Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీని మనం శాసించాలి

-ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరేయాలో మనమే నిర్ణయిద్దాం -ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అనివార్యం -తెలంగాణ ఆలోచన దేశ ఆచరణగా మారుతున్నది -ఐదేండ్లలో మోదీ చేసింది శూన్యం కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే -సంక్షేమంలో తెలంగాణలో స్వర్ణయుగం వివక్షలేకుండా అందరికీ పథకాలు -వరంగల్, భువనగిరి సన్నాహక సభల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఢిల్లీని మనం శాసించాలని, ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం వరంగల్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ, తెలంగాణ ఆలోచన దేశ ఆచరణగా మారుతున్న పరిస్థితుల్లో.. మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలన్నా.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరాలన్నా రాబోయే ఎన్నికల్లో.. 16 స్థానాలు టీఆర్‌ఎస్సే గెలువాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అచిరకాలంలోనే సుస్థిర ప్రగతిని సాధించి.. దేశంలోని 28 రాజకీయపార్టీలు, మేధావివర్గం అబ్బురపడేలా, దేశం గర్వించేలా పరిపాలనాదక్షతతో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు.

దేశంలో జాతీయ పార్టీల శకం ముగిసిందని, ఏడు దశాబ్దాలపాటు కాంగ్రెస్, బీజేపీ పాలించినా ప్రజల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. రైతు కేంద్రంగా పరిపాలన సాగిన దాఖలాలు దేశ చరిత్రలో లేవన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావం అనివార్యమని పలు జాతీయ మీడియా సర్వేలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల భూమిక పోషించడం ఖాయమని స్పష్టంచేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం స్థానాలను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటుచేయాలో టీఆర్‌ఎస్ నిర్ణయించబోతున్నదన్నారు. నిర్ణయాత్మక శక్తి మనచేతుల్లో ఉంటే కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా రాదా? అని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి నిధులు రప్పించుకొనే అద్భుత అవకాశం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తలపించిన పరిపాలన సీఎం కేసీఆర్‌దని వివరించారు..

ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణలో 16 స్థానాల్లో గులాబీ బిడ్డలను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ఇవ్వాళ తెలంగాణ ఆలోచనా విధానం రేపు దేశం ఆచరణగా మారబోతున్నదని, దేశంలో మొత్తం రాజకీయ వ్యవస్థ సీఎం కేసీఆర్‌వైపు ఆసక్తిగా చూస్తున్నదని చెప్పారు. జాతీయ పార్టీల శకం ముగిసిపోయిందని, రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరుగుతూ వస్తున్నదని అన్నారు. 71 ఏండ్లలో కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ అన్న తీరు మాత్రం రేపు కచ్చితంగా ఉండదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావ అనివార్యతల్ని వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం వరంగల్, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో వేర్వేరుగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో వేలసంఖ్యలో హాజరైన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు బెంగాల్ ఏమి ఆలోచిస్తే అదే దేశమంతా ఆచరిస్తుందనే నానుడి ఉండేదని, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతో ఆ నానుడి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇవాళ తెలంగాణ ఏం ఆలోచిస్తుందో.. రేపు దేశంఅది ఆచరించే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. యావద్దేశం సీఎం కేసీఆర్‌వైపు ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సాధించిన ఫలితాలు దేశంలోని 28 రాష్ర్టాల రాజకీయ పార్టీలు, మేధావివర్గం, ప్రజలంతా తెలంగాణవైపు చూసేలా చేశాయన్నారు. పటిష్ఠమైన, సుస్థిర ప్రగతిని సాధించి.. దేశం గర్వించేలా పరిపాలనాదక్షతతో సీఎం కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.

జాతీయ పార్టీల శకం ముగిసింది దేశంలో రాజకీయ పార్టీల శకం ముగిసిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు 71 ఏండ్లపాటు పరిపాలించినా, మహామహులు ఏలినా దేశం పరిస్థితి మారలేదని అన్నారు. తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభ కొనసాగుతున్నదని.. ఈ క్రమంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఖాయమని కేటీఆర్ తెలిపారు.

కేంద్రం మొండిచెయ్యి ఘట్‌కేసర్ నుంచి భువనగిరి, ఆలేరు, జనగామ మీదుగా వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని భావిస్తే కేంద్రం పడనివ్వలేదని కేటీఆర్ విమర్శించారు. 2014లో మోదీ ఏదో చేస్తడని ఓటేసి 283 సీట్లతో ఏకపక్ష మెజార్టీ ఇస్తే ఐదేండ్లలో చేసిందేమీ లేదని, శుష్కప్రియాలు.. శూన్య హస్తాలేనని ఎద్దేవాచేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకోసం పేగులు తెగేదాకా కొట్లాడే టీఆర్‌ఎస్ బిడ్డలకు 16 స్థానాలు అప్పగించాలని కోరారు. దారితప్పి ఒకటోరెండో సీట్లు కాంగ్రెసోళ్లకు అప్పజెప్తే వాళ్లు ఢిల్లీకి గులాంగిరీ చేస్తారని చెప్పారు. ఢిల్లీకి గులాం చేసేవాళ్లు కావాలో తెగించిపోరాడే గులాబీలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఢిల్లీ గద్దెమీద ఎవరు కూర్చోవాలో నిర్ణయించే శక్తి మన చేతిలో ఉంటే, బుల్లెట్‌రైలు కూడా ఉరుక్కుంటూ హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

