Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దయ్యాలు వేదాలు వల్లించినట్టే..

-రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డిని ఎంతకు కొన్నారు?
-ఫిరాయింపులను మొదలు పెట్టిందే మీరు
-ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీరా?
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తామంటే చేర్చుకోరా?
-కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
-టీఆర్‌ఎస్‌లో విలీనాలు రాజ్యాంగబద్ధమేనని వ్యాఖ్య

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీయేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు పెడబొబ్బలు పెట్టడం హాస్యాస్పదమని, రాజకీయ పార్టీల్లో చేరికలు కొత్తగా జరుగుతున్నట్లుగా వారు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఆయారాం, గయారాం సం స్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని, పార్టీలు మారేలా నాయకులను ప్రోత్సహించడాన్ని మొదలు పెట్టింది ఆ పార్టీయేనని నిప్పులు చెరిగారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు తెలంగాణ ప్రజల అనుభవంలోనే చాలా ఉన్నాయన్నారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మరువలేదన్నారు.

2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా, మూడింట రెండొంతుల మెజార్టీ లేకుండా 26 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని కాంగ్రెస్‌లో కలిపేసుకున్నది నిజం కాదా? అని నిలదీశారు. దీనిపై ఆనాడు తాము కూడా స్పీకర్‌కు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకున్నారా? ఇటీవల ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఎంపీని, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? అప్పుడు వారితో రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. వీరందరికీ స్వయంగా రాహుల్‌గాంధీయే కాంగ్రెస్ కండువాలను కప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేస్తూ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వెల్‌కమ్ అంటూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రకటించడం సరియైనదేనా, వారు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అంటూ నిలదీశారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో కొత్త కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంలో చట్ట విరుద్ధమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది ఏమైనా ఉంటే ప్రశ్నించవచ్చని కేటీఆర్ పేర్కొంటూ.. పార్టీల మార్పు రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందని, స్పీకర్ బులిటెన్‌లో కూడా అదే చెప్పారని గుర్తుచేశారు.

ఏదైనా మాట్లాడే ముందు కాం గ్రెస్ నేతలు ముందూ వెనకా చూసుకోవాలని, వారు ఎక్కడ ధర్నాలుచేసినా కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు ఎన్నటికీ మరువరని అన్నారు. ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు జరిగితే స్పీకర్‌తోపాటు కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించడాన్ని కేటీఆర్ గుర్తుచేస్తూ.. అక్కడే తేల్చుకుందామన్నారు. శాసనసభలో ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది పార్టీ మారితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఒకవేళ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్‌లో చేరుతామంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దంటాడా?, టీడీపీ నుంచి చేరిన రేవంత్‌రెడ్డితో రాజీనామా చేయించకుండానే ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఎందుకిచ్చారు.. రేవంత్‌తోపాటు విశ్వేశ్వర్‌రెడ్డిని, యాదవరెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారు? అని కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నట్టు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. వారిలో ముగ్గురిని బీజేపీలో చేర్చుకోవడం రాజ్యాంగబద్ధమేనా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌లో చేరికలను భూతద్దంలో చూపుతున్నారని, అన్ని ఎన్నికల్లో ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్న ప్రజలే రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదని తీర్పు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.