Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ధరణితో పేదరైతుకు భరోసా

-ఒకట్రెండు శాతం సమస్యలున్నాయి.. పరిష్కరిస్తాం
-ఇక్కడ ఎకరం అమ్మి ఆంధ్రలో రెండెకరాలు కొంటున్నరు
-నోటరీల భూములు కొన్నవారికి న్యాయం చేస్తాం
-ద్రవ్య వినియమ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్‌ వచ్చాక ప్రతి పేదరైతుకు తమ భూమి ఎటూ పోదనే భరోసా దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే ధరణి దేశానికే మార్గదర్శిగా మారుతుందని చెప్పారు. పోర్టల్‌లో ఇంకా ఒకట్రెండుశాతం సమస్యలున్నాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్‌ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం ఇచ్చారు. వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఎమ్మార్వో ఆఫీసుల్లో భూ లావాదేవీలుండవు
ధరణి వెనుక ప్రత్యక్షంగా ఉన్నది నేనే. పట్టుబట్టి మూడేండ్లు పోరాటం చేసి పోర్టల్‌ను తెచ్చింది నేనే. రాష్ట్ర భూభాగం విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలుంటే.. 1.53 కోట్ల ఎకరాలు ధరణిలోకి వచ్చింది. గతంలో రెవెన్యూశాఖలో ఒక దుస్సాంప్రదాయం కొనసాగింది. భూ రికార్డులు మొత్తం ఎమ్మార్వోలు, వీఆర్వోల చేతుల్లో ఉండేవి. వాళ్లు రాసిందే రాత.. గీసిందే గీత. అనుభవించడం ప్రజల ఖర్మ. అబ్దుల్లాపూర్‌మెట్‌ తాసిల్దార్‌పై ఒకవ్యక్తి పెట్రోల్‌ పోసి, తనపై కూడా పోసుకొని కాలబెట్టుకోవడం ఈ అరాచకానికి పరాకాష్ట. భూ రికార్డులపై కఠినంగా ఉండాలని ధరణి పోర్టల్‌ ప్రారంభించాం. విజయవంతంగా కొనసాగుతున్నది. సుమారు 3.50 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. 3-4% భూములకు సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మాడ్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఒకట్రెండు శాతం సమస్యలుంటే అతిత్వరలో పరిష్కరిస్తాం. పోర్టల్‌ వచ్చాక ల్యాండ్‌ రికార్డ్స్‌ ట్యాంపర్‌ చేసే అవకాశం లేదు. దీంతో నిరక్షరాస్యులైన పేద రైతులు కూడా ధైర్యంగా ఉంటున్నారు. ధరణితో తమపై ఉన్న మచ్చ తొలిగిపోయిందని 98% ఎమ్మార్వోలు సంతోషంగా ఉన్నారు. కొందరు మాత్రం అధికారం పోయిందనే దుగ్ధతో ‘ఏ సమస్య ఉన్నా సీసీఎల్‌ఏకు వెళ్లండి’ అని వెటకారంగా బోర్డులు పెడుతున్నరు. వారిని నేను అభినందిస్తున్నా. ప్రజలు కోర్టులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలన్నది మా ఉద్దేశం కాదు. ఎమ్మార్వోగా, ఆర్డీవోగా, జాయింట్‌ కలెక్టర్లుగా ఆర్డర్‌ వారే ఇస్తున్నారు. మళ్లీ వాళ్లకే కోర్టులు. ఎవరూ ఈ రెవెన్యూ కోర్టుల దగ్గర ఆగడం లేదు. 99% మంది సివిల్‌ కోర్టులకు పోతున్నరు. అందుకే రెవెన్యూ కోర్టులు తొలగించాం.

