Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశం నివ్వెరపోతున్నది

-ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర పురోగమనం
-ఉద్యమంలో ఆశించాం.. స్వరాష్ట్రంలో సాధించాం
-మన వనరులు మనకే దక్కాయి.. ఆర్థికంగా ఎదిగాం
-సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ పంచుతున్నాం..
-మన దగ్గర కరెంట్‌ ఉంటదెట్లా? ఢిల్లీలో ఉండదెట్లా?
-నీచ రాజకీయాలతో దేశాన్ని విడదీసే పన్నాగం
-ప్రతీప శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి
-దేశంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించాలి
-విద్వేషం పెచ్చరిల్లితే ఏకం కావడం సాధ్యం కాదు
-రాష్ట్రంలో మరిన్ని గురుకుల పాఠశాలల ఏర్పాటు
-ఆసరా పెన్షనర్లందరికీ ఎలక్ట్రానిక్‌ కార్డుల పంపిణీ
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటన
-మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభం

తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుకొన్నది అనుకొన్నట్టుగా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. తెలంగాణ ఇదంతా ఎట్లా చేస్తున్నదని దేశమే నివ్వెర పోతున్నది.. చైతన్యవంతమైన సమాజం ఉంటే.. రాష్ట్రం, దేశం పురోగమిస్తది. లేకుంటే దెబ్బతింటది. ఒక బంగ్లా కట్టాల్నంటే చాలా కష్టమైతది. కూలగొట్టాల్నంటే పటపటా జేసీబీలు పెట్టి ఎటు పడితే అటు కూలగొట్టొచ్చు. నీచ రాజకీయాల కోసం దేశాన్ని కుల మతాల పేరుమీద విడదీసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మంచిది కాదు.
– మేడ్చల్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


ఉద్యమకాలంలో ఏవైతే ఆశించామో.. స్వరాష్ట్రంలో వాటన్నింటినీ సాధించుకొన్నామని.. యావత్‌ దేశమే నివ్వెరపోయేలా పురోగమిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మన వనరులు మనకు దక్కడంతోపాటు ఆర్థికంగా ఎదిగామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం కులం, మతం, వర్గం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటువంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్‌ మల్కాజిగిరి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగం
ఆయన మాటల్లోనే..

మేడ్చల్‌ ఒక జిల్లా అయితదని ఈ ప్రాంతంవాళ్లు కల కూడా కనలే. తెలంగాణ ఏర్పడటం వల్ల కలిగినటువంటి శుభ పరిణామం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా వస్తే అంత చక్కగా పనులన్నీ జరిగే అవకాశముంటది. రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మేడ్చల్‌ను జిల్లా చేసేటప్పుడు పెద్ద చర్చ జరిగింది. ప్రజలకు పాలన అందాలంటే మేడ్చల్‌ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి నిర్ణయం తీసుకొన్నాం. అందులో భాగంగా 33 జిల్లాలు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం భూమిని లెక్క తీసుకొని 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేశాం. క్లస్టర్‌కు ఒక వ్యవసాయాధికారిని నియమించాం. రైతుల కోసం రైతు వేదికలు ఏర్పాటు చేయాలని భావించాం. ఆరు నెలల లోపే స్థలాలు సేకరించి, 2,600 రైతు వేదికలను నిర్మించాం. ఇదెలా సాధ్యమైందంటే ప్రజలకు పరిపాలన చేరువ కావడం వల్లనే. అదే తరహాలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా ఇప్పటికే 11 వేల ప్రాంగణాల ఏర్పాటు తుది దశకు వచ్చింది. స్వరాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇలాంటి అనేక సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి.

పెన్షనర్లందరికీ కొత్త కార్డులు..
వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్దేశిత గడువులోగా పింఛన్లు అందుతున్నయి. ఇచ్చిన మాట నిలబెట్టుకొంటూ 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలోని పింఛనుదారులందరికీ కొత్త కార్డులను, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందజేయాలని ఆదేశించాం.

24 గంటల కరెంటు ఇస్తున్నది మనమే
గతంలో కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వదు. పరిశ్రమలకు హాలిడేలు ఇచ్చిన దుస్థితి. ఈ రోజు చాలా గొప్పగా, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతున్నది. మనం ఆంధ్రప్రదేశ్‌లనే ఉంటే ఈ కరెంటు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? పింఛన్లు వచ్చేవా? బియ్యం దొరికేదా? మంచినీళ్లు వచ్చేవా? చాలా అవస్థల్లో ఉండేవాళ్లం. గత 75 ఏండ్ల నుంచి సాగుతున్న పరిపాలన, అసమర్థమైన, అవివేకమైన, లోపభూయిష్టమైన విధానాల వల్ల దేశ ప్రగతి కుంటుపడ్డది. ఆదిలాబాద్‌ గోండు గూడెంలో, వరంగల్‌ లంబాడా తండాలో, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఎక్కడైనా 24 గంటలపాటు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది ఆషామాషీగా రాలే. గత పాలకులు ఎందుకియ్యలేదు. ఇవాళ ఎట్ల్ల ఇవ్వగలుగుతున్న? ప్రజలకు మేలు చేయాలనే తపన కడుపుల ఉంటే, హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతయి.

