Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశం మనల్నే చూడాలి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టుబట్టి అద్భుతంగా పనిచేస్తున్నారని యావత్ దేశం ప్రశంసించేలా కలిసిమెలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. ఏ తెగువ.. ఏ పౌరుషంతో తెలంగాణ సాధించామో ఆదే స్ఫూర్తితో పని చేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని రేయింబవళ్లు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక మోడల్ స్టేట్‌గా తెలంగాణను రూపొందిద్దాం. రాష్ర్టాన్ని విజయవంతమైన రాష్ట్రంగా నిలబెడుదాం అని సీఎం అన్నారు.

KCR-Addressing-in-Siddipet-Water-Grid-awareness-Programme -పౌరుషం గల బిడ్డలం..పట్టుబట్టి పనిచేద్దాం -తెలంగాణ విజయవంతమైన రాష్ట్రం కావాలి -పథకానికి ఎలాంటి నిధుల సమస్య లేదు -విదేశాల నుంచి అప్పులిస్తామని వస్తున్నరు -మీ చెమట చుక్కలే ప్రజలకు మంచినీటి చుక్కలు -ఇంజనీర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ -వాటర్ గ్రిడ్‌కు ప్రథమ ప్రాధాన్యం.. -సిద్దిపేట మన రోల్‌మోడల్ -వాటర్‌గ్రిడ్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం సిద్దిపేట నియోజకవర్గానికి సమగ్ర నీటి సరఫరా పథకం – విజయోత్సవం (2000-2014) కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకంలో పాలు పంచుకోబోతున్న పలువురు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లకు సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన మంచినీటి పథకాన్ని ఈ సందర్భంగా సీఎం పరిచయం చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్దిపేట మంచినీటి పథకం పూర్వాపరాలను సాంకేతిక అంశాలతో సహా వివరించి ఆ పథకాన్ని రోల్‌మోడల్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని సూచించారు.

అధికారులు, ఇంజినీర్ల మీద నమ్మకంతోనే వచ్చే ఎన్నికల్లోపు ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తానని శాసనసభ సాక్షిగా ప్రతిజ్ఞ తీసుకున్నానని, పథకాన్ని ప్రైవేటువారికి ఇవ్వాలని సలహాలు వచ్చినా ప్రభుత్వాధికారుల మీద విశ్వాసంతో ప్రభుత్వపరంగానే పూర్తిచేయాలని నిర్ణయించామని చెప్పారు. పట్టణాలు, పల్లెలే కాదు.. పది గుడిసెలున్న ఆవాసాల్లో సైతం ప్రతి ఇంటికి, గుడిసెకు మంచినీరు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు కోరినవన్నీ సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిధులకు సమస్యే లేదని స్పష్టం చేశారు. సిద్దిపేట పథకాన్ని మొదలుపెట్టినపుడు తనను చాలా మంది అవమానపరిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ఈయన గుట్టల మీద నీళ్లు తెస్తుండు… అయితదా పోతదా అన్నరు. కానీ నేను మాత్రం దేవుడున్నడు, సిన్సియారిటీ ఉంది. ఇంజినీర్ నర్సింహారావు ప్రధాన కార్యాలయంలో ఉన్నరు అనుకున్న. కష్టపడి పనిచేస్తే ఆ పథకం పూర్తయింది. అట్లనే మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. చాలా అవమానాలు పడ్డం. చాలామంది ఎక్కిరించిండ్రు. ఈ కేసీఆర్ గాడు బక్కగ, చీపురు పుల్లోలె ఉన్నడు. ఊదితె ఎగిరిపోతడు… అని మాట్లాడిండ్రు. కానీ తెలంగాణ ఇప్పుడు సాకారమైంది. రేపు వాటర్ గ్రిడ్ పథకం కూడా కచ్చితంగా సాకారమైతది. మనం తెలంగాణ బిడ్డలం. తెగువ, పౌరుషం ఉన్నవాళ్లం. పట్టుదల కలిగిన బిడ్డలం. అనుకుంటే సవ్యసాచిల పనిచేస్తం.

కుడి చేత్తో, ఎడమ చేత్తో కూడా పని చేస్తం. రాత్రింబవళ్లు కష్టపడదం. దేశానికే ఒక నమూనా రాష్ట్రంగా మారుద్దాం. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంల వాళ్ల అధికారులు, వాళ్ల మంత్రులు, వాళ్ల శాసనసభ్యులు పట్టుబట్టి.. జట్టుకట్టి.. అద్భుతంగ పనిచేసిండ్రు! అని చెప్పి యావత్తు దేశమే తెలంగాణ వైపు తిరిగి చెప్పుకొనే విధంగా పేరు తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి.. ముఖ్యమంత్రి అంటే నాకేం పదిచేతులుండయి. నేను కూడా ఒక మనిషిని. నేను చెప్పగలను.

