Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశమంతటా రైతుబంధు

-3.5 లక్షల కోట్లు అవసరమవుతాయి
-ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అమలుచేస్తం
-వ్యవసాయంలో క్షోభను నివారించటానికి కాంగ్రెస్, బీజేపీ మోడల్ దేశానికి పనిచేయదు
-సరికొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరం
-జాతీయపార్టీల గుత్తాధిపత్య ధోరణి పోవాలి
-రైతు, మజ్దూర్ సంఘాలు, ఎన్జీవోలు.. అందరినీ పిలిచి మాట్లాడుతం
-ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకొస్త
-ఈ భగీరథ ప్రయత్నంలో విజయం సాధిస్త
-వారంలో పంచాయతీ నోటిఫికేషన్ రెండు దఫాల్లో ఎన్నికల నిర్వహణ
-ప్రభుత్వ ఖాళీలను వందశాతం భర్తీచేస్తం
-యువకుల్లో అపోహలు సృష్టించడం సరికాదు
-కేంద్రం అనుకుంటే ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం సులువే
-వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి
-పది లక్షలమందికి వచ్చినా ఆశ్చర్యం లేదు
-కుంభకోణాల దొంగల పని పడుతం
-మేంచేసిన అప్పెలా తీర్చాలో మాకు తెలుసు
-జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్త
-తెలంగాణభవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్

తెలంగాణలో అమలుచేస్తున్న పంటపెట్టుబడి సాయం పథకం రైతుబంధును దేశవ్యాప్తంగా అమలుచేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. దానికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. మనదేశంలో అన్నిరకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, అన్నీ ఉండికూడా మనం ముందుకు పోవడంలేదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశ వ్యవసాయంలో ఉండే క్షోభను నివారించాలంటే కాంగ్రెస్ మోడల్, బీజేపీ మోడల్ పనిచేయవని సీఎం స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో అధికారాల వికేంద్రీకరణ జరుగాలని కానీ.. కేంద్రీకృతం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి ఒక సరికొత్త ఆర్థిక నమూనా, కొత్త వ్యవసాయ విధానం అవసరమని చెప్పారు. తెలంగాణభవన్‌లో బుధవారం శాసనసభాపక్ష సమావేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగింది.

అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంచైనాచెడైనా మేమే అన్నట్టు వ్యవహరిస్తున్న జాతీయపార్టీల గుత్తాధిపత్య ధోరణి పోవాలన్నారు. మైనార్టీలకు దేశ బడ్జెట్‌లో కేవలం నాలుగువేల కోట్లే పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇంతపెద్ద దేశంలో ఇంతతక్కువ పెడతారా? చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి కదా! మేం చేస్తే కడుపునిండాచేస్తం. ఇంకా, ఇలాంటి చాలా విషయాలున్నాయి. మా అజెండా పెద్దగా ఉంది అని వివరించారు. డెమోక్రసీలో కొన్ని విషయాల్లో సెంట్రలైజేషన్ ఉంటుంది. ప్రధాని, సీఎం ఉంటారు. టీం ఎలా అడాలో మెంబర్స్‌కు వారు చెప్తారు. కేసీఆర్ స్ట్రాంగ్.. ఐ డోంట్ మైండ్. కఠినంగా లేకుంటే నన్ను రూపాయి పావలాకు కోఠీలో అమ్ముతారు అని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారంలో పంచాయతీ ఎలక్షన్లను నోటిఫైచేయాల్సి ఉందని, రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు తాను కూడా తప్పకుండా అమరావతి వెళుతానని చెప్పారు. తమ ప్రభుత్వానికి సరిపోయేంత ఆదాయం ఉందని, సహజంగా పెరిగే పన్నులుంటాయని, కానీ ప్రత్యేకించి పన్నులు వేయబోమని స్పష్టంచేశారు. వచ్చే ఏప్రిల్‌నాటికి మిషన్ భగీరథద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మైనార్టీల భద్రతలో హైదరాబాద్ ముందుందని, ఈ విషయంలో హైదరాబాద్‌ను దేశానికి మోడల్‌గా చూపుతామని చెప్పారు. అసదుద్దీన్‌తో చర్చించింది కూడా ఇదేనన్నారు. సమాచారశాఖ తన వద్దే ఉంటుందని చెప్పారు. క్యాబినెట్‌లో చేరబోమని ఎంఐఎం నేత అసదుద్దీన్ చెప్పారని తెలిపారు. నోట్ల రద్దు చెడ్డ కార్యక్రమం కాదని, ఎందుకో ప్రధాని మోదీ మధ్యలోనే నిలిపివేశారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ తరహాలో పాత్రికేయ కుటుంబాలను ఆహ్వానించి లంచ్ చేద్దామనుకున్నానని, త్వరలోనే పిలుస్తానని తెలిపారు. ఇంకా వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