ఒక్కో నియోజకవర్గానికి మరో రూ.10 కోట్లు
మేడ్చల్‌లో గ్రామాలు తక్కువ. ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటది. అనేకరకాల సమస్యలు ఉంటయి. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగా గతంలో రూ.5 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆ నిధులు సరిపోవడం లేదని మేడ్చల్‌ ఎమ్మెల్యేలు చెప్పారు. మేడ్చల్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులకు అదనంగా రూ.10 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నా. రోడ్లు, ఇతరత్రా అవసరాలకు ఎమ్మెల్యేలు ఆ నిధులను మంత్రి నేతృత్వంలో వినియోగించుకోవాలి

నాడు ఆశించింది.. నేడు సాధించాం..
కొందరు మూర్ఖులు తెలివి లేక కారుకూతలు కూస్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమంలోనే నేను చెప్పిన. మన తెలంగాణ మనకు కావడంతోనే ధనిక రాష్ట్రంగ ఉంటామని చెప్పిన. చాలామంది నమ్మలే. రాష్ట్ర ఆర్థిక సౌష్టవాన్ని తెలుసుకోవాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటయి. తలసరి ఆదాయం ఒక గీటురాయి. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగినం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుకొన్నది అనుకొన్నట్టుగా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది.

దేశమే నివ్వెర పోతున్నది.. తెలంగాణ ఎట్లా ఇదంతా చేస్తున్నదని! దేశంలో అత్యుత్తమ జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులు తెలంగాణలనే ఉన్నరు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రేషన్‌ బియ్యం.. ఇలా ఒకటేమిటి అనేక సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసుకొంటున్నం. ఈ రోజు వృద్ధులు సంతోషంగా ఉన్నరు. అంతకుముందు వృద్ధులను ఇంట్ల నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు అనేకం. ఇవ్వాళ ముసలి వాళ్ల దగ్గర కూడా రూ.30 నుంచి 40 వేల వరకు డబ్బులు ఉన్నయి. ఇయ్యాల అత్తలను కోడండ్లు గౌరవిస్తున్నరు. ఇట్ల ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన వనరులు మనకు దక్కినవి కాబట్టే ఆర్థికంగా పెరిగినం. 2014లో మన జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు. ఇవాళ రూ.11.50 లక్షల కోట్లు. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్ఠపడ్డాం. అధికారుల అంకితభావం. ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వ లక్ష్యశుద్ధి వల్లనే ఈ పురోగతి సాధించాం.

రాబోయే రోజుల్లో మరిన్ని గురుకులాలు..
చాలా రాష్ర్టాల్లో మన కలెక్టరేట్ల మాదిరిగా సెక్రటేరియట్లు కూడా లేవు. పోలీసు భవనాలను కూడా తీసుకొస్తున్నాం. దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్‌ స్కూళ్లు కలిగిన రాష్ట్రం తెలంగాణే. దళితులు, గిరిజనులు, ముస్లింలు, బీసీల పిల్లలు అందరూ చక్కగా చదువుకుంటూ దేశమే ఆశ్చర్యపోయేలా సీట్లు సాధిస్తున్నారు. కరోనా రాకపోయి ఉంటే మరో 500 గురుకులాలను ఏర్పాటు చేసేవాళ్లం. ఇటీవలే బీసీ గురుకులాలను పెంచాం. రాబోయే రోజుల్లో గురుకులాలను విస్తరిస్తాం. నేడు రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అల్లాడిపోయే పరిస్థితులు లేవు. నాడు వలస పోయిన తెలంగాణ గ్రామాలకే నేడు 20 రాష్ర్టాల నుంచి దాదాపు 30-40 లక్షల మంది కార్మికులు వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నరు. అంత గొప్పగా ఎదిగాం. ఉద్యమకాలంలో ఏదయితే కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నాం.