ఆర్డీఎస్‌ నుంచి 16 టీఎంసీలు తీసుకునుడే
తెలంగాణ.. నీళ్లు.. ఈ రెండింటిపై కేసీఆర్‌కు ఉన్నంత యావ ఈ ప్రపంచంలో ఇంకొకరికి ఉండదు. ప్రాణం పోయినా మన హక్కులను కాపాడుకుంటాం. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఏపీ ప్రభుత్వం పెట్టిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై అనేక స్టేలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుపై అన్నిరకాలుగా పోరాడుతాం. అవసరమైతే శాసనసభ మొత్తం ఢిల్లీకి పోయి పోరాడుదాం. కృష్ణాలో నీళ్లు లేవు.. గోదావరిలో ఎక్కువ ఉన్నాయి.. వాటిని తరలించి రెండు రాష్ర్టాలు పంచుకుంటే ఇద్దరికీ లాభం కలుగుతుందని చెప్పినం. కానీ వాళ్లు మొండిగా పాత పద్ధతిలోనే పోతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని గుర్తుంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ చుక్క నీటినీ వదులుకోం. ఆర్డీఎస్‌లో 15.9 టీఎంసీల నీళ్లను తీసుకొస్తాం.

విద్య ఆదాయాన్ని సృష్టిస్తుంది
కరోనా సెకండ్‌వేవ్‌ ఇబ్బంది పెట్టకపోతే విద్య, వైద్యరంగాలపై ప్రధానంగా దృష్టిపెడుతాం. విద్యారంగం ఆదాయాన్ని ఇవ్వదని కొందరు ఆర్థికవేత్తలు చెప్పే సూత్రాన్ని నేను నమ్మను. కచ్చితంగా విద్య ఆదాయాన్ని సృష్టిస్తుంది. ఆస్తి ఇయ్యకపోయినా మంచి విద్య ఇస్తే వారు ప్రపంచంతో పోటీపడి బతుకుతరు. నిరుద్యోగ భృతి ఇవ్వాలనే సంకల్పం ఉన్నా కరోనా వల్ల ఇవ్వలేకపోయాం. అసలు నిరుద్యోగి అంటే ఎవరు? వేరే రాష్ర్టాల్లో ఎలా ఉంది? అనే వివరాలు తెప్పించాం. వీటిని విశ్లేషిస్తుండగానే కరోనా దెబ్బకొట్టింది. సెకండ్‌ వేవ్‌ లేకుంటే త్వరలోనే భృతి కల్పిస్తాం.

వాళ్ల శాపాలు రివర్స్‌ అయినయి
తెలంగాణ వస్తే రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలుతుందని, భూముల ధరలు పడిపోతాయని కొందరు శాపాలు పెట్టిన్రు. ఇప్పుడు అవి వాళ్లకే రివర్స్‌ తలిగినయి. మన దగ్గర భూముల ధరలు పెరిగితే ఆంధ్రలో తగ్గినయి. ఇక్కడ ఎకరం అమ్మి ఆంధ్రలో రెండు మూడెకరాలు కొంటున్నరని చెప్తున్నరు. ఇది వింటుంటే గర్వంగా అనిపించింది. తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో రాష్ట్రంలోని అన్ని భూములను సర్వేచేస్తాం. వాటికి అక్షాంశ, రేఖాంశాలతో కో-ఆర్డినేట్స్‌ ఇస్తాం. ఇందుకు రూ.400 కోట్లు కేటాయించినం. ఆ తర్వాత మూడురకాల లావాదేవీలు.. క్రయవిక్రయాలు, గిఫ్ట్‌ డీడ్‌, భాగపంపకం మాత్రమే జరుగుతాయి. అంతకుమించి రికార్డులను మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా ఉండదు. వ్యవస్థకు ఉంటుంది తప్ప వ్యక్తులకు ఆ అధికారం ఉండబోదు. కాబట్టి ధరణి ఉంటే కలహాలు తగ్గుతాయి. ఇప్పటికే అనేక రాష్ర్టాలు వచ్చి అధ్యయనం చేసి, బాగుందని ప్రశంసిస్తున్నరు. ఏమైనా లోపాలుంటే ఓసారి సమీక్ష చేద్దాం. సాదాబైనామాలకు సంబంధించి 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిష్కరించే ప్రక్రియ నడుస్తున్నది. నోటరీల మీద భూములు కొన్న పేదలకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. ప్రజలకు ఒకసారి అవకాశం కల్పిస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.