దేశానికి కావాల్సిన సమగ్ర ప్రణాళికలు రచిస్తం
ప్రత్యామ్నాయ పార్టీ అంటే.. నాలుగైదు పార్టీలను కలుపుకొని వెళ్లడంకాదు. రాజకీయపార్టీలే కాకుండా.. దేశంలో రైతుసంఘాలు, మజ్దూర్ సంఘాలు, ఎన్జీవోలు వంటివి ఉన్నయి. అనేకమంది సామాజిక కార్యకర్తలు పనిచేస్తున్నరు. వాళ్లందరినీ పిలిచి ప్రత్యేకంగా మాట్లాడుతం. దేశానికి ప్రస్తుతం అవసరమయ్యే సమగ్ర ప్రణాళికలు రచిస్తం. ఎలాచేస్తే సాధ్యమవుతుందో అదేవిధంగా అడుగులేస్తం. దేశప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిజానికి, మన పేదలంకాదు. నిరుపేదలుగా మార్చివేయబడుతున్నం. మన అవసరాలకంటే అధికంగా నీటిని దేవుడు మనకిచ్చాడు. వాటిని సరైనరీతిలో వినియోగించుకునే తెలివిలేకపోవడం దారుణం. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా ఏటా దేశంలో ఏదోఒక ప్రాంతంలో రైతులు కరువును ఎదుర్కొంటున్నరు. వేరే ప్రాంతాలకు తరలిపోతున్నరు. తాగటానికి, వ్యవసాయానికి నీళ్లు లేవు. అసలేమైతుందీ దేశంలో? స్వాతంత్య్రం వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్న మనం ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ వదిలేసి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. ఇప్పటికే జరుగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికైనా ఈ దీనస్థితి నుంచి దేశాన్ని మెరుగుపర్చాలి. అందుకే, మన దేశప్రజలకు వివరించాల్సిన అవసరముందని భావిస్తున్న. వారందరినీ ఒకతాటిపైకి తీసుకొస్త. నా ఈ భగీరథ ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకముంది.

రెండు పార్టీల వ్యవస్థ పోవాలి
జాతీయస్థాయిలో స్థాపించాలనుకునే పార్టీకి పేరు ఇంకా అనుకోలేదు. పాత ప్రయోగాల తరహాలో కాకూడదన్న అభిప్రాయం మాత్రం అందరికీ ఉంది. రెండు పార్టీల వ్యవస్థ వల్ల రాష్ర్టాల పరిస్థితిని అవి దిగజార్చుతున్నయి. కేంద్రం తాను చేయాల్సిన పనులు చేయకుండా ఈ అధికారాలు, పెత్తనం పెట్టుకొని రాష్ట్రాల మీద రాజకీయాలు చేద్దామని ప్రయత్నిస్తున్నది. ఇంత పెద్దదేశానికి ఇది మంచిపద్ధతి కాదని అందరిలో అభిప్రాయం ఉంది. చిన్నచిన్న విషయాల్లోనూ కలుగచేసుకోవటంపై అందరూ ఆలోచనలో ఉన్నరు. రెండు పార్టీల సైకాలజీ కూడా అధికారాలను కేంద్రీకృతం చేయాలనే ఉంది. నేను చెప్పినట్లు ఐదు అధికారాలను వెంటనే రాష్ట్రాలకు బదిలీచేయాలి. వ్యవసాయం, అర్బన్, రూరల్ తదితరాలపై అధికారం వారికెందుకు? విద్య, వైద్యం కూడా వాళ్లు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఐఐటీలాంటి ప్రత్యేకమైన సంస్థలు, పరిశోధన సంస్థలు పెట్టుకుంటే సమస్య లేదు. అంతేగాని ఒక ప్రైమరీ స్కూల్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మీద ఎందుకు వాళ్ల అధికారం? అర్థంపర్థం లేకుండా అపరిమిత అధికారాలు వాళ్ల చేతిలో పెట్టుకొని ఏదో చేస్తున్నరు. దొందూదొందే. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా ఏమీలేదు. ఒకరి జుట్ల నుంచి ఒకరు వచ్చినోళ్లు. రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. సహకార సమాఖ్యను అనుసరిస్తమని ప్రధాని మోదీ గొప్పగా ప్రచారం చేసుకున్నరు. ఎక్కడికి పోయింది ఇప్పుడు ఆ పదం? మాటలు తప్ప అమలులో ఎక్కడా కనిపించడం లేదు. ఇది పెద్ద తప్పు. ప్రజాస్వామ్యంలో అధికారాల వికేంద్రీకరణ జరుగాలి. కాని కేంద్రీకృతం చేస్తున్నరు. దానికి వ్యతిరేకంగా దేశంలో అందరిలో ఒక ఆలోచన ఉంది. దేశానికి ఒక సరికొత్త ఆర్థిక నమూనా, వ్యవసాయ విధానం అవసరం.