సలహా, సందేశం ఇవ్వగలను. చేయాల్సింది మీరు. మనకు వజ్రాల వంటి ఇంజినీర్లున్నరు. బంగారు తునకల్లాంటి అధికారులున్నరు. మీ చెమట చుక్కలు రాలితేనే, మన ప్రజలకు మంచినీటి చుక్కలు పడతయి. ఇంజినీర్లుగా మీ అందరి శ్రమ మీదనే ఈ పథకం ఆధారపడి ఉంది. మీకు వసతులు ఏమీ కావాలో అన్నీ తీసుకోండి… ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నం… అని స్పష్టం చేశారు.

మీ మీద నమ్మకంతోనే…

అధికారులు, ఇంజినీర్ల మీద నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిజ్ఙ తీసుకుందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంగ మాకు ధైర్యముంది. మీ మీద విశ్వాసముంది. మీ మీద ఉన్న నమ్మకంతోటి మేం ఒక ప్రతిజ్ఙ తీసుకున్నం. శాసనసభ సాక్షిగా.. తెలంగాణలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు ఇయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం అని చెప్పినం. ప్రభుత్వం, మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏమైన గలాట గిలాట చేస్తే లాఠీ పట్టుకొని నిలబడేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక్కడున్నరు. మీ కాళ్లలో ముల్లు కుచ్చుకుంటె పన్నుతో తీసే పద్ధతిలో ప్రభుత్వం ఉంటది.

కానీ ఈ పథకాన్ని మాత్రం నూరు శాతం విజయవంతం చేయాలి. చాలామంది ఆంధ్రవాళ్లు మనను బనాయించిండ్రు. మీ బొంద.. మీరు చేస్తరా… సస్తరా? మీరు ప్రభుత్వాన్ని నడుపుతరా? అని అన్నరు. అందుకే ప్రభుత్వాన్ని నడపడం కాదు.. ఛాలెంజ్‌గ తీసుకుందం. తెలంగాణను విజయవంతమైన రాష్ట్రంగా నిలబెడుదాం.. దానికి మీరే ముఖ్య సారథులు కావాలి. అందుకే అందరినీ ఒక వేదికపైకి పిలిచిన. మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధిపేటల పథకాన్ని చూసినంక సంతృప్తి పడ్డరు. వారిలో ఒక నమ్మకం వచ్చింది. ఈ పథకం మా ప్రాంతంలో ఎందుకు కాదు? అనే నమ్మకం వచ్చింది… అని అన్నారు.

ప్రైవేటుకు ఇమ్మన్నా ఒప్పుకోలేదు.. ప్రభుత్వ ఇంజినీర్లు చేయలేరు. ప్రభుత్వ అధికారులు చేయలేరు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేయండి అని అందరూ అన్నారని కేసీఆర్ చెప్పారు. మీ మీద ఉన్న నమ్మకంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా.. సిద్దిపేటల రెండు దశాబ్దాల కిందటే పథకాన్ని పూర్తి చేసిన అధికారులు ఇవాళ ఎందుకు చేయలేరనే నమ్మకంతో మా ప్రభుత్వ శాఖల ద్వారా గ్రిడ్‌ను చేపడతామని వారికి చెప్పానన్నారు. పథకం అమలు దగ్గరికి వచ్చినందున సిద్దిపేట పథకాన్ని చూపిస్తే గ్రిడ్ అమలు సులువు అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

నిధులకు కొరతే లేదు.. ఈ పథకానికి ఎలాంటి నిధుల కొరత లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇంజినీర్లకు కావాల్సిన ఐప్యాడ్లు, లాప్‌ట్యాప్‌ల కొనుగోలుకుగాను డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాంట్రాక్టర్లకు ముందుగానే (అడ్వాన్సు) నిధులు మంజూరు చేస్తం. ప్రభుత్వంలో ఇది నెంబర్ వన్ ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం. నిధుల గురించి భయపడొద్దు. ముందుకెళ్లండి. మనుషులమున్నం, వజ్రాల్లాంటి అధికారులు ఉన్నరు. అద్భుతంగా చేసుకొని ముందుకు పోదాం అని ముఖ్యమంత్రి ఇంజినీర్లలో స్ఫూర్తిని నింపారు.

