాలకు తావులేకుండా, ప్రాంతాలకు అతీతంగా కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వందకు వంద శాతం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ మహానగరంలో 8 ఏండ్లుగా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నామో ఆదే విధంగా ముందుకు పోదామని, రాజకీయ టూరిస్టులను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.

అగ్నిపథ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని, ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. అగ్నిపథ్‌లో చేరితే డ్రైవర్లు, బట్టలు ఉతికే స్కిల్స్‌ వస్తాయని కిషన్‌రెడ్డి అంటున్నారని ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు త్వరలో హైదరాబాద్‌ వస్తారని చెప్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. సొల్లు పురాణం చెప్పి, సీఎం కేసీఆర్‌పై బట్ట కాల్చి మీద వేసి, ఏదోరకంగా నాలుగు డైలాగ్‌లు కొట్టి వెళ్తామంటే కుదరదని, ఇక్కడి ప్రజలు అమాయకులేమీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టే పార్టీలను తరిమికొట్టాలని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

దశల వారీగా అభివృద్ధి పనులు
నిరంతర విద్యుత్తు, సమృద్ధిగా తాగునీరు, మెరుగ్గా రహదారుల విస్తరణ, వైకుంఠధామాలు, బస్తీ దవాఖానలు, అన్నపూర్ణ సెంటర్లు, మన బస్తీ-మన బడి కార్యక్రమం..ఇలా ఒక్కొక్కటిగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. త్వరలోనే 57 ఏండ్ల్లు నిండిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇంటికి వచ్చి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తారని వెల్లడించారు. కరోనాతో కొత్త రేషన్‌ కార్డుల జారీ ఆలస్యం అయిందని, త్వరలో కచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులపై సమీక్ష జరుపుతానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ఉంటుందని, లబ్ధిదారుల ముందే లాటరీ తీస్తామని, పైసా అవినీతి లేకుండా చూస్తామని చెప్పారు.

8 ఏండ్లలో 30 ఫ్లై ఓవర్లు
నగర వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రూ.8,052 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ పథకం చేపట్టి, 47 వివిధ కార్యక్రమాలు తీసుకొన్నట్లు చెప్పారు. కైత్లాపూర్‌ ఆర్వోబీ ప్రారంభంతో గడిచిన 8 ఏండ్లలో 30 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. మరో 17లో ఈ ఏడాది ఆరు, మిగిలినవన్నీ వచ్చే ఏడాదిలో పూర్తి చేసి హైదరాబాద్‌ ప్రజలకు కానుకగా అందివ్వబోతున్నట్టు పేర్కొన్నారు. రెండోదశ ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.3,115 కోట్లతో పనులు చేపట్టబోతున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు.

డొల్ల మాటలు తప్ప చేసిందేమీ లేదు
ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారే తప్ప.. అవి ఏమయ్యాయో తెలియదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. మోదీవి జుమ్లా మాటలు.. డొల్ల మాటలన్నారు. 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిస్తానన్నారని.. ఇండ్లు ఎక్కడొచ్చాయో.. నీళ్లు ఎందరికిచ్చారో వెల్లడించాలని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మిషన్‌ భగీరథ కింద ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లిస్తుంటే.. దానికి ఒక్క పైసా సాయం చేయలేదని పేర్కొన్నారు.

నిరుడు అక్టోబర్‌లో హైదరాబాద్‌లో వరదలు వస్తే జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.660 కోట్లు వెచ్చించి పేదలకు రూ.పది వేల చొప్పున చేయూతనందిస్తే, మోదీ వెయ్యి రూపాయలైనా ఇవ్వలేదని, గుజరాత్‌లో వరదలువస్తే ఆగమేఘాల మీద హెలికాప్టర్‌లో వెళ్లి రూ.వెయ్యి కోట్ల సాయం చేశారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడితో ఆడుకొన్నారని, అగ్నిపథ్‌తో యువతతో ఆడుకొన్నారని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 2013లో గ్యాస్‌ బండ రూ.400 ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చేతకానిదన్న మోదీ.. ఇప్పుడు రూ.1050కి దాటించారని.. అసమర్థుడెవరో చెప్పాలని ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.