
భారత భవితవ్యాన్ని మార్చే కృషికి కేంద్ర బిందువవుతాం
మన తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
రాష్ట్రంలో 16 ఎంపి స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు 150 పైచిలుకు స్థానాలను గెలిస్తే రాష్ట్రాలకు కలిసొస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు టిఆర్ఎస్కు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల 2 లక్షల ఓట్లు వేరే అభ్యర్థులకు పడ్డాయి. దీంతో మా పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగింది. ఈ ఎన్నికల్లో ట్రక్కు గుర్తును ఇసి తొలగించింది. ఫలితంగా టిఆర్ఎస్కు ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్‌ను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్పై నమ్మకం పెరిగి వివిధ పార్టీల నేతలు మా పార్టీలో చేరుతున్నారు అని ‘మన తెలంగాణ’ ప్రతినిధులు భూమేశ్వర్, వెంకటేశంలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఆయనతో ముఖాముఖి వివరాలు ఇలా…
చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయం
ఎన్టీటర్ ట్రస్ట్ భవన్‌కు తాళాలు వేసుకోవచ్చు రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కాంగ్రెస్, బిజెపిలు ఉనికిని కోల్పోయాయి
దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులకు టిఆర్ఎస్ పార్టీ కేంద్ర బిందువు కానుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బిజెపి, కాంగ్రెస్ యేతర పార్టీలతో టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ జరపనున్న సమావేశం దేశ రాజకీయాల్లో కీలక మార్పునకు నాందీ పలకనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలను సునాయాసంగా సొంతం చేసుకోబోతుంది. 16 ఎంపి సీట్లను గెలిపించడమే తమ ముందున్న కర్తవ్యం. దీంతోపాటు దేశంలోని ప్రాంతీయ పార్టీలకు చెందిన సుమారు 150కి పైగా ఎంపిలతో కూటమిగా ఏర్పడి, దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాం
ఈ సారి పార్టీ గెలుచుకునే సీట్లు, ఓట్ల శాతం…? రాష్ట్రంలో 16 ఎంపి స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు 150 పైచిలుకు స్థానాలను గెలిస్తే రాష్ట్రాలకు కలిసొస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు టిఆర్ఎస్కు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ శాతం పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వలన 2 లక్షల ఓట్లు వేరే అభ్యర్థులకు పడ్డాయి. దీనివలన తమ పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగింది. ఈ ఎన్నికల్లో ట్రక్కు గుర్తును ఈసీ తొలగించింది. ఫలితంగా పార్టీ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్‌ను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీపై నమ్మకం పెరిగి వివిధ పార్టీల అభ్యర్థులు పార్టీలో చేరుతున్నారు.
రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందా? 2014లో 14 ఎంపి స్థానాలు ఉన్నప్పుడు ఏమీ చేశారు, ఇప్పుడు 16 ఎంపి స్థానాలతో ఏమి చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో టిఆర్ఎస్ 14 స్థానాలను గెలిచింది వాస్తవమే. అప్పుడు మోడీ 283 స్థానాలను గెలుచుకోవడం వలన ఆయనకు అప్పుడు ఎవరి అవసరం కలగలేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభంజనం వీస్తొంది. 16 సీట్లతో కెసిఆర్ ఎలా చక్రం తిప్పుతారని ప్రశ్నిస్తున్న కొన్ని పార్టీల నాయకులకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. ఈ ఎన్నికల్లో మోడీ గాలి వీయడం లేదు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎప్పుడో పడిపోయింది. ఈసారి ప్రతి ఎంపి సీటు కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో 150 నుంచి 180 వరకు బిజెపి పార్టీకి, 100 నుంచి 110 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది. అసాధారణ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసినా పూర్తి స్థాయిలో మెజార్టీ రాదు. తాను ఇప్పుడు చెప్పేది ఎవరూ నమ్మకపోవచ్చు, రానున్న రోజుల్లో ఇదే జరగనుంది. దేశంలో ఇంతకంటే అనూహ్యమైనవి, ఊహించనవి జరిగాయి.
