Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశంలోనే అత్యుత్తమ సీఎం

-జయహో కేసీఆర్
-ప్రజల మనసు గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్
-జైకొట్టిన 79.2% ఓటర్లు
-రెండోస్థానంలో హిమాచల్ సీఎం
-జైరామ్ ఠాకూర్ తదుపరి స్థానాల్లో ఒడిశా, ఢిల్లీ సీఎంలు
-14వ స్థానంలో నిలిచిన చంద్రబాబు
-ఆఖరినుంచి మూడోస్థానంలో యూపీ సీఎం
-టాప్‌టెన్‌లో బీజేపీ పాలిత రాష్ర్టాలు రెండే
-ఐఏఎన్‌ఎస్- సీవోటర్ సర్వేలో వెల్లడి

మొదట వాళ్లు నిన్ను విస్మరిస్తారు.. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.. ఆ తర్వాత నీతో యుద్ధంచేస్తారు.. తర్వాత నువ్వు గెలుస్తావు! సత్యాగ్రహాల గాంధీ మహాత్ముడు అనుభవసారంతో చెప్పిన మాట ఇది! సరిగ్గా కేసీఆర్ విషయంలో రుజువైంది! తెలంగాణ సాధనకోసం కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు విస్మరించారు.. అవహేళన చేశారు.. కాలరాసిపారేసేందుకూ ప్రయత్నించారు! కానీ.. అచంచల ఆత్మవిశ్వాసంతో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. కలగన్న లక్ష్యం సాధించి.. ప్రజాభిమానాన్ని గెలిచి.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు! అరవై ఏండ్లుగా నాశనమైన తెలంగాణను బాగుచేసేందుకు సంకల్పించారు. ఆ క్రమంలోనే ఆర్థికప్రగతికి సాగునీటి దేవాలయాలు.. సామాజిక పురోగతికి సంక్షేమ పథకాలు! మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ.. ప్రపంచంలోనే ఎక్కడాలేని పంట పెట్టుబడిసాయం! ఒకటారెండా.. కోకొల్లలు! వాటన్నింటి ఫలాలు ప్రజలకు అందిన ఫలితం.. రెండోసారి మరింత స్పష్టమైన ఆధిక్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు! దీనంతటికీ వెనుక ఉన్న ఒకే ఒక కీలకాంశం విశేష ప్రజామద్దతు! ఉద్యమనేతగానేకాదు.. రాష్ట్ర సారథిగా కూడా ఆ మద్దతు సీఎం కేసీఆర్‌కు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. దేశంలో అత్యంత సమర్థ పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రులెవరని సీవోటర్- ఐఏఎన్‌ఎస్ సర్వే లెక్కదీసినప్పుడు.. ఏకంగా 79.2% ప్రజల మద్దతుతో జనహృదయ నేతగా.. పాలనను పరవళ్లు తొక్కిస్తున్న పాలకుడిగా నంబర్‌వన్ స్థానంలో నిలిచారు సీఎం కేసీఆర్!

దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు అత్యంత జనరంజకంగా పాలిస్తున్నారని మరోమారు వెల్లడైంది. ఆయన తర్వాతి స్థానాల్లో.. పెద్దగా పేరు బయటకురాని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్‌ఠాకూర్, రికార్డుస్థాయిలో ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకోగా.. నవ్యాంధ్ర నిర్మాతనని చెప్పుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు 14వ ర్యాంకులో నిలిచారు. దేశంలోని 29 రాష్ర్టాల ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రముఖ సర్వేసంస్థ సీవోటర్‌తో కలిసి ప్రముఖ వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్ (ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. అత్యంత పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ సీఎంలు ఉన్నారు.

