-భూ లావాదేవీల పోర్టల్‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం -దేశానికే ధరణి పోర్టల్ ఒక ట్రెండ్ సెట్టర్ -దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం -ఇరవై నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ -ఏడు రోజుల్లో కొత్త పాస్‌బుక్ మంజూరు -పాత మార్కెట్ విలువలకే రిజిస్ట్రేషన్లు -ప్రతి మండలానికీ డాక్యుమెంట్ రైటర్లు -త్వరలో రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే -తెలంగాణ మట్టి నా జీవితం.. తెలంగాణ రాష్ట్రం నా అనుభవం.. తెలంగాణ మాగాణం నా స్వప్నం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన క్షణాల్లో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి వ్యక్తమైన ఉద్వేగమిది.

రాష్ట్రం వచ్చిందాకా.. తెలంగాణలో ఎవుసం అన్నది ఎడ్డిమాట. నీళ్లులేవు. కరెంటు లేదు.. భూములకేమో చిక్కుల చికాకులు.. పాస్‌బుక్కులో ఒకపేరు, పహాణీలో ఇంకోపేరు.. షేత్వారీలో మరోపేరు. పట్టాదారు ఒకరు.. అనుభవదారు మరొకరు. ఒక కాయితంలో వ్యవసాయభూమి.. మరో కాయితంలో అటవీభూమి. దశాబ్దాల తరబడి సేద్యం చేసుకొంటున్నా.. తప్పుడు రికార్డులు.. తప్పుడు పేర్లతో ప్రభుత్వ పథకాలు ఏవీ లభించని పరిస్థితి. పర్యవసానం అప్పులు.. వాటిని తీర్చలేక ఆత్మహత్యలు. రాష్ట్రం వచ్చిందాకా.. పొలంల కాలుపెడితే.. మట్టిలో కల్సిపోవుడన్నంత అరిగోస.
ఇప్పుడు అదే భూమి నవ్వింది. అరిగోస పడ్డ అన్నదాత కండ్లల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయి. వివాదాల చిక్కు ముడులతో అస్తవ్యస్తంగా అల్లాడిపోయిన తెలంగాణ నేల సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నది. వివాదాల పీటముళ్లు పటాపంచలయ్యాయి. పడావుపడ్డ భూములు పచ్చగా మారుతున్న వేళ.. రైతులకు ఎలాంటి వివాదాలు లేకుండా గుండెమీద చెయ్యివేసుకొని ఎవుసం చేసుకొనేందుకు భూముల లెక్కలు తేలిపోయినయి. రైతుల భూములను చూసుకొనేందుకు ధరణి తల్లి వచ్చేసింది. ఒక్క అంగుళం కూడా చేజారకుండా పక్కా లెక్కలతో.. ఒకే ఒక్క బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయ్యేలా సరళీకృత భూపాలన దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలైంది.
ఇవాళ తెలంగాణ భూతల్లి సంబురం చేసుకొంటున్నది. తెలంగాణ రైతు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. భూసంస్కరణలు, పారదర్శకంగా భూ పరిపాలన.. కచ్చితంగా భూమి లెక్కలు సాధ్యమే కాదనుకున్న చోట.. ఒక సంకల్పదీక్ష సాధ్యం చేసింది. యావత్‌దేశం ఆశ్చర్యచకితమై తెలంగాణవైపు చూస్తున్నది.
యావత్ దేశానికే మార్గదర్శనం కాగల.. చరిత్రాత్మక భూ పరిపాలనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారంచుట్టారు. అన్ని రకాల భూ లావాదేవీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ధరణి వెబ్ పోర్టల్‌ను.. గురువారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కార్యాలయంలో ప్రారంభించారు. మధ్యాహ్నం 12.55 గంటలకు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ముందుగా పూజలు నిర్వహించారు. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు కొబ్బరికాయలు కొట్టి ధరణి విజయవంతం కావాలని ప్రార్థించారు. వేద పండితులు మహదాశీర్వాదం అందించారు.