చైతన్యంతో ముందుకు సాగాలె
దేశంలో అపారమైన నదులు ఉన్నయి. అపారమైన సంపద ఉన్నది. కానీ దేశానికి చెందకపోవటం దురదృష్టం. జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు రావాలి. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటంలేదు. అర్థం చేసుకోవాలని కోరుతున్న. తెలంగాణలో లేని కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది? మన పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో రాదు. ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరెంటు రాదు. తెలంగాణలో వస్తదెట్లా? ఢిల్లీలో రాదెట్ల? తెలంగాణలో మంచినీళ్లు ఉంటయి ఎట్లా? ఢిల్లీలో ఉండవెట్లా? తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగతలేదు? ఎందుకు జరగకూడదు? ఇక్కడ సాధ్యం అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు? ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. మనం కష్టపడి చెమటోడ్చి అందరం ఒక్కమాటమీద ఉండి ఐకమత్యంతో సమకూర్చుకున్నదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. అందరూ దీని గురించి విచారం చేయాలె. మోసపోతే గోసపడే ప్రమాదం ఉంటది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలె. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో చర్చ జరగాలె. నిజమేందో, అబద్ధం ఏందో తెలుసుకోవాలె. జాగ్రత్తగా ఉంటెనే మన సమాజాన్ని మన రాష్ర్టాన్ని కాపాడుకోగలుతం. మేడ్చల్‌ బ్రహ్మాండంగా చైతన్యం ఉన్న జిల్లా. వ్యవసాయం, కార్మికులు, ఫ్యాక్టరీలు కలగలిసి ఉన్న జిల్లా. అందరూ ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్నట్టే దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే విధంగా ఐకమత్యంతో, చైతన్యంతో ముందుకు సాగాలె. ఎవడో వచ్చి ఏదో చెప్తడు. ఆ నిమిషానికి తమాషా అనిపిస్తది. కానీ ఫలితాలు దుర్మార్గంగా ఉంటయి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా చాలా గోస పడ్తం. ఇప్పటికే 58 ఏండ్లు దగా పడ్డం. ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నం. ఈ శాంతిని, సుఖాన్ని కాపాడుకోవాలె. మన కరెంటు, మన నీళ్లు, మన ప్రాజెక్టులు, మన కాల్వలు అన్నీ మన ఆస్తులు. వీటిని రక్షించుకోవాలి. ఇంకా పెంపొందించుకోవాలె. భవిష్యత్తు తరాలకు అందించాలె. దేశంలోనే తెలంగాణ సముజ్వలంగా ముందుకు పోవాలె. మీరందరూ చైతన్యంతో ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని అందరినీ కోరుతున్నా.

కూల్చడం తేలికే.. కట్టడమే కష్టం..
చైతన్యవంతమైన సమాజం ఉంటే.. రాష్ట్రం, దేశం పురోగమిస్తది. లేకుంటే దెబ్బ తింటది. ఒక బంగ్లా కట్టాల్నంటే చాలా కష్టమైతది. కూలగొట్టాల్నంటే పటపటా జేసీబీలు పెట్టి కూలగొట్టొచ్చు. దేశాన్ని కుల మతాల పేరుమీద నీచ రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతావున్నది. ఇది ఏ రకంగా చూసినా మంచిది కాదు. ఎందరో త్యాగాలు చేసి తెచ్చిన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వతంత్ర ఫలాన్ని పూర్తిగా పొందాలంటే.. దేశంలో కుల, మత, వర్గ భేదాలు లేని భారతీయ ఐక్యత మనలో రావాలి. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లా ఏకం కావడం అంత సులభం కాదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా చైనా, సింగపూర్‌, కొరియా దేశాలు పురోగమించాయో.. ఆ విధంగా భారతీయులందరం కుల, మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది.

సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ జేఏసీ నేతల కృతజ్ఞతలు
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బుధవారం మేడ్చల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. టీజీవో అధ్యక్షురాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్‌ వీ మమత, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌ నూతన సమీకృత కలెక్టరేట్లలో అధికారులంతా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రజలకు న్యాయం జరుగుతుందని మమత అభిప్రాయపడ్డారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పెండింగ్‌ సమస్యలను ట్రెసా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం స్పందిస్తూ త్వరలో పిలిచి మాట్లాడతానని, సమస్యల పరిష్కారానికి ఆదేశిస్తానని చెప్పినట్టు వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌తో పాటు ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే నాగమణి, కార్యదర్శి వాణి, సంయుక్త కార్యదర్శులు ఎల్‌ వెంకటేశ్వర్‌ రావు, గోవర్ధన్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు పీ సుధాకర్‌, జిల్లా కార్యదర్శి వీ రామకృష్ణా రెడ్డి, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు గౌరీ వత్సల, జిల్లా కార్యవర్గ సభ్యుడు శామీర్‌పేట్‌ తాసిల్దార్‌ సత్యనారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, భూపాల్‌, మహిపాల్‌ రెడ్డి, గీత, ఎస్తేర్‌ అనిత ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.