కాంగ్రెస్‌ది రాష్ర్టానికో పాలసీ
రాహుల్‌గాంధీ ఒక రాష్ట్రం పోయి రూ.2500 మద్దతు ధర ఇస్త అన్నడు. అలా చెప్పచ్చునా? రాహుల్ అలా చెప్పడం నేరం. ఒక చిన్న రాష్ట్రంలో నాలుగు ఓట్లకోసం అబద్ధం ఆడితే ఎట్ల? మద్దతు ధర అనేది ఒక రాష్ట్రానికి ఉండదు. అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి. లేకపోతే రైతులు నష్టపోతరు. కాంగ్రెస్‌కు దమ్ముంటే.. అన్ని రాష్ట్రాలకు అమలుచేస్తమని చెప్పాలి. అంతేకానీ ఎటువడితే అట్ల మాట్లాడితే కుదురదు. కాంగ్రెస్ పేరుకు జాతీయపార్టీ. కానీ రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటది. ఓట్లు ఉంటే ఒకరకంగా, లేకుంటే ఇంకోలా మాట్లడుతరు. ఉదాహరణకు సీపీఎస్ సమస్యను తెచ్చిందే కాంగ్రెస్. దాన్ని ఉరికురికి అందరికంటే ముందుండి చేసింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఇప్పుడు అదే కాంగ్రెస్ సీసీఎస్ గురించి మాట్లడుతున్నది. ఇష్టమున్నట్లు మాట్లాడుతరా? ప్రజలు మరిచిపోతరా! వాళ్లకు తక్కువ జ్ఞాపకశక్తి ఉంటదనా ఇష్టమున్నట్లు మాటలు! రద్దుచేస్తం అనుకుంటే ధైర్యంగా చెప్పాలి. తెలంగాణలో బీజేపీ కూడా సీపీఎస్‌కు వ్యతిరేకం అంటది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చెప్తది? అధికారంలోనే ఉన్నరు కదా.. చేయొచ్చుకదా.. అంటే చేయరు. పచ్చి అవకాశవాద రాజకీయంతోని, చిల్లరమల్లర ఎత్తుగడలతోని నడుస్తున్న జాతీయ పార్టీలు అవి. పనిచేయని, పేలవమైన పార్టీలని తేలిపోయింది. కాబట్టే వాటిని పూర్తిగా ఖతం చేసి కొత్త మోడల్, కొత్త ట్రెండ్ మొదలు పెట్టాలి. దానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. ఆ ప్రయత్నం దేశ రైతాంగం కోసం నేను చేస్త. అది ఎలా ప్రారంభం అవుతుందనేది అతి త్వరలో చెప్త. దానికి మొత్తం భూమిక ఇప్పటికే సిద్ధంచేశాం. వందశాతం దాన్ని ప్రారంభిస్తం. దిగ్విజయంగా ముందుకుపోతామని ఆశిస్తున్న.

కేంద్ర ప్రభుత్వపు చెత్త విధానాలతోనే దుస్థితి
ఈ చెత్త కేంద్రం విధానం ఎట్లా ఉంటుందంటే.. యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూల్ అని పెట్టిండ్లు. బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎత్తిపారేసింది. మోడల్ స్కూల్ ప్రవేశపెట్టిండ్లని మనం పెట్టినం. వాళ్లు ఎత్తేస్తరు. ఎత్తేస్తే రూపాయి ఇయ్యరు. అప్పుడు రాష్ట్రం ప్రభుత్వం భరించాలి. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నయి.