అనంతరం మండల కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సభా వేదికకు వచ్చిన సీఎం.. అక్కడ ల్యాప్‌టాప్ బటన్ ఆన్‌చేసి ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపడంలో ధరణి కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ పోర్టల్ రూపకల్పన వెనుక తనతోపాటు సీఎంవోలోని ముఖ్య అధికారుల మూడేండ్ల శ్రమ, మథనం దాగి ఉన్నదని తెలిపారు. ధరణి ప్రారంభం సందర్భంగా మూడుచింతలపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రెవెన్యూలో ఐటీ తెచ్చింది మనమే ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్. నేను మూడుచింతలపల్లి వేదిక నుంచి మాట్లాడుతున్నా.. లైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా, అవకాశం ఉన్నచోట దాదాపు ఇరవైముప్ఫై దేశాల్లో ప్రజలు నా మాటలు వింటున్నరు. కాబట్టి ధరణికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నది. భూమి ఒకప్పుడు కేవలం ఉత్పత్తి సాధనం మాత్రమే. ప్రజల బతుకంతా భూమి చుట్టే ఉండేది. వేల ఏండ్ల కిందట భూమికి విలువ ఉండేదికాదు. నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం నేర్చుకొన్న తర్వాత భూమికి విలువ పెరిగింది. దేశంలో చాలామంది చాలారకాల రెవెన్యూ చట్టాలకు, భూ విధానాలకు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రజలకు ఫలితాలనిచ్చాయి. కొన్ని వికటించాయి. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు, రెవెన్యూ చట్టాలకు రూపకల్పన చేసిన ప్రధానమైన వ్యక్తి మొదటి సాలార్జంగ్. అప్పటి నుంచే కాస్రా, పహాణి, బందోబస్తు అని వింటున్నాం. నిజాంకాలంలో భూములన్నీ కొలిచి, సర్వే చేసి, గెట్లు నిర్ణయించారు. తర్వాత అన్నీ చిందరవందర అయినయి. 1970ల్లో పీవీ నరసింహారావు భూ సంస్కరణలు తెచ్చారు.
ఆయన పుణ్యమా అని ఇవ్వాళ 93% చిన్న సన్నకారు రైతులున్నరు. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేశారు. ఆ తర్వాత ఏ సీఎం కూడా ఏమీ చేయలేదు. ఐటీ.. ఐటీ అని మాట్లాడే సీఎం కూడా రెవెన్యూలో ఐటీ తేలేదు. దేశంలో తొలిసారి రెవెన్యూ రికార్డుల్లో ఐటీ ఇంటర్వెన్షన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమని గర్వంగా తెలియజేస్తున్నా. రెవెన్యూ బాధలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, తెలంగాణ రైతులోకం ఎటువంటి ఆటుపోట్లకు గురికాకుండా వారి భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ఐదేండ్ల కిందటే నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రినైన తర్వాత.. చాలా కష్టపడి కొత్తగా రాష్ర్టాన్ని తెచ్చుకున్నం, ఈ రాష్ర్టానికి ఏం కావాలె.. ఏ దిశలో ముందుకు పోవాలె అని ఆలోచించినం. రాష్ర్టానికి ఒక గమనం.. దిశ.. ఒక దిక్సూచి అన్ని రంగాల్లో ఇవ్వాల్సిన బాధ్యతను ప్రజలు టీఆర్‌ఎస్ మీద, నామీద ఉంచారు. కాబట్టి తప్పులులేకుండా సరైన పంథాలో ముందుకు పోవాలని కఠిన నిర్ణయాలు తీసుకొన్నం. నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా కొన్ని వ్యవహారాలు చేసినం.
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే ప్రభుత్వం వచ్చిన ఐదారు నెలల తర్వాత అసెంబ్లీలో.. మిషన్ భగీరథ ప్రారంభిస్తున్నామని, దాంతో ఇంటింటికీ తాగునీరు అందుతుందని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పినం. చాలామంది ఆశ్చర్యపడ్డరు. ఇది సాధ్యమైతదా? అన్నరు. కానీ సంకల్పబలం, చిత్తశుద్ధి, చేయాలనే తపన ఉంటే అది సాధ్యమేనని తెలంగాణ నిరూపించింది. ఇలాగే గతంలో ఎదుర్కొన్న అనేక జటిలమైన సమస్యలను పరిష్కరించుకున్నం. ఉదాహరణకు కరెంటు సమస్య. నేను కూడా రైతునే. కరెంటు కోసం ఎన్ని బాధలు పడ్డమో మనకు తెలుసు. దీనినొక ప్రధాన సమస్యగా పరిగణించి కఠిన నిర్ణయాలు తీసుకొన్నం. ఈ రోజు దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉన్నది. సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ వ్యవస్థను క్రమబద్ధీకరించినం. ఈ రోజు దేశంలో నాణ్యమైన కరెంటును వ్యవసాయం సహా అన్ని రంగాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇలా అనేక విషయాల్లో మనం దేశానికి మార్గదర్శిగా ఉన్నాం.
