Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీలో తెలంగాణ సీఎం

-మర్యాదపూర్వకంగా నేడు రాష్ట్రపతితో భేటీ -విద్యుత్, పోలవరం, రైల్వే తదితర ప్రాజెక్టులపై -ప్రధాని, పలువురు మంత్రులతో సమావేశాలు -రేపు హైదరాబాద్‌కు తిరుగు పయనం

KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ రాష్ర్టానికి చెందిన అధికారులు ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీ రావడం ఇదే ప్రథమం. ఆయన ఇక్కడ మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు మంత్రులను కలుసుకుంటారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయంతోపాటు అన్ని రకాల సహాయ సహకారాలను అందించాల్సిందిగా ఆయన కోరనున్నారు. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రధానిని కోరనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఎనిమిది జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిందని, తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది కాబట్టి కేంద్రం నుంచి ఆర్థికసాయం అందించాల్సిందిగా ప్రధానితోపాటు ఆర్థికమంత్రిని కూడా కేసీఆర్ కోరే అవకాశం ఉంది. చట్టంలో పేర్కొన్న మేరకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని, ఖమ్మం జిల్లాలో ఇనుము-ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున వీటి గురించి కూడా ఆయన ప్రధానితో మాట్లాడనున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్ర ప్రాంతంలో కలుపుతూ మోడీ ప్రభుత్వం గత నెల 28వ తేదీన ఆర్డినెన్సును జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మండలాలను తెలంగాణలోనే ఉంచాలని, పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చడం ద్వారా ముంపు ప్రాంతాల విస్తృతిని తగ్గించవచ్చునని కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో పలువురు సాగునీటిపారుదల నిపుణులు, ఇంజినీర్ల సూచనలను నివేదిక రూపంలో అందజేయనున్నారు. తెలంగాణ రాష్ర్టానికి తలెత్తనున్న విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఖమ్మం జిల్లాలో నెలకొల్పే విషయమై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో భాగంగా 450 మెగావాట్ల సామర్థ్యమున్న దిగువ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలువనున్నందున ఆ మేరకు విద్యుత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా కేంద్రానికి తెలియజేస్తారు.

షెడ్యూల్ ఇదీ..: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను, అనంతరం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకుంటారు. కేసీఆర్‌తోపాటు పార్లమెంటు సభ్యులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలపై వివరిస్తారు. శనివారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. 6.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుస్తారు. ఈ మధ్యలో మరికొందరు మంత్రులను కూడా కలుసుకుంటారు. ప్రధానితో కూడా శనివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమవుతారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి అందాల్సిన రైల్వే ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం అంశాలకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్ళనున్నారు.

ఏపీ భవన్‌కు బదులుగా ప్రభుత్వ నివాసంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వ అధికార అతిథి గృహానికి చేరుకుంటారని హైదరాబాద్ నుంచి అందిన సమాచారం మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు శబరి బ్లాక్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన ఏపీ భవన్‌కు బదులు ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నివాసానికి వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం రాత్రి 11.15కు కేసీఆర్ ఢిల్లీకి రావాల్సింది. కానీ షెడ్యూలును మార్చుకోవడంతో సాయంత్రం ఆరున్నర గంటలకే వచ్చారు. తన నివాసానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయాలను పార్లమెంటు సభ్యులతో చర్చించారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుతోపాటు కొత్తగా ప్రమాణం చేసిన లోక్‌సభ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున నియమితులైన ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రుడు సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు కేసీఆర్‌తో విడిగా సమావేశమయ్యారు. కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నంకల్లా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఆదివారానికే ఢిల్లీ నుంచి వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.