Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేనిని కోరుకుందాం?

1979లో కావచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరాగాంధీ కరీంనగర్‌ పర్యటన. ఉదయం 11 గంటలకు వస్తానన్న ఆమె సాయంత్రానికి కూడా వచ్చేట్టు కనబడలేదు. బహిరంగ సభ కోసమని వచ్చి, గంటల తరబడి వేచి చూసిన జనం మెల్లగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఏం చేయాలో పాలుపోని నిర్వాహకులకు తళుక్కున ఒక ఐడియా మెరిసింది. వెంటనే వేదిక మీదకు వెళ్లి, ఇందిరాగాంధీ వచ్చేదాకా ఫలానా వ్యక్తి ఒగ్గు కథ ఉంటుందని ప్రకటించారు. అంతే, వాపస్‌ పోతున్న జనం కూడా వెనక్కు వచ్చి కూర్చున్నారు. సాయంత్రం ఐదారింటికి ఒగ్గు కథ మొదలైంది. జనం తిండీ తిప్పలు మరిచి మమేకమైపోయారు. ‘ధగధగ మంటలు మండుతు ఉంటే..’ అంటూ రేణుకా ఎల్లమ్మ ఉగ్ర స్వరూపాన్ని పాటలో ప్రతిబింబిస్తూ, తలమీద నూరు దీపాలను ధరించి ఆ వ్యక్తి చేస్తున్న విన్యాసానికి అందరూ పరవశులై పోయారు. నెత్తి మీద బోనం పెట్టుకుని, అది కింద పడకుండానే, నేల మీది నాణేలను అందుకునేంతటి చాకచక్యమది. ఆ పర-వశం ఎంతటిదంటే, రాత్రి 11కు, మరో పది నిమిషాల్లో ఇందిరాగాంధీ వస్తున్నారని ప్రకటించేదాకా, అది బహిరంగసభ అన్న సంగతే ఎవరికీ గుర్తులేదు! అలా జనాన్ని తన ఆటపాటల్లో ఓలలాడించిన వ్యక్తి పేరు మిద్దె రాములు. గౌడ కులంలో పుట్టి కూడా అనురక్తితో ఒగ్గుకథ నేర్చుకుని, దానికి కొత్త సంప్రదాయాన్ని నేర్పి, జనాన్ని రక్తి కట్టించారు. సభలో జనాన్ని ఆపడానికైతే ఆయన పనికొచ్చారు కానీ, అవార్డులివ్వడానికి గుర్తుకురాలేదు; తెలంగాణ ఏర్పడ్డాకే సాంస్కృతిక సారథి భవనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది.

‘సాధు జంగమా ఆదిదేవుడా… శంభో శంకర హర లింగ రూపుడా… సంచార జగతి నావ తోవ నీవురా.. ఆది అంతమేది నీకు లేదురా.. పంచాక్షరి జప మంత్రమె పరమశివాయ… కైవల్యం కైలాసం నమశ్శివాయ, అద్వైతం శివతత్వం సదా శివాయ, పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణ నమాయ, నమశ్శివాయ సిద్ధనమాయ, సిద్ధనమాయ విశుద్ధనమాయ!’ ఎంత చిన్న పదాలు. ఎంత తాత్వికత. శివరాత్రి సందర్భంగా ఈ పాట రాసి, శివతత్వాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా విప్పిచెప్పింది మన తెలంగాణ ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. బసవన్నకు పచ్చిగడ్డి తినిపిస్తూ, లింగానికి హారతి ఇస్తూ గోరటి ఆ పాటలో కనిపిస్తారు. ఇదే కాదు; పల్లె కన్నీరు పెడుతుందన్నా, సంత ఇసంత రమ్మన్నా, నల్లతుమ్మ లొల్లి చెప్పినా, ఆయన కలం నుంచి అలతి అలతి పదాలే! గోరటి కేవలం కవి గాయకుడే కాదు; ఆయన ఇప్పుడు మన గౌరవ శాసనమండలి సభ్యుడు కూడా! గోరటికి ఎమ్మెల్సీ పదవి అక్కరలేదు. ఆయనకు ఆ పదవి ఇచ్చుకోవడం మనలను మనం గౌరవించుకోవడం!

