Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికే దిక్సూచి తెలంగాణ

-మన పథకాలపై అంతా ఆలోచిస్తున్నారు -తృతీయ ప్రత్యామ్నాయంతోనే అభివృద్ధి -ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి -రైతుబంధు, రైతుబీమా వంటివి దేశమంతటా అమలుకావాలి -బతుకమ్మ చీరెలను అద్భుతంగా రూపొందించిన సిరిసిల్ల నేతన్నలు -రాష్ట్రంలోని 94 లక్షల మందికి పంపిణీ -మూడేండ్లలో జిల్లాకు రైలు కూత వినిపిస్తా -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సిరిసిల్లకు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ప్రత్యామ్నాయంతోనే సాధ్యమని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు వెళుతున్నాయని, ఈ కారణంగానే ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని గుర్తించి, దేశం మొత్తం అబ్బురపడేలా 88 స్థానాలు కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి దేశం అంతా ఆలోచిస్తున్నదన్న కేటీఆర్.. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని చెప్పారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బుధవారం సిరిసిల్లకు వచ్చిన కేటీఆర్‌కు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన కేటీఆర్.. అక్కడే ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడినుంచి అశేష జనవాహిని మధ్య ఊరేగింపుగా బయల్దేరి అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

గాంధీ విగ్రహం వద్ద సభలో, అనంతరం సిరిసిల్ల ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సమయం ఇవ్వకపోయినా తనను రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద మెజార్టీతో సిరిసిల్ల ప్రజలు గెలిపించారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నానంటూ ఉద్విగ్నానికి లోనయ్యారు. సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా, సిరిశాలగా మార్చుతానని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన స్వల్పకాలంలోనే తెలంగాణ చేపట్టిన అభివృద్ధి పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచాయని, దేశంలోని అన్ని ప్రభుత్వాలనూ ఆలోచింపజేశాయని కేటీఆర్ వివరించారు. రైతులకు 24 గంటల కరంటు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలుచేయడం లేదని, ఈ పథకాలన్నీ దేశమంతటా అమలుకావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసమే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ప్రత్యామ్నాయం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు మొదలు పార్లమెంటు ఎన్నికల దాకా ప్రజలంతా కేసీఆర్ వెన్నంటి ఉన్నారని చెప్పేలా, పార్టీని తీర్చిదిద్దాల్సిన బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. సిరిసిల్ల ఆశీర్వాదం, అండ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా, తిరుగులేని రాజకీయశక్తిగా మార్చుతానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు పర్యటించి పార్టీని మరింత పటిష్ఠంచేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి బుధవారం సిరిసిల్లకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు

నేతన్నల నైపుణ్యం అద్భుతం సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యం అద్భుతమని, బతుకమ్మ చీరెలను అత్యంత నాణ్యంగా తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారని కేటీఆర్ ప్రశంసించారు. గతంలో సమయాభావంవల్ల ఆర్డర్లను సూరత్‌కు ఇచ్చామని, చీరెలు బాగా లేవన్న ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. అందుకే ఈసారి ముందస్తుగా మొత్తం చీరెల ఆర్డర్లను సిరిసిల్లకే ఇచ్చామని వివరించారు. చీరెలను సకాలంలో తయారుచేసి ఇచ్చినందుకు నేతన్నలకు, అందుకు సహకరించిన అధికారులు, పార్టీ నేతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో ఎన్నికలు రావడం, పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరెలను ఇవ్వలేకపోయామని విచారం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చీరెలను పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మందికి చీరెలను పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని, అందులో అధికశాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకొని ఆశీర్వదించడం వల్లే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్న కేటీఆర్.. అందుకు తాము వారికి రుణపడి ఉంటామని చెప్పారు.

సిరిసిల్ల నేతన్నలకు చేయాల్సింది ఇంకా ఉందన్నారు. స్కూలు పిల్లల యూనిఫాంలు, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల దుస్తులతోపాటు ప్రభుత్వశాఖలకు అవసరమయ్యే అన్నిరకాల వస్ర్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకే ఇవ్వాలన్నది సీఎం ఉద్దేశమని తెలిపారు. కార్మికుడిని యజమానిగా మార్చే వర్క్ టు ఓనర్ పథకాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనని అన్నారు. అపారెల్ పార్కు ఏర్పాటుతో పదివేలమంది మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడేండ్లలో సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. మిషన్ భగీరథ పనులు 95% పూర్తయ్యాయని, మరో 5% పనులు పూర్తిచేసి ఇంటింటికి తాగునీరిందిస్తామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతంలోని రెండున్నర లక్షల ఎకరాలకు ఆరునెలల్లో సాగునీరిందించి సస్యశ్యామలం చేస్తానని పునరుద్ఘాటించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగారావు, కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ అధ్యక్షురాలు పావని తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే అథితి గృహానికి కేటీఆర్ చేరుకొని జిల్లా ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనుల పురోగతిని తెలుసుకుని దిశానిర్దేశం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.