Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశగతిని మారుస్తాం

-మా వెంట 160 మంది వస్తారు
-కేంద్రంలో ఏర్పడేది ఫెడరల్ ప్రభుత్వమే
-తెలంగాణ సాధించినం.. దేశాన్ని శాసిస్తాం
నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎంపీ కవిత

అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నం. ఇప్పుడు తెలంగాణ గడ్డ దేశాన్ని శాసించబోతున్నది. మాకు ఆ నమ్మకం ఉన్నది. తెలంగాణ పథకాలు ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలకు మోడల్.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఇప్పుడు రోల్‌మోడల్. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పథకాలను కాపీ కొట్టింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేంలేదు. దేశగతిని మార్చాలంటే సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిందే.

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలకభూమిక నిర్వహించబోతున్నదని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ గతిని మార్చే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని అన్నారు. గత ఐదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని యావత్ దేశం గమనించిందని.. తెలంగాణ మోడల్ ఇప్పుడు అన్ని రాష్ర్టాలకు, కేంద్రానికి కూడా అనుసరణీయంగా మారిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాదని స్పష్టంచేశారు. నిజమైన ప్రజాప్రభుత్వం ఆవిష్కారం కావాలంటే ప్రతినిధులు ప్రజల్లో ఉండాలని, ప్రజలు మళ్లీ అవకాశం కల్పిస్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్తున్న కల్వకుంట్ల కవితతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.

గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేశారా?
గత పార్లమెంట్ ఎన్నికల్లో.. చరిత్రలో ఎవరూచేయని విధంగా మ్యానిఫెస్టోను ప్రకటించాను. అందులో నాలుగు అంశాలు చెప్పాను. ఇప్పటివరకు మూడు అంశాలు పూర్తిచేశాను. ఇంకొక దానిమీద జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించగలిగాను. మొదటిది నిజామాబాద్ -పెద్దపల్లి రైల్వే లైన్. ఇరవై ఏండ్లుగా నత్తనడకన నడుస్తున్న దాన్ని మూడేండ్లలో పూర్తిచేశాను. నిజామాబాద్‌కు నడిచే రైలును చూసిన ప్రతిసారి దానికోసం పడ్డ కష్టం గుర్తుకొస్తుంది. రెండోది నిజామాబాద్‌లో ఆయకట్టుని ద్విగుణీకృతం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు కావొచ్చు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం కావొచ్చు.. రైతులకు ఎంతో మేలు చేసేవి. సింగూరు జలాలను తరలించి చేసిన మోసాన్ని అడ్డుకొని ఆ నష్టాన్ని తిరిగి భర్తీ చేసుకున్నాం. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని హామీ ఇచ్చాను. మిషన్ భగీరథ ద్వారా దాన్ని సాధించుకున్నాం. మొదటిసారి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకున్నా. నిరంతరం ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేశాను. లోక్‌సభలో తెలంగాణ హక్కుల కోసం పోరాడాను. రెండోసారి కూడా ప్రజలు దీవించి, పార్లమెంట్‌కు పంపుతారనే ఆశిస్తున్నా.

పసుపుబోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
గత ఎన్నికల సందర్భంగా నేను ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట రైతులు.. తమ కష్టాల గురించి రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. తమకు మంచి రోజులు రావాలని ఆందోళనలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వాళ్ల ప్రయత్నానికి అండగా, పార్లమెంట్ సభ్యురాలిగా నేను పోరాటం చేస్తున్నాను. పసుపుబోర్డు సాధనలో తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. పార్లమెంట్‌లో ఎన్నోసార్లు పసుపు రైతుల బాధలు వినిపించాను. ప్రధాని దృష్టికి సైతం తీసుకువెళ్లా. దురదృష్టవశాత్తు బీజేపీ నుంచి స్పందన కరువైంది. మా బాధ పడలేక స్పెషల్ టర్మరిక్ సెల్ తెలంగాణలో పెడుతామని వాణిజ్యశాఖ మంత్రి చెప్పారు కానీ.. అదికూడా వాస్తవరూపం దాల్చలేదు. మరొకసారి నాకు అవకాశం ఇస్తే బోర్డు సాధనకు మరింత శ్రమిస్తాను. జాతీయ స్థాయిలో ైస్పెసెస్‌బోర్డు ఆఫీస్‌ను నిజామాబాద్‌లో పెట్టించగలిగాం. పంటల ఫుడ్ ప్రాసెసింగ్‌కి వేరే జిల్లాలకంటే ఇక్కడే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. నాణ్యమైన పంటల ఉత్పత్తి ఇక్కడ ఎక్కువ. ఫుడ్ ప్రాసెసింగ్‌తో మహిళలకు ఆదాయం, రైతాంగానికి మద్దతు ధర వచ్చేలా ప్రయత్నిస్తున్నా.

రైతుల కోసం ఏం చేశారు?
నిజామాబాద్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం తప్ప గత ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఎర్రజొన్న రైతుల 11 కోట్ల బకాయిలు విడుదల చేసింది సీఎం కేసీఆరే. ఎర్రజొన్న రైతాంగానికి సంబంధించి పంటనష్టం జరుగుతుందంటే ప్రభుత్వం నష్టపోతుందని తెలిసి, 150 కోట్ల రూపాయలతో చివరిగింజ దాకా కొనుగోలు చేశాం. ఈసారికూడా ఎర్రజొన్న పంటలకు ఇప్పటికే బోనస్ ప్రకటించారు. రైతులు వారి సమస్యలను మాకు చెప్పుకోవాలని చూస్తే, మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు వచ్చారు. అసలైన రైతులను పక్కకు నెట్టి నకిలీ రైతులతో ఆందోళనలు చేయిస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పేరు చెప్పి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీగా మీ ప్రత్యేకత?
మొదటిసారి ఎంపీ అయ్యాను. 15 లక్షల మంది ప్రజలు. పెద్ద బాధ్యత నాకది. వారి ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతో కష్టపడ్డా. నాకున్న జనాదరణ, పార్లమెంట్‌లో విధినిర్వహణకు గాను బెస్ట్ పార్లమెంటేరియన్‌గా అవార్డు వచ్చింది. ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలతో టచ్‌లో ఉండటం పెద్ద విషయం. ఎందుకంటే లక్షల మంది ఉంటారు. రాత్రిపగలు పని చేసినా అందరినీ రీచ్ అవ్వలేము. అయినా నేను మన ఊరు-మన ఎంపీ కార్యక్రమం ద్వారా వీలైనన్ని గ్రామాలు తిరిగాను. ప్రజలతో మమేకమయ్యాను. బీడీ కార్మికులు, రైతుల సమస్యలు, పింఛన్ల సమస్యలను పరిష్కరించాను. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో దాదాపు 15,000 కోట్ల పైచిలుకు పనులు జరిగాయి. మేం చేసింది ప్రజలకు కనిపిస్తున్నది. ఇదివరకు ఊర్లలో పది మందికి పెన్షన్ వస్తే.. ఇప్పుడు వంద మందికి వస్తున్నది. ఒక సీసీ రోడ్డు వేసేందుకు పదేండ్లు పడితే, ఇప్పుడు రోజుల్లో అయిపోతున్నది. 84 కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేశాం. సింగూరును ఎప్పుడైతే నిజాంసాగర్‌కు అటాచ్ చేసినమో నిజామాబాద్ జిల్లాలో డైరెక్ట్‌గా రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందాయి. ఈ మార్పులన్నింటినీ ప్రజలు గుర్తించారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తాయని నమ్ముతున్నా. ఈసారి కూడా వార్ వన్‌సైడే.