కేసీఆర్‌కు 79.2% మద్దతు
తెలంగాణలో రెండోసారి తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు పట్ల ప్రజల్లో హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 20,827 మంది ఓటర్లను సర్వే చేయగా.. ఆయన పాలనపై పూర్తి సంతృప్తికరంగా ఉన్నామని 68.3% తేల్చిచెప్పారు. ఫర్వాలేదన్నవారు మరో 20.8% ఉన్నారు. మొత్తంగా కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తంచేస్తున్నవారు 79.2% ఉన్నారని సర్వే వెల్లడించింది. కేసీఆర్ పాలన బాగోలేదన్నది కేవలం 9.9% మాత్రమే కావటం గమనార్హం. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక ప్రజోపయోగ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమచర్యలు రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. అంతేకాదు.. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలను దేశంలోని వివిధ రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకుంటూ తమ తమ రాష్ర్టాల్లో అమలుచేస్తున్నాయి. అధ్యయనం

చేస్తున్నాయి. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకమే ఇందుకు ఉదాహరణ. ఈ పథకాన్ని వివిధ రాష్ర్టాలేకాదు.. తెలంగాణ సీఎంపై విమర్శలు చేసే ఏపీ సీఎంతోపాటు.. ఆఖరుకు ప్రధాని మోదీసైతం పేరు మార్చి అమలుచేస్తుండటం గమనార్హం. తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఉన్న కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పుకోసం తనవంతు కృషిచేస్తున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకావాలని అభిలషిస్తున్నారు. కేంద్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు రెక్కలు విప్పుకొని జాతీయస్థాయిలో విస్తరించాలంటే కేసీఆర్ ఆలోచనా విధానాలు అమలుచేసే ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలన్న అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించి, అవసరమైన భూమిక కూడా సిద్ధంచేశారు.

టాప్‌టెన్‌లో బీజేపీ పాలిత రాష్ర్టాలు రెండే
అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు ఇద్దరే ఉండటం గమనార్హం. అందులోనూ ఒకరు మాత్రమే టాప్-3లో చోటు సంపాదించుకోగా.. పదో స్థానంలో అసోం సీఎం శర్బానంద సోనోవాల్ నిలిచారు. ఐదోస్థానంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌బఘేల్, ఆరోస్థానంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఏడోస్థానంలో కర్ణాటక సీఎం కుమారస్వామి, తొమ్మిదోస్థానంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు.

అట్టడుగు స్థానంలో పళనిస్వామి
దేశంలోనే అట్టడుగు స్థానంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని సర్వే తెలిపింది. మొత్తం 28,270 మందిని సర్వేచేయగా, అందులో ఆయన పరిపాలనపై అత్యంత సంతృప్తి వ్యక్తంచేసినవారు 18.7% ఉండగా, ఫర్వాలేదన్నవారు 32.6% ఉన్నారు. అయితే.. 43.6% ఓటర్లు ఆయన పాలనపై పూర్తి అసంతృప్తితో ఉన్నామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే నెట్ రేటింగ్ ఆయనకు 7.7% లభించింది. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇది చేదువార్తేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గ్రాఫ్ పడిపోయిన ఆదిత్యనాథ్
ఇక యూపీ సీఎం ఆదిత్యనాథ్ విషయంలో సర్వే ఫలితాలు బీజేపీకి మింగుడుపడేవి కావు. ఉత్తరప్రదేశ్‌లో 52,712 మందిని సర్వే చేయగా.. అందులో మొత్తంగా కేవలం 22.2శాతం మంది మాత్రమే ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన పరిపాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తంచేసినవారు 39.2% ఉండగా, ఫర్వాలేదన్నవారు 21.7% ఉన్నారు. అస్సలు బాగోలేదని 38.7% ఓటర్లు తేల్చిచెప్పారని సర్వే పేర్కొన్నది. ఆదిత్యనాథ్ సీఎం అయిన మొదట్లోనే యూపీలో లోక్‌సభ సిటింగ్ స్థానాలు కోల్పోయి బీజేపీ కష్టకాలాన్ని ఎదుర్కొన్నది. దానికితోడు తాజాగా ఎస్పీ, బీఎస్పీ కూటమితో కొత్త కంగారు మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడం ఆ రాష్ట్రంలో రాబోయే ఫలితాలను చెప్పకనే చెప్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.