2003 ప్రధానిగా మన్మోహన్సింగ్ అవుతాడని, ఆయనే 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉంటారని ఎవరైనా ఊహించారా? 2019లో తాము అనుకుంటున్నట్టుగానే కోల్‌కత్తాలో తృణమూల్ కాంగ్రెస్, ఒరిస్సాలో బిజూ, జనతాదళ్, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాద్ పార్టీ, బహుజన సమాజ్‌వాద్ పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి పార్టీలు సుమారు 150 నుంచి 160పైచిలుకు స్థానాలను గెలుచుకుంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారతాయని అందులో భాగంగానే ఈ సారి ప్రాంతీయ పార్టీల హవా కొనసాగనుంది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి. బిజెపి, కాంగ్రెస్‌లకు ఓట్లు వేసి అడుక్కోవడం కంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఉత్తమం. ఒక ప్రాంతీయ పార్టీగా, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్కు ఓటు వేయాలి.
16 ఎంపి సీట్లను గెలిపిస్తే నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటాం. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు కెసిఆర్‌తో టచ్‌లో ఉన్నారు. వారిని కూడగట్టుకొని ఢిల్లీని యాచించడం కాదు, శాసించే స్థాయికి చేరుకుంటాం. ఈ విషయమై నాకు నమ్మకం ఉంది. ఒకవేళ 150 నుంచి 170 సీట్లు నాన్కాంగ్రెస్, నాన్ బిజెపిలకు వస్తే రాష్ట్రాలను బలోపేతం చేయాలి, అధికారాలు వికేంద్రీకరించాలి, ఢిల్లీ మొత్తం గుత్త పెత్తనాన్ని తీసివేయాలన్నదే మా ఉద్ధేశ్యం. 71 సంవత్సరాలుగా రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తాం.
దేశంలో కాంగ్రెస్, బిజెపిల పరిస్థితి ఎలా ఉంది? పిఎం పదవికి రాహుల్ అర్హుడేనా ? ప్రస్తుతం దేశంలో మోడీ, కాంగ్రెస్ గాలి వీయడం లేదు. 16 సీట్లతో టిఆర్ఎస్ వాళ్లు కలలు కంటున్నారని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు. వారికి తాను చెప్పే సమాధానం ఒక్కటే. 44 సీట్లు ఉన్న రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతానని కలలు కంటున్నారు, వేరే వాళ్లకు ఆశలు ఉండకూడదా? ఉత్తమ్‌కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి తమపై బురదజల్లేటప్పుడు వారి పార్టీ గురించి కూడా కాస్త ఆలోచించుకోవాలి. రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గమైన అమేథీలో మున్సిపాలిటీని కూడా ఓడిపోయారు, ఈ విషయం ఉత్తమ్‌కు తెలియదా, రానున్న ఎన్నికల్లో ఫలానా రాష్ట్రంలో తమ పార్టీకి 20 ఎంపి సీట్లు వస్తాయని చెప్పే పరిస్థితిలో రాహుల్‌గాంధీ ప్రస్తుతం లేరు. సొంత పార్లమెంట్ సీటులో మున్సిపాలిటీని గెలవలేని రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతానని కలలు కనవచ్చా, మిగతా వాళ్లు ప్రధానమంత్రిగా కావాలని కలలు కనడం తప్పా ? రెండోసారి సిఎంగా చేసిన కెసిఆర్ ప్రధానమంత్రి అయితే అందులో తప్పు ఏముంది. గాంధీ కుటుంబం నుంచి వచ్చినందుకే రాహుల్ గొప్పవాడవుతాడా?
జాతీయ పార్టీలపై ప్రజల మనోగతం ఎలా ఉంది? దేశ ప్రజలు జాతీయ పార్టీలపై విశ్వాసం కోల్పోయారు. ఇన్ని సంవత్సరాలుగా జాతికి ఈ రెండు పార్టీలే ద్రోహం చేశాయి. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జాతీయ పార్టీలు ఉనికిని కోల్పోయాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పాత చింతకాయ పచ్చడి డైలాగులను మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా జాతీయ పార్టీలే దేశాన్ని పాలించాయి, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ పాలించాలి. 71 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు కాంగ్రెస్, 13 సంవత్సరాలు బిజెపి, 3 సంవత్సరాలు జనతాపార్ట్టీలు పాలన కొనసాగించాయి. జాతీయ పార్టీలు 71 సంవత్సరాలు ప్రజలను శాసించారు, వారు చేసిందేమి లేదు. ఇప్పటికీ వారే అవకాశం అడుగుతున్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంట్ లేదు, నీళ్లు, రోడ్లు లేని ఊళ్లు కూడా ఉన్నాయి. 71 సంవత్సరాల్లో జాతీయ పార్టీలు చేసింది ఇంతే.