పది గుడిసెలున్న ప్రాంతాన్నీ వదలొద్దు… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా.. దానికి వేరే ప్రణాళిక ఉంటది.. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఉన్న అన్ని గ్రామాలు, పల్లెలు, లంబాడీ తండాలు, పది గుడిసె ఉన్న ఆవాసాన్ని కూడా వదిలిపెట్టొద్దు. వీటితో పాటు మున్సిపాలిటీల్లోనూ పథకం అమలు చేస్తం. మున్సిపాలిటీల్లో బల్క్ పద్ధతిన నీళ్లిస్తం. వాళ్లు ప్రజారోగ్య విభాగం (పబ్లిక్ హెల్త్) ద్వారా మున్సిపాలిటీలో అంతర్గత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటరు. గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అంతర్గత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అని కేసీఆర్ చెప్పారు.

కాంటూర్.. భగవద్గీత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాల్లోని ట్యాంకుల కాంటూర్స్ లెవల్స్‌ను వెంటనే సేకరించాలని కేసీఆర్ ఆదేశించారు. కాంటూర్స్‌కు సంబంధించి ఇంజినీర్లు అవసరమనుకుంటే తప్ప పట్టించుకోరని చెప్పారు. కానీ వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలుకు కాంటూర్ పుస్తకమనేది భగవద్గీతలాంటిదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన జేబులోని తెలంగాణ కాంటూర్ పుస్తకాన్ని తీసి చూపించారు. వీటిని హైదరాబాద్‌లో ముద్రించారని ఇక నుంచి ప్రతి ఇంజినీర్ జేబులో చౌబీస్ గంట ఈ పుస్తకం ఉండాలని సీఎం సూచించారు.

అన్ని జిల్లాలకూ డిజైన్లు సిద్ధం… వాటర్ గ్రిడ్ పథకం కోసం తొమ్మిది జిల్లాలకు సంబంధించి డిజైన్లు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొన్ని జిల్లాల వివరాలు ఈ సందర్భంగా వెల్లడించారు. కరీంనగర్‌లో మిడ్ మానేరు త్వరలో పూర్తవుతుంది. సిరిసిల్ల పక్కనే అత్యధిక కాంటూర్ లెవల్ ఉంది. దాంతో నియోజకవర్గానికి పూర్తిగా నీటి సరఫరా జరుగుతుంది. ఎన్ని నియోజకవర్గాలకు నీళ్లివ్వాలో ఆ స్థాయిలో జీఎల్‌బీఆర్ కట్టుకుంటం. గుట్టల మీద నుంచి ఆయా నియోజకవర్గాలకు పైపులైన్ల ద్వారా రా వాటర్ (ముడి నీరు) సరఫరా అవుతుంది. ఆ తర్వాత నీటి శుద్ధి చేసుకొని, సిద్దిపేట పథకంలోని విధానం మాదిరిగా ఎక్కువ ఎత్తున ఉండే రిజర్వాయర్‌కు పంపు చేసి ఆపై గ్రామాలకు సరఫరా చేసుకుంటం.

మిడ్ మానేరు ద్వారా కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లా జనగామ తాలూకా, స్టేషన్ ఘన్‌పురం, హన్మకొండ పట్టణం వరకు కూడా గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తం. తూర్పు వరంగల్‌కు మానేరు రిజర్వాయర్ ద్వారా నీటిని తీసుకుంటుం. అక్కడ గుట్టలున్నయి. ఒక్కసారి నీళ్లు పైకెక్కిస్తే.. అన్ని నియోజకవర్గాలకు పారుతయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా చాలా క్లిష్టమైనదని సీఎం అన్నారు. శ్రీశైలం డ్యాం నుంచి గ్రిడ్‌లో భాగంగా అక్కడికి నీళ్లు తీసుకునేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న ఎల్లూరు గుట్ట అత్యధిక కాంటూర్ లెవల్స్ ప్రాంతమైనందున శ్రీశైలం డ్యాం నుంచి అక్కడికి నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

కొల్లాపూర్ పక్కన అత్యధిక కాంటూర్ లెవల్ ఉన్న ఎల్లూరు గుట్ట మీదకు నీళ్లు తీసుకుంటే తర్వాత 5-6 కిలోమీటర్ల దూరంలోని కోడేరు గుట్ట మీదకు నీటిని సరఫరా చేస్తం. ఒక్కసారి కోడేరు గుట్ట మీదకు నీళ్లు పోతే మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతయి. త్వరలోనే ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తానని కేసీఆర్ చెప్పారు.

సిద్దిపేటను మించిన పథకం కావాలి.. సాంకేతికంగా ఇంకా అభివృద్ధి జరిగినందున ఇంకా మెరుగైన పద్ధతులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. లోయర్ మానేరు డ్యాంలో ఎండీడీఎల్ (మినిమం డ్రా డౌన్ లెవల్) ప్రతి ఆఖరి చుక్క నీటిని కూడా డ్రా చేసుకునే విధంగా ఇన్‌టేక్ వెల్ డిజైన్ చేసినం. డ్యాం నుంచి అనంతసాగర్‌కు, అక్కడి నుంచి చిన్న పంపింగ్‌తో కోమటి చెరువు, అక్కడ నీటిశుద్ధి, ఫిల్టర్ బెడ్స్, పంపింగ్ స్టేషన్ అక్కడి నుంచి ఇండ్లలోకి నీటి సరఫరా జరిగింది. ఇకముందు ఇంజినీర్లు ఇన్‌టేక్ లెవల్స్ డిజైన్ చేసేటపుడు ఇదే విధంగా డ్యాంకు వీలైనంత సమీపంలో ఐదు కిలోమీటర్ల లోపు డిజైన్ చేయాలి.

పైసలు పోయినా పర్వాలేదు.. మంచి ఎంఎస్ పైపు పెట్టుకుని.. గుట్టల మీదకు పంప్ చేయాలి. అక్కడ నీళ్లు పడంగనె పైపులైన్ల ద్వారా నీళ్లు కిందకొస్తయి. ఎంతదూరం పోతదో అంత దూరం నీళ్లు వచ్చేటట్లు డిజైన్ చేయాలి. సిద్దిపేట పథకంలో ఫుట్ బ్రిడ్జ్ చాలా ఇరుకుగా ఉంది. అక్కడ కస్టమైజ్డ్ మోటార్లున్నయి. ఏవైనా మరమ్మతులు ఉన్నపుడు, మోటారు కాలిపోయినపుడు పోయేతందుకు ఇరుకుగ ఉంది. రేపు వాటర్ గ్రిడ్ పథకంలో కట్టబోయే ఫుట్ బ్రిడ్జులు ఒక వాహనం జీపుగానీ, డీసీఎంగానీ పోయేటట్లు గానీ ఏర్పాటు చేసుకోవాలి.

లోయర్ మానేరు డ్యాంలో నీళ్లకు అందకుండా రెయిజ్‌డ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినం. డ్యాంలో నీళ్లు ఫుల్‌గా ఉన్నపుడు కూడా మంచినీటి సరఫరా జరగాల్సి ఉన్నందున ఆ బ్రిడ్జిని కట్టామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టీ రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మారావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఇదీ సిద్దిపేట పథకం.. సిద్దిపేట పథకం పూర్వాపరాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు. నేను రవాణా మంత్రిగా ఉన్న కాలంలో సిద్దిపేటలో ఎండాకాలం వచ్చిందంటే భయంకరమైన నీటి సమస్య ఉండేది. ఆ పరిస్థితులను ఎట్ల గట్టెక్కాలని ఇంజినీరింగ్ అధికారులం కూర్చుని చివరకు ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినం. మొదలు 145 గ్రామాలకు నీళ్లిచ్చేలా ఈ పథకాన్ని చేపట్టినం. రాత్రింబవళ్లు కష్టపడి 16-17 నెలల రికార్డు టైంల పూర్తి చేసినం. మానేరు డ్యాం దగ్గరికి 37 సార్లు పోయిన. సిద్దిపేట పట్టణం భౌగోళికంగా చాలా ఎత్తు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో భౌగోళికంగా కాంటూర్ లెవల్స్ అన్నీ తెలుసు. సిద్దిపేటదాకా నీళ్లు తెస్తే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గ్రావిటీ ద్వారా పోతయని నిర్దరణకు వచ్చినం.

నేనేం ఇంజినీర్‌ను కాదు. కానీ నాతో పని చేసిన ఇంజినీర్లు ఇచ్చే ఇన్‌పుట్స్, విజ్ఙానం ఆధారంగా ఈ పథకంల 90 శాతం డిజైన్ చేసిన. ముందు నీళ్లు తీసుకున్న చోటనే మంచి గుట్ట వెతకమని అధికారులకు చెప్పిన. నా ఉపాయమేందంటే ఎత్తయిన గుట్ట మీదకు నీళ్లు తీస్కపోతే అక్కడి నుంచి ఎంత దూరమైనా గ్రావిటీతో నీళ్లు వస్తయి. లేక పోతే గడిగడీకీ ఇంజన్లు పెట్టాలె. ప్రకృతికి అనుగుణంగా ఏవైనా పథకాలు రూపొందిస్తే అవి చాలా కాలం మన్నికగా ఉంటయి. 16-17 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.