Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశానికి దశ దిశ చూపిస్త

-పదహారుమంది టీఆర్‌ఎస్ ఎంపీలతో కేంద్రంలో కీలకపాత్ర
-సహజ వనరులు వాడే తెలివిలేని కాంగ్రెస్, బీజేపీ
-దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి
-సమాన గౌరవం, హోదాతో బతికే దేశం కావాలి..
-అందుకు ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించాలి : కేసీఆర్
-దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తం
-రైతుల భూముల సమస్యలన్నీ పరిష్కరిస్త
-ప్రతి గుంట భూమికి కంక్లూజివ్ టైటిల్ ఇస్తం
-టీఆర్‌ఎస్ లేకుంటే కొత్త జిల్లాలు వచ్చేవా?
-పసుపు పంటకు మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమే
-ఐదేండ్ల నుంచి మొత్తుకున్నా.. మోదీ పెడచెవిన పెట్టిండు
-గెలిపిస్తే మూడ్రోజుల్లో పసుపు బోర్డు అని బీజేపీ అంటున్నది
-ఐదేండ్ల నుంచి అడుగుతుంటే ఎక్కడ పండుకున్నరు?
-నిర్మల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఎన్నికలొస్తే.. బీజేపీకి పాకిస్థాన్, హిందూత్వం గుర్తుకు వస్తయి.. లంగ పంచాయతీ పెట్టి ఓట్లు దండుకోవాలనేదే బీజేపీ పని ఇంటికి 15 లక్షలు అకౌంట్‌లో వేస్తామన్న మోదీ హామీ ఏమైంది?.. మోదీ లాంటి చిల్లరమల్లర ప్రధానిని ఎన్నడూ చూడలేదుఅధ్వాన్నమైన ప్రధాని.. ఈ దేశం చేసుకున్న దురదృష్టం

దేశంలో అనేక సహజవనరులున్నా, పెద్దమొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వాడుకునే తెలివి ఈ దేశాన్ని డ్బ్భై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు లేకపోయిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఈ దేశాన్ని ఇలా వదిలిపెట్టొద్దని, కచ్చితంగా బాగుపడాలని అన్నారు. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన కేసీఆర్.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లాకేంద్రంలో ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జీ నగేశ్‌కు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

మీ దీవెన ఉంటే దేశానికి దశ- దిశ చూపిస్త
మీ బిడ్డగ చెప్తున్న. కచ్చితంగా ఈ భారతదేశాన్ని కూడా ఇట్ల వదిలిపెట్టొద్దు. దేశం బాగుపడాలి. బాగుపడాలంటే ఎక్కడి నుంచో ప్రారంభం కావాలి.. ఒక దిక్సూచి, దశ-దిశ తీసుకుపోయే పద్ధతిరావాలి. దానికోసమే నేను ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావిస్తున్న. దేశవ్యాప్తంగా చాలామందితో మాట్లాడిన. సెక్యులర్ భావాలతో, అన్ని మతాలను గౌరవప్రదంగా చూసుకునే, అన్ని అన్నివర్గాల ప్రజలు సమాన గౌరవం, హోదాతో బతికే దేశం కావాలి. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకునే దేశం కావాలి. ఈ కులాల కుళ్లుగాళ్లు, మతాల పంచాయితీలు పెట్టే చిల్లరగాళ్లకు దేశం చెంపదెబ్బ కొట్టాలి. మీ దీవెన ఉంటే.. తెలంగాణలో 16 ఎంపీలు మనం గెలిస్తే.. ఫెడరల్ ఫ్రంట్‌లో మన బాధ్యత బాగా పెరుగుతది. దేశానికి కూడా దశ- దిశ చూపేందుకు, మీ బిడ్డగా శక్తివంచన లేకుండా కృషిచేస్త. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాల్సిన అవసరముంది.

ఎన్నికలొస్తే.. పాకిస్థాన్, హిందూత్వం గుర్తుకు వస్తయా?