బాలారిష్టాలు సహజం.. ఆగం కావొద్దు. భూ సమస్య రైతాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ నాతోపాటు వచ్చారు. వారికి గతంలో ఒకటే మాట చెప్పాను. వీఆర్వోల వల్ల.. ఇతర కొన్ని ఇబ్బందుల వల్ల రెవెన్యూకు చెడ్డపేరు వస్తున్నది. ఇంతమంచి ప్రభుత్వాన్ని నడుపుకొంటున్నాం. గొప్పగా ముందుకుపోతున్నాం. కాబట్టి ఇదంతా తీసేయాలని చెప్తే.. వారందరూ ‘సార్.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విప్లవాత్మక సంస్కరణలు తెస్తమని మీరు అసెంబ్లీలో చెప్పినారు. ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి నెరవేర్చాల్సిందే. మేము మీతో ఉంటాం. ప్రజలకు సేవ చేస్తాం’ అని చెప్పిన్రు. వారందరికీ ధన్యవాదాలు. ఒక పెద్ద విప్లవం, గొప్ప సంస్కరణ వచ్చినప్పుడు బాలారిష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకుపోవాలి. ప్రతీపశక్తులు ఎప్పుడూ వ్యతిరేక ప్రచారానికి సిద్ధంగా ఉంటాయి. ఏదో మండలంలో చిన్న సమస్య వస్తే నెగెటివ్ కోణంలో చూపించే అవకాశముంటుంది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ట్రయల్న్ కోసం ఓపెన్ చేసినప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు పోర్టల్‌ను చూస్తున్నరు. నాతోపాటు వచ్చిన టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ శ్రవణ్‌కుమార్‌రెడ్డి రాత్రి ఆసక్తితో తూప్రాన్ మండలంలోని ఘనపురం గ్రామంలో ఉన్న తన భూమిని చూసుకున్నరు. నాకు చూపించినప్పుడు నేనే ఆశ్చర్యపడ్డా. బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. కొన్ని లక్షల హిట్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే కూడా ఒక నిమిషం ఆగింది. ఏందని అడిగితే విపరీతంగా ట్రాఫిక్ ఉన్నదని చెప్పిన్రు. కాబట్టి చిన్నపాటి సాంకేతిక సమస్యలు వస్తాయి. వాటిని మనం అధిగమించుకొని ముందుకు వెళ్లాలి.

అక్రమ రిజిస్ట్రేషన్లు ఉండవు ఇప్పుడు 1,45,58000 ఎకరాల భూముల రికార్డులన్నీ క్లీన్ అయ్యి ధరణి పోర్టల్‌లో దర్శనం ఇస్తున్నాయి. ఈ వివరాలను ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాళ్లయినా చూసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఒకరి భూమి ఇంకొకరికి రాయడం, మార్చడం కుదరదు. గతంలో ఎవరికిపడితే వారికి, ఏ భూములైనా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈరోజు నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు. దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములు ధరణిలో ఉంటాయి. కానీ ఆటోలాక్‌లో ఉంటాయి. ఏ అధికారి కూడా వాటిని మార్చలేరు.
మూడేండ్ల మథనం ఉన్నది ధరణి గురించి ఇతర రాష్ర్టాల సీఎంలు నాతో మాట్లాడినరు. మీరు చాలా సాహసం చేస్తున్నరు చంద్రశేఖర్‌గారు.. ఇది సాధ్యం అయితదా? అని అడిగినరు. సంకల్పం, నిజాయితీ ఉంటే భగవంతుడు కూడా సహకరిస్తడు, ప్రజలు కూడా సహకరిస్తారు, ఆటోమెటిక్‌గా సక్సెస్ అయితదని చెప్పిన. అదే నిజమైంది. ఈ రోజు మనం చేసింది పక్క రాష్ట్రంలో ధన్‌మని చేద్దామంటే సాధ్యంకాదు. ఎందుకంటే దీని వెనుక మూడేండ్ల విశేష కృషి ఉన్నది. సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంవోలోని నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్, శేషాద్రి వంటివారు మూడేండ్ల కిందట నేను దీనిని మొదలుపెట్టినప్పుడు ఇది సాధ్యమైతదా? ముందుకు పోగలుగుతామా? అని దిగులుపడ్డరు. కలెక్టర్ల మీటింగ్ పెట్టినం. దాదాపు 150-200 సమావేశాలు జరిపినం. కొన్నిసార్లు రాత్రి 2-3 అయ్యేది. నేనూ కూర్చునేవాడిని. అనేక కార్యకారణాలు వివరించి.. దీనిని సాధ్యంచేసినం. భూ రికార్డులు ప్రక్షాళన చేసినం. దానిలో కొంత జరిగింది. అంతలోకే ఎలక్షన్లకు పోయినం. తిరిగి వచ్చిన తర్వాత పట్టువదలని విక్రమార్కుడిలాగా ఎంబడివడి పూర్తిచేసినం. మధ్యలో కరోనా వచ్చి కొంచెం ఆలస్యం జరిగింది. లేకపోతే ఆరేడు నెలల ముందే పోర్టల్ వచ్చేది. మనం మూడుచింతలపల్లి మండలంలోని ఏ గ్రామానికైనా పోదాం. అక్కడ ఏం కనబడుతది. నూటికి 99 మందికి గెట్లున్నయి.. గట్లున్నయి. ఎవరి బతుకు వారే బతుకుతున్నరు. పంచాయితీలుంటే ఒకటి రెండు పర్సెంట్ ఉంటయి. వారికోసం మిగిలినదానిని ఎందుకు పెండింగ్‌లో పెట్టాలె? అని అధికారులతో వాదించేవాడిని. ఫలితంగానే 1.45 కోట్ల భూములు ఎలాంటి పంచాయతీ లేకుండా ఈరోజు ధరణి పోర్టల్‌లోకి వచ్చినయి. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్లు జరుగుతయి. ‘సమస్యలుండి పార్ట్-బీలో పెట్టిన భూములు కొన్ని ఉన్నయి సార్?’ అంటే.. ‘దానికదే జరుగుతది.. దీనికిదే జరుగుతుంటది’ అని చెప్పిన. వివాదాలను బట్టి పరిష్కారం ఉంటదని చెప్పిన.
