Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికే తెలంగాణ ఒక మోడల్

-అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తా -కరీంనగర్ శంఖారావ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన -కాంగ్రెస్, బీజేపీ దరిద్రులను తరిమికొట్టాలి -కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి -అప్పుడే దేశంలో ప్రత్యామ్నాయ సమాఖ్య -అద్భుత దేశ నిర్మాణానికి ముందడుగు వేస్తా -దేశానికి తెలంగాణ చోదకశక్తి కావాలె -రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీలే అసలు దొంగలు -ఈ దేశాన్ని డమ్మీ చేసింది ఈ ఇద్దరి బతుకులే -ఇజ్జత్ లేకుండా రాహుల్, మోదీ విమర్శలు -వీళ్లా మన ప్రధానులు? ఏమనుకుంటుంది ప్రపంచం? -ఇండియాను సాదే ఆరేడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి -తెలంగాణ తెస్తానని ఇదే కరీంనగర్ గడ్డమీద చెప్పిన -ఇయ్యాల దేశానికే తెలంగాణ ఒక మోడల్ -కాళేశ్వరంతో కరీంనగర్‌లో నాలుగు జీవధారలు -శపించిన వాళ్లకంటే వెయ్యి రెట్ల ప్రగతి సాధించినం -దేశరాజకీయాల్ని ప్రభావితం చేయడానికి చివరి రక్తపు బొట్టువరకు పోరాటం చేస్త -ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తే కేంద్రమంత్రిగా వినోద్: సీఎం కేసీఆర్

దేశం బాగుపడాలన్నా, అంతర్జాతీయస్థాయి లో తలెత్తుకొని ముందుకు పోవాలన్నా కాంగ్రెస్, బీజేపీ.. ఈ ఇద్దరు దరిద్రులను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అప్పుడే దేశంలో ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు వస్తాయని చెప్పారు. అందుకోసం కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణలో ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగమిస్తున్నామని, అద్భుతమైన రాష్ట్రంగా తయారుచేస్తున్నామని చెప్పిన కేసీఆర్.. ఈ దేశం తలరాత మారుస్తానని ప్రకటించారు. ఈ ఎన్నికల అనంతరం అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని సంచలన ప్రకటనచేశారు. కలిసొచ్చిన గడ్డ.. పోరాటాల గడ్డ అయిన కరీంనగర్ నుంచి ఈ మాట చెప్పాలనే ఇక్కడ మనవి చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. మీ బిడ్డగా కరీంనగర్ దీవెనతోని ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల్ని బలోపేతం చేసి ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి, అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ముందడుగు వేస్తాను అని చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల సమరశంఖం పూరించిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై తన అభిప్రాయాలు విస్పష్టంగా వెల్లడించారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశానికి ఏమీ చేయలేదని, అభివృద్ధిలో దేశం వెనుకబడి ఉన్నదని చెప్తూ.. ఉదాహరణలతో సహా వివరించారు. సీఎం ప్రసంగం ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