ఒక లంగ పంచాయితీ పెట్టి ఓట్లు దండుకోవాలనేదే బీజేపీ పని. ఎన్నికలు వస్తేనే రామాలయం, హిందువులు గుర్తుకొస్తరా? పాకిస్థాన్, ముస్లింలు గుర్తుకొస్తరా? ఎన్నిరోజులు ఈ అంశాన్ని వాడుకుంటరు? ప్రధానిగా ఉన్న వ్యక్తి దేశప్రజలను విడదీసి, హిందువులు, ముస్లింలు అని మాట్లాడవచ్చునా? ఇది ధర్మమేనా? మంచిగా అన్ని మతాలు కలిసి జీవించే గడ్డ మన తెలంగాణ గడ్డ. మసీదుకు పోయేవాడు మసీదుకు, గుడికి పోయేవాడు గుడికి పోతుండు. చర్చికిపోయే వాళ్లు చర్చికిపోతున్నరు. ఎవరి దేవుని బొమ్మ వాళ్లు పెట్టుకుంటున్నరు. ఈ లంగ పంచాయతీలు మన కడుపు నింపుతయా? ఏ మతం వారైనా రక్తం ఎర్రగనే ఉంటది. చావైనా.. సంతోషమైన ఒకటే వస్తది. అందరం ఒక్కటే. కానీ లంగ పంచాయతీలు పెట్టాలి.. సమాజాన్ని విడదీయాలి! సెక్యులర్ భావాలతో అద్భుతంగా బతికే ప్రాంతాలను కలుషితం చేయాలా? ఫేస్‌బుక్‌లో హిందువులను, దేవుళ్లను కాపాడాలని ఒకటే లొల్లి! ఏం? మనం కాపాడటం లేదా! ఎవరింట్లోనైనా దేవుడిని మొక్కుతరు. వరి కోసినా.. పంట పండినా.. కళ్లం చేసినా దేవుడికి దండం పెట్టుకుంటం. నాగోబా జాతర జరుగడం లేదా! వీళ్లు (బీజేపీ) చెప్తేనే జరుగుతున్నాది? నిర్మల్‌లో దేవాలాయాలన్నీ బీజేపీవాళ్లే కట్టిచిర్రా? ఈ పిచ్చి ప్రచారంలో యువకులు కొట్టుకొని పోవద్దు.

ఇంటికి 15 లక్షలు అకౌంట్‌లో వేస్తా మన్న మోదీ హామీ ఏమైంది?
ఎన్నికల్లో గెలిపిస్తే నల్లధనం పాతాళంలో ఉన్నా తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తనని మోదీ గత ఎన్నికల్లో చెప్పిండు. 15 రూపాయాలన్న ఇచ్చిండా? ఇప్పుడు దానిగురించి మాట్లాడుతుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతుండు? సిగ్గు, లజ్జ ఉండొద్దా మనకు! పదికోట్లమందికి ఉద్యోగాలిస్తమన్న బీజేపీ.. కోటిమందికైనా ఇచ్చిర్రా? ఉందా లెక్క? చూపిస్తరా?