చేసేదంతా చేసి సుద్దులు చెప్తే ఎట్ల?
గతంలో గ్రామాల్లో బ్లాక్ పంచాయతీలు ఉండే. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డాక్టర్ల ఉద్యోగాలు కూడా బీడీవో ఇచ్చేవాడు. టీచర్లు, వెటర్నరీ డాక్టర్ల జీతాలు కూడా బీడీవో ఇచ్చేవాడు. అందుకే అప్పుడు భయం, నియంత్రణ ఉండేది. ఇప్పుడు లేదు. ఎవరు చేసినారు? గ్రామాల్లో ఉన్న అధికారాలు గుంజుకొచ్చినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ దుర్మార్గులె. ఇది చరిత్ర కాదా? ఒకప్పుడు బీడీవోలు, పంచాయతీలు, పంచాయతీ సమితులు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లున్నయి! వారి అధికారాలు తీసిన కాంగ్రెసోళ్లే సుద్దులు మాట్లాడితే ఎట్లా? ఉన్న దాన్ని ధ్వంసం చేసినయి ఈ పార్టీలు. పంచాయతీల అభివృద్ధికి పోయిన సంవత్సరం బడ్జెట్‌లో రూ.1500 కోట్లు ఈటల రాజేందర్ పెట్టినారు.

కేంద్రం అనుకుంటే ముస్లిం రిజర్వేషన్
కేంద్రం అనుకుంటే ముస్లిం రిజర్వేషన్ వందశాతం చాలా సులువు. సహజంగా జరిగే మార్పులకు కూడా మేం అంగీకరించం.. మేం లైన్ పెట్టినం.. సచ్చినా 50% దాటేదిలేదు అంటే ఎట్ల? వెనుకబడిన వర్గాలు 85 శాతానికి పైగా ఉన్న రాష్ట్రంలో మేం 50 శాతం దాటం అంటే రాష్ట్ర ప్రజలకు ఎట్లా పంచాలె? 14% మైనార్టీలు, 16% ఎస్సీలు, 10% ఎస్సీలు.. 40 శాతం అయిపాయె. 50 శాతం బీసీలే ఉండిరి! ఇలాంటి ఫ్యూడల్ వైఖరి పోవాలంటే కాంగ్రెస్, బీజేపీ పోవాలె. అవి రెండు పోతే తప్ప… అది జరుగది.

కేంద్ర ప్రభుత్వ ఫ్యూడల్ వైఖరి నశిస్తేనే బాగుపడుతం
జెడ్పీలకు ఫైనాన్స్‌కమిషన్ నుంచి వస్తేనే డబ్బులు. ఇప్పుడు వాళ్లు కట్‌చేశారు. జిల్లా పరిషత్తులకు ఏం పనిలేదు. వాళ్ల దగ్గర రూపాయి లేదు. వాళ్లకు పనుల్లేవు.. జీతాల్లేవు! జెడ్పీ చైర్మన్లకు జీతాలు మేం ఇస్తున్నం. అట్లుంటయ్ కేంద్ర ప్రభుత్వ పాలసీలు. అందుకే కేంద్రానికి అవసరం లేని గ్రామీణవ్యవస్థ, పంచాయతీరాజ్‌వ్యవస్థ కేంద్రం పరిధిలో ఎందుకు? రూరల్ డెవలప్‌మెంట్‌తోని నీకేం పని? ఒక రాష్ట్రంలో ఎక్కువ అర్బన్ ఏరియా ఉంటది.. ఒక రాష్ట్రంలో ఎక్కువ రూరల్ ఏరియా ఉంటది. వాళ్ల అవసరాలను బట్టి వాళ్లు పెట్టుకుంటరు. అందుకే కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి మొత్తం నశించే పద్ధతి రానంతకాలం అది జరుగదు. నిర్మాణాత్మకమైన మార్పు రాకుంటే దేశంలో సమూల మార్పులకు శ్రీకారం రాదు. దానికి కొంచెం ధైర్యం, సాహసం కావాలె. ఆ సాహసం నేనుచేస్తున్న. తప్పకుండా విజయం సాధిస్తనని అనుకుంటున్న.

