Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దండుకట్టిన తెలంగాణ

-నేడే కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభ
-జెండాపట్టి జైకొట్టి పట్నందారి పట్టిన జనం
-గులాబీవనంలా సభాప్రాంగణం
-సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. వేల ట్రాక్టర్లు.. లక్షల మంది రైతులు
-లక్షకుపైగా వాహనాల్లో జాతరగా సభకు తరలివస్తున్న ప్రజలు
-జిల్లాలవారీగా సీటింగ్ ఏర్పాట్లు
-పకడ్బందీ ఏర్పాట్లు.. పక్కా వ్యూహాలు
-ప్రగతి సభకు పోలీసుల భారీ బందోబస్తు
-సభాప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘాలో..
-ట్రాక్టర్ల తిరుగు ప్రయాణం రేప్పొద్దునే
-వచ్చినదారిలోనే వాహనాలు తిరిగివెళ్లాలి
-సురక్షిత ప్రయాణం కోసం పోలీసుల నిర్ణయం
-ఔటర్‌రింగురోడ్డుపై ఈ రోజు అసాధారణ రద్దీ
-ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే
-ప్రత్యామ్నాయాలు వాడుకోవాలన్న పోలీసులు

ట్రాక్టర్లొచ్చె.. బస్సులొచ్చె.. బండ్లొచ్చె. కార్లొచ్చె.. అందుబాటులో ఉన్న వాహనం అందుకుని.. కనకమ్మొచ్చె! అనేకానేక సంక్షేమ ఫలాలు అందుకున్న సబ్బండవర్ణాలు.. ముఫ్ఫై ఒక్క జిల్లాల నుంచి పట్నం బాట పట్టె! ఇదో జాతర! జనజాతర! చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అపూర్వ సన్నివేశం సాక్షాత్కారమయ్యేది నేడే! ఆ అపురూప సందర్భంలో పాలుపంచుకునేందుకు వేలు లక్షలుగా తెలంగాణ ప్రజలు దండుకట్టారు! కొంగర కలాన్ దిశగా కదిలారు! కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభలో టీఆర్‌ఎస్ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివేదించే ప్రగతిని వినేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంతో తరలివస్తున్నారు! శనివారం అర్ధరాత్రికే వేల సంఖ్యలో ట్రాక్టర్లు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. అంతకు మించిన సంఖ్యలో బస్సులు, లారీలు, ఇతరత్రా వాహనాలు.. నగరం సమీపానికి వచ్చాయి! దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు నాందిపలికే ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు పదహారు వందల ఎకరాల్లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లుచేశారు. సభాప్రాంగణం మొత్తాన్ని గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు, తోరణాలతో శోభాయమానంగా అలంకరించడంతో సభాస్థలి గులాబీవర్ణాన్ని పులుముకొన్నది! ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలనే పేర్లుగా పెట్టుకున్న స్వాగతద్వారాలు.. ప్రజలను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి! తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద సభకు 25 లక్షల మంది వస్తారన్న అంచనాలతో ఉన్న పార్టీ నాయకత్వం.. చివరి వ్యక్తికి కూడా సభావేదిక కనిపించేలా ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే చేరుకున్న ప్రజలతో, వారికి మరింత ఊపు ఉత్సాహాన్నిస్తున్న కళాకారుల ఆటపాటలతో సభాస్థలి సందడిగా మారింది! తెలంగాణ రాష్ట్ర ప్రగతిని నివేదించడమేకాకుండా.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో యావత్ దేశం దృష్టి ఇప్పుడు కొంగర కలాన్ సభపైనే కేంద్రీకృతమైంది! మొత్తంగా ఇప్పటివరకు ఎవరూ నిర్వహించని విధంగా.. భవిష్యత్తులో మరెవరూ నిర్వహించలేని రీతిలో జరిగే సభ.. దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నది!!

దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించేలా ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. గులాబీ జాతరకు ప్రజలు తండోపతండాలుగా తరలొస్తున్నారు. ముఫ్ఫైఒక్క జిల్లాల దారులూ కొంగరకలాన్‌కే బాటలుతీస్తున్నాయి. మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చారిత్రాత్మక సభకు కొంగరకలాన్, రావిర్యాల ప్రాంతాలు జాతరను తలపించేలా ముస్తాబయ్యాయి. సభా ప్రాంగణం నుంచి ఎటు చూసినా కనుచూపు మేరలో అంతటా గులాబీరంగు పులుముకొన్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ఏర్పాటుచేసిన పలు రకాల హోర్డింగులు ఆకర్షణీయంగా ఉన్నాయి. సభాప్రాంగణంలో జిల్లాలవారీగా సీటింగ్ ఏర్పాటుచేశారు. సభకు హాజరుకావడానికి లక్షలమంది వాహనాల్లో బయల్దేరగా.. శనివారం సాయంత్రానికే సభాస్థలానికి వేలమంది చేరుకున్నారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒకటిచొప్పున ట్రాక్టర్లు అందంగా అలంకరించుకుని బయల్దేరాయి. లక్షకుపైగా వాహనాలు వస్తాయని అంచనాతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. దేశంలో గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం టీఆర్‌ఎస్ చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరే పార్టీ ఇంతటి సాహసానికి పూనుకోని విధంగా సభను నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్.. తన నాలుగేండ్ల పాలనా కాలంలో తీసుకొచ్చిన వినూత్న అభివృద్ధి పథకాలు.. అమలుచేసిన అద్వితీయమైన సంక్షేమ కార్యక్రమాలు.. బంగారు తెలంగాణ నిర్మాణానికి వేసిన పునాదులు.. సబ్బండవర్ణాల సమగ్రాభివృద్ధికి చేసిన.. చేస్తున్న విశేషకృషిని వివరించేందుకు నిర్వహిస్తున్న సభ.. చరిత్రలో నిలిచిపోనున్నది.

సాయంత్రానికే సభాస్థలికి ప్రజలు
వివిధ జిల్లాల్లోని దూర ప్రాంతాలనుంచి ఇప్పటికే వేలమంది ప్రజలు సభాప్రాంగణానికి చేరుకున్నారు. వారికి పార్కింగ్ ప్రాంతాల్లో వంటలు చేసుకోవడానికి, నిద్రకు అవసరమైన ఏర్పాట్లుచేశారు. ఏడువేల ఆర్టీసీబస్సులు, మరో 15వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర రాష్ర్టాల బస్సులు అద్దెకు తీసుకుని బయల్దేరుతున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక
సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జానపద, ఒగ్గు, గిరిజన, బుర్రకథ కళాకారులు రంజింపజేయనున్నారు. టీఆర్‌ఎస్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు సభకు ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున చేరుకోనున్న నేపథ్యంలో వారిని వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టేందుకు కళాకారులు ప్రభుత్వ పనితీరుపై, పథకాలు, అవి ప్రజలకు చేరుతున్న తీరుపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఆదివారం 200 మంది కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి వరకు ప్రదర్శనలు కొనసాగాయి.

రెండువేలమంది వలంటీర్లు
ప్రగతి నివేదన సభ నిర్వహణలో రెండువేల మంది వలంటీర్లు సేవలందించనున్నారు. వీరందరూ సమన్వయంతో ఉండేందుకు వీలుగా వారికి ఐదువందల వాకీటాకీలు అందించారు. వలంటీర్లకోసం ప్రత్యేకంగా గులాబీరంగు టీషర్ట్ రూపొందించారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు నేతృత్వంలో వలంటీర్స్ కమిటీ పనిచేయనుంది. పార్కింగ్ ప్రాంతాల్లో సమన్వయం చేయడంతోపాటు సభకు హాజరయ్యేవారికి ఎప్పటికప్పుడు మంచినీటి ప్యాకెట్లను అందిస్తారు. ఇప్పటికే సభాప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో ముస్తాబుచేసిన నిర్వాహకులు.. పెద్ద సంఖ్యలో స్వాగతద్వారాలు ఏర్పాటుచేశారు. ఒక్కో స్వాగతద్వారానికి ఒక్కో పథకం పేరు పెట్టారు. సభలోని అన్ని రోడ్లు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.

వేదికపై వీరు…
ప్రగతినివేదన సభ వేదికపై ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్రకమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ఆసీనులు కానున్నారు. వేదికను పది అడుగుల ఎత్తులో నిర్మించారు. ఐదువందల మందికిపైగా నాయకులు కూర్చునేలా విశాలంగా సభావేదికను ఏర్పాటుచేశారు. అయితే, 300 మందిని వేదికపైకి ఆహ్వానించే అవకాశం ఉన్నది. సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హెలికాప్టర్‌లో చేరుకుంటారు. ఏపీ నుంచి ఐదారు వేల మంది! తెలంగాణలో ఉన్నటువంటి పాలన తమ ఆంధ్రప్రదేశ్‌లోనూ కావాలని విజయవాడకు చెందిన కొణిజేటి నారాయణ ఆకాంక్షించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నారని ఆయన చెప్పారు. నారాయణతోపాటు పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు. సభాప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి, తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. మీలాంటి నాయకుడు మా రాష్ర్టానికి కూడా కావాలి అని కేటీఆర్‌తో వారు అన్నారు. ప్రగతి నివేదన సభకు ఏపీ నుంచి ఐదారు వేల మంది హాజరుకానున్నారని తెలిపారు.

కృష్ణాజిల్లానుంచి యాదవులు
మా జాతిని ఉద్దరించేందుకు పుట్టిన మహానుభావుడికి మద్దతిచ్చేందుకే ప్రగతి నివేదన సభకు హాజరయ్యేందుకు వచ్చాం అని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ప్రతినిధులు చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి అబ్బురపడిన ప్రతినిధులు కొలుసు రాజాయాదవ్, గొర్రిపర్తి శ్రీనివాస్‌యాదవ్, మాగంటి బాలాజీ, సతీశ్, బర్రెల శ్రీరాం, ఫణీంద్ర , గొర్ల సింహాద్రి తదితరులు శనివారం అబిడ్స్‌లో నమస్తే తెలంగాణ ప్రతినిధితో ముచ్చటించారు. ఇక్కడి పథకాలు చూస్తుంటే తెలంగాణలో ఉంటే బాగుండు అనిపిస్తున్నదన్నారు.

మంత్రి కేటీఆర్‌కు లంబాడీల కృతజ్ఞతలు
ప్రగతినివేదన సభ ఏర్పాట్లను మంత్రి కే తారకరామారావు స్వయంగా వాహనాన్ని నడుపుతూ పర్యవేక్షించారు. మార్గమధ్యంలో సభకు వచ్చిన వారితో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో ఆరాతీశారు. పార్కింగ్ ప్రాంతాలు, సభాప్రాంగణాన్ని, వంటల ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్‌తోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి ఉన్నారు. వేదిక వద్ద సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన లంబాడీలు.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లతో కేటీఆర్ ఫొటో దిగారు.

వలంటీర్లు క్రమశిక్షణతో పనిచేయాలి
ప్రగతి నివేదన సభ విజయవంతానికి వలంటీర్లు క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. శనివారం సభాప్రాంగణంలో వలంటీర్లకు పలు సూచనలు చేసిన కేటీఆర్.. లక్షల సంఖ్యలో హాజరయ్యేవారికి మంచినీటి అందించడంతోపాటు వారికి అవసరమైన సహాయం చేయడంలో వలంటీర్లదే కీలకపాత్ర అని చెప్పారు. సభ ముగిశాక వారివారి పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లడానికి సహకరించాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచిస్తూ.. వలంటీర్లకు 500 వాకీటాకీలు ఇస్తున్నట్టు తెలిపారు.

మంత్రి కేటీఆర్‌కు పావుగంటలో అంగీ
అప్పటికప్పుడు కుట్టిచ్చిన మేరు సంఘం ప్రతినిధులు పదిహేను నిమిషాల వ్యవధిలోనే అంగీకుట్టి మంత్రి కేటీఆర్‌కు అందించి మేరు సంఘం తెలంగాణ ప్రతినిధులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మేరు సంఘం జనరల్ సెక్రటరీ వీ మాధవ్ సారథ్యంలో కర్నె సంధ్య, కర్నె మల్లేశ్, లక్ష్మీనారాయణ, పీ శ్రీను, సతీశ్‌లు మంత్రి కేటీఆర్ కొలతలు తీసుకుని వెంటనే అక్కడికక్కడే ఎలక్ట్రానిక్ కుట్టు మిషన్ల ద్వారా 15 నిమిషాల్లో అంగీని కుట్టి, మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఫోటో గ్యాలరీలోనే దానిని ధరించిన కేటీఆర్.. మేరు సంఘం ప్రతినిధులను అభినందించారు.

ఆకట్టుకొంటున్న ఫొటో గ్యాలరీ
నమస్తే తెలంగాణ, హైదరాబాద్ సిటీబ్యూరో: సభాప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకర్షిస్తున్నది. జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం మొదలుకుని.. స్వరాష్ట్ర ఏర్పాటు వరకు కేసీఆర్ సాధించిన విజయాలు, సర్కారు సంక్షేమ పథకాల గురించి తెలిపేలా ఎగ్జిబిషన్ కమిటీ బాధ్యులు కర్నాటి విద్యాసాగర్, ఎన్ ధర్మేందర్ ఆధ్వర్యంలో 500 అరుదైన ఫొటోలతో కొలువుదీరిన గ్యాలరీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌తో కలిసి ఫొటోలను తిలకించారు. పలు ఫొటోల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.

సభకోసం ప్రత్యేక యాప్
ప్రగతి నివేదన సభకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను టీఆర్‌ఎస్ రూపొందించింది. దీనిని మంత్రి కే తారకరామారావు శనివారం ఆవిష్కరించారు. సభకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుం ది. సభ రూట్ మ్యాప్, గూగుల్ సహకారంతో రూపొందించిన డిజిటల్ రూట్ మ్యాప్‌ను పొందుపర్చారు. పార్కింగ్ ప్రాంతాలు, టీఆర్‌ఎస్ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో గ్యాలరీ కూడా ఇందులో ఏర్పాటుచేశారు.

