తెలంగాణ రాష్ర్టాన్ని జాతీయస్థాయిలో విత్తన భాండాగారంగా మార్చడానికి విత్తన ఉత్పత్తి కంపెనీలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. విత్తన ఉత్పత్తిదారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని విత్తన ఉత్పత్తితోపాటు అధిక దిగుబడులపై రైతులను చైతన్యవంతులను చేయాలని సీఎం సూచించారు. విత్తన ఉత్పత్తి కంపెనీలకు ప్రభుత్వపరంగా అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని, అండగా నిలుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. విత్తన ఉత్పత్తి కంపెనీలు, వ్యవసాయ అధికారులు కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.

-వ్యవసాయాన్ని లాభసాటిగా మారుద్దాం.. -తెలంగాణను జాతీయ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుదాం -నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోవాలి -రైతులకు మేలురకమైన సాగు పద్ధతులు నేర్పాలి -ఆరులక్షల ఎకరాలలో విత్తన ఉత్పత్తి జరగాలి.. విత్తన కంపెనీలకు సీఎం కేసీఆర్ పిలుపు -క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలి.. మార్కెట్‌పై అవగాహన కల్పించాలి -యంత్రాల వినియోగంలో మెళకువలు నేర్పాలి.. వ్యవసాయ అధికారులకు సీఎం సూచన రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం తొలుత విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో, ఆ తరువాత వ్యవసాయ అధికారులతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు. సీఎం వారితో ముఖాముఖి మాట్లాడి విత్తన ఉత్పత్తిలో ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఒక్కొక్క విత్తన కంపెనీ మొదటిదశలో తెలంగాణలోని 95 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. కంపెనీ దత్తత తీసుకున్న గ్రామాలలో రైతులను విత్తనాల ఉత్పత్తికి ప్రోత్సహించాలని, మేలురకమైన సాగు పద్ధతులను నేర్పాలని అన్నారు. సీఎం ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన విత్తన కంపెనీల ప్రతినిధులు త్వరలో మరోసారి సమావేశమై గ్రామాలను దత్తత తీసుకునే అంశంపై తుది నిర్ణయం తీసుకుని విధి విధానాలు తయారు చేసుకుంటామని చెప్పారు.
తెలంగాణలో విభిన్న స్వభావం కలగిన నేలలున్నాయి. సమశీతోష్ణ వాతావరణం ఉంది. మంచి వర్షపాతం ఉంది. ఈ పరిస్థితులు విత్తనాల ఉత్పత్తికి ఎంతో అనుకూలించే అంశం. అందుకే ఇక్రిశాట్‌తోపాటు దాదాపు 364 విత్తన కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. భారతదేశ విత్తన రాజధానిగా తెలంగాణకు పేరుంది. దేశానికి అవసరమయ్యే 80 శాతం విత్తనాలు తెలంగాణలో తయారవుతున్నాయి. 2.90 లక్షల ఎకరాలలో విత్తన ఉత్పత్తి జరుగుతున్నది. ఈ పరిస్థితిని మరింత సానుకూలంగా మలుచుకుని తెలంగాణలో విత్తన ఉత్పత్తిని మరింత పెంచాలి.
కనీసం ఆరులక్షల ఎకరాలలో విత్తన ఉత్పత్తి జరగాలి. అది రైతులకు ఉపయోగపడాలి. దేశానికి ఏ రకమైన విత్తనాలు అవసరం? మనం ఎంత ఉత్పత్తి చేయాలి? ఏ ప్రాంతంలో ఏ విత్తనాలు పండించాలి? అనే అంశాలపై అవగాహనకు రావాలి. రైతులను చైతన్యపరిచి విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించాలి అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. నీటిపారుదల ప్రాజెక్టులు కడుతున్నాం. వ్యవసాయశాఖలో క్షేత్రాధికారులను నియమిస్తున్నాం. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ శాఖాధికారులను అగ్రానమిస్టులుగా తీర్చిదిద్దుతాం.
వ్యవసాయ యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తాం. పరిశోధనలను ప్రోత్సహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా గోదాముల సంఖ్యను పెంచుతున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులు మరింత ప్రయోజనం పొందేవిధంగా విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించాలి. ఇప్పటికే వ్యవసాయశాఖ తెలంగాణలో క్రాప్ కాలనీల వర్గీకరణ చేసింది. ఈ ప్రక్రియ మరింత లోతుగా సాగాలి. వ్యవసాయధికారులు, శాస్త్రజ్ఞులు, విత్తన కంపెనీలు కలిసికట్టుగా ఈ అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. విత్తన ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు హరీశ్‌రెడ్డి, ఏఎస్‌ఎన్‌రెడ్డి, నిరంజన్, గంగారాం, సుదర్శన్, శ్యాంసుందర్, రమణారావు, శ్రీపతిరెడ్డి, డీ లక్ష్మీకాంతరావు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.
క్షేత్రస్థాయికి తరలండి: వ్యవసాయ అధికారులతో సీఎం ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి తరలివెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం సాయంత్రం విత్తన ఉత్పత్తి కంపెనీల సమావేశం అనంతరం వ్యవసాయశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమైక్య పాలనలో సాగునీటిరంగం నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖకు పూర్వవైభవం తేవడానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
వ్యవసాయశాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి, నేల స్వభావాన్ని బట్టి ఏయే రుతువులలో, ఏయే పంటలు వేయాలన్న విషయాన్ని సూచించాలని, మార్కెట్‌పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని, ఆధునిక యంత్రాలను ఉపయోగించడంలో మెళకువలు నేర్పాలని సూచించారు.
వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్‌శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, జిల్లాలవారీగా కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులు, కొత్త పద్ధతులను రైతులకు ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. ఈ రెండు సమావేశాలలో వ్యసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ఇందిరా ప్రియదర్శిని, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం స్పందన పట్ల విత్తన కంపెనీల సంతోషం సీఎంతో విత్తన కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఓపికగా వారి విన్నపాలను విన్నారు. విత్తనాల ఉత్పత్తికి కోల్డ్ స్టోరేజీలు కాకుండా డీహ్యుమిడేషన్ స్టోరేజీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరారు. దీనివల్ల విత్తనాలను కొన్నేండ్ల్లపాటు నిల్వ ఉంచే వీలుంటుందని వారు వివరించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఈ విషయం తనకు తెలుసునని, ఈ దిశలో సరైన చర్చలు తీసుకుంటామని చెప్పారు. విత్తనాల స్టాక్‌లో తేడా ఉందంటూ విజిలెన్స్ అధికారులు తరుచూ దాడులు చేస్తూ సతాయిస్తున్నారని, పౌరసరఫరాలశాఖకు వర్తించే 6-ఏ కేసులను తమకు వర్తింపజేస్తున్నారని తెలిపారు.
దీనిపై పరిశీలించి చర్య తీసుకుంటానని సీఎం అన్నారు. విత్తన కంపెనీల ఏర్పాటుకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో అనుమతుల జారీకి ఆలస్యం జరుగుతున్నదని ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు.15 రోజులలో అనుమతినిచ్చే ఏర్పాట్లు చేస్తామని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి తమ సమస్యలను సానుకూలంగా వినడమే కాకుండా నిర్దిష్టమైన హామీనివ్వడం సంతోషంగా ఉందని విత్తనాల కంపెనీల ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. గ్రామాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అంకాపూర్‌కు చెందిన గ్రీన్‌విజన్ అగ్రిటెక్ కంపెనీ యజమాని గంగారాం చెప్పారు.