ప్రత్యేకహోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదు
ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే స్పష్టత లేదు. గతంలో ప్రత్యేక హోదాలో వచ్చేదేంది? చచ్చేదేంది? అని డైలాగులు కొట్టారు. ప్రత్యేక హోదా కోరేవారు మూర్ఖులని అన్నారు. ఇప్పుడు ఆయనే ప్రత్యేక హోదా కోరుతున్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నిరుద్యోగ భృతి…
ప్రకటించిన మ్యానిఫెస్టోను వందశాతం అమలుచేస్తం. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థికసంవత్సరంలో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం సంవత్సరం చివరలో ఉన్నం. మధ్యలో ఎన్నికలున్నయి. అవన్నీ అడ్డంవస్తయి. చేయాలన్నా చేయలేం. దానికి ఒక కమిటీ వేస్తం. ఇతర రాష్ర్టాల్లో ఎట్లా ఉంది? ఎంపిక చేసేందుకు కావాల్సిన అంశాలు, వయో పరిమితి ఎంత ఉండాలె? అధ్యయనం చేస్తం. కొన్ని గైడ్‌లైన్స్ ఉంటయి. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. అన్ని జిల్లాల్లో జాబితాను తయారుచేయాలె. ఇంతకుముందు 31 జిల్లాలుండె. మొన్ననే ఇంకా రెండు ప్రకటించినం కాబట్టి మొత్తం 33 జిల్లాల్లో జాబితా తయారుచేయాలె. పథకం ప్రారంభించగానే నిధులు విడుదల చేసేందుకు బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టుకుంటం. ఒక్కసారి అర్హుల పేరు నమోదైతే డబ్బులు వందశాతం పోస్టుద్వారా వారికి చేరుతాయి. వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు తెరిపించాలె. అప్పుడు ఠంచనుగా వారి అకౌంట్లలోకి డబ్బులు వెళ్తాయి. ఒక్కటి మాత్రం గ్యారంటీ.. నాకున్న అంచనా ప్రకారం దగ్గరదగ్గర పది లక్షలమందికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పాత జిల్లాలు అనుకుంటే జిల్లాకో లక్ష మంది చొప్పున రావచ్చు. అందుకు మేం సిద్ధమవుతున్నం.

కుంభకోణాల దొంగల పని పడుతం
మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌వాళ్ల స్కాంలపై పడి ఉంటే మా వెంబడి పడ్డారు.. ప్రభుత్వానికి ఇంకో పనిలేదు అనేవారు. వాళ్లు ఎన్ని స్కాంలు, కుంభకోణాలు చేశారో తెలుసు. రాష్ట్రానికి ఒక డైరెక్షన్, ప్లాన్ పెద్ద బాధ్యత. దానికోసం ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇక దొంగల పనిపడుతం. ఎవరేంచేశారో వారి పనిపడుతాం. వారు తిన్నదంతా కక్కిస్తం. ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎటుపడితే అటు మాట్లాడితే ఊరుకోం. ఓటుకు నోటు కేసు కొనసాగుతుంది.

ఊహకు అందని సంక్షేమ కార్యక్రమాలు
నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఆలోచించింది. లాస్ట్ టైమ్ ఏం లేకున్నా మాకు డైరెక్ట్‌గా పరిపాలన చేసే సంఖ్యను ప్రజలిచ్చారు. దానిని మేం కరెక్టుగా వాడాం. చేసింది సిన్సియర్‌గా చేశాం. ఈ దేశంలో ఎక్కడాలేని, ఊహకందని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కంటివెలుగు, కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి వాహనం, కల్యాణలక్ష్మి వంటి పథకాలు చేపట్టడంతో ప్రజలు ప్రభుత్వం తమను పట్టించుకుంటున్నదని విశ్వసించారు. బిడ్డ పెండ్లికి లక్ష రూపాయలు వస్తాయన్న ధీమా పెరుగడంతో తెలంగాణలో బాల్యవివాహాలు ఆగిపోయాయి. కేసీఆర్ కిట్స్‌వల్ల ఇంటివద్ద కాకుండా దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నయి. ఇలా అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంవల్ల ప్రజల నుంచి సమాంతర మద్దతు లభించింది. నాలుగు లక్షల టన్నుల గోదాములుండే సామర్థ్యాన్ని 25 లక్షల టన్నులకు తీసుకెళ్లినం. మేమేంచేసినా పాజిటివ్ దృక్పథంతో, కాంక్రీట్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నం. మైనార్టీ స్కూళ్లలో చదివే పిల్లలను చూడండి.. వచ్చే పదేండ్లలో సరికొత్త విప్లవం వస్తుంది. ప్రపంచాన్ని జయించే శక్తి విద్యార్థులకు లభిస్తుంది. సుపీరియర్ మెంటాలిటీతో స్కూళ్లనుంచి బయటికొస్తరు. ఉన్నత జీవనాన్ని కొనసాగిస్తరు.