దేశవ్యాప్తంగా ఏఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది? దక్షిణాదిలో 6 రాష్ట్రాలుంటే అందులో కర్ణాటక తప్ప 5 రాష్ట్రాల్లో బిజెపి ఉనికిలో లేదు. అలాంటప్పుడు బిజెపి జాతీయ పార్టీ ఎలా అవుతుంది? 20 రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. జాతీయ పార్టీగా చెప్పుకునే పరిస్థితి దానికి లేదు. దేశంలో 30 సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కూడా ఎన్‌డిఎ, యుపిఎలు వేరుగాను, ఫెడరల్ ఫ్రంట్ మరోవైపు ఉంటాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే ప్రధాన మంత్రి ఎవరవుతారని అందరూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ అవుతారని ఎవరూ ఊహించలేదు, మోడీ ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు. ప్రజలు ఫెడరల్‌ఫ్రంట్‌కు అవకాశమిస్తే ప్రధానమంత్రి కావడానికి చాలామంది సమర్థులు ఉన్నారు. కెసిఆర్ ప్రధానమంత్రి అవుతారని నేను చెప్పడం లేదు. రాహుల్ వర్సెస్ మోడీ అని జాతీయ పార్టీలు పేర్కొంటున్నాయి, దేశానికి అంత ఖర్మ పట్టలేదు. వారికన్నా సమర్థులు చాలామంది ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు దేశాన్ని నడపడం వచ్చా అని జాతీయ పార్టీల నాయకులు ఆరోపించడం ఎంతవరకు సమంజసం?. గతంలో యునైటెడ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది రాజీవ్‌గాంధీ కాదా, బయటి నుంచి మద్ధతు ఇచ్చినట్టే ఇచ్చి కూలగొట్టడంలో జాతీయ పార్టీలు ముందుంటాయి.
పుల్వామా దాడులపై టిఆర్ఎస్ ఎలా స్పందించింది? టిఆర్ఎస్ పార్టీకి జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నాయి. పుల్వామా ఘటన సందర్భంగా సిఎం కెసిఆర్ ఎక్కువగా స్పందించారు. దాడుల్లో మృతిచెందిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలను సిఎం కెసిఆర్ ప్రకటించారు. వారంరోజులు పాటు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. మోడీ మాత్రం యధావిధిగా తన కార్యక్రమాలను కొనసాగించారు. చనిపోయిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడానికి కెసిఆర్ ముందున్నారు. హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు ఏ సిఎం స్పందించని విధంగా కెసిఆర్ స్పందించారు. కేరళలో తుఫాను వస్తే ఏ ప్రభుత్వం స్పందించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నిలిచింది. కశ్మీరు, జార్ఖండ్‌లో జరిగిన సంఘటనలపై స్పందించడంలో తామే ముందు ఉన్నాం. జాతీయ భావాలు, జాతి పట్ల ప్రేమ, దేశ భక్తి ప్రాంతీయ పార్టీలకు లేవంటూ. జాతీయ పార్టీలు చిల్లరగా ప్రచారాలు చేస్తున్నాయి. పుల్వామా దాడి అనంతరం దేశానికి అండగా నిలవాల్సిన రాహుల్‌గాంధీ దానిని రాజకీయంగా ఉపయోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసినా బిజెపికి డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయి? కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన టీంలో లేము. తెలంగాణ ప్రజల టీమ్ తరఫున పోరాటం చేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో బిజెపికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా క్యాంపెయిన్ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. విజయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. 16 స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే తమ ముందున్న కర్తవ్యం. డికె అరుణ కాంగ్రెస్ పార్టీని వీడింది. ఆమె ఆరోపణలపై కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. మొదటి నుంచి మజ్లిస్ మా మిత్రపక్షం. వారు గెలవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండు జాతీయ పార్టీల వాళ్లు గేమ్ ఆడుతున్నారు. ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎంపి ఫలితాల అనంతరం జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలతోనే అవసరం ఉండవచ్చు. ఎప్పుడూ మా శక్తి వారికి ధారపోయడం ఎందుకు. జాతీయ పార్టీలే మాకు సపోర్టు ఇవ్వొచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎప్పుడూ మేమే వారికి సబార్డినేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. జాతీయ పార్టీలే దిగిరావాలి, వాటికి అహంకారం అవసరం లేదు.