కిరికిరిగాళ్ల బారిన పడొద్దు కిరికిరిగాళ్లు మన మధ్యనే ఉంటరు. వాళ్లు పైరవీకారుల రూపంలో, జగడాలమారి కేసులు పెట్టేవారి రూపంలో, అన్నదమ్ముల గెట్ల పంచాయతీలు పెట్టించే రూపంలో ఉంటరు. యాష్ట పెడుతరు. వాళ్ల బారిన పడకపోతే పల్లెలు, గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి. కొన్ని కఠినమైన పద్ధతులు తెచ్చిన. కుటుంబ పెద్ద చనిపోయిననప్పుడు ఆ భూములు పంచుకునే ఫౌతి (వారసత్వం) అధికారాన్ని ఇప్పుడు కుటుంబసభ్యులకే ఇచ్చినం. వారసత్వం విషయంలో మార్పులు చేర్పులను కుటుంబసభ్యులు కూర్చొని, తీర్మానం చేసుకొని, సంతకాలు పెట్టుకొని ఎమ్మార్వోను స్లాట్ అడిగితే అలాట్ చేస్తడు. తీర్మానం కాపీ ఇస్తే దాని ప్రకారం భూములు ఇచ్చేస్తరు. అక్కడికి పంచాయితీ ఒడిశిపోతది. దాని తర్వాత కూడా పంచాయితీ ఉంటే.. అది కిరికిరిగాళ్లు పెట్టించేదే. వాళ్లు సివిల్ కోర్టుకుపోయి తేల్చుకోండి. అధికారులను బదనాం చేస్తమంటే కుదరదు. తాసిల్దార్ లేకుంటే నాయబ్ తాసిల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ విధానం గ్యారెంటీగా సూపర్‌హిట్ అయితది. దేశమంతా విప్లవం లేపుతది. కేంద్రం మీద, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల మీద విపరీతమైన ఒత్తిడి కూడా వస్తది.
95% రైతు వేదికలు పూర్తి 2,601 రైతు వేదికలు కట్టాలని కలెక్టర్లందరినీ కొరిన. నాలుగు నెలల్లోనే 95% పూర్తయ్యాయి. వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో నేను వీటిని ప్రారంభించబోతున్నా. రైతు వేదికలు, వాటి ఆఆవశ్యకత ఏంది? అనేది వరంగల్‌లో చెప్తా. రాష్ట్రంలోని రైతులందరూ వినాలె. తెలంగాణ ఉద్యమం సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలో, జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో, మహబూబ్‌నగర్‌లోని నడిగడ్డలో రైతుల బాధలు, ఆత్మహత్యలు చూసి, వారు ఉరేసుకున్న పరిస్థితులను చూసి ఏడ్చిన. ఆ బాధలన్నీ పోవాలని, రెవెన్యూ భూముల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, అద్భుతమైన పద్ధతిలో ప్రపంచమే ఆశ్చర్యపడేలా గొప్ప పోర్టల్ కావాలని చెప్పి నేను సంకల్పం చేసిన. ఎంత ఖర్చయినా సరేనని ఈ ధరణి పోర్టల్ తెచ్చుకున్న. కాబట్టి రైతుల సమస్యలన్నీ తీరేవరకు రైతులు, ప్రజలు, నాయకులు అందరూ రెవెన్యూ సిబ్బందికి సహకరించాలి.