ఈ ఏడాది 29.90 శాతం గ్రోత్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29.90% ఆర్థిక పెరుగుదల నమోదైంది. ఈ స్థాయిలో పెరుగుదల ఏ రాష్ట్రంలోనూ లేదు. కనీసం మన సమీపంలోనూ లేవు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలాంటి ఆర్థిక అభివృద్ధిని సాధించలేదు. ఎంత క్రమశిక్షణ ఉంటే ఇది సాధ్యమవుతుంది? సింగరేణి రాయల్టీ పెరుగుతున్నది.. పన్నులు పెరుగుతున్నయి. లంచాల్లేవు. వేధింపుల్లేవు. వ్యాపారులు సంతోషంగా ఉన్నరు. ఆర్థికశాఖ సమర్థంగా పనిచేస్తున్నది. ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఇప్పట్నుంచి రూ.70 వేల కోట్లు అవసరం. పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకానికి రూ.30 వేల కోట్లు అవుతుంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా జులై నుంచే నీళ్లు ఇస్తం. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాలేదు. అయినా కాల్వ కంప్లీట్ చేసి, దుమ్ముగూడెం నుంచి సాగర్ నిండకుండానే నీళ్లిస్తం.

అప్పెలా తీర్చాలో మాకు తెలుసు
అప్పులుచేశామని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు. మేంచేసిన అప్పెంతో.. దాన్నెలా తీర్చాలో మాకు తెలుసు. 2024 నాటికి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే పైసా, పోయే పైసాను లెక్కిస్తే.. పది లక్షల కోట్లు అవుతుంది. మాకు పూర్తి అవగాహన ఉంది. మేం దాంట్లో 2.40 లక్షల కోట్ల అప్పు కట్టాలి. అందులో మేం కట్టిన దానికి లక్షా ముప్పయ్ వేల కోట్ల ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే, మనది మనకే ఉంటుంది. ఇలా, ప్రతి నయాపైసా మీద మాకు అంచనా ఉండి స్కీములను ప్రవేశపెడుతున్నం. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టినం. బిల్డింగులు కట్టినం. ఇంకా, కొన్ని పెద్ద స్కూళ్లు పెట్టాలి. ఇలా, మంచి ప్లానింగ్‌తో రాష్ట్రాన్ని ఏ దశకు తీసుకెళ్లాలో అలా తీసుకెళుతున్నం. పవర్ సెక్టార్ బ్రహ్మాండంగా ఉంది. ఏడాదిన్నరలో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులు వందశాతం పూర్తవుతాయి. పాలమూరు ఎత్తిపోతల 75-80% కంప్లీట్ అవుతుంది. దాని కింద ఉండే ఏరియాలకు నీరు పారుతుంది. పాలమూరు ప్రజలకు మాపై విశ్వాసం కలిగింది. మేం తిప్పలు పడుతున్నమన్న సంగతి వారికి అర్థమైంది. సిన్సియర్‌గా ప్రాజెక్టులను పూర్తిచేయగల సామర్థ్యముంది.. డబ్బు ఉంది. పదిహేను పదహారు వేల కోట్లు ఇచ్చేందుకు ఆర్‌ఈసీ సంసిద్ధతను వ్యక్తంచేసింది. భారీ మెజార్టీతో గెలిచినందుకు మన రాష్ట్ర పరపతి పెరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు గంటలలోపే 16 వేల కోట్లు ఇస్తమనడమంటే.. మన రాష్ట్ర పతారా పెరిగిందని చెప్పొచ్చు.