పిడికిలి బిగిస్తేనే దేశం మారుతది
మన పక్కన చైనా దేశం ఉన్నది. భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నరు.. ఏదో ఒక పూట ఇండియాకు తెలివొచ్చి, బలమైన వ్యక్తి ప్రధాని అయితే.. అక్కడి జనమందరూ పనిచేసుకోవడం మొదలుపెడితే రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రమాదముంటది.. నిజంగా అదే జరిగితే ఏయేరంగాల్లో చైనాకు ప్రమాదముంటది.. అనేది తెలుసుకోవడానికి ఒక కమిటీని చైనా అపాయింట్ చేసింది. ఏడాది టైం ఇచ్చి అధ్యయనం చేయమంటే.. కమిటీవాళ్లు మూడునెలల్లోనే నివేదిక ఇచ్చిర్రు. ఏమి ఇంత తొందరగా నివేదికిచ్చిర్రు? అని కమిటీని ఆ దేశ ప్రధాని అడిగితే.. భారతదేశంలో అంతా పిచ్చిసన్నాసులున్నరు. వాళ్లు ఇవ్వాల్టికి కూడ కులం, మతం అని కొట్టుకొని చస్తున్నరు. వాళ్లు మనతో పోటీకివచ్చే ముచ్చటేలేదు. వాళ్లది ఒక పిచ్చి దేశమని రిపోర్టు ఇచ్చిర్రు. ఈ దేశం ఇట్లనే ఉండాలా? 1976కు ముందు చైనా జీడీపీ మనకంటే తక్కువ. ఈ రోజు వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. మనకంటే నాలుగు రెట్లు ఎక్కువ. వాడు బంగారం తింటుంటే.. మనం మట్టి తింటున్నమా? వాడు మేల్కొన్నాడు. దేశం మొత్తం పిడికిలి బిగించినారు. కులంలేదు.. మతంలేదు.. జాతిలేదు.. లింగభేదంలేదు. అందరూ అన్నిరకాల పనులు చేస్తరు. చైనాలో లక్షలమంది మహిళలు ఫ్యాక్టరీల్లో పనిచేస్తుంటరు. మన దేశంలోనే దరిద్రం! ఇది ఆడవాళ్లు చేసేపని.. ఇది మగవాళ్లు చేసేపని అని విభజన పెట్టారు. ఎప్పటివరకైతే ఈ కులాల కుళ్లు.. ఈ మతాల చిల్లర పంచాయతీ పోయి.. భారతీయులంతా పిడికిలి బిగిస్తరో.. అప్పటిదాకా ఈ దేశం బాగుపడదు. భారత సమాజం పురోగమించాలంటే.. దళితులు, గిరిజనులు గౌరవించబడాలి. మహిళలకు సమాన హక్కులు రావాలి. జాతి నిర్మాణంలో అన్నిరంగాల్లో మహిళల పాత్ర పెరుగాలి. వీటన్నింటిపై చర్చ జరుగాలి.

ఈ నాయకులేనా దేశానికి కావాల్సింది?

దేశంలో 7,500 కి.మీ. సముద్రతీరం ఉంది. బ్రహ్మాండమైన దీవులు ఉన్నయి. లక్షద్వీప్, అండమాన్.. వంటి అందమైన, అద్భుతమైన టూరిజం స్పాట్‌లు ఉన్నయి. కానీ వాటిని వాడం. సింగపూర్ పోయొత్తవా అని మనోళ్లు అంటరు. ఏం? మన్నుందా సింగపూర్‌లో? వానికున్నదే 193 కిలోమీటర్ల సముద్రతీరం. దానిమీద రంగులు, రుంగులు పెట్టి దేశమంత, ప్రపంచమంత పరేషాన్ చేస్తడు. మనకు సహజసిద్ధమైన టూరిజం స్పాట్‌లను వాడే తెలివిలేదు. పర్యాటకులను ఆకర్షించే తెలివిలేదు. మౌలిక వసతులను ఏర్పాటుచేసే తెలివిలేదు. దానిమీద చర్చలేదు. కేసీఆర్ ముక్కు బాగాలేదు.. ఇంద్రకరణ్ మూతి బాగలేదు! గిదేనా మాట్లాడేది? గీ పద్ధతుల్లో ఓట్లు అడుగుతరా? మౌలిక సమస్యలేంది? వసతులేంది? దేశ పరిస్థితి ఏంది? ఎట్ల బాగుపడాలె? దేశ వ్యవసాయ విధానం, ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉన్నయి? గా కథ లేదు! పొద్దునలేసి టీవీలు చూస్తే.. ప్రధానమంత్రి చోర్‌హై.. అని రాహుల్‌గాంధీ అంటడు. ఈ తల్లీకొడుకులు జమానత్ మీద తిరుగుతున్నరని మోదీ అంటడు. ఈ నాయకులేనా దేశానికి కావాల్సింది? యువకులు, విద్యావంతులు సీరియస్‌గా ఆలోచనచేయాలి.