ఈ రోజు మూడుచింతలపల్లికి ప్రత్యేక గౌరవం దక్కింది. ఒక విప్లవానికి, చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. నేను ఈ స్థలం ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం.. ఈ గ్రామ మట్టిలో మెరిసిన మాణిక్యం వీరారెడ్డి. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అగ్రగణ్యులు. రాష్ట్రం కావాలని కోరుకొని జైలుకెళ్లిన ముఖ్య వ్యక్తుల్లో ఒకరు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో జరిపితే ఈ చారిత్రాత్మక ఘట్టానికి సార్థకత వస్తుందనుకున్నా. నేను ముందుగా వారి కుమారుడు, కుటుంబసభ్యులు, ఈ గ్రామ సర్పంచ్‌తో కలిసి వీరారెడ్డి విగ్రహానికి పూలమాల సమర్పించి, సెల్యూట్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చాను.
రైతు మెడకు దూలం కట్టదల్చుకోలేదు కౌలు రైతులకు ఇయ్యాలె అని కొందరు అడిగితే ఇయ్యనని చెప్పిన. ఎందుకంటే రైతు మెడలో దూలం కట్టదల్చుకోలేదు. అనుభవదారు కాలం అని రాయాలె.. ఓ పహాణీ ఇయ్యాలె. వాళ్లు పోయి కోర్టులో కేసు పెడితే అసలుదారు ఆఫీసుల చుట్టూ తిరుగాలె. కౌలు అనేది యజమానికి, కౌలు రైతుకు మధ్య వ్యవహారం. దానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది మా ప్రభుత్వం పాలసీ. భవిష్యత్తులో కంప్లీట్ టైటిల్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నం. టైం పడుతది. సర్వే కావాలి, మరింత స్పష్టత రావాలి. ఇదంతా జరుగాలంటే మనం అధికారులకు సహకరించాలి.
రైతు ఖాతాలో లక్షలున్నప్పుడే బంగారు తెలంగాణ మొన్ననే 48 గంటలల్లో 58 లక్షల మంది రైతులకు డబ్బు వేసినం. కేసీఆర్ బతికి ఉన్నన్ని రోజులు ఎవ్వడు అడ్డం వచ్చినా రైతుబంధు ఆగదు. రైతులు వాళ్ల అప్పులు కట్టి సొంత పెట్టుబడి వాళ్ల జేబులోకి రావాలని నేను కోరేది. ఫ్రీ కరెంటు వచ్చి, కొద్దిగా నీళ్లు వచ్చి, ఈ రెండేండ్లలో వర్షాలు పడి ఇప్పుడిప్పుడే తేట పడుతున్నం. ఆయన సొంత పెట్టుబడి లక్షనో, రెండు లక్షలో, నాలుగు లక్షలో ఎవరి శక్తిని వాళ్లకు బట్టి బ్యాంకులో ఉండాలి. అలా అయిన్నాడే బంగారు తెలంగాణ.
సాదాబైనామా మరో వారం రోజులు పొడిగింపు తెలిసో తెలియకో తెల్లకాగితం మీద భూములు కొన్నోళ్లు కూడా ఉన్నరు. ధరణి వచ్చిన తర్వాత భూముల మారకం కుదురదు. భూమి మారాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ జరుగాలె. సాదాబైనామాలు యాడనో ఒకకాడ తెగిపోవాలె. అందుకే సాదాబైనామాలకు ప్రభుత్వం చిట్టచివరి అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు 1.64 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువును ఇంకో వారం పెంచాలని సీఎస్‌ను కోరుతున్నా. సమగ్ర సర్వేతో అడవి భూములు, దేవాదాయ భూములు తేలిపోవాలి. గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాలు ఇప్పిస్తాం. నేనే స్వయంగా వస్తానని చెప్పిన. కరోనా వల్ల ఆలస్యమైంది. వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తం. ఆగం చేస్తమని ఎక్కడా అనలేదు.
