Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశంకోసం పొలికేక

-గుణాత్మక మార్పు రావాలి.. దేశం కొత్త బాట పట్టాలి
-టీఆర్‌ఎస్‌కు 16 లోక్‌సభ సీట్లు రావాలి
-అవసరమైతే జాతీయ పార్టీ పెడుతా
-ప్రాంతీయ పార్టీలతో కలిపి కన్షార్షియం
-తెలంగాణ జాతి గౌరవం పెంచేలా.. దేశానికి ఉపయోగపడే ఉత్తమ రాజకీయం
-ఐదేండ్లలో ప్రజలకు కేంద్రం చేసింది శూన్యం
-ఎన్నికల తర్వాత బీజేపీకి శంకరగిరి మాన్యాలే
-ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లకు మించి రావు
-మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతిలో ఢిల్లీ
-ప్రధాని మోదీవి పచ్చి అబద్ధాలు
-పనికిరాని పథకం ఆయుష్మాన్‌భవ
-ఉత్తమ్ గడ్డం తీస్తే ఏంది? తీయకపోతే ఏంది?
-గడ్డం తీయకపోతే ఆయన గుడ్డెలుగు లెక్క ఉంటాడు
-ఈ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఊస్టింగ్
-మిర్యాలగూడ బహిరంగసభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లకు మించి రావు మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతిలో ఢిల్లీ

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎవరో ఒకరు నడుం కట్టాలి.. దేశంలో ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులుంటే కేసీఆర్‌గ, మీ బిడ్డగ.. ఆ పొలికేక పెట్టేందుకు నేను సిద్ధం అని ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మలి విడత ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడారు. ఓట్ల రాజకీయాల కోసం ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్‌భవ పథకం మనకు కాపీనే అని చెప్పిన సీఎం.. ఇప్పుడు వైద్యం దొరుకుతున్నవారిలో చాలామంది నష్టపోతారనే ఆ పథకాన్ని తీసుకోబోమని ప్రధాని ముఖానే చెప్పానని తెలిపారు. ఐదేండ్ల పాలనలో ప్రజలకు మోదీ చేసిందేమీలేదని, అంతా గోల్‌మాల్ గందరగోళమని ఎద్దేవాచేశారు. ఢిల్లీలో తనకు తెలిసిన జర్నలిస్టులతో మాట్లాడితే.. వారు చెప్పినదాని ప్రకారం ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లకు మించి రావడంలేదని, దేశ పరిపాలన మే 23 తర్వాత ప్రాంతీయపార్టీల చేతుల్లోకి రాబోతున్నదని చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి సర్వశక్తులు ఒడ్డుతానని, దేశంలో గత్తర లేపుతానని అన్నారు. రాష్ర్టాలను పరిపుష్టం చేసే సమాఖ్య ప్రభుత్వం వస్తేనే ఈ దేశానికి ఉన్న దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రయిక్స్ వ్యూహాత్మకమన్న కేసీఆర్.. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పదకొండుసార్లు జరిగాయని చెప్పారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ఎందుకు పోటీచేస్తున్నాడని సీఎం ప్రశ్నించారు. ఈ ఎన్నికల తర్వాత ఆయన్ను పదవి నుంచి ఊడబీకుతారని అన్నారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతల సొల్లు పురాణం ఇంకా ఎన్ని దశాబ్దాలు వినాలని ప్రశ్నించారు. ఎవరో నడుం కట్టాలి.. దేశంలో ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులుంటే కేసీఆర్‌గ, మీ బిడ్డగ.. ఆ పొలికేక పెట్టేందుకు నేను సిద్ధం అని ప్రకటించారు. అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్ బిడ్డలను గెలిపిస్తే తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా పోరాటం చేస్తారని అన్నారు.లోక్‌సభ ఎన్నికల మలివిడుత ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