కొత్త రాష్ట్రం.. దేశానికే ఆదర్శం
చాలా కష్టపడి రాష్ట్రం సాధించుకున్నం. గతంలో కరంట్ బాధలు ఉండె. ఇప్పుడులేవు. దేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్ వాడుకునే రాష్ట్రం, దేశంలో 24 గంటల కరంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. పంటలకు రాత్రి నీళ్లు పెట్టేందుకు వెళ్లి పాములు, తేళ్లు కుట్టి చనిపోయేవారు. మోటర్లు కాలిపోయి బాధలు పడేవారు. గత నాలుగేండ్ల ప్రబలమైన బాధ తీరిపోయింది. సంక్షేమంలోనూ దేశానికి ఆదర్శం గా నిలుస్తున్నం. గతంలో రూ.200 పెన్షన్ ఇస్తే ఇప్పుడు రూ.1000 చేసుకున్నం. మే నెలలో దాన్ని రూ.2000 చేసుకోబోతున్నం. దేశంలో 18 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నరు. ఎక్కడా ఇవ్వనివిధంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పీఎఫ్ ఉన్న కార్మికులకు కూడా పెన్షన్ వస్తది. రైతుబంధు, రైతుబీమా పెట్టి రైతులను ఆదుకుంటున్నం. ఏ దేశంలో రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వాలులేవు. రైతులు చనిపోతే పట్టించుకునే నాథుడే లేడు. మన రాష్ట్రంలో రైతు సహజమరణం చెందినప్పటికీ రైతుబీమా కింద ఆ కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తున్నం. విద్య, వైద్యం ఇలా ఏ రంగంలో చూసినా అనేక మార్పులు చేసి ప్రజలకు చేరువచేశాం.

టీఆర్‌ఎస్ లేకుంటే కొత్త జిల్లాలు వచ్చేవా?
ఉమ్మడి ఏపీలో నష్టపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లాభపడ్డాం. మీరు మరోసారి టీఆర్‌ఎస్‌ను దీవించి గెలిపించారు. మీ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నం. అనేక పరిపాలన సంస్కరణలు తెచ్చుకున్నం. ఇంద్రకరణ్‌రెడ్డి, నగేశ్, ఆదిలాబాద్‌కు చెందిన అనేక మిత్రులు కొత్త జిల్లాలు అడిగారు. పెద్ద అటవీభాగం మాది, జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉం దని చెప్పారు. అందుకే ఆలోచించి మొత్తంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తోపాటు పాత ఆదిలాబాద్ ఇలా మొత్తం నాలుగు జిల్లా లు చేసుకున్నం. తెలంగాణ రాకుంటే, కేసీఆర్ సీఎం కాకుంటే, ఐకేరెడ్డి మంత్రిగా లేకుంటే ఈ జిందగీల కూడా నిర్మల్ జిల్లా కాకపోయేది.

రాదనుకున్న రాష్ట్రం సాధించుకున్నం
ఈ దేశం బాగుపడాలి. దేశానికి కూడా ఎజెండా సెట్‌చేయాలి. 2001లో గులాబీ జెండా ఎగురకముందు.. నా మిత్రుడు కడ్తాల్ సత్యనారాయణ ఇక్కడే ఉన్నడు. 1996లో ఎస్సారెస్పీ కట్టమీద సత్యనారాయణ, మరో 20 మంది మిత్రులతో నేను చెప్పిన. ఈ రాష్ట్రంలో కచ్చితంగా తెలంగాణ ఉద్యమం మళ్ల వస్తది. అదృష్టం బాగుంటే, నా ఆరోగ్యం బాగుంటే నేనే జెండా లేవడ్త అని చెప్పిన. పక్కానికి వచ్చినందున 2001లో.. ఏదైతే అది అయితది, ఎక్కడనో ఒకరు కేకపెట్టాలని చెప్పి ఈ జెండా ఎగురవేసి కదిలిన. మొదట్ల నాతోటి చాలామంది రాలేదు. అవమానపరిచినరు. అవహేళన చేసినరు. కానీ ఒక్కరు, ఒక్కరు జమై.. ఉద్యమం ఒక ఉప్పెన అయి ఇయ్యాల తెలంగాణ తెచ్చుకున్నం. తెలంగాణ వస్తదంటే ఎవరూ నమ్మలేదు. కానీ సాధించుకున్నం.