రైతులం సెల్ల్ల వేసుకొని తిరుగుతం. కానీ వెనుకకు చూస్తే అన్ని అప్పులే ఉంటయ్. నిన్న ఇయ్యాల జర దమ్ము తీసుకుంటున్నం. నేను కోరేది రైతుకు బాకీలన్నీ తీరిపోవాలి, సొంత పెట్టుబడి ఆయనకు లక్షనో, రెండు లక్షలో, మూడు, నాలుగు లక్షలో వారి శక్తిని బట్టి బ్యాంకులో ఉండాలె. అలా అయిన్నాడే బంగారు తెలంగాణ. – సీఎం కేసీఆర్
ఈ రోజు మనం చేసింది పక్క రాష్ట్రంలో ధన్‌మని చేద్దామంటే సాధ్యంకాదు. ఎందుకంటే దీని వెనుక నాతోపాటు అధికార యంత్రాంగం మూడేండ్ల విశేషమైన కృషి ఉన్నది. చాలా మధనం ఉన్నది. కొన్నిసార్లు రాత్రి 2-3 కూడా అయ్యేది. నేను కూడా అధికారులతో కూర్చునేవాడిని. అనేక కార్యకరణాలు వివరించి.. దీనిని సాధ్యం చేసినం. – సీఎం కేసీఆర్
నేను ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ‘వీడు గింతంతున్నడు.. బక్కపానం.. ఎవడో బొండిగె పిసికేస్తడు.. వీంతోని ఎక్కడైతదిరా?’ అని అన్నరు. కానీ గట్టిగ కొట్లాడితే తెలంగాణ వచ్చిందా? రాలేదా?. ఇప్పుడు కూడా సమస్యలు అట్లనే పరిష్కారం అయితయి. సంకల్పబలం, చిత్తశుద్ధి, చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ నిరూపించింది. – సీఎం కేసీఆర్
కిరికిరిగాళ్లు.. రాక్షసుల ప్రతిరూపాలు కొంతమంది కిరికిరిగాళ్లు ఎప్పటికీ అంతటా ఉంటరు. వాళ్లది పెద్ద కథ ఉంటది. శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని విడిపించడానికి లంక మీద యుద్ధానికి పోయిండు. యుద్ధం జరుగుతున్నది. అది ధర్మయుద్ధం. మోసం చేసేది ఉండదు. సాయంత్రం యుద్ధ విరమణ గంట కొట్టినంక ఎక్కడివాళ్లు అక్కడ ఉంటరు. ఒకరోజు యుద్ధ విరమణ తర్వాత రాములవారు సైనికులతో కూర్చుంటే ఒకాయన చెప్పిండు.. అయ్యా రాములవారు మనవాళ్లేమో కోతులు. రావణాసురుడి సైన్యంలో రాక్షసులున్నరు. ఒక్కొక్క రాక్షసుడికి దొరికితే పది ఇరవై కోతులు సచ్చిపోతున్నయి. ఎట్లన్నచేసి మనం యుద్ధం గెలవాలె. ధర్మం మనదిక్కు ఉన్నది అని చెప్పిండు. దానికి రాముడు.. ‘నా దగ్గర బ్రహ్మాండమైన రామబాణం అనే అస్త్రం ఉన్నది. కానీ రామబాణం వేస్తే రావణాసురుడితోసహా దానికి ఎదురుగా వచ్చినోళ్లంతా చనిపోతారు. అది సృష్టి నియమానికి విరుద్ధం. ఏం చేద్దామంటారు’ అని అంటడు. నువ్వే దేవునివి కాబట్టి ఎట్లనన్న సదురుకోగానీ మొత్తానికి యుద్ధం గెలవాలి అని అందరూ అడుగుతరు. తెల్లారి యుద్ధం మొదలైన తర్వాత రాముడు ప్రార్థనచేసి రామబాణం వేస్తడు. రావణాసురుడితోసహా అటువైపు అందరూ చనిపోతరు. రాములవారు సీతమ్మవారిని విడిపించుకొని తిరిగి అయోధ్యకు ప్రయాణమైతడు. కొద్దిదూరం వచ్చిన తర్వాత కొంతమంది రాక్షసులు ఎదురుంగ వస్తరు. ఆయ్యా శ్రీరామా నీ రామబాణంతో మేము చాలా మందిమి సగం ఆయుష్షుతో చనిపోయాం. మా సంగతేంది? మా లెక్క ఎట్ల తేలాలె? మా ఆయుష్షు కథ ఏంది? అని అడుగుతరు. అప్పుడు రాముడు ‘మీరు కలియుగంలో గ్రామానికి ముగ్గురు, నలుగురు చొప్పున పుట్టుండ్రి. మీకు అక్కడ అవకాశం ఇస్తా. ప్రజలను పీక్కొని తినుండ్రి’ అని చెప్తడు. ఇప్పుడు మనమధ్య ఉన్న కిరికిరిగాళ్లు వాళ్లే అని కేసీఆర్ చెప్పడంతో సభికులంతా ఘొల్లున నవ్వారు.