దేశం తలరాత మార్చడానికి ప్రధాన పాత్ర పోషిస్తా.. ఈ దేశం బాగుపడాలంటే, అంతర్జాతీయస్థాయిలో దీటుగా తలెత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను (కాంగ్రెస్, బీజేపీ) తరిమికొట్టాలి. అప్పుడే దేశంలో ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు వస్తయి. రాష్ట్రాల పెత్తనం నడువాలి. రాష్ట్రాల కోరికలు మన్నించాలి. కేంద్రంచేసే పనులు కేంద్రంచేయాలి. న్యాయ, శాసనవ్యవస్థలో, ప్రభుత్వాల నిర్మాణంలో సంస్కరణలు రావాలి. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీంకోర్టు ఉంటదా! సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అది లా! ఎక్కడో ఏదో రాష్ట్రంలో తీర్పు వస్తే అది దేశానికి వర్తించాల్నా? ఇది సరైందేనా? కాదు! న్యాయవ్యవస్థలో, పాలనావిధానంలో సమూ ల మార్పులురావాలి. కేంద్రం పని కేంద్రం చేయాలి, రాష్ట్రాల పని రాష్ట్రాలు చేయాలి. ఇది జరుగాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు శాసించే, రాష్ట్రాలు హక్కులు కలిగి ఉండే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి. దానికోసం మీ బిడ్డగా మనవి చేస్తున్న! తెలంగాణ కథ దగ్గర పడుతా ఉన్నది. మంచినీళ్ల గోస దగ్గరపడ్డది. సాగునీళ్ల గోస ఐదారునెలలైతే ఖతమైతది. కరంటు బాధలు రావు. ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగమిస్తున్నం. అద్భుత రాష్ట్రంగా తయారుచేస్తున్నం. మీరు ఆశీర్వదిస్తే.. ఈ దేశం తలరాత కూడా మార్చడానికి నేను ప్రధానపాత్ర పోషిస్తా. ఈ 16 ఎంపీలతోనే కాదు.. ఇంకా 100-150 మంది ఎంపీలను జమచేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తెలంగాణ దేశానికి చోదకశక్తి కావాలి. దేశానికి దిక్సూచి కావాలి. అనేక పథకాల్లో దేశానికి మార్గదర్శకంగా, దేశంలో నంబర్‌వన్‌గా ఉన్నం. ఇంకా ఎన్నో మార్పులు రావాల్సి ఉన్నయి. దానికోసం మీ ఆశీర్వాదం కావాలి. మీ బలం కావాలి.

జాతీయ పార్టీని స్థాపిస్తా.. కరీంనగర్‌లో మీ ఆజ్ఞ తీసుకొని.. ఈ ఎన్నికల తరువాత సంభవించే పరిణామాలు చూసి.. అవసరమైతే జాతీయపార్టీని స్థాపించి దేశం మొత్తం ఒకటి చేస్తానని మనవిచేస్తున్న. ఇది కలిసొచ్చిన గడ్డ.. పోరాటాల గడ్డ అని.. ఈ మాట కరీంనగర్ గడ్డనుంచే చెప్పాలని మనవిచేస్తున్న. ఆనాడు నేను పెదవి చప్పరిస్తే తెలంగాణ రాకపోవు. 200 పింఛన్ 2000 కాలే! వచ్చునా ఈ జన్మల? ఆ పేదలను ఎవరైనా ఆదుకుందురా? సమైక్య రాష్ట్రమే ఉంటే ఇద్దురా? ఈ కాళేశ్వరం కనపడుతుండేనా? మిషన్ భగీరథ, 24 గంటల కరంటు వస్తుండేనా? ఆనాడు మీ దీవెనలతో ధైర్యంచేసి, నడుం కట్టిన కాబట్టి ఇయ్యాల తెలంగాణ వచ్చింది. అన్నివర్గాల ప్రజలను కాపాడుకొని ముందుకుపోతున్నం. అదే పద్ధతిలో దేశానికి అవసరమైతున్నది కాబట్టి మీ దీవెనతోని కచ్చితంగా దేశరాజకీయాల్ని ప్రభావితంచేయడానికి నా చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేస్త. ఎక్కడనో ఒకరు ఎవరో ఒకరు తెగించాలె. ఎవరో ఒకరు పిడికిలి ఎత్తాలె. ప్రజలను నడిపించాలె. ఆ సమయం దగ్గర పడుతున్నది.

కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ కావాలి కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ కావాలి. ఈ రెండు దరిద్రపు పార్టీలు ఏం చేయలే. వీళ్ల సంగతి తెలిసిపోయింది మనకు. గోలగోల! వీన్ని వాడు.. వాడు వీన్ని! తూ కిత్తా.. మై కిత్తా! ఈ రాజకీయాలు తప్ప పేద ప్రజలను కానీ రైతులను కానీ, మంచినీళ్ల గోసగానీ, సాగునీళ్ల గోసగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. మౌలికవసతులు రాలేదు. అనేక మార్పులు తెచ్చే అవసరం ఉంది. వ్యవస్థాగత మార్పులు రావాలి. రావాలంటే కచ్చితంగా రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కావాలె. అటువంటి రాజకీయాల కోసం మీ దీవెన పొందుదామని వచ్చిన. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమంటారా? వెళ్లమనే వాళ్లంతా పిడికిలి ఎత్తాలి. (ఈ సమయంలో సభలో ఉన్నవారంతా పెద్దపెట్టున నినాదాలుచేస్తూ పిడికిళ్లు పైకి లేపారు.) దేశ రాజకీయాల్లో తెలంగాణ కచ్చితంగా పెద్ద పాత్ర పోషించాలె. ఇయ్యాల మన శక్తి.. 16ఎంపీలు కాదు. ఇద్దరు ఎంపీలతో గుద్దు గుద్ది తెలంగాణ ఎట్ల తెచ్చినమో.. మీరు 16 గెలిపిస్తే అవతల 160 మందిని జమచేసి దేశంలో అగ్గిపెట్టాలె.. గత్తర లేవాలె.. మీ బిడ్డగా ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల్ని బలోపేతం చేసి ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి, అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ముందడుగు వేస్తా.

16 కాదు.. నూటయాభై మందిమి 16 సీట్లు ఇస్తే ఏం చేస్తవు కేసీఆరూ.. అంటున్నరు! 2001ల కూడా దద్దమ్మలు గిట్లనే మాట్లాడారు. యాడ తెస్తవు తెలంగాణ అన్నరు. ఆనాడు ఉన్న సీఎంల దగ్గరపడి పైరవీలు చేసుకొని బతికారు. ఒక్కనాడు నోరు మెదపలేదు. మనం 16 లేము. అన్ని వ్యూహాలు బయటికి చెప్తామా! ఆల్రెడీ నూరు, నూటయాభై మందిని జమకట్టాను. నేను ఏ రాష్ట్రాలకు వెళ్లానో మీకు తెలుసు. వాళ్లకు ఏమేం నూరిపోయాలో నూరిపోసేసిన.

కొత్త భారతదేశం ఆవిష్కారం కావాలి.. ఈ విషయాలన్నీ నీతిఆయోగ్ సమావేశాల్లో ప్రధానమంత్రికి బల్లగుద్ది చెప్పినం. నిన్నగాక మొన్న మన రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ వస్తే జాతీయవిధానాల మీద పరిణతితో ఒక బుక్‌ను వారికిచ్చాం. ఫైనాన్స్ కమిషన్ వస్తే ఏ రాష్ట్రం గురించి ఆ రాష్ట్రం వాల్లు చెప్పుకుంటరు కానీ దేశం గురించి చెప్పరు. మొట్టమొదటిసారిగా దేశం గురించి చెప్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక సీఎం కేసీఆర్. వట్టి మాటలుకాదు. ప్రయత్నాలు ఏడాదికిందనే ప్రారంభించిన. ప్రస్థానం మొదలుపెట్టాం. దేశంలో పెనుమార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. కొత్త భారతదేశం ఆవిష్కారం కావాల్సిన అవసరం ఉన్నది.

అమిత్‌షావి అన్నీ అబద్ధాలే.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణకు వచ్చినపుడల్లా ఇన్ని డబ్బులిచ్చాం.. అన్ని డబ్బులిచ్చాం అంటూ మాట్లాడుతడు. ఆయనిచ్చిందేం లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చేవి వస్తున్నాయి. ఇండియాను సాదే రాష్ట్రాలు మొత్తంగా ఆరేడుంటే.. అందులో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రఖజానాకు సమకూరేది రూ.50వేల కోట్లు. కేంద్రం నుంచి మనకు వచ్చేవి రూ.24వేల కోట్లే. అంటే తెలంగాణ దేశానికి ఇస్తున్నదా.. దేశం తెలంగాణకు ఇస్తున్నదా? అమిత్‌షా అడ్డంపొడుగు మాట్లాడితే ఎట్ల? ఇది నిజంకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్త. నువ్వు అబద్ధం మాట్లాడినవ్.. ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలి అనంటే నోరు మూసుకొని దాటిపోయిండు. సరే.. మన అదృష్టం. కలిగిన వాళ్లు పేదవాళ్లకు పెట్టాలి కాబట్టి మంచిదే. దానికి అభ్యంతరం లేదు.