భారీ మెజార్టీతో నగేశ్‌ను గెలిపించాలి
నగేశ్ వినయశీలి.. వాళ్ల నాయనకాలం నుంచి నాకు తెలిసినటువంటివాళ్లు. అందుకే నగేశ్‌ను మళ్లీ నిలబెట్టిన. నాకున్న సర్వే రిపోర్టు ప్రకారం దాదాపు 3 లక్షల పైచిలుకు మెజార్టీతోటి నగేశ్ గెలుస్తడు. కార్యకర్తలు అందరూ పట్టుబట్టి పనిచేసి నగేశ్‌ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి. మనం 16 ఎంపీలు గెలవబోతున్నం. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిది సీట్లు గెలిపించినరు. ఒక సీటు దురదృష్టవశాత్తు తక్కువ మెజార్టీతోటి పోయింది. కానీ చాలా బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చినరు. ఆ ప్రేమ నాకు కూడా ఉంది. తప్పకుండా ఇక్కడి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాయకత్వంలో, మీరు గెలిపించబోయే ఎంపీ నగేశ్, జిల్లా ఎమ్మెల్యేల నాయకత్వంలో ఈ జిల్లాలో 10- 14 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. భూ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.

పోడుభూములకు సదుపాయాలు
ఎన్నికల తర్వాత నిర్మల్ పట్టణానికి వచ్చి, రెండు, మూడ్రోజులుండి ఈ జిల్లా సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున అటవీ అధికారులు మా భూములు గుంజుకుంటరనే రంధి మీరు పడే అవసరంలేదు. ఒక ఇంచు భూమి కూడా మీది పోనివ్వను. సాధారణ రైతాంగానికి ఏవిధమైన హక్కులు, రైతుబంధు, రైతుబీమా, నీటి సదుపాయం, కరంటు వస్తున్నవో పోడు భూములకు కూడా ఆ సదుపాయాలు కల్పించే బాధ్యత నాది. ఆదివాసీ బిడ్డలు కొంతబాధతో ఉన్నట్టు నాకు తెలుసు. వంద శాతం ఆదివాసీ బిడ్డలకు కూడా కొన్ని ప్రత్యేక పాఠశాలలు, హక్కులు కల్పించి వాళ్లను కూడా ఆదుకుంటా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడినట్లు. అప్పుడే బంగారు తెలంగాణ అయితది. ఇక్కడుండే ముస్లింల కోసం గురుకుల పాఠశాలలు పెట్టుకున్నం వాళ్ల సంక్షే మం చేసుకుంటున్నం. క్రైస్తవులు, గిరిజనులు, దళితుల కోసం చేసుకుంటున్నం. అన్నివర్గాలను కలుపుకొని ఒక సమగ్రవృద్ధి చేసుకుంటేనే బంగారు తెలంగాణ సాకారం అయితది. ఆ దిశలోనే మనం ముందుకు సాగుతున్నం.