ఐదేండ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారా…?
గడిచిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో ప్రస్తావించిన అంశాలు గతంలో ఎన్నడూ ఎవరూ ప్రస్తావించలేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని అంశాల మీద పార్లమెంట్‌లో మా వాణి వినిపించాం. ఒక టీం వర్క్‌లాగా, ఎవరి నియోజకవర్గ సమస్య అయినప్పటికీ అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్నాం. హైకోర్టు సాధనలో ఎంపీలందరం కలిసి పోరాటం చేశాం. హైకోర్టు సాధనలో తెలంగాణ ఎంపీల పాత్ర కీలకం. ఎయిమ్స్ సాధనలోనూ కేసీఆర్ నాయకత్వంలో ఎంపీలమంతా ఒక్కమాటపై నిలిచి పోరాడాం. రక్షణశాఖ భూముల వ్యవహారంలోనూ అంతే.

రైతుల నామినేషన్ల గురించి ఏమంటారు?
రాజకీయ ప్రయోజనం కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు. నిజామాబాద్ పార్లమెంట్‌స్థానంలో నామినేషన్లు వేస్తే జాతీయస్థాయిలో ఒకరోజు చర్చ జరుగుతుంది. కానీ, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మీద నామినేషన్లు వేస్తే నిరంతరం చర్చ జరుగుతుంది. మేము అదే కోరుకుంటున్నాం. రైతుల సమస్యల గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అందుకే మేం కూడా నిజామాబాద్ రైతులను తీసుకువెళ్లి మోదీ, రాహుల్‌గాంధీ మీద నామినేషన్లు వేయిస్తాం. అప్పుడు జాతీయ స్థాయిలో అందరి రైతుల సమస్యల గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. మేం కోరుకుంటున్నది అదే.

మోదీ పాలన ఎలా ఉంది?
అభివృద్ధి అసలే లేదు. ప్రధాని మోదీ ఎప్పుడూ ైఫ్లెట్‌మోడ్‌లోనే ఉంటారు. అన్ని దేశాలు తిరుగుతారు. కానీ దేశం గురించి పట్టించుకోరు. కానీ, రాష్ర్టాల్లోని అనేక అంశాల్లో తలదూర్చడం, మతపరమైన అంశాలను రేకెత్తించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తారు. పేదలకు ఇది చేశామని చెప్పుకునే స్థితిలో బీజేపీ లేదు. అబద్ధాలు చెప్పడంలో మాత్రం వాళ్లు నంబర్‌వన్. కేంద్రం తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రతి అంశాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్‌లో రూ.800 కేంద్రం ఇస్తున్నదని, అబద్ధ్దాలు చెప్పారు. వాస్తవానికి జరుగుతున్నది ఉల్టా. గుజరాత్‌లో విడో పెన్షన్ రూ.750 మాత్రమే ఇస్తున్నారు. మరి కేంద్రమే 800 ఇస్తున్నపుడు అక్కడ 750 ఎందుకు ఇస్తరు. అబద్ధ్దాలతో బతికే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. ఫేస్‌బుక్‌లో, వాట్సప్‌లో లేనిదాన్ని చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు.

మీది జాతీయ పార్టీలకు బీ టీం అని అంటున్నారు?v ఆ రెండు జాతీయపార్టీలను ఎదిరించేందుకు ఎవరు ప్రయత్నించినా ముందుగా వేసే ముద్ర బీ టీం అనే. ఢిల్లీవైపు ప్రాంతీయ పార్టీలు చూసిన ప్రతిసారి ఎదుగనీయకుండా చేస్తారు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన వారిగానే చిత్రీకరిస్తారు. రెండు పార్టీలూ ఇలానే మాట్లాడుతాయి. ఢిల్లీ ఈ రెండు పార్టీల నుంచి చేజారొద్దనే వాళ్ల బాధ. సీఎం కేసీఆర్‌కు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం కొత్తకాదు. సవాళ్లను అధిగమించి లక్ష్యాన్ని చేరుకొని దేశ తలరాతను మార్చుతాం.