బిజెపియేతర రాష్ట్రాల అభివృద్ధిని మోడీ విస్మరించారా? బిజెపియేతర రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించడంతో పాటు వాటిపైనే మోడీ పెత్తనం చేశారు. బుల్లెట్ రైలును భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను కాదని వేరే రాష్ట్రాలకు మళ్లించారు. తెలివి ఉన్నవాళ్లు ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. కొన్ని పార్టీలు కుట్రలు పన్నడం వల్లే నిజామాబాద్‌లో రైతులు నామినేషన్లు వేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అక్కడ అభ్యర్థి దొరకలేదు. మధుయాష్కీకి ఇష్టం లేకున్నా అక్కడ పోటీలో దింపారు. ఆయనకు ఓటమి తప్పదని తెలుసు. రాహుల్, మోడీ పోటీ చేసే దగ్గర రైతులతో నామినేషన్ వేస్తే బాగుండేది.
కాంగ్రెస్, బిజెపిలు జాతికి మేలు చేశాయా? నదుల అనుసంధానం ఎంతవరకు వచ్చింది? సిఎం కెసిఆర్ లెక్కప్రకారం సాగునీటి, తాగునీటికి 45వేల టిఎంసిల నీరు అవసరం. దేశంలో 75వేల టిఎంసిల నీరు ఉంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నధుల అనుసంధానం గురించి మాట్లాడారు, ఇప్పటివరకు అది అందుబాటులోకి రాలేదు. 71 ఏళ్లలో జాతీయ పార్టీలు ఆ దిశగా ఆలోచించలేదు. సిఎం కెసిఆర్ ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను కలపడానికి ప్రయత్నం ప్రారంభించారు. దీంతోపాటు కొండపోచమ్మ సాగర్ పూర్తయితే దానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు లింక్ చేయాలన్న ఆలోచన దిశగా కెసిఆర్ పనిచేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటివరకు ఆలోచించని ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీలు ఎలా అవుతాయి. జాతికి ఆ రెండు పార్టీలు ద్రోహం చేశాయి. 71 ఏళ్లలో సాగునీటి, తాగునీటిపై ఈ రెండు పార్టీలు దృష్టి సారించలేదు.
ఎంపి అభ్యర్థులను ఎందుకు మార్చారు..? సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం సిట్టింగ్ అభ్యర్థులను మార్చింది. చాలా పార్టీల్లో ఈ విధానం కొనసాగుతుంది. పార్టీ టికెట్ ఇవ్వనంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీ చెడ్డది అంటే అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నా. బిజెపి పార్టీ సికింద్రాబాద్‌లో మా పార్టీ అభ్యర్థికి పోటీ ఇస్తుంది, మిగతా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీగా భావిస్తున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డిని టిఆర్ఎస్లోకి ఆహ్వానించి ఆయనకు సముచిత స్థానం కల్పించాం. ఆయన ఎందుకు పార్టీని వదిలి వెళ్లారో తెలియదు. వేరే పార్టీల నుంచి టిఆర్ఎస్లోకి వలసలు వస్తే తప్పు ఎలా అవుతుంది. కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్నారు, అదే టిఆర్ఎస్ వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే అది తప్పు కాదా? మీ పార్టీకి చేవలేదు, మీ నాయకత్వానికి దమ్ము లేకనే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారు. నైతికత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు. 2004లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకోలేదా?. ఏప్రిల్ 11 తరువాత మిగతా రాష్ట్రాల సిఎంలతో కెసిఆర్ సమాలోచనలు జరుపుతారు. చాలామంది ఇప్పటికే కెసిఆర్‌తో టచ్‌లో ఉన్నారు. అక్కడ జరిగే ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ పాల్గొంటారా లేదా అన్న విషయం నాకు తెలియదు.
