-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ -భౌతికదాడులతో తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని హితవు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతికదాడులకు ఏమాత్రం చోటులేదని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించటం చేతకాక, ఇతర పార్టీలపై భౌతికదాడులు చేస్తూ తమ వాదనను వినిపించాలని యత్నిస్తున్న బీజీపే తీరును ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని కోరారు. గతంలోనూ బీజేపీ భౌతికదాడులకు ప్రయత్నించిందని చెప్పారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి.. బీజేపీ పదేపదే భౌతికదాడులకు దిగడం తెలంగాణ సమాజానికి ఏమాత్రం వాంఛనీయం కాదని స్పష్టంచేశారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నాయకులు కనీసం బయట కూడా తిరుగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. బీజేపీ భౌతికదాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుందని, ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని పేర్కొన్నారు. అయినా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మరచిపోకూడదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.