Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేవభూమిగా ఎర్రవల్లి క్షేత్రం

-మూడోరోజు నిర్విఘ్నంగా సాగిన సహస్ర చండీయాగం
-మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
-పెద్దఎత్తున తరలివచ్చిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు
-రేపు పూర్ణాహుతితో ముగియనున్న సహస్ర చండీయాగం

వేద మంత్రాలు.. పురాణేతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది. మంగళనీరాజనాలు, జపతపాలతో తపోభూమిగా పరివర్తనం చెందింది. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మూడోరోజు కన్నులపండువగా కొనసాగింది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన యాగ ప్రక్రియ నిరంతరాయంగా రాత్రి ఏడు గంటలవరకు కొనసాగింది. సీఎం కేసీఆర్ దంపతులు.. ఇతర కుటుంబసభ్యులు యాగశాలకు చేరుకొని సంప్రదాయబద్ధంగా తొలిపూజలు నిర్వహించారు. మొదట రాజశ్యామల మంటపంలో అమ్మవారిని అర్చించారు. ఆ తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు బ్రహ్మ స్వరూపిణి మంటపంలో పూజలుచేశారు. అనంతరం పవిత్ర మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి అభిషేకం చేశారు. వేదపారాయణాలు జరుగుతున్న చతుర్వేద పారాయణ మంటపంలో ప్రార్థనలు చేశారు. సూర్యనమస్కారాలు చేశారు. చండీ మండపంలో చండీమాతకు పూజలు చేశారు. ఆ తర్వాత మహారుద్ర మంటపంలో రుద్రహవనం, రుద్ర పారాయణం జరిగింది. మూడోరోజు పూజాకార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మ న్ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు కూర్చున్నారు. ప్రాతఃకాల పూ జానంతరం 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. సాయంకాలం 4 నుంచి 2 లక్షల నవార్నజపము పూర్తిసచేశారు.

మహారుద్ర యాగం
శాంతి పాఠముతో ప్రారంభమై ఆవాహిత దేవతా పూజ.. 41 ఏకాదశ రుద్ర అభిషేకములు పూర్తి చేసుకొని మధ్యాహ్నం 3 గంటల నుండి 41 ఏకాదశ హోమములు, క్రమార్చన హారతి, మంత్రపుష్ప సమర్పణ జరిగింది. అనంతరం జరిగిన భజన కార్యక్రమం సీఎం దంపతులను, భక్తులను ఆకర్షించింది.

రాజశ్యామల యాగము
రాజశ్యామల యాగంలో భాగంగా రాజశ్యామల మూల మంత్ర జపం, మూలమంత్ర హవనాలు, శరభ సాళువ మూలమంత్ర జపం హవనం , మాతంగి మహావిద్య హవనము, ప్రదోషకాల మంటప్రార్చనలు, కుంకుమార్చన, సహస్ర నామార్చన, హారతి మంత్రపుష్పము చతుర్వేద స్వస్తి పూజాకార్యక్రమాలు జరిగాయి.

బగళాముఖి
బగళాముఖి పూజలో భాగంగా మూడోరోజు పదివేల జపం పూర్తయింది. సాయంత్రం 4 గంటలకు హరిద్రన్నముతో 2 వేల మూల మంత్ర హవనము పూర్తిచేసి రాత్రి 7.30గంటలకు హారతి.. మంత్ర పుష్పము, తీర్థప్రసాద వితరణతో కార్యక్రమం పూర్తయింది. వీటితోపాటు అరుణ పారాయణము మహాసారము, పంచ కాటకముల పారాయణములు, నవగ్రహ జపానుష్ఠానములు, మహా మృత్యుంజయ జపము నిర్వహించారు. ప్రతి యాగ మంటపములో జరిగే హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలకు ముఖ్యమంత్రి దంపతులు హాజరవుతున్నారు . సాయంత్రం ప్రదోషకాల వేళ చతుర్వేదాలను అవధారయ అని వినిపించి పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మంగళనీరాజనం సందర్భంగా భక్తి కీర్తనల ఆలాపన ముఖ్యమంత్రి దంపతులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం మంత్ర పుష్ప సమర్పణ.. తీర్థ ప్రసాద వితరణతో మూడోరోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి.

మూడోరోజు కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, హోంశాఖ మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దంపతులు, జోగినిపల్లి సంతోష్‌కుమార్ దంపతులు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటలరాజేందర్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దంపతులు, రాజేందర్‌రెడ్డి దంపతులు, వరంగల్ ఈస్ట్ ఎమ్మె ల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్‌ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్‌రావు, సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌టీఎస్‌సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, టీఎస్‌టీడీసీ చైర్మన్ పీ భూపతిరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయసంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావు, గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు పీ రాములు, బస్వరాజుసారయ్య, రావుల శ్రవణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కోవాలక్ష్మి, కే ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నుంచి మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. పూజలకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. యాగానికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజన సమయానికి వచ్చే ప్రతీ ఒక్కరు భోజనం చేసి వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన సిబ్బందికి ఆదేశించడమే కాకుండా తాను స్వయంగా వచ్చి భోజనం అందుతున్న తీరును గమనించారు. బుధవారం ఆయన స్వయంగా భోజ నం చేస్తున్న భక్తులను, అతిథులను పలకరించారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా భోజనశాలలను ఏర్పాటుచేశారు. రుత్విక్కుల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. యాగం శుక్రవారం పూర్ణాహుతితో పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.