కరంటు, నీళ్లు ఉపయోగించే తెలివిలేని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు..
దేశంలో 3.50 లక్షల మెగావాట్ల కరంటు ఉత్పత్తి అవుతది. దేశాన్ని పరిపాలించిన, పరిపాలించే కాంగ్రెస్, బీజేపీలకు తెలివిలేదు. ఏనాడూ 2.20 లక్షల మెగావాట్ల కరంటు వాడలేదు. దేశంలో విద్యుత్ పాలసీ అంత దరిద్రంగా ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లో 27 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు పడి ఉన్నయి. వాటిని వాడరు. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. వాటిని వాడుకొనే తెలివిలేదు. దేశం కరువుతో ఉంటది. సగం దేశం చీకట్లో ఉంటది. నేను పక్షి వర్లినట్టు వర్లుతున్న దీనిగురించి.. కాంగ్రెస్‌వాడు మా ట్లాడడు.. బీజేపీవాళ్లు మాట్లాడరు. వట్టి అబద్ధాల ప్రచారం. చంద్రశేఖర్‌రావు ముక్కు పెద్దగా ఉన్నది.. సీఎం కేసీఆర్ జాతకం చూసుకుంటడు.. జ్యోతిష్యం నమ్ముతడు.. యాగం చేస్తడు.. అని మాట్లాడుతుండు. నీ ముల్లె ఏమైనా పోయిందా? నాకు ఇష్టమున్నది. నేను దేవుడికి దండం పెట్టుకుంటున్న. పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటున్న కదా! నువ్వు కూడ వస్తే నీక్కొంచెం తీర్థం.. ప్రసా దం పెడుత! ఇలాంటి మాటలా మాట్లాడేది ప్రధాని? దేశంలో ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్ర సీఎంలను, నాయకులను టార్గెట్‌చేసి మోదీ మాట్లాడుతుండు. ప్రధాని ఇలా మాట్లాడవచ్చా? చిల్లరమల్లర ప్రధానమంత్రి. ఇంత చిల్లర ప్రధానమంత్రిని, ఇంత అధ్వాన్నమైన ప్రధానిని నిజంగా నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది ఈ దేశం చేసుకున్న దురదృష్టం. చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ప్రధాని అంటే విద్యావిధానం, వైద్యవిధానం గురించి మాట్లాడాలి. దేశంలో అందరికీ విద్య ఉం దా? అందరికీ వైద్యం ఉందా? దేశంలో అందరికీ మంచినీళ్లు, సాగునీళ్లు ఉన్నయా? ఉండటానికి చిన్నదో, పెద్దదో కొంప ఉన్న దా? మౌలిక, ప్రాథమిక అవసరాలు తీరినయా? ఇవేవీ మాట్లాడరు! అవకాశాలున్న యి.. నీళ్లు, కరంటు ఉన్నయి. కానీ వాడం. నిర్మల్, ఆదిలాబాద్‌లో రోడ్లు మంచిగనే ఉన్నయనిపిస్తది. మీ జాతీయ రహదారి బాగానే ఉందనిపిస్తది కానీ బాగాలేదు. సన్నాసి రోడ్డు అది. ఏ దేశంలో చూసినా రోడ్లు దీనికంటే పదిరెట్లు బాగుంటయి. అన్‌ఇంటరెప్టెడ్ రోడ్డు ఉంటది. మన దగ్గరనేమో.. కుక్కలు, పందులు, ఎద్దులు, దున్నపోతులు, సైకిళ్లు, ఆటోరిక్షాలు, లారీలు అన్నీ కలిసేపోతయి. అంతర్జాతీయంగా లారీలు గంటకు 80 కి.మీ. వేగంతో పోత యి. మన దేశంలో గంటకు 24 కి.మీ. వేగంతో పోతయి. అంతర్జాతీయ గూడ్స్ ట్రైన్ స్పీడు గంటకు 85 కిలోమీటర్లు.. మన దేశంలో 32 కిలోమీటర్లు. ఇదేనా దేశం?

హామీలన్నీ నెరవేర్చుకుందాం
మొన్న ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుందాం. నిర్మల్‌లో, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు ఉన్నరు. ముఖ్యంగా యువకులు దేశం బాగుపడాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఆలోచించాలి. ఎన్నికల్లో గెలువాల్సింది వ్యక్తులు కాదు. పార్టీలు కాదు. నిజమైన ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే గెలువాల్సింది ప్రజలు. ప్రజల అభీష్టం. అప్పుడే అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరుగుతాయి. ప్రజల్లో ఈ పరిపక్వత రావాలి. ఇష్టమొచ్చిన అబద్ధాలు చెప్పడం.. ఇష్టానుసారం హామీలు ఇవ్వ డం.. ఎలక్షన్లలో ఓట్లు దండుకొని పోవడం జరుగుతున్నది. ఇది పోవాలి.

ధనవంతమైన రాష్ట్రంగా తెలంగాణ

మనందరం దేశంలో భాగం.. తెలంగాణ బాగున్నంత మాత్రాన బాగా కాదు. మనం ఆర్థికంగా బలంగా ఉన్నం. ఇంకా బలపడు తం. నిర్మల్ గడ్డ మీద ఒక సత్యం చెప్తు న్న..ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పదేండ్లలోపల తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ.30 లక్షల కోట్లు. మన ప్రభుత్వ ఆదాయం అది. ఇయ్యాల కేంద్ర బడ్జెట్‌కంటే రూ.3 లక్షల కోట్లు ఎక్కువ. అంత ధనవంతమైన రాష్ట్రం మనది. మంచి పనులు జరుగుతయి. మీరు కండ్లతోటి చూడబోతరు. ఒక్క ఊరికే పింఛన్ల పేరిట నెలకు కొన్ని లక్షలు వస్తున్నయి. ముసలోళ్లను ఎవరూ పట్టించుకోకపోవు.. వాళ్లం తా చచ్చిపోదురు! ఇయ్యాల వాళ్లంతా ఒకపూట కడుపునిండా అన్నంతిని నిద్రపోయే పరిస్థితి ఉంది. మహిళలు ప్రసవానికిపోతే బాధలేకుండా కేసీఆర్ కిట్స్ కార్యక్రమం పెట్టుకున్నం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటం. ఇండ్లు మెల్లగనే కడుతున్నం. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడానికి నేనేం భయపడ, సిగ్గుపడ! కానీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకుంటున్నం. ఈసారి బడ్జెట్‌లో ఇంకా పెంచుకుందాం. కేంద్రంలో ఈసారి మనకు అనుకూలమైన ప్రభుత్వమే వస్తది. ఎక్కువ డబ్బులు తెచ్చుకుందాం. సొంత జాగా ఉన్నవాళ్లకు కూడా డబుల్ బెడ్‌రూం ఇండ్లకు పైసలు సాయంచేద్దాం. అన్నిరకాలుగా ముందుకుపోదాం.