మ్యానిఫెస్టో అమలులో మేం దేశంలోనే ఆదర్శం
దేశంలో మ్యానిఫెస్టోను వందశాతం అమలుచేసిన మొదటి పార్టీ టీఆర్‌ఎస్. దీనిపై చర్చించేందుకు మేం సిద్ధం. ఏం చేస్తమని చెప్పామో పూర్తిగాచేశాం. మ్యానిఫెస్టోలో లేకున్నా.. ప్రజలకు అనుగుణమైన 76 అంశాలను అమలుచేశాం. బీడీ కార్మికులకు పింఛన్లు సహా అనేకం మా మ్యానిఫెస్టోలో లేవు. కానీ చేశాం. మేం ఏం చెప్పామో వందశాతం చేశాం. అనుకున్నట్టు రాష్ట్ర సంపద కూడా పెరిగింది కాబట్టి అదనపు కార్యక్రమాలు చేశాం. రైతుబంధు పథకం ఎవరూ అడగలేదు. మా మ్యానిఫెస్టోలో పెట్టలేదు. కాని మంచికోసం అమలుచేస్తున్నం. ఓట్ల కోసం, తమాషా కోసం మేం ఈ పథకం తీసుకోలేదు. పాసుబుక్కు ఇవ్వాలనుకున్నం. దాదాపుగా ఇచ్చాం. పార్ట్-బీలో ఉన్న కొన్ని వివాదాల వల్ల ఒక 20% మిగిలింది. అవికూడా త్వరలో అయిపోతాయి. చాలా భూ సమస్యలకు పరిష్కారం లభించింది. ఇంటి తగాదాలు, అన్నదమ్ముల పంచాయితీలు, ఎన్నో రకాల గొడవలు, కోర్టు కేసులు తగ్గాయి. వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దుచేశాం. రైతుబంధు, రైతుబీమా అమలుచేశాం. రైతుబీమా కింద ఇప్పటికి 4000 పైచిలుకు రైతు కుటుంబీకులు లబ్ధిపొందారు. అందులో 95% సన్న, చిన్నకారు రైతులే! ఒక్క ఎకరం, పావు ఎకరం, రెండు గుంటల భూమి ఉన్న రైతుకు కూడా వర్తించింది. గతంలో రైతు చనిపోతే కుటుంబం రోడ్డునపడేది. ఈరోజు ఎలాంటి పైరవీ లేకుండా, ఏ అధికారి చుట్టూ తిరుగకుండా పది రోజుల్లోనే రూ.5 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నయి. ఇది ఒక మంచి పథకం. నాకు తృప్తిని ఇస్తున్న స్కీం. ప్రభుత్వం మంచి పని చేసిందని అందరూ అభినందిస్తున్నరు.

అంతర్జాతీయ మార్కెట్‌లో మన రైతును అడ్డుకుంటున్నరు
భారత వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకునే పరిస్థితులు లేవు. అందుబాటులో లేని ఉత్పత్తులకు అవకాశం ఉంది తప్ప.. వేరేదాని విషయంలో మనల్ని ఎంటర్ కానివ్వరు. ఎదుగనివ్వడం లేదు. ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదు. నేను వ్యవసాయంచేశాను కాబట్టి చెప్తున్నా.. ఉల్లి పొరుక లాగా ఉండే చెవ్స్ అనే పంట ఉంటది. యూరప్‌లో ప్రత్యేకంగా జర్మనీలో ఎక్కువగా తింటరు. నా పాలీహౌజ్‌లో దానిని పండిద్దామని ప్రయత్నించాను. కానీ విదేశీ మార్కెట్‌లోకి రానివ్వరు. మధ్యలో ఉండే బ్రోకర్లు ఏ ధర అంటే ఆ ధరకే ఇవ్వాలి. నష్టపోవాలి. ఏ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజ్ లేకుండా చేస్తున్నరు. ఇజ్రాయిల్ మనకంటే చాలా చిన్న దేశం. ప్రపంచ కట్ ఫ్లవర్ మార్కెట్‌లో 90% వాళ్ల చేతిలోనే ఉంటుంది. మనకు అన్ని అవకాశాలు ఉండి, ఇంత పెద్ద దేశం ఉండి కూడా చేయలేక పోతున్నం. మన దేశంలో అన్నిరకాల వాతావరణ పరిస్థితులున్నయి. అన్ని ఉండి కూడా ముం దుకు పోతలేము. మరోవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. భారత వ్యవసాయంలో ఉండే క్షోభ పోవడం లేదు. నివారణ కావాలంటే కాంగ్రెస్ మోడల్, బీజేపీ మోడల్ పనిచేయదు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తం
జర్నలిస్టులు మిత్రులకు ప్రామిస్ చేస్తున్న.. లాస్ట్ టర్మ్‌లోనే అనుకున్నం. ఇండ్ల జాగాలు సమకూర్చుతామని అన్న. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులకు రాలేదు. కొందరికి వచ్చాయి.. కొందరికి రాలేదు. ఫొటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు రాలేదు. వాళ్లుకూడా జర్నలిస్టులే కాబట్టి అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఒక వరుస చాలా చిన్న పత్రికలు కూడా ఉన్నయి. అందరికీ కలిసి ఇస్తే ఒక స్థితికి వస్తరనే ఆలోచన ఉంది. సిటీస్థాయిలో, రాష్ట్రస్థాయిలో మాత్రం నేనే చొరవ తీసుకుంట. వీలైనంత త్వరలో ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేస్తం. జర్నలిస్టుల సంక్షేమం అనుకున్నం. ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించుకున్నం. ఇప్పుడు కూడా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి ఇంకొంత చేసుకుందాం. ప్రభుత్వం ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా నిధి కోసం జమ చేయాలనుకుంటున్నం. త్వరలో పూర్తిచేస్తం. ఇతర రాష్ట్రాల్లో రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను ఇస్తున్న విషయంపై అధ్యయనం చేస్తం. బాగుంది అనిపిస్తే అమలుచేసేందుకు ప్రయత్నం చేద్దాం.

