Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికి కొత్త పంథా కావాలి

-కొత్త పద్ధతి ఆవిష్కర్తగా నేనే ఎదుగుతా కావచ్చు
-దేశాన్ని పాలించడంలో బీజేపీ, కాంగ్రెస్‌ అట్టర్‌ఫ్లాప్‌
-సంపద సృష్టించే తెలివితేటలు ఆ రెండు పార్టీలకు లేవు
-జీడీపీలో తెలంగాణది 12.6 శాతం వృద్ధి
-తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈ దేశానికి ఒక దిశ, దశ, మార్గదర్శనం చేయడంలో రెండు సోకాల్డ్‌ జాతీయ పార్టీలకు ఒక అవగాహన లేదు. ఈ దేశంలో ఓ ప్రబలమైన మార్పు రావాల్సిన అక్కెర ఉన్నది. కచ్చితంగా దేశం కొత్త మార్గం, కొత్త పంథా పట్టాల్సిన అవసరమున్నది. మొన్ననే నేను శాసనసభలో ఇదే విషయాన్ని చెప్పా. ఈ చిల్లర పంచాయితీలు, కిరికిరిలు పెట్టి, తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపడం కాదు. దేశంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరమున్నది. ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుతా కావచ్చు.

దేశాన్ని పాలించడంలో బీజేపీ, కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మాటలు చెప్పమంటే పెద్దపెద్ద మాటలు చెప్తారని, చేతల్లోకి వస్తే అంతా శూన్యంగానే ఉన్నదని మండిపడ్డారు. సోమవారం తెలంగాణభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లలోనే.. రెండు జాతీయ పార్టీలూ విఫలమయ్యాయి ఇవాళ దేశాన్ని పాలించే పార్టీ.. అంతకుముందున్న కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. నేను చాలాసార్లు ఇదేమాట చెప్పిన, ఇప్పుడు చెప్పడం నా కర్తవ్యం కాబట్టి మళ్లీ చెప్తున్న. ఈ దేశానికి ఒక దిశ, దశ, మార్గదర్శనం చేయడంలో రెండు సోకాల్డ్‌ జాతీయ పార్టీలకు అవగాహన లేదు. 50 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న అనుభవంతో చెప్తున్నా.. దేశంలో ఏదో కొత్త ప్రయోగం రావాల్సిన అవసరం వంద శాతమున్నది. రెండు పార్టీలు ఫ్లాప్‌ అయిపోయాయి.

మనకు కథలు చెప్పి, స్టోరీలు నడిపి కంప్లీట్‌గా నాశనంచేశారు. డంబాచారాలు, డొంబాచారాలు, కట్టుకథలు, పిట్టకథలు మస్తు చెప్పొచ్చు. కానీ ఇవాళ రియాల్టీ ఏమిటంటే 24% జీడీపీ క్రాష్‌ అయిపోయింది. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీలకు లేవు. నేను వ్యక్తులను అనడంలేదు. ఎవరినో ఒకరిని విమర్శించడంలేదు. రెండు పార్టీలకు రెండు పార్టీల పాలసీలు ఫ్ల్లాప్‌ అయిపోయినయ్‌. వీరిద్వారా దేశానికి ఏం జరుగదు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ముసుగులో బడ్జెట్‌ సమకూరుస్తున్నరు. దానికి వాళ్లు సిగ్గుపడాలె.