రిజిస్ట్రేషన్ ఎట్లా అయితదంటే.. ఒకాయన రెండెకరాలు ఇంకొకాయనకు అమ్మిండు. ఇద్దరు తాసిల్దార్ ఆఫీస్‌కు సమాచారం ఇయ్యాలె. మేము ఫలానా విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నం అని చెప్పి ఫీజు కట్టాలె. మ్యుటేషన్ ఫీజు కూడా చాలా స్వల్పంగా ఉంటది. మీరు కోరుకున్న రోజు స్లాట్ అలాట్ అయితది. మీరు ఆఫీస్‌కు వచ్చిన తర్వాత 10-15 నిమిషాలలోపట రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయితది. అమ్మినాయన పాస్‌బుక్‌ల భూమి డిలీట్ అయితది. కొన్నాయన పాస్‌బుక్‌ల ఎక్కుతది. వెంటనే ధరణి సైట్‌లో వస్తది. మీరు తాసిల్దార్ ఆఫీస్‌లో ఉండంగనే ప్రపంచం మొత్తం తెలిసిపోతది. 20 నిమిషాలల్ల కొన్నాయినకు రిజిస్టేషన్ కాగితాలు, ధరణి నకలు ఇచ్చేస్తరు. ఇద్దరు వ్యవసాయదారులైతే వారి పాస్‌బుక్‌లలో అప్‌డేట్ చేస్తరు. బ్యాంకుల్లో పాస్‌బుక్‌లు ఎలా అప్‌డేట్ అవుతుయో ఇకపై భూమిని అమ్మినా, కొన్నా పాస్‌బుక్‌లో యాడ్ అయితది. డిలీట్ అయితది. కొనేవ్యక్తికి పాస్‌బుక్ లేకుంటే..దానికి చార్జెస్ కట్టి, అడ్రస్ ఇస్తే ఏడెనిమిది రోజుల్లో వస్తది. పాస్‌బుక్ ఎక్కడపడితే అక్కడ ప్రింట్ చేయరు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా గవర్నమెంట్ రహస్యంగా ప్రింట్ చేయిస్తది. మనుషుల ప్రమేయం లేకుండా ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేకుండా జరుగుతది.
చార్జీలు పెంచలేదు గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలనే ప్రభుత్వం ఉంచింది. సర్వే నంబర్, గ్రామం, మండలాలవారీగా ఎంతున్నదో అందరికీ తెలుసు. ఆఫీస్‌కు రాకముందే రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తం కాబట్టి గింత.. గంత ధర అని ఉండదు. సబ్ రిజిస్ట్రార్లకు ఇదివరకు విచక్షణాధికారాలు ఉండే. మన సర్వే నంబర్ పక్కన ఒకడు రూ.20 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. నువ్వుకూడా రూ.20 లక్షలు ఇయ్యాలె అని అంటుండే. వద్దు సార్.. బల్ల కింద డబ్బు ఇస్తా అంటే తీసుకొని పాతధరకే రిజిస్ట్రేషన్ చేస్తుండే. ఇప్పుడు ఆ అధికారం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన భూమి ధర మాత్రమే కట్టాలె. ఇంత గొప్ప సదుపాయం కలలో కూడా మనం ఊహించలే. ఇటువంటి మంచి అవకాశం రాష్ట్రంలోని 59 లక్షల మంది రైతులకు వస్తదని అనుకోలే. వచ్చినదాన్ని మనం కన్నబిడ్డలను కాపాడుకొన్నట్టు కాపాడుకోవాలె. ఎక్కడ్నో మారుమూల మండలంలో సమస్య వస్తే బెంబేలెత్తొద్దు. దానిని పరిష్కరిస్తరు. ఇందుకోసం టీమ్ ఏర్పాటు చేసినరు. గంటలల్లో మళ్లీ కార్యక్రమం మొదలైతది. మనం కొత్త మోటర్ తెస్తం. ఫ్యాన్ తెస్తం. వాటిలో సమస్యలు రావా? అట్లనే ధరణిలో కూడా వస్తది. తెలంగాణలో ఉండే ప్రతి ఇంచు జాగాను డిజిటల్ మెకానిజంలో కొలువడంపై ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వబోతున్నది. మొత్తం సర్వే చేస్తాం. సర్వేలో గెట్టు నిర్ణయం చేసి, వాటికి కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) నిర్ధారిస్తారు. ప్రపంచంలో వీటిని ఎవరూ మార్చలేరు.