విభజన సమస్యలపై బీజేపీ స్పందించిన తీరు ఎలా ఉంది?
విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్రం సరిగ్గా స్పందించలేదు. మనకు రావాల్సిన ఐఏఎస్ అధికారులను ఇవ్వడంలో జాప్యం చేసింది. ఉద్యోగుల విభజనలోనూ ఇదే పరిస్థితి.. విభజన సహా అన్నీ ఆర్టికల్ 3 ద్వారా జరగాలి, కానీ క్యాబినెట్ నిర్ణయం ద్వారా చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఉంటే, ఐదేండ్ల తర్వాత, అది కూడా సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే జరిగింది. ఏ ఒక్క అంశంలో కూడా కేంద్రం ముందుకు వచ్చి సహకరించలేదు.

సమాఖ్య స్ఫూర్తితో పరిపాలన లేదని ఎలా అంటారు?
కాంగ్రెస్ పరిపాలన ఎలా సాగిందో, బీజేపీ పాలన కూడా అంతకంటే దారుణంగా ఉన్నది. మూడుసార్లు సీఎంగా చేసానని, రాష్ట్రాలతో ఎలా ఉండాలో నాకు తెలుసని మోదీ మొదట్లో చెప్పారు. సమాఖ్యస్ఫూర్తితో ప్రభుత్వం నడుపుతానన్నారు. కానీ మొట్టమొదటి క్యాబినెట్ నిర్ణయంలోనే మన రాష్ట్ర ప్రయోజనాలను హరించారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఖమ్మం జిల్లా నుంచి తీసి ఏపీలో కలిపారు. ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు ఎన్నో జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు ఏనాడూ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చలేదు. నీతిఆయోగ్ రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పింది. దాని మీద ఒక్క రివ్యూ పెట్టలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫెడరల్ స్ఫూర్తి రావాలంటే ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అందులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలి.

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఏమంటారు?
ప్రజలు ఆశీర్వదిస్తే లోక్‌సభలోని మహిళా ఎంపీల బృందానికి నాయకత్వం వహిస్తాను. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉమెన్ వాళ్లు ఒక ఎంపీల బృందాన్ని లీడ్ చేయమన్నారు. దేశ చరిత్రలో తొలిసారి ఇలా ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం, దానికి నన్ను నాయకత్వం వహించమనడం గొప్ప విషయం. అన్ని రంగాల్లో మహిళలకు సరైన ప్రాధాన్యం ఉండేలా చేస్తాం. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ గ్రూప్‌లో సభ్యురాలిగా స్పీకర్ మేడం ఇప్పటికే నన్ను నామినేట్ చేశారు. పార్లమెంట్ కమిటీ వ్యవస్థలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో నా పాత్ర ఉండటం గర్వంగా ఉన్నది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగాలి. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే తప్ప మార్పు రాదు. ఐదేండ్లలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం.

ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం ఏమిటి?
గతంలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పడినప్పటికీ దానికి ప్రజల ఎజెండా లేదు. రాజకీయ అవసరాలకోసం ఏర్పడిన ఫ్రంట్ అది. ప్రజల అజెండాతో సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారు. తెలంగాణలోని మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశం అంతా ఎందుకు ఇవ్వొద్దనే ఎజెండాతో పోతున్నాం. ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రాంతీయ పార్టీల నేతలకు ఈ విషయాలను వివరించాం. వాళ్లు కూడా ముందుకు వచ్చేందుకు ప్రధాన కారణం కేసీఆర్ చెప్పిన ప్రజా ఎజెండానే. దేశమంతటా తెలంగాణ మోడల్ ఆచరణీయం కావాలి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు అనే చర్చ లేదు. ప్రజల ఎజెండాను జాతీయ స్థాయిలో ఎట్లా నడిపించాలనేదే ముఖ్యమైన చర్చ.

ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది?
నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. అక్కడి పరిస్థితులు అలాగే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ప్రశ్నార్థకమే. రాజకీయ పార్టీలు అబద్ధాలతో ఎంతోకాలం ఉండలేవు. అది స్పెషల్ స్టేటస్ కావొచ్చు, రైల్వేజోన్ల మీద కావొచ్చు. నిరంతరం ప్రజలకు తప్పు చెప్పే ప్రయత్నంచేశారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ వాస్తవాలు చెప్పలేదు. ప్రజలకు నిజాలు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది. ప్రజలను మభ్యపెట్టి ఇక్క డి పథకాలను కాపీ కొట్టి వేరే పేరు పెట్టి అమలు చేసినంత మాత్రాన లాభాలు ఉండవు. ఎన్ని చెప్పినా ప్రజలు ఏదోఒకటైంలో అన్నీ గమనిస్తరు. గమనించినపుడు కోలుకోలేనివిధంగా బుద్ధి చెబుతారు.

కేవలం 16 మంది సభ్యులతో ఏం చేయగలరు?

మేము 16 మందిమి మాత్రమే కాదు.. సీఎం కేసీఆర్‌గారు ఇప్పటికే చాలామందిని కలిసి ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఎక్కువమంది ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే కొంత మంది మాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఎన్నికల తర్వాత వస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం అస్సలు లేదు. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర. మేం కేవలం 16 మంది మాత్రమే లేము. మొత్తంగా 100 నుంచి 160 మంది దాకా ఉన్నాం. అధికారంలో ఎవరు ఉంటారనేది కాదు.. ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర ఉంటుంది.. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాత్మక స్థాయిలో ఉంటుంది.

లోక్‌సభలో మీకు నచ్చిన మీ ప్రసంగం ఏమిటి?
2014లో పార్లమెంట్ తొలి సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. ఆరోజు రాష్ట్రపతి ప్రసంగం విని చాలా బాధపడ్డాను. ఇదేంపద్ధతి. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే కనీసం శుభాకాంక్షలు చెప్పరా.. అనుకున్నా.. అదే అంశాన్ని నా ప్రసంగంలో ప్రస్తావించాను. ఉద్యమ స్ఫూర్తితోనే అనేక అంశాలను లోక్‌సభలో ప్రస్తావించాను. మా ఫోకస్ ఎక్కువ మా ప్రజల బాధల మీద ఉండేవి. ఏడు మండలాలను తీసుకున్నపుడు మొదటిసారి ఆందోళనచేయడం నాకు గుర్తుంది. ఆవేదనతో, కోపంతో మాట్లాడిన ప్రసంగం అది. చాలామంది నన్ను ప్రశంసించారు. కశ్మీర్‌పండిట్ల అంశంపై చేసిన ప్రసంగానికి మంచిపేరు వచ్చింది. నాకు సంతోషం ఇచ్చింది మాత్రం మొట్టమొదటిసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రసంగం.

కేంద్రమంత్రి కావాలనుకుంటున్నారా?
నాకు ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేవు. కానీ దేశ ప్రగతికోసం ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నది.

జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతిస్తాయని భావిస్తున్నారా?
ప్రాంతీయ పార్టీలు జాతీయపార్టీలకు మద్దతు తెలపడం కాదు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు తెలపాలి. ఇకపై అదే జరుగుతుంది.

సోషల్ మీడియాలో ప్రచారాలపై మీ అభిప్రాయమేమిటి?
ప్రజలందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. కొందరు సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. మేం పింఛన్ ఇస్తుంటే, అం దులో 800 మాదే అంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఇలాంటి అభూత కల్పనల పట్ల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని కోరుతున్నా.

ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొనబోతున్నారు?
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంత చేశానో, ఏం చేశానో లోక్‌సభలో పలు సమస్యల గురించి ఎలా పోరాటం చేశానో.. ప్రజలందరికీ తెలుసు. ప్రత్యర్థులు ఎన్ని చెప్పి నా, ఎవరున్నా.. ప్రజలను కలువడం ఓట్లు అడుగటం మా పని. ప్రత్యర్థుల పని ప్రజలే చూసుకుంటారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.