సంపద సృష్టించి పేదలకు పంచే ప్రభుత్వం రావాలె
దేశంలో సంపద సృష్టించే ప్రభుత్వం రావాలె.. ఆ సంపదను పేదలకు పంచే ప్రభుత్వం రావాలె. అదే మేం చేసి చూపించాం. తెలంగాణలో జీఎస్‌డీపీ 1,12,000 కోట్ల నుంచి 2,28,000 కోట్లకు తీసుకుపోయినం. సంపద సృష్టి అంటే ఇదే. దాన్నే అనేక విధాలుగా పేదలకు పంచుతున్నం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.2,016 పింఛన్‌ ఇస్తున్నాం. ఇది అంత ఆషామాషీ కాదు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016లకు తీసుకుపోయినమంటే తమాషా కాదు. సంపద లేనిది ఇదంతా ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం.. ఇవ్వలేం. ఎన్నికల వాగ్దానాల నుంచి మేం తప్పించుకోలేదు. సంపద పెంచే విధానాల్లో రెండు పార్టీలు విఫలమయ్యాయి. ఒకప్పుడు మన కన్నా ఘోరంగా ఉన్న చైనా ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఈ దేశంలో ఓ ప్రబలమైన మార్పు రావాల్సిన అక్కెర ఉన్నది. కచ్చితంగా దేశం కొత్త మార్గం, కొత్త పంథా పట్టాల్సిన అవసరమున్నది. మొన్ననే నేను శాసనసభలో ఇదే విషయాన్ని చెప్పా. ఈ చిల్లర పంచాయతీలు, కిరికిరిలు పెట్టి, తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపడం కాదు. దేశంలో కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరమున్నది. ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుతా కావచ్చు. నాకు ఆ ఆలోచన ఉన్నది. చాలా మందితో నేను మాట్లాడాను. త్వరలోనే మీరు చూడబోతున్నరు.

దేశం సాధించలేని ప్రగతి తెలంగాణ సాధించింది
తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కరోనా కొంత దెబ్బకొట్టింది. లేకపోతే ఇంకా ఉజ్వలంగా పోయి ఉండేవాళ్లం. దేశం సాధించలేని అద్భుతమైన ప్రగతిని తెలంగాణ సాధించింది. ఇవి ఊరికే చెప్పే సొల్లు మాటలు, పొల్లు మాటలు కాదు. దేశ ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించిన వివరాలు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లెక్కలు కావు. కేంద్రం ప్రకటించిన లెక్కలు. కరోనా దెబ్బ తగిలినా రాష్ట్రం ఏవిధంగా ఉన్నది, దేశం ఏ విధంగా ఉన్నదనేది మనకే అర్థమైంది. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు దేశ జీడీపీ రూ.79,118 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ.1,34,432 కోట్లు ఉన్నది. ఇక్కడ వృద్ధి 9.2 శాతమే. అదే తెలంగాణ జీఎస్‌డీపీ 2014లో రూ.1,12,000 కోట్లు ఇప్పుడు రూ.2,28,000 కోట్లు ఉన్నది. అంటే గతంలో ఉన్న దానికి రెండు రెట్లకంటే ఎక్కువ. జీడీపీలో 12.6% వృద్ధిరేటును నమోదుచేసింది.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ స్థా యిలో లేదు. 2014లో 13వ స్థానంలో ఉన్న మనం ఈ రోజు దేశంలో ఐదోస్థానంలో నిలిచాం. గుజరాత్‌ 8, మహారాష్ట్ర 10, బీహార్‌ 29, రాజస్థాన్‌ 18, మధ్యప్రదేశ్‌ 23, పశ్చిమ బెంగాల్‌ 19, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉన్నాయి. పెద్దరాష్ర్టాల్లో ఒకే ఒక్క కర్ణాటక మనకంటే ముందు ఉన్నది. మనం రూ.2.28 లక్షల కోట్లు ఉంటే కర్ణాటక రూ.2.30 లక్షల కోట్లతో స్వల్ప తేడాలో మాత్రమే ముందున్నది. మిగిలిన వాటిలో ఢిల్లీ, గోవా వంటి చిన్న రాష్ర్టాలు ఉన్నాయి. ఈ లెక్కన దేశంలోనే మనం ఒకటీ, రెండో స్థానానికి ఎదిగాం. అనేక విషయాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తాగునీటి రంగంలో 98 శాతంతో, తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.