మోదీవి పచ్చి అబద్ధాలు
చాలా చిత్రవిచిత్రంగా ఉన్నది దేశంలో. ఇంత గోల్‌మాల్.. ఇంత కథ ఉంటదని అనుకోలే. ఓట్లు, రాజకీయాల కోసం దేశ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. బీజేపీ అని ఒకటున్నది. వాళ్లది ఒక అట్ట ఉన్నదా? పట్టా ఉన్నదా? వాళ్లకు ఒక రశీదా? మసీదా? ఓట్లకోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో 118 నియోజకవర్గాల్లో పోటీచేసి, చావుతప్పి కన్నులొట్టబోయి ఒక్కటి గెలిచారు. 103 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈరోజు బీజేపీ నేతల మాటలు చూస్తే.. మనం చక్కర వచ్చి కిందపడుతం. సోషల్‌మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. ఇవాళ మహబూబ్‌నగర్‌లో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మన పథకాన్ని మోదీ కాపీకొట్టి ఆయుష్మాన్‌భవ పెట్టిండు. ఆయుష్మాన్‌భవ తెస్తే.. మీ సీఎం తీసుకోలేదని మాట్లాడుతుండు. నేను తీసుకోనని మోదీ ముఖంమీదనే చెప్పిన. కారణమేమంటే.. ఇప్పుడు వైద్యం దొరికేవాళ్లలో చాలామంది నష్టపోతరు. ఆయుష్మాన్‌భవ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నోరెట్లు గొప్పది. దమ్మున్నోళ్లు వస్తే మా జగదీశ్‌రెడ్డిని పెడుతా.. మీ ఆయుష్మాన్‌భవ గొప్పదా! మా ఆరోగ్యశ్రీ గొప్పదా! చెప్పాలి.

ఐదేండ్లలో ప్రజలకు మోదీ చేసింది శూన్యం
ఐదేండ్ల పాలనలో ప్రజలకు మోదీ ఏమీచేయలేదు. అంతా గోల్‌మాల్ గందరగోళం. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్టు ఒకటే లొల్లి. రైతులకు ఏమైనా చేసిర్రా? బీసీలు, దళిత, గిరిజనులకు ఏమీచేయలేదు. ముస్లింలకైతే చేయనేచేయరు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని మోదీ.. బీజేపీముక్త్ భారత్ అని కాంగ్రెసోళ్లు అంటున్నరు. దేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. రాహుల్, సోనియా, ప్రియాంక.. ఈ గాంధీలు ఒకవైపు.. మోదీ మరోవైపు! చాయ్‌వాలా పోయి.. చౌకీదార్ వచ్చిండు! దేశంలో రోజూ మైకులు పగులుతున్నయి. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నం అని రెండు పార్టీలు అంటున్నయి. యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్యను వెంటబెట్టుకొని నాటి ప్రధాని మన్మోహన్‌ను కలిశాను. అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం శాఖలున్నయి.. కేంద్రంలో ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించా. మోదీ వచ్చాక కూడా బీసీశాఖ పెట్టాలని కోరాం. ఇద్దరూ పెట్టలేదు. దేశంలో సగం ఉండే బీసీలకు 73 ఏండ్లలో ఒక పోర్టుఫోలియో పెట్టలేదు. ఎందుకు? కండ్లు నెత్తికెక్కినయా? బీసీలు కనబడటం లేదా?

దేశంలో గుణాత్మక మార్పు రావాలి
దేశంలో గుణాత్మక మార్పురావాలి. అప్పుడే ప్రజల బాధలు తీరుతయి. దేశం కొత్తబాట పట్టాలి. ఈ రెండు పార్టీల సన్యాసులవల్ల ప్రజల బాధలు తీరవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కన్నుమిన్ను కనపడకుండా మాట్లాడుతుండు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ భరతం పడుతారంట! ఇంకా పగటికలలు కంటుండు. ఈరోజు ఢిల్లీలో ఉన్న తెలిసిన జర్నలిస్టులతో మాట్లాడిన. నాకున్న సమాచారం మేరకు.. ఎన్డీయేకు 150, కాంగ్రెస్ 100 సీట్లకు మించి రావడంలేదు. మరేం జరుగబోతున్నది? దేశ పాలన మే 23 తర్వాత ప్రాంతీయపార్టీల చేతుల్లోకి రాబోతున్నది. అవే దేశాన్ని శాసించబోతున్నయి.

