-అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం -సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు భరోసా -పాలమూరు ఎత్తిపోతలతో 85వేల ఎకరాలకు సాగునీరు -గడ్డాలు పెంచితే గబ్బర్‌సింగ్‌లు కారు.. -తుర్కయాంజాల్ బహిరంగసభలో మంత్రి శ్రీ కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు సైతం కితాబునిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమదృష్టి, సమభావనతో చూస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. శుక్రవారం తుర్కయాంజాల్‌లోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని, కరెంట్ లేక అంధకారంగా మారుతుందని ప్రచారం చేశారని కానీ నేడు తెలంగాణ 24 గంటల నిరంతర విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నదన్నారు. వ్యవసాయరంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.
కాంగ్రెస్ విధిలేకే తెలంగాణ ఇచ్చింది
1953 నుంచి నేటివరకు తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయానికి, ఆవేదనకు కాంగ్రెస్ గురిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల త్యాగాలు, పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డాలు తీయబోమం టూ పెంచుకుంటున్నారని, గడ్డాలు పెంచుకునేవాళ్లందరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమారెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నూరు శాతం అమలుచేస్తున్నదన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లానీరు అందించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పా రు. కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. తాము 40 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల కోసం కళ్యాణలక్ష్మి, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ వల్లే పాలమూరు పథకం ఆలస్యం
పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 85వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ఆలస్యానికి కాంగ్రెస్ నాయకులే కారణమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఏటా రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ, వైమానిక పరిశ్రమలతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకోసం నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మాదిరిగా ఆదిభట్ల ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌కు విజువల్స్ (టీవీ) తప్ప.. విజన్ ఉండదని విమర్శించారు. బీజేపీ గల్లీకి ఎక్కువ ఢిల్లీకి తక్కువ అని ఎద్దేవాచేశారు. కొత్త, పాత, సరికొత్త కార్యకర్తల అనుభవాలతో టీఆర్ఎస్ ముందుకు పోతుందన్నారు.
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు సహా దాదాపు 500 మంది కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ బలోపేతానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. టీఆర్ఎస్లో చేరినవారిలో హయత్‌నగర్ మాజీ జెడ్పీటీసీ నోముల క్రిష్ణగౌడ్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పల్లె గోపాల్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాశం రవీందర్‌గౌడ్, సర్పంచులు బండమీది క్రిష్ణ, ఆశోక్‌గౌడ్, సింగల్‌విండో చైర్మన్ విఠల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.