మరి అప్పుడు మిద్దె రాములుకు ఎందుకీ గౌరవం దక్కలేదు? ఇప్పుడు గోరటి వెంకన్నకు ఎందుకు దక్కింది? తెలంగాణలో ఇంతక్రితం కవి గాయక పండిత ప్రవీణులు లేరా? వారు ఎందుకు గుర్తింపునకు నోచుకోలేదు? అధికార పదవులను ఎందుకు అలంకరించలేదు? ఎందుకు పురస్కారాలను అందుకోలేదు? ఇదే కాదు; అన్నింటి గురించీ మాట్లాడుకోవాలి. ఎందుకిప్పుడే మన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి? విలనీ భాషగా ముద్రవేసిన తెలంగాణ యాస ఇప్పుడే ఎందుకు హీరో హీరోయిన్ల భాషగా మారి యువతరాన్ని ఫిదా చేస్తున్నది? తెలంగాణ జానపద గీతాలు ఎందుకిప్పుడే యూట్యూబ్‌ సంచలనాలై తెరకెక్కుతున్నాయి? తెలంగాణ జీవన చిత్రం ఎందుకిప్పుడే కంబాలపల్లి కథలై అలరిస్తున్నది? తల్లి కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనుక్కున్న చింతకింది మల్లేశం చరిత్ర ఇప్పుడే ఎందుకు సినిమా కథాంశమైంది? రవీంద్ర భారతిలో పైడి జయరాజ్‌ థియేటర్‌ ఇప్పుడే ఎందుకు వెలిసింది? ఎందరో కళాకారులకు ఇప్పుడే ఎందుకు పురుడుపోస్తున్నది? వేములవాడ కూడా గొప్ప శైవక్షేత్రమనే ఖ్యాతి ఇప్పుడే ఎందుకు దక్కింది? అక్కడ ఎందుకిప్పుడే 13 గంటల నాన్‌స్టాప్‌ జాగారం వేడుకలు జరుగుతున్నాయి? ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాతే కాళేశ్వరం కట్టుకోగలిగాం? ఎందుకిప్పుడే పాలమూరు వలసలన్నీ ఆగిపోయాయి? పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ ఇప్పుడే ఎందుకింత తొందరగా పూర్తయ్యాయి? ఎందుకు శ్రీరాంసాగర్‌ నీళ్లు చివరాఖరు నల్లగొండ ఆయకట్టుదాకా ఇప్పుడే పారాయి? ఎందుకు పల్లెల్లో ఆర్వో నీళ్ల సెంటర్లు మూతపడ్డాయి? నల్లగొండ జనాన్ని మెలితిప్పిన ఫ్లోరైడ్‌ నీళ్ల పీడ ఎందుకిప్పుడే విరగడైంది? ఎందుకిప్పుడే వేలాది గురుకులాలు వెలిసాయి? ఎందుకు మన పిల్లలకు ఇప్పుడు సన్న బియ్యం భోజనం అందుతున్నది? ఎందుకిప్పుడే మన రైతన్నలు, చేనేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి? ఎందుకిప్పుడే ఎండాకాలంలోనూ మన చెరువులు నిండుగ కనిపిస్తున్నాయి? పాడుబడ్డ మన ఊరు ఎందుకిప్పుడే బాగుపడుతున్నది? ఎందుకిప్పుడే మన పట్నాలు ఎంతోకొంత శుభ్రంగా కనిపిస్తున్నాయి? ఎందుకిప్పుడే హైదరాబాద్‌ నగరానికి ఎక్కడలేని కంపెనీలూ వచ్చి వాలుతున్నాయి? ఎందుకిప్పుడే మన ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతున్నాయి? ఎందుకిప్పుడే మన పిల్లలకే మన ఉద్యోగాలు అందుతున్నాయి? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో…

ఆరేండ్ల క్రితం దాకా ఇవన్నీ ఎందుకు జరుగలేదు..,
ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే…
తేడా ఒక్కటే..
అప్పుడు తెలంగాణ రాష్ట్రంగా లేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైంది.