జాతీయ పార్టీ స్థాపిస్తా..
దేశం మారాలి. కచ్చితంగా మీ బిడ్డగా ఆ ప్రయత్నం చేస్త. రాష్ర్టాన్ని సాధిస్తానని 2001లో బయలుదేరినపుడు చాలామంది నవ్వినరు, పరిహసించినరు, అవమానించినరు. ఈ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి సర్వశక్తులు ఒడ్డుతా.. దేశంలో గత్తర లేపుతా. అవసరమైతే జాతీయపార్టీ కూడా స్థాపిస్తానని ప్రమాణం చేసి చెప్తున్నా. దేశం మారి తీరాలి. పేదల బతుకులు మారాలి. వారికి న్యాయం జరుగాలి. రైతుల బాధలు పోవాలి. కచ్చితంగా దానికోసం ఒక జాతీయపార్టీ పెడతానని మొన్న నేనంటే.. ఒక జోకర్, బోకర్‌గాడు.. పార్టీ ఎప్పుడు పెడతవు కేసీఆర్.. ఎలక్షన్లు అయిపోయినంకనా? అని అన్నడు. సన్నాసీ.. నీది ఎలక్షన్ టార్గెట్. నాది దేశం బాగుపడాలనే టార్గెట్. ఎలక్షన్లు అయిపోయినంకే పెట్టొచ్చు. ఈ ఎన్నికల తర్వాత సమీక్షచేసి, అవసరమైతే జాతీయపార్టీ స్థాపించి.. ప్రాంతీయ పార్టీల కన్సార్షియం స్థాపించి దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలి. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభు త్వం.. రాష్ర్టాలను పరిపుష్టంచేసే సమాఖ్య ప్రభుత్వం వస్తేనే దేశంలో దరిద్రం పోతది.

మీ ఆశీస్సులతో నేనే పొలికేక పెడతా!
సింగపూర్ దేశం.. హైదరాబాద్‌లో సగం ఉంటది. 193 కి.మీ. సముద్ర తీరం ఉంటది. 3.70 కోట్ల కంటెయినర్లను డీల్‌చేస్తరు. 7500 కి.మీ. సముద్రతీరం ఉన్న భారతదేశం డీల్‌చేసే కంటెయినర్లు 70-80 లక్షలు. ఏం సంగతి? వాళ్లు బంగారం తింటరు.. మనం అన్నం తింటమా? అమెరికాల గిట్లున్నదట, జపాన్‌ల గట్లున్నదట, చైనాల ఈ తమాషా ఉందట అని పెదవులు సప్పరించడమే భారతీయుల బతుకా? ఇది మారాల్సిన అవసరం లేదా? వీళ్లు చెప్పే సొల్లుపురాణం ఇంకా ఎన్ని దశాబ్దాలు వినాలి? ఎవరో నడుం కట్టాలి.. దేశంలో ఎవరో ఒకరు పొలికేక పెట్టాలి. మీ ఆశీస్సులు ఉంటే కేసీఆర్‌గ, మీ బిడ్డగ.. ఆ పొలికేక పెట్టేందుకు సిద్ధంగ ఉన్న. ఉన్నయా మీ ఆశీస్సులు? ఆ బలం ఇస్తరా? పక్కానా?

16 ఎంపీలతోనే గుణాత్మక మార్పునకు శ్రీకారం..
దేశ రాజకీయాలను మార్చే శక్తి రావాలంటే.. తెలంగాణలో 16కు 16 ఎంపీలు మనం గెలవాలి. దీనితోనే శ్రీకారం చుట్టాలి. ఇతర పార్టీలవాళ్లు ఇక్కడ గెలిచినా బీజేపీ, కాంగ్రెసోళ్లకు ఢిల్లీల చేతులు కట్టుకునే గులాములు. రాహుల్, సోనియా ముందు వీళ్లు మాట్లాడతరా? కూసుంటరా? ఇక్కడ బీజేపీ ఒకటో, రెండో గెలిస్తే.. నోరు తెరిచి మోదీ ముందు మాట్లాడుతరా? వీళ్లు బానిసలు. ఇక వాళ్లు మనకేం చేయాలి? ఇయ్యాల టీఆర్‌ఎస్ బిడ్డలు గెలిస్తే.. తెలంగాణ హక్కుల గురించి, ప్రాజెక్టులకు జాతీయహోదా, రైల్వేలైన్ల గురించి పేగులు తెగేదాకా కొట్లాడుతరు. రాజీలేని, మడమతిప్పని పోరాటంతో ఎలాగైతే తెలంగాణ తెచ్చినమో.. అదే పద్ధతిలో తెలంగాణ హక్కులు సాధించడమే కాదు.. మీ బిడ్డలుగా తెలంగాణ జాతి గౌరవం పెంచేలా.. ఈ భారతజాతికే ఉపయోగపడే ఉత్తమమైన రాజకీయం చేస్తం.