ఎగతాళి చేసినోళ్లను వెనుకకు నెట్టినం ఒకప్పుడు తెలంగాణలో చాలా తక్కువగా పంటలు పండేవి. ఉత్పత్తి తక్కువ ఉండేది. మనం ఏ రాష్ట్రం నుంచైతే విడిపోయినమో వాళ్లు మనల్ని ఎగతాళి చేసేవాళ్లు. వాళ్లను మనం ఏనాడో వెనక్కి నేట్టేశాం. గతేడాది ఎఫ్‌సీఐకి ధాన్యం సమకూర్చినప్పుడు.. అన్ని రాష్ర్టాలు కలిపి 45% ఇస్తే తెలంగాణ ఒక్కటే 55% అందించింది. ఎఫ్‌సీఐ చైర్మన్, మన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అల్లుడు.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో నేను శాసనసభలో, వివిధ బహిరంగ వేదికల్లో ‘మాది వెనుకబడిన ప్రాంతం కాదు. వెనుకపడేయబడిన ప్రాంతం. వెనుకకు నెట్టివేయబడిన, వివక్షకు గురైన ప్రాంతం’ అని చెప్పిన. ఇది వాస్తవమేనని ఇప్పుడు రుజువైంది. ఆర్‌బీఐ ప్రకారం 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు. ఆరేండ్లలోనే ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.28 లక్షలు. ఆనాడు 13, 14 స్థానాల్లో ఉన్నం. ఈనాడు దేశంలో ఐదో స్థానంలో ఉన్నం. ఇంత ఆర్థికప్రగతిని సాధించుకోగలిగినం. టీఎస్‌ఐపాస్, పరిశ్రమలను ఆహ్వానించుకోవడం, లా అండ్ ఆర్డర్ నిర్వహణ.. ఇలా అనేక పాలసీల్లో చాలా చక్కగా ముందుకుపోయినం.
ఆఫీస్‌ల చుట్టూ తిరిగే ఖర్మ ఉండది కొత్తగా జరిగే కొనుగోలు, అమ్మకాలు నిమిషాల మీద జరిగిపోతయి. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ల కోసం కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే ఖర్మ మనకుండది. పోర్టల్‌లోనే ఐప్లె చేసుకునే వీలున్నది. మీసేవ ద్వారా లేదా పోర్టల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆఫీస్‌కు పోయి చేసుకోవచ్చు. రాష్ట్రంలో మునుపు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు 140 మాత్రమే ఉండేవి. వీటికి అదనంగా 570 తాసిల్దార్ ఆఫీస్‌లన్నీ కూడా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారినయి. గతంలో మ్యుటేషన్ కోసం ఆర్డీవో దగ్గరికి పోయేటోళ్లు. కాళ్లరిగేదాకా తిరిగేది. గందరగోళం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కొందరికి బుధవారం ఇష్టం.. కొందరికి గురువారం ఇష్టం.. కొందరికి ఘాతవారాలుంటయి. మీ ఇష్టమున్న రోజు మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరే రాసుకుంటమంటే నమూనా పత్రాలు కూడా పోర్టల్‌లో ఉన్నయి. రాసిపెట్టాలనంటే డాక్యుమెంట్ రైటర్లు ఉంటరు. వాళ్లుకూడా మునుపటిలాగా అడ్డగోలు వసూలు చేయరు. ఫిక్స్‌డ్ ఫీజు ఉంటది.
రెవెన్యూ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తరు కొద్దిమంది అధికారులు తప్పు చేయవచ్చు. అలా అని మొత్తం రెవెన్యూ శాఖను తప్పు అనలేం. వాళ్లకు 55 రకాల బాధ్యతలుంటయి. రాత్రింబవళ్లు పనిచేసేది రెవెన్యూ డిపార్ట్‌మెంట్. వాళ్లను బదనాం చేయడానికి పూనుకోవద్దు. ఈ రోజు చట్టం చాలా క్లియర్‌గా ఉంది. వాళ్లు ఎటువంటి తప్పులు చేయరు. చేసే అవసరం, అవకాశం లేదు. చివరికి నా భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా.. తాసిల్దార్ వేలిముద్ర, నా వేలిముద్ర, కొనేటాయన వేలిముద్ర ఇలా మూడు ముద్రలు పడితేనే సాధ్యమైతది. వేరే పద్ధతిలో చేసే అధికారం కలెక్టర్‌కు, రెవెన్యూ సెక్రటరీకి, మంత్రికి కూడా లేదు. రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఆ ఎమ్మార్వోనే బాధ్యులు. మనం కూడా వేలిముద్ర పెడతం కాబట్టి మనమూ బాధ్యులమే. అయితే నేను చెప్పిన కిరికిరిగాళ్లు దీంట్ల కూడా కొన్ని తీస్తరు. ధరణి వచ్చినాక గ్రామాల్లో ఎక్కడికక్కడ కథానాయకులు కావాలె. వార్డు మెంబర్లు మొదలు మంత్రులు, ఎంపీలు అందరూ ఏకమై పనిచేసుకోవాలె.
దేశంలో మొదటిసారి రెవెన్యూ రికార్డులలో ఐటీ ఇంటర్వెన్షన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమని గర్వంగా తెలియజేస్తున్నా. ఈ విధానం గ్యారెంటీగా సూపర్‌హిట్ అయితది. దేశమంతటా విప్లవం లేపుతది. కేంద్రం మీద, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల మీద విపరీతమైన ఒత్తిడి కూడా వస్తది. -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు