-వ్యక్తిత్వం మూర్తీభవించేలా స్మృతిమందిరం
-బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టాలి: మంత్రి కేటీఆర్
-ప్రతినెలా ఒక విశేషంతో ప్రత్యేక కార్యక్రమాలు
-డిసెంబర్లో జాతీయసదస్సులు.. విదేశాల్లోనూ..
-పీవీ ఫొటోలతో ప్రపంచస్థాయి కాఫీటేబుల్ బుక్
-పీవీకి భారతరత్న పురస్కారం, పార్లమెంట్లో విగ్రహం ఏర్పాటుపై కేంద్రానికి నివేదన
-శతజయంతి ఉత్సవాల కమిటీ తీర్మానాలు

స్మృతిమందిరం పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా ఉండాలి. నిర్దిష్టమైన ప్రణాళికతో ఏడాదిపాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించాలి. పీవీతో ఎక్కువగా అనుబంధమున్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో శతజయంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఉత్సవాల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నెలకు ఒకటికన్నా తక్కువ కాకుండా అన్నివర్గాల ప్రజలను కలుపుకొనిపోయేలా కార్యక్రమాలను రూపొందించాలి.
– మంత్రి కేటీఆర్
ఆధ్యాత్మికత, జ్ఞాన సమున్నత, విధాన నిర్ణయాలు, ప్రజాసంక్షేమ పాలన, రాజనీతి, సాహితీ సాంస్కృతిక విషయాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు ఆయనే సాటిఅని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని దశదిశాలా చాటుదామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పీవీ వ్యక్తిత్వం మూర్తీభవించేలా స్మృతిమందిరం, మ్యూజియాన్ని తీర్చిదిద్దుదామని సూచించారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశం శుక్రవారం రవీంద్రభారతిలోని కళాభవన్ కాన్ఫరెన్స్‌హాలులో చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలుఅంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..స్మృతిమందిరం పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా ఉండాలని సూచించారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ఏడాదిపాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. పీవీతో ఎక్కువగా అనుబంధమున్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో శతజయంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో ఉత్సవాల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నెలకు ఒకటికన్నా తక్కువ కాకుండా అన్నివర్గాల ప్రజలను కలుపుకొనిపోయేలా కార్యక్రమాలను రూపొందించాలని, ప్రత్యేకంగా ఆయాశాఖలు, వ్యక్తులు, అధికారులకు బాధ్యతలను అప్పగిస్తూ సబ్‌కమిటీలను కూడా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన pvnr.telangana.gov.in ప్రత్యే క వెబ్‌సైట్‌ను చైర్మన్ కే కేశవరావు ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పీవీకి సంబంధించిన అరుదైన ఫొటోలు, రచనలు, ఆయనపై పలువురు రచించిన పుస్తకాలు, వ్యాసాలు, శతజయంతి ఉత్సవకమిటీ సమావేశాల సమాచారం, వివరాలు, అరుదైన వీడియోలు అందుబాటులో ఉంటాయి. సమావేశంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధానసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, పీవీ కుటుంబసభ్యులు వాణీదేవి, ప్రభాకర్‌రావు, అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎంఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వకార్యదర్శులు సవ్యసాచి ఘోష్, శ్రీనివాసరాజు, భాషాసాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, ఏపీ ప్రభుత్వ సలహాదారు కే రామచంద్రమూర్తి, విదేశీ కార్యక్రమాల సమన్వయకర్త మహేశ్ బిగాల, సీతారామారావు పాల్గొన్నారు.
సమావేశంలో చేసిన తీర్మానాలు..
-పీవీ జ్ఞానభూమిలో నిర్మించతలపెట్టిన మెమోరియల్హాల్ డిజైన్లలో నాలుగింటిని సీఎం కేసీఆర్‌కు నివేదించి..ఆమోదం పొందాక నిర్మాణం చేపట్టాలి. నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు నియమాలను అనుసరిస్తూనే జూన్ 2021కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-ఈ స్మృతిమందిరం నమూనా పీవీ వ్యక్తిత్వానికి, భారతీయతత్వానికి అద్దం పట్టాలి.
-విదేశాల్లోఉన్న తెలంగాణ ప్రజలతో సమన్వయం చేసుకొని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో -పీవీ విగ్రహాలను ఆవిష్కరించాలి. ఆ సందర్భంగా ప్రసంగాలు, చర్చలు కూడా నిర్వహించాలి. -కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
-నెలకొక్క థీమ్‌తో కార్యక్రమాల రూపకల్పన చేయాలి. ఈ నెలలో ‘భూమి పుత్రుడికి నీరాజనం’ పేరుతో పీవీ స్వగ్రామమైన వంగరలో సాంసృతిక -పర్యాటకశాఖ టూరిజంశాఖ కార్యక్రమాలు నిర్వహించాలి.
-సెప్టెంబర్‌లో ‘పీవీ గారికి కళాకారుల నీరాజనం’ పేరుతో చిత్రకారులు, కార్టూనిస్ట్‌లు, క్యారికేచరిస్ట్లు, ఫొటోగ్రాఫర్స్‌తో వర్క్‌షాపులను నిర్వహించి, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటుచేయాలి.
-అక్టోబర్‌లో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో‘తెలుగు ప్రజల నీరాజనం’ పేరిట అక్కడి ప్రముఖులతో సదస్సు నిర్వహించాలి.
-నవంబర్‌లో ‘పీవీ గారికి సాహితీ-సాంస్కృతిక నీరాజనం’ పేరిట కవి సమ్మేళనాలు, సాహితీగోష్టులు, ఆయన రచనలు, కథలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి.
-డిసెంబర్లో పీవీ వర్ధంతి సందర్భంగా జాతీయస్థాయి సదస్సులు నిర్వహించాలి. ఈ కార్యక్రమాలన్నీ విదేశాల్లోనూ కొనసాగేలా చర్యలు తీసుకోవాలి.
-పీవీ ఛాయాచిత్రాలతో అంతర్జాతీయస్థాయి కాఫీటేబుల్ పుస్తకాన్ని, పీవీ అముద్రిత రచనలను ప్రచురించాలి. గతంలో ప్రచురించిన పుస్తకాలను తిరిగి ముద్రించాలి.
-పీవీకి భారతరత్న, పార్లమెంట్లో విగ్రహం ఏర్పాటుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. ఆ సమావేశాల్లోనే అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించాలి.
-రాష్ట్ర మంత్రిగా, సీఎంగా అసెంబ్లీలో పీవీ చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో ముద్రించాలి.