Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికే ఆదర్శం రైతు జీవిత బీమా

-రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది -ఏ కారణంగా రైతు చనిపోయినా బీమా వర్తింపు -రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ -ప్రజల నమ్మకం పొందిన ఎల్‌ఐసీ ద్వారానే అమలు -పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలి -ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పథకం కొనసాగుతుంది -రైతు జీవిత బీమా పథకంపై సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

అన్నదాతలకు అండగా ఉంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో బాధ్యత భుజానికి ఎత్తుకుంటున్నది. ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుం బం దిక్కులేనిదవుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మార్గదర్శకాలు రూపొందించే విషయంపై ముఖ్యమంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేలా ప్రభుత్వం తీసుకొచ్చే పథకం యావత్తు దేశానికి మార్గదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఎల్‌ఐసీ అధికారులతో క్షుణ్ణంగా చర్చించి, బీమా చెల్లింపులతోపాటు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయదారుడి కుటుంబానికి బాసటగా నిలిచేలా బీమా పథకం ఉండాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఉచితంగానే రైతులకు బీమా అందించాలని స్పష్టంచేశారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతు జీవిత బీమా పథకాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. ఇది చిరకాలం వర్ధిల్లే పథకం. కారణం ఏదైనప్పటికీ రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి తప్పకుండా తక్షణమే రూ.5 లక్షల బీమా సొమ్ము అందించాలి. ఈ పథకాన్ని అమలుచేయడానికి ఎలాంటి సహాయమైనా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ పథకానికి చెల్లించే ప్రీమియంను బడ్జెట్‌లో కేటాయించి చెల్లింపు హామీ ఇస్తాం అని సీఎం తెలిపారు.

ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల వ్యవసాయరంగం కుదుట పడుతున్నది. ఈ మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రైతుల సమస్యలను అర్థం చేసుకున్నది మన ప్రభుత్వమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన వాళ్లు ఎలాంటి మానవతా దృక్పథం లేకుండా వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేశారు. దీనాతిదీనమైన స్థితిలో ఉన్న వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలను తీసుకొస్తున్నాం. ఏ కారణం వల్లనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం అని సీఎం చెప్పారు. చిన్న, సన్నకారు పెద్ద రైతులు అనే తేడా లేకుండా ఎవరు మృతిచెందినా ఒకే తరహా బీమా సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు.

ఎల్‌ఐసీ ద్వారానే రైతు జీవిత బీమా అమలు దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెద్ద యంత్రాంగం ఉంది. ఎల్‌ఐసీ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. ప్రజలకు ఈ సంస్థపై నమ్మకమున్నది. అందుకే రైతు జీవిత బీమా పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలుచేయాలి. రైతులకు జీవిత బీమా పథకం దేశంలోనే మొదటిది. ఈ పథకం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులలో వివిధ వయస్సులకు చెందిన వారు ఉంటారు కాబట్టి ఎల్‌ఐసీ నిబంధనలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రైతు జీవిత బీమా పథకం ఎలా ఉండాలనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి, రైతులందరికీ వర్తించేలా నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు. ఈ మేరకు ఎల్‌ఐసీ అధికారులతో చర్చలు జరుపాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మండలాలవారీగా రైతులు, వారి నామినీల జాబితాలను రూపొందించాలని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.