చైనా కంటే మనమేం తక్కువ?

హిమాలయాలకు అవతల చైనా, ఇవతల మనం ఉన్నం. చైనాలో మనకంటే వ్యవసాయభూమి తక్కువ. ఎడారి ఎక్కువ. ఎత్తుపల్లాలు, గుట్టలు! దరిద్రం ఉంటది. కానీ వాళ్లు ఎక్కడున్నరు? మనం ఎక్కడున్నం? మనకు గంగానది ఉన్నట్టే.. వాళ్లకు యాంగ్జి నది ఉన్నది. ఉత్తరచైనాలో నీళ్లులేకపోతే వెయ్యి టీఎంసీల నీళ్లు 1600 కిలోమీటర్లు తీసుకుపోయి ఇస్తున్నరు. కానీ మన ఖర్మ ఏంది? మనదేశంలో నాలుగోవంతు ఉంటది అమెరికా! వాళ్ల స్థాపిత విద్యుత్ శక్తి పదిలక్షల మెగావాట్లు. చైనాది 9.25 లక్షల మెగావాట్లు. మనది 3.44 లక్షల మెగావాట్లు. అనేక విషయాలున్నాయి. చెప్తే సిగ్గుపోతది. దేశం విషయాలు బయటపెట్టొద్దని బాధ్యత ఉన్న వ్యక్తులుగా అనిపిస్తది.. కానీ సమయం వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత, అవసరం ఉంటది. అంతర్జాతీయంగా లారీల స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. మనదేశంలో 36 కిలోమీటర్లు.

దేశం ఈ దద్దమ్మల చేతుల బాగుపడుతదా? చైనాలో 1975 వరకు మనకన్న తక్కువ జీడీపీ ఉన్నది. వాళ్ల దగ్గర 23 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలున్నాయి. ఇండియాలో 2వేల కిలోమీటర్లే. గూడ్స్‌రైలు వేగం 80 కిలోమీటర్లు.. ఇక్కడ 24 కిలోమీటర్లు. చైనాలో విమానాల్లో సరుకు రవాణా 21305 మిలియన్ టన్నులుంటే.. ఇండియాలో 1894 మిలియన్ టన్నులే. విమానాల్లో ప్రయాణించే చైనాలో ఏటా 49 కోట్ల మంది ఉంటే.. మనదగ్గర 11 కోట్ల మంది. తలసరి విద్యుత్ వినియోగం చైనాలో 4475 యూనిట్లు.. మన దగ్గర 1500 యూనిట్లు. సగటు మనిషి బతికే వయస్సు చైనాలో 76 ఏండ్లయితే.. మన దగ్గర 67 ఏండ్లు. అమెరికాలో అట్ల ఉంటదట.. లండన్‌లో గిట్లన్నదట.. హాంకాంగ్‌కాడ 100 అంతస్తుల బంగ్లా ఉన్నదట.. జపాన్‌లో బుల్లెట్ రైలు ఉన్నదట.. ఈ స్టోరీ వినుడే ఇండియా బతుకా? ఎన్ని రోజులు వినాలి? అమెరికావాళ్లు బంగారం తింటున్నారా? మనమేమైనా మన్ను తింటున్నామా? అక్కడ గట్ల ఎందుకు ఉండాలి? ఇక్కడ గిట్ల ఎందుకు ఉండాలి? వానికి బుర్ర ఉన్నది.. మనకు లేదు. హిందూ గాల్లు.. బొందుగాల్లు.. దిక్కుమాలిన దరిద్రపుగాల్ల చేతుల పడి దేశం విలవిలలాడుతున్నది.

