-నేడు నీతి ఆయోగ్ సబ్ కమిటీతో కలిసిప్రధానికి నివేదిక

మంగళవారం కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తర్వాత నీతి ఆయోగ్ సబ్ కమిటీ సభ్యులతో కలిసి సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో ఆయన నివాసంలో భేటీ అవుతారు. అంతకుముందు ఉదయం 11.45 గంటలకు ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, మధ్యాహ్నం 2.30 గంటలకు ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు.
-కేంద్రమంత్రులు జైట్లీ, గడ్కరీలతోనూ సమావేశం కానున్న కేసీఆర్ -చండీయాగానికి రావాలని రాష్ట్రపతి, ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం కాగా, డిసెంబర్ 23 నుంచి నిర్వహించనున్న ఆయత మహా చండీయాగం కార్యక్రమానికి రావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీలను ఆహ్వానిస్తారు. కేంద్రమంత్రులతో జరిగే చర్చల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్, రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్ వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ పాల్గొంటారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉదయానికల్లా ఢిల్లీకి చేరుకుంటారు.
అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరనున్న సీఎం 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా నిధుల విడుదల, రుణ పరిమితి పెంపుతోపాటు ఏపీ, తెలంగాణ మధ్య హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. సమర్థవంతంగా రాష్ట్రప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన రుణాలు సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరనున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్సాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితిని 3% నుంచి 3.5 శాతానికి పెంచాలని ఇంతకుముందే కోరారు. మరోసారి సీఎం ఈ అంశాన్ని ప్రధానితో ప్రస్తావిస్తారు. ఇప్పటికే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆర్థికశాఖలోని బడ్జెట్ విభాగం తగు చర్యలు తీసుకోవాలని వినిమయ విభాగానికి గత ఆగస్టు 21న లేఖ రాసింది. మిగులు విద్యుత్ రాష్ర్టాల జాబితాలో గుజరాత్ తర్వాత తెలంగాణ ఉన్నందున 14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని దృష్టిలో పెట్టుకుని రుణ పరిమితి పెంచాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
తెలంగాణ, ఏపీ మధ్య హైకోర్టు విభజనపై బడ్జెట్, వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా న్యాయశాఖమంత్రి సదానందగౌడ లోక్‌సభలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా తక్షణం తెలంగాణకు విడిగా హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరే అవకాశముంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్ల అనుసంధాన ప్రక్రియపై దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను అమలు చేయాలని సీఎం విజ్ఞప్తి చేస్తారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు పారిశ్రామిక ఉత్పత్తులను నౌకాశ్రయాల ద్వారా రవాణాకు ప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ – వరంగల్ – విజయవాడ – మచిలీపట్నం మధ్య ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకోసం రైల్వేశాఖతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలను కలుపుతూ విజయవాడ వరకు ఎక్స్‌ప్రెస్ రైల్వేలైన్‌ను ప్రత్యేకంగా నెలకొల్పాలని కూడా ఇటీవల రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ దృష్టికి తెచ్చే అవకాశముంది.
గడ్కరీతో భేటీలో రహదారుల విస్తరణే ఎజెండా తెలంగాణలో తక్కువగా ఉన్న జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియ పెంపుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణామంత్రి గడ్కరీతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పరిధిలో 6 జాతీయ రహదారుల పరిధిలో 1015 కి.మీ. రోడ్ల అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. మరికొన్ని రోడ్ల విస్తరణ విషయాన్ని ప్రస్తావిస్తారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్లకు పెంచడంతోపాటు ఇందుకు రూ.300 కోట్లు విడుదల చేయాలని కోరే అవకాశముంది.
మంచిర్యాల-వరంగల్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన కేంద్రాన్ని ఆ రహదారిని ఖమ్మం వరకు విస్తరించాలని కోరతారు. రాష్ర్టానికి డ్రైపోర్ట్ మంజూరు చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రాష్ట్రం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వంటి సాంకేతిక అంశాలపైనా సత్వరం చర్య తీసుకోవాలని కోరతారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
నేడు ప్రధానికి నీతి ఆయోగ్ సబ్‌కమిటీ తుది నివేదిక కేంద్ర సంక్షేమ పథకాల కొనసాగింపుపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ సబ్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీకి నివేదిక సమర్పించనున్నది. యూపీఏ హయాంలో సంక్షేమ పథకాలు 147 నుంచి 66కు తగ్గిపోయాయి. ఎన్డీయే సర్కార్ కొత్తగా ఆరింటిని చేర్చింది. మొత్తం 72 పథకాల్లో కుదించే అవకాశాలపై నివేదిక సమర్పించాలని కేంద్రం సూచించింది. ఆ పథకాలను 30కి తగ్గించవచ్చునని గత జూలైలో సమర్పించిన ముసాయిదాలో కమిటీ పేర్కొంది. దీంతో తుది నివేదిక కీలకం కానుంది. ప్రస్తుతం రాష్ట్రాలకు అందుతున్న 10% ఫ్లెక్సీ ఫండ్‌లను 25%కు పెంచాలని ఈ కమిటీ జూన్ చివరివారంలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సంక్షేమ పథకాల హేతుబద్ధీకరణ, రాష్ర్టాలకు కేంద్రం నిధుల విడుదల విధానంలోనూ కొన్ని మార్పులు తేవాలని సిఫారసు చేయనున్నది. సిఫారసుల రూపకల్పనపై ఈ సబ్ కమిటీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా నేతృత్వంలో మంగళవారం సమావేశం అవుతుంది. సబ్‌కమిటీ సభ్యులుగా ఉన్న ఎనిమిది రాష్ర్టాల సీఎంల అభిప్రాయాల మేరకు కేంద్ర పథకాల అమలులో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలని సిఫారసు చేయనున్నారని సమాచారం. శాంతిభద్రతల విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలన్న సీఎం కేసీఆర్ ప్రతిపాదనను సబ్ కమిటీ ఆమోదించింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల ఆదాయంలో 42% నిధులు రాష్ర్టానికి కేటాయిస్తున్నందున కొన్ని సంక్షేమ పథకాలను తగ్గించాలని కేంద్రం భావిస్తున్నది. దీనివల్ల రాష్ర్టాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఫ్లెక్సీ ఫండ్ నిధులు గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరనున్నాయి. కనుక కేంద్రం నుంచి రాష్ర్టాలకు 50 శాతానికి తగ్గకుండా నిధులు విడుదలకు సిఫారసు చేయాలని ఈ సబ్ కమిటీ గత సమావేశంలో నిర్ణయించింది.