ప్రతి ప్రాంతానికి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. అక్కడి ప్రజలకు తమదైన అవసరాలుంటాయి. వాటిని తీర్చేందుకు అక్కడే వనరులుంటాయి. వాటినెలా వాడుకోవాలన్న దానిపై ఆ ప్రాంతంలోనే అనూచానమైన ఆలోచనలుంటాయి. ప్రాంతీయ ప్రత్యేకతలను, ప్రత్యేక వనరులను, మనదైన ఆలోచనలను సమీకృతం చేసి సద్వినియోగ పరచుకున్నప్పుడే మనం బాగుపడతాం. ఇది జరగాలంటే ప్రజల్లోనూ, అది ఎన్నుకున్న ప్రభుత్వంలోనూ ‘ఇది మనది’ అనే ఒక ఉద్వేగ భావన, బంధం అవసరం. భారతదేశాన్ని వశం చేసుకున్నప్పుడు, ఆ తర్వాత కూడా బ్రిటిషర్లు భారతీయుల్లో ఈ ‘మన’ అనే భావనను చంపేసేందుకు ప్రయత్నించారు. 1927లో సింధు నాగరికత బయటపడేదాకా భారత ద్వీపకల్పం, ఇంకా చెప్పాలంటే ఆసియా ప్రజలు న్యూనతలోనే బతికారని చరిత్రకారులు అంటారు. ఎప్పుడైతే సింధు నాగరికత బయటపడిందో, తమకూ ఘనమైన చరిత్ర ఉందనీ, తామూ గొప్పవాళ్లమేనని, తామెవరికీ తీసిపోమనే ఆత్మవిశ్వాసం అందరిలో కలిగింది. అదే భారత్‌తో పాటు ఈ ప్రాంతంలో అనేక జాతుల పునరుత్థానానికి దారితీసింది. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయమూ, అవమానమూ ఇలాంటివే! తెలంగాణ అవతరణతో మనం మళ్లీ మూలాల వెతుకులాటలో పడ్డం. ఘన చరిత్ర నుంచి నవ చరిత్రలోకి ప్రయాణమెప్పుడూ ఆషామాషీగా జరగదు. మార్పెప్పుడూ సులభంగా ఉండదు.

ఇల్లలుకగానే పండుగ కాదు. రాష్ట్రం రాగానే అన్నీ కుదిరిపోవు. కొత్త ఇల్లు సదురుకున్నట్టు సదురుకోవాలి. ఇప్పుడదే జరుగుతున్నది. రాష్ట్రం వచ్చాక మనం బాగుపడ్డామా? చెడిపోయామా? రెండుసార్లు మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం మనకు ఎంతోకొంత మంచి చేసిందా? చెరుపు చేసిందా? ఇంతగా ఎవరన్నా చేశారా? ఇంతకన్నా ఎవరైనా చేశారా? మనం చెడులోకి జారిపోతున్నామా? మంచివైపు మరలుతున్నామా? ఆరేండ్ల కిందటి దాకా మన సమాజంలో ఉన్న ఆందోళన, అరాచకం, అశాంతి ఇప్పుడున్నాయా? మనకు మనమే ఆలోచించుకోవాలి. తెలంగాణ వస్తే రాజకీయ సుస్థిరత ఉండదన్నారు. మనకు పరిపాలన రాదన్నారు. హైదరాబాద్‌ ఖాళీ అవుతుందన్నారు. కంపెనీలు పారిపోతాయన్నారు. కరంటు లేక చీకట్లు అలుముకుంటాయన్నారు. రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందన్నారు. పొలాలకు నీళ్లులేక, మనకు వ్యవసాయం చేయరాక జనం ఆకలి చావులు చస్తారన్నారు. మళ్లీ అదే పాచిక, ఏదో జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం. మరి అవన్నీ జరిగినవా? జరగలేదు కదా. జరగనివ్వలేదు కదా!

