-ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం -మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ బాగున్నాయి -నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్..సీఎం కేసీఆర్‌తో భేటీ

రాష్ట్ర ఆర్థిక పురోగతి బాగున్నది.. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఇంత బాగా అభివృద్ధి చెందడం నిజంగా గర్వకారణమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నట్లు తెలిసింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రం ఏర్పడిన ఈ రెండేండ్ల్లలో ఆర్థికరంగంలో సాధించిన పురోగతిని సీఎం కేసీఆర్ ఆయనకు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల జీవన విధానం, సంస్కృతి కారణమని సారస్వత్ అన్నారు. తెలంగాణ ప్రజల కమిట్మెంట్ నచ్చిందని కితాబు ఇచ్చారు. తెలంగాణ కోసం ఏవిధంగా ఉద్యమించారో అదే స్ఫూర్తితో అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఇదేతీరుగా ప్రజలు అండగా ఉండి కలిసికట్టుగా పని చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో మొదటిస్థానంలో ఉంటుందన్నారు. దేశంలో చిన్న నీటి పారుదల వ్యవస్థ అయిన చెరువుల వ్యవస్థపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం అభివృద్ధికి ఎంత కీలకమైనదో ఆచరణలో చేసి చూపిస్తున్నారని సారస్వత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మిషన్ కాకతీయను చూసిన తర్వాత పలు రాష్ర్టాలు చెరువుల వ్యవస్థను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రతి మనిషికి సురక్షితమైన మంచినీటిని అందించడానికి చేపట్టిన మిషన్ భగీరథను కూడా కొనియాడారు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బ్రహ్మాండంగా ఉన్నాయని అన్నారు.