-నేడు హస్తినకు మంత్రులు, ఎంపీల బృందం
-బీజేపీ వల్లే ధాన్యం సేకరణపై గందరగోళం
-ఆ పార్టీ వైఖరిపై 20న ఊరూరా చావుడప్పు
-రైతుబంధు అమలు ఎట్టిపరిస్థితుల్లో ఆగదు
-మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు శనివారం రాష్ట్రమంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీల బృందం ఢిల్లీ వెళుతున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఒకమాట, రాష్ట్ర బీజేపీ నేతలు మరోమాట మాట్లాడుతున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం యాసంగిలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా తెరవబోదని స్పష్టంచేశారు. ఈ వానకాలంలో రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దాదాపు 1.35 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వివరించారు. కేంద్రం వానకాలం పంట మొత్తాన్ని సేకరిస్తామని చెప్తూనే 59.60 లక్షల టన్నుల సేకరణకే ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు. మొదట హామీ ఇచ్చినట్టు ధాన్యం మొత్తం సేకరించాలని ఇప్పటికే కేంద్రంపై అనేకరకాలుగా ఒత్తిడి తెచ్చామని, టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. రైతు ప్రయోజనాలు కాపాడేందుకు మరోసారి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో తనతోపాటు మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీల బృందం శనివారం ఢిల్లీకి వెళ్తున్నదని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టంచేశారు.
రైతు బంధు ఆగదు
వరి సాగు చేస్తే రైతుబంధు రాదన్న వార్తలు వదంతులేనని నిరంజన్‌రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలో రైతుబంధు ఆగదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారని చెప్పారు. ‘కేసీఆర్ ఉన్నంతకాలం రైతుబంధు ఆగదు. ఇది గతంలో శాసనసభ సాక్షిగా చెప్పిన.. మరోసారి చెప్తున్న. కొంతమంది దీనిపై అనవసర రాద్ధ్దాంతం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రైతుబంధు ముమ్మాటికీ ఆగదు. ఈ విషయాన్ని రైతులకు చెప్పండి’ అని సమావేశంలో సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. కొందరు వ్యవసాయ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు రైతుబంధు విషయంలో చేసిన సూచనను సీఎం తిరస్కరించారని చెప్పారు.
పంట మార్పిడి అనివార్యం
కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని తేల్చేసినందున రైతులు వరి వేసి నష్టపోవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఇతర పంటలు పండించేందుకు రైతులకు సాయం చేస్తామని తెలిపారు. రైతులకు వాస్తవ పరిస్థితిని ముందుగానే వివరించటంతో రాష్టంలో ప్రస్తుతం వేరుశనగ సాగు 5 లక్షల ఎకరాలకు చేరిందని చెప్పారు.
20న ఊరూరా చావుడప్పు
రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 20న గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చేపట్టినట్టుగానే ఊరేగింపులు, చావుడప్పు వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కేంద్రప్రభుత్వం తన బాధ్యతను మరిచి పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధ్దాలు చెప్పిందన్న విషయాన్ని రైతాంగానికి వివరిస్తామని తెలిపారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నష్టపోతున్న రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పేర్కొన్నారు.