కరంటు బాధలు పోయినయి.. అన్ని విషయాలు మీ కండ్ల ముందున్నయి. ఎన్నికలు కాబట్టి, సభలుపెట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నంగానీ.. మీకు తెల్వని విషయాలు ఏమీలేవు. ఐదేండ్ల కిందట తెలంగాణ ఎట్ల ఉండె.. ఇయ్యాల ఎట్లున్నది? ఐదేండ్ల కిందట కరంటు ఎట్లుండె! యాది చేస్కుంటే భయమైతది. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు.. కరంటు షాక్ కొట్టి చచ్చిపోయే, లేచిపోయే శవాలు.. హృదయవిదారకంగా ఉండేవి. ఈరోజు చాలా గర్వంగా, ఇదే నడిగడ్డ మీద ఉండి చెప్తున్న.. యావత్‌దేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. ఇది కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ చెప్పిన మాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్. గతంలో 30 ఏండ్లు గోసపడ్డం. ఏటా ఎన్ని లక్షల మోటర్లు కాలిపోయినయి? ఎన్ని వేలకోట్లు మన రైతులు మునిగిపోయినరు? ఇయ్యాల ఆ బాధలు పోయినయి.

శపించిన వాళ్లకంటే వెయ్యిరెట్ల ప్రగతి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాళేశ్వరం చివరిదశ, పాలమూరు రెండోదశ పనులకు రూ.30వేల కోట్లు మంజూరుచేసింది. చిన్న విషయం కాదు. ఎవడన్న పైసియ్యాలంటే సులువు కాదు. తెలంగాణ అట్లాంటి గౌరవాన్ని సంపాదించుకుంది. మీకు పరిపాలన చేయరాదు.. రాష్ట్రమైతే మీతోటికాదని ఎవరైతే అన్న రో.. వారికంటే వెయ్యిరెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకుపోతున్నది. ఇదంతా ఎట్ల సాధ్యమైంది? ఎన్నో విషయాల్లో దేశంలోనే నం బర్ వన్‌గా ఉన్నం. ఒకప్పుడు దారితెన్నులేని రాష్ట్రం. చేస్తే, కష్టపడితే, మనసుపెడితే, మేధ స్సు కరిగిస్తే.. అన్నీ సాధ్యమైతయి. తెలంగాణ ఇయ్యాల తలసరి విద్యుత్ వినియోగం, ఆదా య వృద్ధిరేటు, గురుకులాల ఏర్పాటు, కేసీఆర్ కిట్ల ద్వారా పేద మహిళలకు వైద్యం, వ్యవసాయానికి ఎక్కువ నిధులు కేటాయించడం, విదేశాల్లో చదువుకునే పిల్లలకు రూ.25 లక్షల స్కాలర్‌షిప్, గొర్రెల పంపిణీల్లో నంబరవన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సౌర విద్యుత్‌లో నంబర్ టు. ఇలా అద్భుతంగా ముందుకుపోతున్నం.

కరీంనగర్ లక్ష్మీ గడ్డ కరీంనగర్ లక్ష్మీ గడ్డ. ఇక్కడ ఏం సంకల్పంచేసినా నెరవేరుతుంది. తెలంగాణ కోసం నేను బయల్దేరుతుంటే.. నాకు సద్ది కట్టి పంపించారు. 15 ఏండ్లు నిద్రాహారాలు లేకుండా కొట్లాడి, కరీంనగర్‌లో ఇచ్చినమాట నిలబెట్టుకున్న. ఈరోజు ఇదే గడ్డమీద నుంచి దేశంలో సమాఖ్య ప్రభుత్వం రావాలని, దద్దమ్మలు, మొద్దన్నలు పోవాలని మొదలుపెట్టాం. దేశం బాగుపడాలంటే ఎవడో మొగోడు పుట్టాలి.. యాడనో పొలికేక రావాలి. ఎక్కడ్నో ఒకడు అడిగేటోడు పుట్టకపోతే ఈ దేశం గిట్లనే పోవాల్నా! కరంటుగతి గిట్లనే ఉండాల్నా! కరువు గిట్లనే ఉండాల్నా? నీటికోసం ఎందుకు అవస్థపడాలి? సగందేశం అంధకారంలోనే ఉన్నది. సుమారు 18 రాష్ట్రాల్లో భయంకరమైన కరువు, కరంట్ కోతలున్నాయి. ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి! ఇంత దిక్కుమాలిన పాలసీలు ఎందుకు? సంపాదన పెంచే తెలివి లేదు. ఎప్పుడో 1950నాటి మాటలు మాట్లాడుతరు.