రాష్ట్ర పథకాలు దేశానికి ఎలా ఆదర్శమయ్యాయి? రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఏంచెయ్యాలి? దేశ రాజకీయాల్లో కెసిఆర్ చెరగని ముద్ర వేశారు, వేస్తున్నారు. మన దగ్గర విజయవంతమైన రైతుబంధు పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ, పిఎం కిసాన్‌గా పేరు మార్చి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. మోడీ కాపీ కొట్టినా ఫర్వాలేదు, సిఎం కెసిఆర్ మానసపుత్రిక అయిన రైతుబంధు పథకం దేశం మొత్తానికి ఆదర్శవంతమయ్యింది. కెసిఆర్ ఆలోచన దేశానికి ఆచరణ అయ్యింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వలన తెలంగాణకు పెద్దగా ప్రయోజనం లేదు, దానికన్నా 10 రెట్లు మెరుగ్గా ఆరోగ్య శ్రీ పథకం ఉంది. ప్రజల ఆరోగ్యం మీద కేంద్రానికి శ్రద్ధ ఉంటే అదే డబ్బును రాష్ట్రాలకు ఇస్తే వారు వేరే పథకానికి వినియోగించుకుంటారు. కావాలంటే ప్రధాని ఫొటో పెడతాం. రైతుబంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ పెట్టడం వలన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. డబుల్ బెడ్ రూం స్కీంను దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. దానికి పేరు మార్చిన కేంద్రం పిఎం ఆవాస్ యోజన పేరుతో తీసుకొచ్చారు. దానికి ఇచ్చే డబ్బులను డబుల్ బెడ్ రూంకు ఇస్తే మరింత ఫలితం వస్తుంది. కేంద్ర పరిధిలో ఉన్న వ్యవసాయం, ఎడ్యుకేషన్, వైద్యంపై ఉన్న హక్కులను రాష్ట్రాలకే పూర్తిగా ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు. రాష్ట్రాలకు పూర్తి హక్కులను కల్పించడంతో పాటు నిధులను కేటాయిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
ఏపీ సిఎం చంద్రబాబు, పవన్ టిఆర్ఎస్ను టార్గెట్ చేశారెందుకు..? చంద్రబాబుకు రిటైర్మెంట్ దగ్గర పడింది. త్వరలో ఆయన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆయనకు వలంటరీ రిటైర్మెంట్ కాదు బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు ఓడిపోతారని ఏపి ప్రజలకు తెలిసిపోయింది. ఆయనలో ఇప్పటికే కోపం, నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిలు ముగ్గురు కెసిఆర్ జపం లేకుండా ఏపిలో మాట్లాడడం లేదు. దీనిని బట్టి కెసిఆర్ ఎంత బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు టూ లెట్ బోర్టును టిడిపి పార్టీ వాళ్లు పెట్టుకోవచ్చు. బలవంతపు రిటైర్మెంట్ తరువాత హైదరాబాద్‌లో ఏదైనా పనిచేసుకోవచ్చు లేదా ఆయన మనువడితో ఆడుకోవచ్చు.
పవన్‌కళ్యాణ్, చంద్రబాబులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు, తాము దాడులు చేస్తే వారి వ్యాపారాలను హైదరాబాద్‌లో ఎందుకు విస్తరించుకుంటున్నారు. మరీ పవన్‌కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలో ఎందుకు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు చాలా తెలివైన వాళ్లు. కెసిఆర్ మీద ఆంధ్రా ప్రజలకు కోపం ఉంటే జిహెచ్ఎంసిలో అన్ని సీట్లు రావు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు అంత మద్ధతు దొరికేది కాదు. తాము ముందునుంచి చెప్పేది ఒక్కటే, విభజన వికాసం కోసమే ముందు నుంచి ఇదే మాటను చెబుతున్నాం. విభజన వలన రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కడా బాంధవ్యాలు తగ్గలేదు. చుట్టరికాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రజల మధ్య వైషమ్యాలు తొలగాయి. మా మీద అంత కోపం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించారు.