Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీ చేరిన కేసీఆర్

-నేడు ప్రధాని మోడీతో భేటీ -అనంతరం రాష్ట్రపతి వద్దకు -అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు రావాలని రాష్ట్రపతి, ప్రధానిని కోరనున్న సీఎం -విభజన సమస్యలపై కేంద్రంతో చర్చలు -విద్యుత్, హెచ్చార్డీ మంత్రులకూ వినతులు

KCR 05 రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి అర్ధరాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీలతో సీఎం భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా ఆయన కలుస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు, తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి అందించాల్సిన సాయాన్ని కోరేందుకు సీఎం ఢిల్లీ పర్యటనను ఉద్దేశించారు. అక్టోబర్ ఏడు నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ మేయర్ల కాంగ్రెస్ (మెట్రోపొలిస్)కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీని ఆయన స్వయంగా ఆహ్వానించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మోడీతో భేటీ కానున్న సీఎం.. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన 14 అంశాలను చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ప్రధానిని కోరనున్నారు. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్

పాజెక్టును రాష్ర్టానికి ఇవ్వాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. దీనితోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ వాటా నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ర్టానికి అదనంగా కేటాయించాలని కోరుతారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్లుగానే, తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను రాయితీ, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు, స్పెషల్ స్టేటస్ కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు ఆ ప్రాంత ప్రభుత్వాల అజమాయిషీలోనే పనిచేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని ప్రధాని, రాష్ట్రపతిలకు కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో ఉమ్మడి రాజధాని కాలంలో హైదరాబాద్‌లో పనిచేసే సంస్థలు ఇరు రాష్ర్టాలకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించేలా కేంద్రం సూచించాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కేసీఆర్ కలువనున్నారు.

రాష్ట్రపతితో భేటీలో హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాల అంశంపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో గవర్నర్‌కు అధికారాలు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అవమానించడమేనని సీఎం రాష్ట్రపతికి చెప్పనున్నారు. ఆ తర్వాత రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్ తదితరులను కలవనున్నారు. రాజ్‌నాథ్‌ను సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు.

అయితే హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాలు, అఖిల భారత సర్వీసు అధికారుల విభజన అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం గురించి విద్యుత్ మంత్రి గోయల్‌ను కలిసి వివరిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న హైకోర్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, గతంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ సైతం ఇచ్చిన నేపథ్యంలో మరోమారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు స్వయంగా కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు వైఫై, 4జీ సేవలను విస్తరించేందుకు కేంద్రం సహకరించాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కూడా అయిన రవిశంకర్‌ప్రసాద్‌ను కోరనున్నారు. రెండవ రోజు పర్యటనలో ఉదయం తొలుత స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. తెలంగాణలో కొన్ని ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రి అయిన స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేయనున్నారు. పరిశ్రమల స్థాపన, పన్నుల మినహాయింపు తదితర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించనున్నారు.

కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ తదితరులు కూడా ప్రధానిని, రాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేసీఆర్‌వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు మహేశ్ భగవత్, శివధర్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తదితరులు కూడా ఢిల్లీ వచ్చారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ సంజయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్ తదితరులు సీఎం బృందానికి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.