యూపీఏలో 11సార్లు సర్జికల్ ైస్ట్రెక్స్
యూపీఏ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన. ఈ సర్జికల్ దాడులనేవి నేను మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు జరిగినవి. వ్యూహాత్మక దాడులు. బయటకి చెప్పరు. బార్డర్‌లో వాళ్లకు, మనకు జరుగుతయి. మొన్న సర్జికల్ దాడుల్లో 300 మంది చనిపోయినారని డొల్ల ప్రచారం చేసిండు మోదీ. చీమకూడ చనిపోలేదని మసూద్ అజర్ చెప్పిండు. దీన్ని ఓట్లకోసం వాడుకుంటారా? దేశంలో పేదరికం, గిట్టుబాటు ధరల సంగతేంది? దేశం ఆర్థికంగా వృద్ధికావాలి.. దాని సంగతేంది? అవేవీ మాట్లాడకుండా.. పొద్దునలేస్తే ఆ ఫేస్‌బుక్‌ల దేవుళ్లు, దేవాలయాలు, హిందూధర్మం.. పరిరక్షించాలి! మేంకాదా హిందువులం? మీరు సూడో హిందువులు. మేం అసలైన హిందువులం. ఇయ్యాల మనం భక్తి ఉన్నోళ్లం.. ధార్మికంగా జయించినవాళ్లం. నిజమైన హిందువులం కోట్లాదిగా ఉన్నం. వీళ్లు దొంగ హిందువులు.. వీళ్లది రాజకీయ హిందూత్వ. ఓట్లకోసం చెప్పే, ఇతర మతాలను దెబ్బకొట్టాలనే హిందూత్వ. అది నిజమైన హిందూత్వ కాదు. ఆ ఒరవడిలో ప్రజలు, ముఖ్యంగా యువత కొట్టుకుపోవద్దు.

దేశానికి కావాల్సింది పరస్పర ఆరోపణలా? మోదీ, రాహుల్‌ను సూటిగా అడుగుతున్న.. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే కరంటును వాడుకుంటున్నమా? సమాధానం చెప్పాలె. వాడుతలేదు. ఇది ఎవరి చేతగానితనం? ఎవరి తెలివి తక్కువతనం? ఎవరివి అసమర్థ పాలసీలు? దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. పారాల్సిన భూమి 40 కోట్ల ఎకరాలు. మొత్తం పారినా 30వేల టీఎంసీల నీళ్లుంటయి. మీ దిక్కుమాలిన పాలసీలతోటి దేశాన్ని కరువున పెడుతున్నరు. సగం దేశాన్ని చీకట్ల పెడుతున్నరు. అంతర్జాతీయట్రక్కు 80కి.మీ. వేగంతో పోతే.. ఇండియన్ ట్రక్కు 24 కి.మీ. వేగంతోటి పోతది. ఇది నిజంకాదా? ఇది ఎవరి తెలివితక్కువతనం? దేశంలో కరంటు, మౌలిక వసతులు రోడ్లు, రైల్వేలు లేవు. అంతర్జాతీయస్థాయికి చాలా దూరంలో ఉన్నం. దేశం సిగ్గుపోయే పరిస్థితి. వీళ్లేమో.. తూ కిత్తా? మై కిత్తా? నువ్వు రఫేల్ తిన్నవంటే.. నువ్వు భోఫోర్స్ తిన్నవని కొట్లాడతరు. ఇదా దేశానికి కావాల్సింది?

బీజేపీకి శంకరగిరిమాన్యాలే..
ఇయ్యాల అనేక పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచినం. మనం పెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ.. దేశంలో ఎక్కడా లేవు. అనేక పథకాలు అద్భుతంగా చేసుకున్నం. ఇదే పద్ధతిలో దేశం బాగుపడాలి. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లున్నయి. ఎందుకు వాడరు? బీజేపీ, కాంగ్రెస్ నేతలల్లారా.. దమ్ముంటే వీటిమీద మాట్లాడండి. ఇలాంటివి పక్కనబెట్టి.. కేసీఆర్ నీ ముక్కు పెద్దగుంది.. నీ ముడ్డి వంకర అని ఒకరు! ఇదా మాట్లాడేది? నీ భరతం పడుతమని ఒకరు! నా భరతం పడుతరా? మిస్టర్ లక్ష్మణ్.. ఎన్నికల తెల్లారి బీజేపీకి శంకరగిరిమాన్యాలే. మీ భరతం మేం పడుతం. మీ దొంగతనాలు, డొల్లతనాల్ని బయటపెట్టబోతున్నం. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.