ఎనిమిది వైద్య శిబిరాలు
సభకు వచ్చేవారికి అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ఎనిమిది వైద్య శిబిరాలు, 30 అంబులెన్స్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో శిబిరంలో ఐదు పడకలు ఏర్పాటుచేశారు. వైద్య శిబిరాల బాధ్యతలను ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డిలకు పార్టీ అప్పగించింది. మల్లారెడ్డి వైద్య కళాశాల, యశోద, స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శిబిరాలను ఏర్పాటుచేశారు. మొత్తం 260 మంది వరకు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. ఇక్కడ ఈసీజీ యంత్రం, పాముకాటుకు మందు ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి.

నగరంలో గులాబీ గుబాళింపు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రాజధాని గులాబీ మయమైంది. ఆదివారం నాటి ప్రగతి నివేదన సభకు వచ్చే లక్షలమందికి ఆహ్వానం పలికేందుకు టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ మొత్తాన్ని అందంగా అలంకరించింది. ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి రమేశ్ తదితరులతో కూడిన అలంకరణ కమిటీ కొన్నిరోజులుగా శ్రమించి నగరాన్ని అందంగా అలంకరించింది. మెట్రో రైలు పిల్లర్లకు 2000, మెట్రో పోర్టళ్లను వంద బ్యానర్లతో అలంకరించారు. 700 హోర్డింగులు, 600 బస్‌షెల్టర్లకు సభ ఆహ్వాన పోస్టర్లను అతికించారు. 40 ప్రధాన రోడ్లలో స్వాగతతోరణాలు ఏర్పాటుచేశారు. 150చోట్ల పెట్టిన సీఎం కేసీఆర్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 300 ప్రాంతాల్లో బెలూన్లు, 400 ప్రాంతాల్లో గుండ్రటి కటౌట్లు, 56 కూడళ్లలో తోరణాలతో అలంకరించారు. ఓఆర్‌ఆర్ చుట్టూ 165 కి.మీ మేర జెండాలు కట్టారు. సభా ప్రాంగణం వద్ద 60 అడుగుల ఎత్తుతో సీఎం కటౌట్లు 20 ఏర్పాటుచేస్తున్నారు.

కేసీఆర్ సారు ఏం చెప్తారో వినాలని వచ్చాం
కేసీఆర్ సారు మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ బహిరంగసభ ద్వారా ఏం చెప్తారో వినాలని ఎంతటి కష్టమైనా భరించి వచ్చాము. ముఖ్యమంత్రి సారు అండతో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మా ప్రాంతానికి ఏది కావాలంటే అది తీసుకొస్తున్నారు. – కమ్మపాటి నాగేశ్వర్‌రావు, కిష్టాపురం, కల్లూరు మండలం

రైతుబంధుతో పెట్టుబడి అందించారు
సీఎం కేసీఆర్.. పంటలు వేసుకోవడానికి పెట్టుబడిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చారు. రైతుల పట్ల సీఎం చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా ఈ బహిరంగసభకు వచ్చి ఆయనకు మద్దతు ఇవ్వాలనుకొంటున్నా. ఆయన ఏం చెప్పినా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. – రామారావు, చిన్న కోరుకొండి, సత్తుపల్లి

చెరువుల్ని మరమ్మతు చేసి సాగునీరు అందించారు
ఎన్నో చెరువుల్ని బాగు చేసి సాగునీరందించిన మహానుభావుడు సీఎం కేసీఆర్. ఆయన పాలన మాకు బాగా నచ్చింది. – రవి, మంగల్‌పల్లి

కేసీఆర్ సార్ పాలన బాగుంది
కేసీఆర్ సార్ పాలన ఎంతో బాగుంది. ఆ సారు బహిరంగసభ ఏర్పాటుచేసి ఇప్పటివరకు చేసిన పనుల గురించి తెలియజేస్తున్నట్టు తెలువడంతో మరికొందర్ని తీసుకుని శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరా. – సూర్యం, పార్తపరం, ఖమ్మంజిల్లా

పంటలకు పెట్టుబడి ఇచ్చి ఆదుకున్నడు
పెట్టుబడి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మా భుజం తట్టి ఎకరాకు నాలుగు వేల రూపాయలిచ్చిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. మాకోసం ఆయన ఎంతో చేశారు. ఆయన కోసం ఎంత కష్టపడైనా రావాలని నిర్ణయించుకొని వచ్చాం. – సామిరెడ్డి, అర్సల్లపాడు, సత్తుపల్లి

కళాకారులకు పెద్దపీట
తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టించిన కళాకారులకు అనేక ప్రోత్సాహాలను అందించారు. సభకు సంప్రదాయ వేషధారణలో హాజరయ్యాం. వృత్తిదారులు, కళాకారులందరం సీఎం కేసీఆర్‌కి వెన్నంటే ఉంటాం. – మల్లయ్య, కళాకారుడు, కళానగర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.