రాహుల్, మోదీ దమ్ముంటే జవాబియ్యండి? కేసీఆర్.. 16 సీట్లు తెస్తే ఏం చేస్తవని కొందరు మాట్లాడుతున్నరు. మీరు గెలిచి ఏం చేశారు? దేశంలో ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనైనా రైతాంగానికి 24 గంటల కరంటు ఇస్తున్నరా? ఇక్కడున్న గోకరకాయ, కాకరకాయల్ని కాదు.. నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీని అడుగుతున్న. దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఎన్నో విషయాల్లో అద్భుత ప్రగతి సాధించినం. రైతుబీమా పథకాన్ని ఈ దేశంలో ఎవరూ ఆలోచించలేదు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే దరఖాస్తుకు పోయేదిలేదు.. దఫ్తరు ఇచ్చేదిలేదు.. లంచానికి పోయేది లేదు. పదిరోజుల్లో ఠంచన్‌గా వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల జమ అయితయి. దేశంలో ఎవరూ రైతులను పట్టించుకోలేదు. ఇయ్యాల రైతుబంధు పథకాన్ని కేంద్రంతో సహా అన్ని రాష్ర్టాలు నకలు కొడుతున్నయి. మిషన్ భగీరథను 12 రాష్ర్టాల వాళ్లు వచ్చి చూసిపోతున్నరు. కడుపు కట్టుకొని, అవినీతి బంద్ పెట్టి పనిచేసినందునే ఇవన్నీ ఇక్కడ సాధ్యమైనయి.

రాహుల్, మోదీలే అసలు దొంగలు.. ఈ దేశాన్ని ఇంకెవరో పరిపాలించినట్టు గొంతుచించుకొని ఎందుకు మాట్లాడుతరు? నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ స్పీచులకు మైకులు పగిలిపోతున్నయి. వీరిద్దరే అసలు దొంగలు. ఈ దేశాన్ని డమ్మీ చేసింది ఈ ఇద్దరి బతుకులే. భారతదేశానికి భగవంతుడు లేదా ప్రకృతి ప్రసాదించిన వరం 70వేల టీఎంసీల నీళ్లు. ఇన్ని నీళ్లుంటే దేశంలో వ్యవసాయ అనుకూల భూమి 40కోట్ల ఎకరాలే ఉన్నది. ఇంచులేకుండా దేశమంతా నీళ్లుపారితే 40వేల టీఎంసీలు సరిపోతయి. ఇంకా 30వేల టీఎంసీలు మిగులుతాయి. 73 ఏండ్లలో 50 ఏండ్ల పైబడి కాంగ్రెస్ పాలించింది. మరో 11 ఏండ్ల పైబడి ఎన్డీయేరూపంలో బీజేపీ పాలించింది. ఇప్పటికీ దేశంలో తాగునీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. నీటి యుద్ధాలని సిగ్గులేకుండా మాట్లాడుతరు. తెలివుంటే ఈ పరిస్థితులు ఉంటాయా!

ట్రిబ్యునల్ తీర్పుకు దశాబ్దాలా? కృష్ణా జలాల పంచాయితీ చెప్పడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటైంది. పదిహేనేండ్లు అయింది. అయినా ట్రిబ్యునల్ తీర్పురాదు. ఇదీ కాంగ్రెస్, బీజేపీ తెలివి. రెండునెలల్లో తేల్చాల్సిన విషయం.. 20 ఏండ్లకు పరిష్కారం.. పర్మిషన్లకు ఇంకో 20ఏండ్లు.. ప్రాజె క్టు కట్టడానికి ఇంకెన్నేండ్లు? ఎవరికి రావాలి నీళ్లు? వస్తయా? ఇదా దేశాన్ని నడిపే పద్ధతి?