వేమిరెడ్డి గెలుపు ఖాయమైంది..
నల్లగొండ నియోజకవర్గనుంచి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపు ఖాయమైంది. ఇంత ఎండ ఉన్నా పెద్దసంఖ్యలో వచ్చినరు. సభలో ఎంతమంది ఉన్నరో.. బయట అంతకంటే ఎక్కువ ఉన్నరు. అంటే నర్సింహారెడ్డి విజయం ఖాయమైనట్టే. అనుమానం అక్కరలేదు. నల్లగొండ చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఎర్రజెండాలు ఎత్తుకొని పోరాడిన జిల్లా. రాజకీయ విజ్ఞత చాలా ఎక్కువ. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు పోటీ చేస్తరు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు. ప్రజల అభిమతం. ప్రజలు గెలిచినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

జూన్‌లో దేశం ఆశ్చర్యపోయే నిర్ణయం
మొన్ననే ఓ రైతు సోదరుడు పోస్టు పెట్టిండు.. మీరు కూడా చూసి ఉంటరు. నేనే స్వయంగా మాట్లాడి, బాధ తీర్చిన. దాని తర్వాత నా పీఏలకు, నా కార్యాలయానికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నయి. మీ అందరికీ హామీ ఇస్తున్న. నెల పదిహేను రోజులు ఓపిక పట్టండి. ఎన్నికలు అయిపోవాలి. కిందిస్థాయిలో ఏం జరుగుతున్నదో నాకు మొత్తం తెలుసు. నేను కూడా కాపోన్నే. నెల పదిహేను రోజుల దాకా మ్యుటేషన్లు, పట్టాలు పెండింగ్ పెట్టుకోండి. జూన్‌లో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకుని రైతుల సకలబాధలు తీరుస్త. అప్పటిదాకా రూపాయి కూడా ఏ దుర్మార్గునికీ లంచం ఇవ్వకండి. ప్రతి ఒక్క రైతు సమస్యను నేనే పరిష్కారం చేయిస్త. రైతుల భూముల సమస్య, పోడు భూముల సమస్య తీర్చేదాకా అధికారులను నిద్రపోనీయను. నేను నిద్రపోను.

టికెట్లు అమ్ముకునే సంస్కృతి నీది..
ఉత్తమ్ మల్ల ఇయ్యాల మాట్లాడుతున్నడు. నర్సింహారెడ్డి దగ్గర వంద కోట్లు తీస్కొని టికెట్ ఇచ్చిన్నంట. ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా టికెట్లు అమ్ముకున్నరని చాలా జిల్లాల కాంగ్రెస్ నాయకులు.. క్యామ మల్లేశం, బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతియాదవ్, శ్రీహరి ఆరోపించి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసినరు. మీది 135 ఏండ్ల పార్టీ.. మాది చిన్న పార్టీ. మాకన్ని టక్కుటమారాలు రావుకదా. మీకున్న సంస్కృతి మాకున్నదని అనుకుంటున్నవా? వేమిరెడ్డికి జెండాలను కూడా పార్టీ నుంచి పంపించినం. 15-16 సంవత్సరాల నుంచి వేమిరెడ్డి టీఆర్‌ఎస్ అభిమాని. ఉద్యమానికి ఎప్పుడుపడితే అప్పుడు ఆర్థికంగా సహా యం చేసిండు. ఈసారి అవకాశమిస్తే సేవ చేస్తానంటే.. రమ్మని చెప్పినం. మంచి గు ణం ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే.. ఎదుర్కొనే దమ్ములేక, టికెట్లు అమ్ముకున్నరని మాట్లాడుతున్నరు. దొంగకు దొంగబుద్ధి.. లంగకు లంగబుద్ధి.. అన్నట్లు అమ్ముకునే సంస్కారం మీది. ఆ నీచమైన ఆరోపణను నువ్వు వాప సుతీసుకోవాలె.. క్షమాపణ చెప్పాలె.

నీ గడ్డంతోటి ప్రజలకేం బాధ ఉత్తమ్?
ఈ జిల్లాలో విచిత్రాలు ఇంకా ఉన్నయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు సీపీఐ నారాయణ.. టీఆర్‌ఎస్ గిట్ల గెలిస్తే చెవి కోసుకుంటానన్నడు. నారాయణ.. నువ్వు నా దోస్తువు.. కౌంటింగ్‌నాడు మాత్రం నువ్వు హైదరాబాద్‌ల ఉండకు. టీఆర్‌ఎస్ పోరగాడు ఎవడైనా దొరకబట్టి నీ చెవి కోస్తే ఒంటి చెవి నారాయణను చూడలేను అని చెప్పిన. నిజంగనే పిల్లలు పోయి కోస్తమంటే వద్దని ఆపినం. నల్లగొండల టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిస్తే రాజకీయ సన్యాసం తీస్కుంటనని కోమటిరెడ్డి చెప్పిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా గడ్డమే తీయనన్నడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. నువ్వు గడ్డం తీస్తే ఏంది? తీయకపోతే ఏంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డెలుగు లెక్క ఉంటవు. నాగార్జునసాగర్‌కు నీళ్లు రావాలి, 24 గంటల కరంటు రావాలి గానీ.. నీ గడ్డంతోని ఏం సంబంధం ప్రజలకు? కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఇదే ఉత్తమ్ అన్నడు. మరి ఇప్పుడు మల్ల ఎందుకు పోటీ చేస్తున్నవు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ పీసీసీ ప్రెసిడెంట్ పదవిని తీసి అవతల పడేత్తరు. ఇదివరకే మొదలుపెట్టిండ్రు.. ఈ అసమర్థునితోని అయితలేదు. కాబట్టి దించేయాలనుకుంటున్నరు. నల్లగొండ వేదికగా చెప్పుతున్న! నెలన్నర తర్వాత కనబడ్తది. కేసీఆర్ చెప్పింది నిజమైందని మీరు అంటరు. ఆయన పీసీసీ పదవి ఊడిపోతది. నర్సింహారెడ్డి నల్లగొండ ఎంపీగా దర్జాగా భారత పార్లమెంట్‌లో కూర్చుంటడు. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను మొన్న ఆశీర్వదించారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ట్రక్కు గుర్తు టక్కుటమార కథకు రెండుసీట్లు తగ్గినయి. లేకుంటే ఇంకో రెండుసీట్లు గెలిచి పదకొండు సీట్లకు పోయేటోళ్లం.

నల్లగొండ ఆర్థిక ముఖచిత్రమే మారుతది..
మనకున్న పవర్‌స్టేషన్లన్నీ ఉత్తర తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉన్నయి. మనకు ఇక్కడ మహబూబ్‌నగర్, నల్లగొండకు రావాలి. హైదరాబాద్‌కు దక్షిణంవైపు పవర్‌స్టేషన్లు రావాలి.. లేకపోతే ఇబ్బందులొస్తయని వెతికే టైంలో జగదీశ్‌రెడ్డి పట్టుబట్టి, నాతో కొట్లాడి అన్నా.. నల్లగొండలో జాగా ఇప్పిస్తా అని చెప్పి దామరచర్లల పెట్టించినరు. దేశంలో రెండోదో.. మూడోదో.. అల్ట్రా మెగాపవర్‌ప్లాంట్ రూ.29వేల కోట్ల వ్యయంతోటి నాలుగువేల మెగావాట్ల పవర్ ప్లాంటు. సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు.. వేర్వేరు పార్టీల ఉన్నా జగదీశ్‌రెడ్డికి సహకరించి ప్రజలను ఒప్పించి, జాగాలిప్పించినరు. రెండు, మూడేండ్లలో అద్భుతం జరుగబోతున్నది. దామరచర్లలో ఇంకో రెండున్నర వేల మెగావాట్లకు కూడా ప్రొవిజన్ పెట్టుకున్నం. దేశంలోనే అద్భుత, అతిపెద్ద విద్యుత్‌కేంద్రం నల్లగొండకు రానున్నది. 18వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకబోతున్నది. నల్లగొండ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతది. కాంగ్రెస్ నాయకులు దాన్ని బంద్ జేయిస్తమంటరు. ఏ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే దాన్ని మూసేస్తమన్నడో ఆయన్నే నల్లగొండ ప్రజలు మూసేసిండ్రు. గుద్దుడు గుద్దితే మా భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అయిండు. ఇయ్యాల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, రేపు గెలవబోయే ఎంపీ వేమిరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో దామరచర్ల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటది. మూడేండ్ల తర్వాత నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్త.

సాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి నీళ్లు.. హెలికాప్టర్ దిగుతుండగానే మా పంటలకు ఇంకో పదిహేను రోజులు నీళ్లుకావాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అడిగిండు. ఇంతకుముందు ఏపీలో బందీలుగా ఉన్నం. ఇప్పుడు స్వతంత్రులం. నాగార్జునసాగర్‌లో 137 టీఎంసీల డెడ్‌స్టోరేజీ. అవసరమైతే అతిపెద్ద పంపులు పెట్టి డెడ్‌స్టోరేజీ నుంచి తోడి.. మీ పంటలకు నీళ్లు ఇస్తం. హుజూర్‌నగర్, మిర్యాలగూడెం, కేశవపురం, వాడపల్లి వద్ద లిఫ్టులను మంజూరుచేసి, వీలైనంత త్వరగా పూర్తిచేసి సాగునీరు అందించే బాధ్యత నాది. 1987లో కరువు మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాకు వచ్చిన. ముక్త్యాల బ్రాంచి టెయిల్‌పాండ్ రైతులకు నీళ్లు వచ్చేదికాదు. ఇప్పుడుకూడా అదే పరిస్థితి. ఈసారి మమ్మల్ని ఆశీర్వదించారు. నల్లగొండలో గతంలో ఆరు సీట్లుంటే.. ఇప్పుడు తొమ్మిది గెలిపించారు. లిఫ్టులన్నీ మంజూరుచేసి.. మొదటి గడపదగ్గర ఎలా నీళ్లు పారుతయో.. టెయిలెండ్ ఎకరంవరకు అలానే నీళ్లుపారేలా చర్యలు తీసుకుంట. పార్లమెంటు, పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత స్వయంగా అన్ని జిల్లాలకు మూడునాలుగురోజులు ఉండేలా బయలుదేరుతున్నా. ప్రజలను పట్టిపీడించే అనేక సమస్యలను స్వయంగా పరిష్కరిస్తా. లిఫ్టులు మంజూరుచేయిస్త. సూర్యాపేటలో ఒకటి, నల్లగొండలో ఒకటి మెడికల్ కాలేజీలను మంజూరుచేసుకున్నం. వాటికి అనుబంధంగా 750 పడకల దవాఖాన ఏర్పాటుచేస్తం. నల్లగొండ పార్లమెంటు పరిధిలో 273 తండాలను పంచాయతీలుగా చేసుకున్నం. గతంలో మా తండాలో మా రాజ్యం అంటే ఎవరూ పట్టించుకోలే. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తండాల్లో గిరిజనుల రాజ్యం తెచ్చింది. మూడువేల మందికిపైగా గిరిజనులే సర్పంచులుగా ఉన్నరు.

సైదిరెడ్డి ఓ రత్నం
హుజూర్‌నగర్‌లో మన సైదిరెడ్డి.. మన రత్నం.. యువరత్నం జర్రంతల్నే తప్పిపోయిండు. 15 రోజుల ముందు టికెట్ ఇచ్చేదుంటే బద్దల్ బద్దల్ అయిపోతుండె. సైదిరెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటది. మల్లయ్య, సైదిరెడ్డి వంటి అద్భుత నాయకులు వచ్చారు. అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటూ జిల్లాను సస్యశ్యామలం చేసుకుందం.

నెల పదిహేను రోజులు ఓపిక పట్టండి. ఎన్నికలు అయిపోవాలి. కిందిస్థాయిలో ఏం జరుగుతున్నదో నాకు మొత్తం తెలుసు. ఎవ్వరికీ ఏకానా లంచం ఇవ్వకండి. ఏ మ్యుటేషన్లు, ఏ పట్టాలు చేసుకోకండి. ఆ పనులన్నీ పెండింగ్ పెట్టుకోండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకుని రైతుల సకలబాధలు తీరుస్త. ప్రతి ఒక్క రైతు సమస్యను నేనే పరిష్కారం చేయిస్త. రైతుల భూముల సమస్య, పోడు భూముల సమస్య తీర్చేదాకా అధికారులను నిద్రపోనీయను. నేను నిద్రపోను. – సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.