Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఢిల్లీని శాసిద్దాం

-పదహారు పార్లమెంట్ స్థానాలను గెలిస్తే అది సాధ్యమే
-టీఆర్‌ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
-దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలకు అపూర్వ ఆదరణ
-రైతుబంధు స్ఫూర్తిగా ఒడిశా, జార్ఖండ్‌లో పథకాలు
-మోదీ కూడా ఈ పథకం అమలుచేయాలని చూస్తున్నరు
-ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం
-ఓటరు నమోదు కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలి
-కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల విజయోత్సవసభల్లో కేటీఆర్

ఢిల్లీ పెద్దలను యాచించడం కాకుండా శాసించేస్థాయిలో ఉండాలంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలువాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. పదహారు స్థానాలను సీఎం కేసీఆర్ చేతిలో పెడితే దేశం మొత్తానికి రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపడం సాధ్యమవుతుందని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన ప్రయోజనాలు మన చేతుల్లోనే ఉంటాయని వివరించారు. ఆదివారం కూకట్‌పల్లి, సికింద్రాబాద్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, టీ పద్మారావుగౌడ్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హుడా ట్రక్ పార్కు, చిలుకలగూడలోని మున్సిపల్ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన విజయోత్సవసభలకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత జయశంకర్‌సార్ చెప్పినట్టు మనం యాచించే స్థితిలో ఉండవద్దని, శాసించే స్థాయిలో ఉండాలని అన్నారు.

అప్పుడే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే లేదా రాహుల్ నాయకత్వంలోని యూపీఏ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసే ఆస్కారంలేదని కేటీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ రోజురోజుకు దిగజారిపోతున్నదని చెప్పారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో నరేంద్రమోదీ, అమిత్‌షా, ఆరు రాష్ట్రాల సీఎంలు, పదకొండుమంది కేంద్రమంత్రులు ప్రచారంచేసినా.. ఆ పార్టీ పోటీచేసిన 119 స్థానాల్లో 103 చోట్ల డిపాజిట్లు గల్లంతుచేసిన ఘనత తెలంగాణ ప్రజలదన్నారు. రెండు లక్షల రుణమాఫీ అంటూ రాహుల్, చంద్రబాబు కాళ్లకు బలపం కట్టుకుని తిరిగినా ప్రజలు నమ్మలేదని తెలిపారు.

ఆదర్శం.. రైతుబంధు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన వస్తున్నదని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు పథకాన్ని ఇప్పటికే జార్ఖండ్, ఒడిశా రాష్ర్టాలు యథాతథంగా అమలుచేస్తున్నాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోదీ కూడా కొన్ని మార్పులు, చేర్పులతో ఈ పథకాన్ని అమలుచేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి పెద్దలు అధ్యయనం చేశారని, మిషన్ భగీరథను 11 రాష్ర్టాల ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారని వివరించారు. టీఎస్‌ఐపాస్ లాంటి పథకాలు ఆదర్శంగా మారాయన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలు గెలిస్తే.. ఇక్కడి సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశ ఎజెండాలో చేరి, యావత్ దేశానికే రాష్ట్రం దిక్చూచిగా మారుతుందనడంలో సందేహం లేదన్నారు.

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొనే ధీరోదాత్తమైన నాయకుడు కేసీఆర్ అని, ఏ ఒక్క హామీని వదిలిపెట్టకుండా అమలుచేసి తీరుతామని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం నిబద్ధత, చిత్తశుద్ధితో అహర్నిశలు కృషిచేస్తామని చెప్పారు. త్వరలోనే పింఛన్లను రెట్టింపుచేస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని అన్నారు. మంచి ప్రభుత్వాన్ని, ప్రజలే కేంద్రబిందువుగా పనిచేసే సీఎంను వదులుకోబోమని ప్రజలు తమ తీర్పుతో చెప్పారని పేర్కొన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌కు 34% ఓట్లతో 63 సీట్లను ప్రజలు అప్పగిస్తే.. ఈసారి ఏకంగా 47% ఓట్లువేసి.. 88 స్థానాల్లో గెలిపించారని చెప్పారు. కేసీఆర్‌పట్ల ఎంత విశ్వాసం ఉందో రుజువు చేశారన్నారు. ఓటరు నమోదులో లోపాలవల్ల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని, లేదంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మరింత మెజార్టీ వచ్చేదని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

జనవరి 24 దాకా జరిగే ఓటర్ల నమోదు కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించాలని, దీనిని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని చెప్పారు. సికింద్రాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లను నమోదు చేయించి.. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడంలో స్థానికనేతలు సత్తాచాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానన్న కేటీఆర్.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేద్దామని సూచించారు. ఉద్యమ సమయం నుంచి పనిచేసిన వారందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తామని, పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు.

హైదరాబాద్ మినీ భారత్.. అందరినీ ఒకేలా చూస్తాం
నాలున్నరేండ్లలో అందరినీ ఒకేలా చూశామని, భవిష్యత్తులోనూ ఇదే విధానం ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన వారందరి సంక్షేమం కోసం త్రికరణశుద్ధితో పనిచేస్తామని స్పష్టంచేశారు. మినీ భారతదేశంలాంటి నగరంలో టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం అందరి పట్ల సానుకూల ధోరణితో ఉంటాయని చెప్పారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి విజయోస్తు అని దీవించి అధికారం కట్టబెట్టారన్న కేటీఆర్.. ఈ గెలుపుతో టీఆర్‌ఎస్‌పై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే పార్టీపరంగా లక్షలమంది కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేయాలన్నారు.

గెలుపును ఆస్వాదిస్తూనే అహంకారానికి పోకుండా, దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకోవడంపై దృష్టి సారించాలని కోరారు. తద్వారా దశాబ్దాలపాటు ప్రజలు మనందరినీ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. ఈ విజయోత్సవ సభల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్‌రావు, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మిరియాల రాఘవరావు, మోతె శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.