ప్రధాని మీద కోపానికి వచ్చిన.. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్తే, ప్రధాని మీద కోపానికి వచ్చిన. అగ్గిమీద గుగ్గిలం అయిన. ఏమైంది మా ట్రిబ్యునల్? అని అడిగితే.. దానికి మోదీ.. నీళ్ల విషయాలు మాట్లాడే అవకాశంలేదు.. కావేరి మాట అన్నమో లేదో తమిళనాడు భగ్గుమన్నది అన్నరు. మీకు తెలివిలేక భగ్గుమన్నదని చెప్పిన. అన్ని రాష్ట్రాలకు సరిపోయే నీళ్లుండగా, అందరికి సమానంగా పంపిణీచేసే తెలివిలేక, మీకు చేతగాక, మీరు దద్దమ్మలు, మొద్దన్నలుగా ఉండటంవల్ల దేశం ఇట్ల తయారైందని చెప్పిన. ఈ బాధ దేశానికి పోవాలి. నీళ్లు మన భూభాగంమీదకు రావాలి.. జీవనదులు సస్యశ్యామలం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ దద్దమ్మలు అధికారంలో ఉంటే ఇది సాధ్యంకాదు.

హిందూ మతానికి టేకేదార్లా? స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్దపెద్ద నోర్లు పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నరు. ఇంకేం సమస్యలు లేనట్టు.. మంచినీళ్ల బాధలు అసలే లేవన్నట్టు వ్యవహరిస్తారు. కొందరైతే తామే హిందూమతానికి టేకేదార్ తీసుకున్నట్టు అంటరు. నువ్వేనా హిందువు.. మేము కాదా? మీకంటే నికార్సయిన హిందువులం మేమే. నేను చేసినన్ని యాగాలు ఇండియాల ఎవ్వరు చెయ్యరు. ఇంక ఉల్టా మోదీ నా మీద మాట్లాడిండు.. ఈయన పూజలు చేసినంత టైం ప్రజలకు ఇవ్వడని అన్నడు. మరి హిందువువే అయితే నేను పూజ చేస్తే నీకేం పోయింది? మోదీగారు మీరూ రండి, మీకింత తీర్థం ప్రసాదం పెడుత అన్న. వాళ్లకు ఏం పనిలేదు. ఇదొక్కటే ఉన్నది. హిందూ, హిందుత్వ, సంప్రదాయాలు! నువ్వే కాపాడుతున్నవా సంప్రదాయాలు? మీరు లేకపోతే నడువదా? మీరు లేకపోతే లగ్గాలుకావా? మీరు లేకపోతే ఎములాడ గుడి బంద్ అయితదా? మీరే పుట్టించినారా గుడిని?

ఇజ్జత్, మానం ఉండాలనే సోయి ఉందా.. 50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ మన్ను కూడా చేయలేదు. చెప్పుకుంటే సిగ్గు పోతది. ఇప్పుడున్న మోదీ 130 కోట్ల మందికి ప్రధాని. ఇంకొగాయన ప్రధాని కావాలనుకునేటాయన.. ఆయనెవరు.. రాహుల్‌గాంధీ! వాళ్ల నాయినా, తాత, ముత్తాత అంతా ప్రధానమంత్రులే. ఇప్పుడు ఈయన కావాల్నట! ఏం మాట్లాడుతరండీ టీవీల్లో! ప్రపంచం అనేది ఒకటుంది.. అందరు చూస్తున్నరు.. మనకు ఇజ్జత్ ఉండాలే అనే సోయి ఉన్నదా? ప్రధాని చౌకీదార్ నహీ హై.. చోర్ హై అని అని రాహుల్ రోజూ అంటడు. దొంగతనం చేసిన నేషనల్ హెరాల్డ్ కేసుల తల్లికొడుకులిద్దరు జామీన్‌పై బయట తిరుగుతున్నరు అని ప్రధాని మోదీ అంటడు. వీళ్లా మన ప్రధానులు? ఏమనుకుంటుంది ప్రపంచం? మన గురించి ఎంత చులకన భావం ఏర్పడుతది? ఏం చీప్ దందా ఇది?