నిరుద్యోగులను కన్ఫ్యూజ్ చేస్తున్నరు
నియామకాల విషయంలో అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నరు. నిరుద్యోగులను బుకాయించి తమాషా చేసి, అబద్ధాలు చెప్పే పార్టీలు చాలానే ఉన్నయి. మాకన్న ముందు 60 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీ పాలించినయి. కాంగ్రెస్, టీడీపీ నాయకులు మహామేధావులు.. ఘనాపాటీలు.. ఇక్కడనుంచి ఢిల్లీ దాక పెత్తనాలు చేసినోళ్లు! ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు? నోటితో మాట అలుకగా చెప్పొచ్చు కదా! ఏడాదికో లక్ష ఉద్యోగాలు ఇచ్చినా 60 లక్షలు అయితుండే! ఎందుకియ్యలె? 60 లక్షలు కాదు ఐదు లక్షల ఉద్యోగాలు కూడా ఇయ్యలె. దారుణమేమంటే యువతను కన్ఫ్యూజ్ చేస్తున్నరు. పచ్చి అబద్ధాలు చెప్పి.. వారిలో ఆశలు రేపి, ఆశావహులను చేసి ఇబ్బంది పెట్టుడెందుకు? గుండెల మీద చేయివేసి అనుకోవాలె. మన రాష్ట్రంలో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత? ప్రైవేట్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మూడు లక్షలైతే.. ప్రైవేట్‌లో పనిచేసేవారి సంఖ్య 30 లక్షలు. ఒక్కొక్క కన్‌స్ట్రక్షన్ కంపెనీలో దాదాపు ఆరు వేల మంది దాక పనిచేస్తున్నరు. వందలమంది ఇంజినీర్లు ఉన్నరు. ప్రభుత్వంలో లేనంత ఇంజినీర్ల సంఖ్య ప్రైవేట్‌లో ఉంది. దాన్ని విస్మరించి, అబద్ధాలు చెప్పి ఎంతకాలం మోసంచేస్తరు? ప్రభుత్వ ఖాళీలను వందశాతం భర్తీచేస్తం. ఇంటికో ఉద్యోగం అన్నానని కథలు పుట్టించారు. నేను అన్నానా? మ్యానిఫెస్టోలో ఉన్నదా? ఉద్యోగాలు కల్పిస్తమని చెప్పాం. ఆంధ్రావాళ్లు వెళ్లిపోతే మిగిలిన ఉద్యోగాలు ఇస్తమన్నం. ఇచ్చాం.. ఇస్తూనే ఉంటాం. యువకుల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, ఆరోపణలు చేయడం సరికాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు హామీ ఇస్తరు.. ప్రతిపక్షంలోకి రాగానే వాళ్లే ధర్నా చేస్తరు. ఎవరు వచ్చినా ధర్నా నడుస్తనే ఉంటది. నేను స్పష్టంగా చెప్పిన.. ఎన్ని ప్రభుత్వ ఖాళీలైతే ఉన్నయో, అవి వందశాతం ఆగమేఘాల మీద పూర్తిచేస్తం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిచ్చిపిచ్చి పనులు పెట్టుకుని మేం ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తిచేయలే. అది కొంత మైనస్ కూడా అయింది. ఇప్పుడు కొన్ని తీసేసినం. వేరే శాఖలకు ఇచ్చేసినం. వారినే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయమని చెప్పినం.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 1 శాతం మాత్రమే…
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఒకశాతం కంటే తక్కువే. ఇతర ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ. రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడుల ద్వారా మన దగ్గర కూడా రెండున్నర లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చినయి. పెట్టుబడి ఎంత పెరిగితే ఉద్యోగావకాశాలు అంత పెరుగుతయి. ప్రభుత్వంలో ఏముంది.. ఏదైనా కొత్తయి ప్రారంభిస్తే వస్తయి.. ఇప్పుడున్నోళ్లు రిటైర్ అయితే వస్తయి. లేకపోతే లేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.