వెయ్యికి రెండు వేలకు ఎకరం అమ్ముకున్న తెలంగాణలో ఇవాళ ధర లక్షల్లో! అది సాగునీటి వల్ల అయినా పెరిగి ఉండొచ్చు. పక్కనే వెలిసిన కలెక్టరేట్‌ వల్ల అయినా పెరిగి ఉండొచ్చు. లేక కొత్తగా వచ్చిన జిల్లా వల్ల అయినా పెరిగి ఉండొచ్చు. ప్రతి మనిషీ తనకు గుంటెడు భూమైనా ఉండాలని తపిస్తున్నాడంటే తెలంగాణ భూమి ఎలా బంగారమైందో ఆలోచించాలి. ఇక హైదరాబాద్‌ విస్తరణ గురించి చెప్పడమే అనవసరం. రేపటి కాలంలో రీజినల్‌ రింగు రోడ్డు దాకా భాగ్యనగరమే! ఎండిన చెరువులు, కూలిన గోడలు, ముసలి ముతక తప్ప యువత కనిపించని పల్లెల్లోకి, ప్రభుత్వ పథకాల రూపేణా లక్షల కోట్ల రూపాయలు ప్రవహించి, గ్రామాలు కళకళలాడుతున్నవా లేవా? ఉద్యోగాలు ఎక్కువో తక్కువో వచ్చి ఉండచ్చు. కానీ ఉపాధి కల్పన వాతావరణం ఏర్పడుతున్నదా లేదా? అప్పులు చేసి ఉండవచ్చు, కానీ సంపద సృష్టి జరుగుతున్నదా లేదా! జీతాల పెంపు మనకు పూర్తి సంతృప్తినివ్వకపోవచ్చు. కానీ రైతు బంధు, పింఛను అందుతున్నది మన తాత, అవ్వ, అక్కా, చెల్లెళ్లకే కదా! ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో హైదరాబాద్‌లో ఉంటున్నా, సొంత ఊర్లో ఒక ఇైల్లెతే ఉండాలని తాపత్రయపడేంతగా ఊరు మెరుగైంది. ప్రతి బడిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతున్నాయి. పండుగలు, జాతర్లు ధూంధాంగా సాగుతున్నయి. మారిన వాతావరణానికి ఇవన్నీ సూచికలు కావా!

ఈ ఉద్యోగులే, ఈ పట్టభద్రులే, ఈ యువకులే, ఈ విద్యావంతులే ఉద్యమంలో జనానికి ధైర్యం చెప్పారు. జాగృతం చేశారు. ప్రత్యర్థుల వాదనలను పదునైన మాటతో కకావికలం చేశారు. ఇప్పుడూ తెలంగాణ బాధ్యత వారిదే. మనలో మనకు వంద ఉండొచ్చు. కొట్లాడి తేల్చుకుంటాం. ‘మా ఉద్యోగాలేవీ’ అని ఇప్పుడు నిలదీయగలుగుతున్నాం. ఎందుకు? తెలంగాణ వచ్చింది కనుక! ఆరేండ్ల కిందట ఆ పరిస్థితి ఉండిందా? ఇప్పటికైనా కేంద్ర ఉద్యోగాల్లో మా రాష్ట్రం వాటా మాకు కావాలని అడిగే పరిస్థితి ఉందా?

రాష్ట్రం వచ్చి ఉండొచ్చు. కానీ కుట్రలింకా ముగిసిపోలేదు. ఈ రాష్ట్రం ఎన్నాళ్లో ఉండదని శాపనార్థాలు పెట్టినవాళ్లింకా ఏదో ఒకటి జరగాలని కొంగ జపాలు చేస్తూనే ఉన్నారు. బెర్లిన్‌ గోడలు కూలిపోలేదా అన్న వాళ్లింకా, కాలం వెనక్కు వెళ్లాలని ఆశపడుతూనే ఉన్నారు. రాజన్న రాజ్యం అంటూ ఓ కూతురు కొత్త జెండా పట్టుకుని వాలిపోతున్నారు. జాతి వాదాన్ని జాతీయ వాదంతోనే కొట్టగలమని మరికొందరు నేను మతతత్వ వాదినే అని ప్రకటించుకుంటున్నారు. అందరి వ్యూహమూ ఒక్కటే! గతంలో జరిగినట్టే మన ఉనికిని దెబ్బతీయడం. ఒక్కసారి తెలంగాణ అస్తిత్వ భావనను దెబ్బకొడితే, రాష్ట్రం చేజిక్కినట్టే! రాజన్న రాజ్యం, జాతీయవాదం తదితర ఆకర్షణీయ నినాదాలన్నీ అస్తిత్వ హరణంలో భాగమే! మరి మనం మళ్లీ ఆ మాయలో పడదామా? 60 ఏండ్ల కిందట చేసిన తప్పును మరోసారి చేద్దామా?

కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతి ప్రయాణం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం ఈ ఆరేండ్ల కాలంలో అనేక విజయాలు సాధించింది. ఇది మనం చెప్పుకొనేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రులు చేస్తున్న ప్రశంసలే దీనికి సాక్షి. మన కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి దీనికి సాక్షి. గణాంకాలు దీనికి సాక్షి. మారిన మన జీవన నాణ్యత దీనికి సాక్షి. పెరిగిన మన ఆస్తుల విలువ దీనికి సాక్షి.

ఈ ఉద్యోగులే, ఈ పట్టభద్రులే, ఈ యువకులే, ఈ విద్యావంతులే ఉద్యమంలో జనానికి ధైర్యం చెప్పారు. జాగృతం చేశారు. ప్రత్యర్థుల వాదనలను పదునైన మాటతో కకావికలం చేశారు. ఇప్పుడూ తెలంగాణ బాధ్యత వారిదే. మనలో మనకు వంద ఉండొచ్చు. కొట్లాడి తేల్చుకుంటాం. ‘మా ఉద్యోగాలేవీ’ అని ఇప్పుడు నిలదీయగలుగుతున్నాం. ఎందుకు? తెలంగాణ వచ్చింది కనుక! ఆరేండ్ల కిందట ఆ పరిస్థితి ఉండిందా? ఇప్పటికైనా కేంద్ర ఉద్యోగాల్లో మా రాష్ట్రం వాటా మాకు కావాలని అడిగే పరిస్థితి ఉందా? అనేక జాతుల సమాహారమైన భారత్‌లో ప్రాంతీయ పార్టీలుగానీ, భావనలుగానీ ఉండొద్దన్న వైఖరిని ఎలా సమర్థించగలం? అస్తిత్వానికే ప్రమాదం ఎదురవుతున్నప్పుడు మొదట ఆలోచించాల్సింది, సమాజానికి ఆదర్శంగా నిలిచి నడిపించాల్సింది విద్యావంతులే! అస్తిత్వాన్ని కాపాడుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. దాడులతో చెల్లాచెదురైన యూదులు మళ్లీ ఒక జాతిగా, దేశంగా అవతరించడానికి దాదాపు రెండు వేల ఏళ్లు పట్టింది. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లే! గమ్యం దూరంగా ఉండొచ్చు. కొంచం ఆలస్యం కావచ్చు. సరైన మార్గంలో వెళుతున్నామా లేదా అన్నదే ప్రశ్న. 60 ఏండ్ల కిందట సాయుధ పోరాటంతో తెచ్చుకున్న రాష్ర్టాన్ని మానసిక యుద్ధంలో పోగొట్టుకున్నాం. 15 ఏండ్ల ఉద్యమంతో మళ్లీ రాష్ర్టాన్ని తెచ్చుకున్న మనం, ఈసారి ఉద్వేగ నినాదాల్లో కొట్టుకుపోదామా? ఇప్పుడు ఓట్లడుగుతున్న వాళ్లు ఇంతకుముందు మనకేం చేశారని యోచిద్దామా? యాచిద్దామా? శాసిద్దామా? చరిత్రలో ఎప్పుడూ మన వేలితో మన కన్ను పొడిపించే ప్రయత్నమే జరిగింది.

ఆలోచనాపరులైన, చైతన్యశీలురైన తెలంగాణ విద్యావంతులకు, పట్టభద్రులకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేశంలో ఎలాంటి వాతావరణం ఉందో, ఏం జరుగుతున్నదో విప్పి వివరించనక్కరలేదు. ప్రశ్న ఒక్కటే.. తెలంగాణలోనూ అదే కావాలని, రావాలని మనం కోరుకుంటున్నామా? కోరుకుంటామా?

– తిగుళ్ల కృష్ణమూర్తి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.