వినోద్‌కుమార్ కేంద్రమంత్రి అయ్యే అవకాశం

కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆయన ముందునుంచి క్రియాశీల రాజకీయాల్లో, ఉద్యమ పార్టీలో, కమ్యూనిస్టు పార్టీలో జీవితమంతా గడిపిన వ్యక్తి. ఉద్యమంలో నాతో కలిసి వచ్చిన వ్యక్తి. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో వెన్నుచూపని వీరుడు. నా వెంట నిఖార్సుగా ఉన్న వ్యక్తి. అటువంటి వినోద్‌కుమార్ ఎంపీగా గెలిస్తే రేపు కచ్చితంగా ఫెడరల్ సమాఖ్య ప్రభుత్వం వస్తే ఆయన మామూలు ఎంపీగా ఉండడు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశముంటది. కాబట్టి కరీంనగర్ ఆ గౌరవాన్ని పొందాలి. పెద్ద వ్యక్తి ఇక్కడ అందుబాటులో ఉంటే నాకు సగం బరువు పోతది.. కాబట్టి వినోద్‌ను దేశమే ఆశ్చర్యపోయే విధంగా బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఎండను లెక్క చేయకుండా లక్షల్లో వచ్చి నన్ను దీవించినందుకు శిరస్సు వంచి కరీంనగర్ గడ్డకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న. సమావేశాన్ని గంభీరంగా నిర్వహించిన మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

గ్రామ్ సడక్ ప్రధాని వేస్తడా! చేయాల్సిన పనులు పక్కనపెట్టి రాష్ట్రాల ఎంబడి పడుతరు. రాష్ట్రాలకు ఇయ్యాల్సిన స్వేచ్ఛ ఇవ్వరు. పెత్తనం చెలాయిస్తరు. ఎక్కడో మంథనిలో ముత్తారం మండలంలో రోజ్‌గార్ కూలీ జరిగితే ఢిల్లీ నుంచి డబ్బులేస్తడట ప్రధాని. ఇక్కడ సర్పంచ్, జిల్లా పరిషత్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి ఎందుకు? ఇదా ప్రధాని, కేంద్రం చేయాల్సిన పని? ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన.. ఎవడికి కావాలి నాయనా! గ్రామ్‌సడక్ ప్రధాని వేస్తరా? ఏ దేశంలోనన్న ఉన్నదా ఈ పద్ధతి? రోడ్డువేసే వాళ్లు లేరా కింద?

పాకిస్థాన్‌ను కంట్రోల్ చేయలేరు.. పాకిస్థాన్‌ను కంట్రోల్ చేయరు.. రక్షణ వ్యవహారాలు పట్టించుకోరు. తెలివితేటల్లేవు. అంతర్జాతీయ వ్యవహారాలు చక్కపెట్టరు. దేశంలో కరం టు 3.44 లక్షల మెగావాట్లు ఉన్నది. కానీ ఇప్పటివరకు అత్యధికంగా వాడిందే లక్షా 80వేల మెగావాట్లు. లక్షల మెగావాట్ల ఉత్పత్తి ఉన్నా.. వాడే తెలివిలేదు. ఛత్తీస్‌గఢ్‌లో 37వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డయి. నీళ్లను వాడం, విద్యుత్‌ను వాడం. బీజేపీ, కాంగ్రెస్ పాలన తీరు ఇది. వీళ్లా జాతీయపార్టీలు? ఇంత దిక్కుమాలిన విధానాలు ఏ దేశంలోనైనా ఉంటయా? ఇది మారాలి. మారి తీరాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.