కేంద్రం మెడలు వంచుదాం రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అద్భుత పథకాలు అమలవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. తాను మంత్రులు, ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిసినప్పుడు వారు ప్రతిసారీ మన పథకాలను పొగుడుతారు తప్పించి డబ్బులివ్వరని విమర్శించారు. అందుకే మనకు 16 ఎంపీలు కావాలె. యాచించి కాదు.. శాసించి, కేంద్రం మెడలు వంచి ఏటా వేల కోట్ల నిధులు తీసుకువచ్చే అవకాశం ఉం టుంది అని చెప్పారు. ప్రధాని మోదీ గజ్వేల్ వచ్చినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వారు తప్పించి.. బుడ్డ పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు.

ఉద్యమకారుడే.. పాలనాదక్షుడు సహజంగా ఉద్యమాలు చేసేవారిని ఆందోళనకారులని సంబోధిస్తుంటారని, ఆందోళనకారులకు పాలన చేతకాదని అంటుంటారని, కానీ సీఎం కేసీఆర్ చరిత్రను తిరగరాశారని కేటీఆర్ చెప్పారు. ఆందోళనకారులకు పరిపాలన అనుభవం ఉండదనేది తప్పుడు అభిప్రాయమని కేసీఆర్ రుజువు చేసి, అద్భుత పాలన అందిస్తున్నారని స్వయానా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే లోక్‌సభ ఎన్నికలతో కేసీఆర్‌కు సంబంధంలేదని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇవి రాహుల్‌గాంధీకి, మోదీకి మధ్య జరిగే ఎన్నికలని కాంగ్రెస్ నేతలు కామెంట్‌చేయడం వారి అవివేకమన్నారు. దేశంలో కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నదని ప్రశ్నించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లెన్ని.. ఓట్లెన్ని అని ప్రశ్నించారు. కానీ 88 సీట్లు గెలుచుకొని అజేయశక్తిగా టీఆర్‌ఎస్ రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టిందని, ఇదే స్ఫూర్తి, ఇవే ఫలితాలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లేనన్నారు. జాతీయ మీడియా సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం ఎన్డీయేకి 150 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని, అదే యూపీఏకు 100 నుంచి 110 సీట్లు దాటవని తేల్చిచెప్పాయని గుర్తుచేశారు.

ఏప్రిల్ తర్వాత కేంద్రంలో భావసారుప్యం కలిగిన పార్టీల నేతృత్వంలో ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పడుతుందని, ఈ ఫ్రంట్‌కు సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేయబోతున్నారని స్పష్టంచేశారు. ఈ సన్నాహక సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పైళ ్లశేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గ్యాదరి కిశోర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, హసన్‌పర్తి నంచి ఓ సిటీ మైదానం వరకు కేటీఆర్‌కు అడుగడుగునా భారీ బైక్ ర్యాలీలు, గొల్లకురుమ డోల్ దెబ్బలు, బతుకమ్మలు, బోనాలతో అపూర్వఘనస్వాగతం పలికారు. అటు భువనగిరిలోనూ కేటీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

సంక్షేమంలో స్వర్ణయుగం సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఆసరా పింఛన్లు తీసుకొంటున్న వృద్ధులు కేసీఆర్ మా పెద్ద కొ డుకు అని అన్నప్పుడల్లా హృద యం ఉప్పొంగిపోతుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం.. ఇలా అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.

చిరస్థాయిగా కేసీఆర్ కీర్తి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎంతో శ్రమి ంచి భువనగిరికి రూ.1028 కోట్ల నిధులతో ఎయిమ్స్ తీసుకువచ్చారని కేటీఆర్ చెప్పారు. గత పాలకులు ఈ పనెం దుకు చేయలేదో ఆలోచించాల న్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క రూ పాయైనా యాదాద్రికి ఖర్చుచేయలేద ని, కానీ.. రెండువేల కోట్లతో యాదాద్రిని దేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.

సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్: జీ జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి దేశానికి దిశ, దశ చూపే సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఐదేండ్ల క్రితం ఉనికిలో లేని తెలంగాణను భారతదేశం, ప్రపంచమంతా మారుమోగేలా చేశారని చెప్పారు. తెలంగాణకు నాయకత్వమే లేదన్నవారికి దేశానికే నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకులున్నారని రుజువుచేశారని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడు ఉద్యోగం కరెక్ట్‌గా చేస్తాడా అని ప్రశ్నించిన వారికి.. ప్రజల కోసమే పాలన అంటూ రాష్ర్టాన్ని అభివృద్థి పథంలో నడిపి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారని తెలిపారు.

పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 35 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేసినా.. ఎందరినో ఎమ్మెల్యేలను చేసినా.. పార్టీలను ముందుడి నడిపించినా ఎవరూ తనను పట్టించుకోలేదని.. కానీ.. సీఎం కేసీఆర్ గుర్తించి, తనకు మంత్రిపదవి ఇచ్చారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎంకు రుణపడి ఉంటానని, టీఆర్‌ఎస్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.

ఎంపీ సీట్లను సీఎంకు బహుమతిగా ఇస్తాం: మాజీ డిప్యూటీ సీఎం కడియం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నదని చెప్పారు. రాష్ట్రానికి యువ నాయకత్వాన్ని కేటీఆర్ రూపంలో కేసీఆర్ అందించారని చెప్పారు.

వరంగల్ సత్తా చాటుదాం: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మండలి విప్ వరంగల్ అంటేనే చరిత్ర, కాకతీయుల పౌరుషం, జయశంకర్ సర్ ఆలోచనలను అందిపుచుకున్న గడ్డ అని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యమగడ్డ వరంగల్ జిల్లా సత్తా ఏమిటో చూపించాలన్నారు. 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరికి 3.96 లక్షల మెజార్టీ వస్తే తర్వాత ఎన్నికల్లో దయాకర్‌కు 4.60 లక్షల మెజార్టీ వచ్చిందన్నారు.

ఐదేండ్లలో చేసి చూపించాం: బూర నర్సయ్య గౌడ్, భువనగిరి ఎంపీ 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని ఐదేండ్లలో చేసి చూపించామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలి సీఎంగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.

రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే: ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై నమ్మకంతో గెలిపించారని, రాబోయే ఎన్నికల్లోనూ ఆయనపై నమ్మకంతో గెలిపించాలన్నారు. బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు భువనగిరి ప్రజలు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణ పథకాలు ఆదర్శవంతం

రైతును కేంద్రం చేసుకొని పరిపాలన సాగిన దాఖలాలు దేశచరిత్రలో లేవని కేటీఆర్ చెప్పారు. దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి ఆలోచించలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే రైతు సమస్యలను ఆకళింపుచేసుకొని రైతుబంధు వంటి చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టి చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. రైతుబంధుతోపాటు రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. దీనికింద ఇప్పటికే దాదాపు 7500 కుటుంబాలకు భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలుచేస్తున్నదని, ఏపీ సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరుతో కాపీకొట్టారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని 11 రాష్ర్టాలు అధ్యయనం చేసి, అనుసరించబోతున్నాయని తెలిపారు. మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ ఆ పథకాన్ని ప్రశంసించారే తప్ప ఒక్క రూపాయి కూడా దానికోసం ఇవ్వలేదని విమర్శించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలో కట్టే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి, మన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై చిన్నచూపు చూస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలు గెలుచుకొంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మకశక్తి అవుతుందని పేర్కొన్నారు. కేవలం రెండు ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలిచి రాష్ర్టాన్నే సాధించుకున్నామని, అదే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్, మిత్రపక్షమైన ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంటే ప్రధాని ఎవరుండాలో నిర్ణయించేది మనమే అవుతామని తెలిపారు. మనచేతుల్లో నిర్ణయాత్మక శక్తి ఉంటే కాళేశ్వరం మాత్రమేకాదు.. పాలమూరు వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదాతోపాటు కేంద్రం మెడలు వంచి నిధులు రప్పించుకునే అద్భుత అవకాశం వస్తుందని పేర్కొన్నారు. ఏడాదిలోగా రాష్ట్రంలో సజీవ జలదృశ్యం సాక్షాత్కరిస్తుందని చెప్పారు.

ఈ ఎన్నికలు తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమే కాదు, అత్యంత ప్రాముఖ్యం కలిగినవి. ఎర్రకోట మీద కూడా ఏ జెండా ఎగురాలన్నది నిర్ణయించే స్థాయికి చేరుకోవాలంటే మనం 16 సీట్లు సాధించాలి. మీ కోసం పేగులు తెగేదాక కొట్లాడే టీఆర్‌ఎస్ బిడ్డలకు లోక్‌సభ సీట్లు అప్పగించాలి. ఢిల్లీకి గులాం చేసేవాళ్లు కావాలో తెగించి పోరాడే గులాబీలు కావాలో తేల్చుకోవాలి. – కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.