దేశం నేర్చుకునేలా రెవెన్యూ చట్టం
రెవెన్యూ భూముల సమస్య పరిష్కారం కావాలి. ఏజెన్సీ మాత్రమే కాకుండా ప్లెయిన్ ఏరియాలోనూ సమస్యలున్నయి. పోడు భూముల సమస్య కూడా ఉంది. మంచిర్యాలలో ఒక రైతు ఫేస్‌బుక్‌లో మాట్లాడితే ఆయన సమస్య పరిష్కారం చేశాను. కేసీఆర్ మాట చెప్తే పక్కాగా చేసి చూపిస్తాడని అందరికీ తెలుసు. హాల్తుపాల్తు ముచ్చట చెప్పడం నాకు అలవాటు లేదు. ఈ జూన్ తర్వాత రాష్ట్రాన్ని భారతదేశమే ఆశ్చర్యపోయేటటువంటి నూతన రెవెన్యూ చట్టం ఉన్న రాష్ట్రంగా చేస్తాను. అన్నిరకాల భూములు, ఒక్కో గుంట లెక్క తేలాలి. ఎవరి భూమి ఏంటో అధికారికంగా పాస్‌బుక్ ఇవ్వడంతోపాటు, కన్‌క్లూజివ్ టైటిల్ ఇస్తం. పూర్తి యజమాని అని ప్రభుత్వంచే ధ్రువీకరించే ప్రక్రియ మొదలుపెడుతం. సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తం. అలాంటి చట్టం తెస్తున్నం. భూములకు సంబంధించిన సకల సమస్యలను పరిష్కరించేందుకు నేనే స్వయంగా ప్రతి జిల్లాలో రెండు, మూడు క్యాంపులు పెడుత. ఒక్కడిని రావటం కాదు.. సీఎస్, అధికారులు, మొత్తం మంత్రివర్గం వస్తం. గిరిజనుల పోడు భూములు, మామూలు రైతులవి.. ఇలా ఎలాంటి భూసంబంధ సమస్య లేకుండా చేస్తం. రైతు మాటిమాటికి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగే ఖర్మలేకుండా, ఎవరికీ రూపాయి లంచం ఇచ్చే అవసరం లేకుండా, బ్యాంకు లోనుకు కూడా పాస్‌బుక్ బ్యాంకు వాళ్లకు ఇచ్చే అవసరం లేకుండా చేస్త. ప్రతి రోజు జరిగే భూ క్రయావిక్రయాల పూర్తి వివరాలను గంట సమయంలోనే వెబ్‌సైట్‌లో వచ్చేలా చట్టం తెచ్చే బాధ్యత నాది. మన చట్టం దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపొందిస్తం. ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు. రెండు నెలల తర్వాత మీ పని రూపాయి ఖర్చు లేకుండా పూర్తవుతుంది. అప్పటిదాకా ఓపికపట్టండి.

పసుపు పంటకు మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమే
నిజామాబాద్ రైతులు పసుపు పంటకు మద్దతు ధర అడుగుతున్నరు. నిర్మల్‌లో కూడ కొద్దిమంది రైతులు పసుపు పండిస్తరు. మద్దతు ధర రాష్ట్రం చేతులో లేదు. అది కేంద్రం నిర్ణయించాలి. ఐదేండ్ల నుంచి ఐదొందల దరఖాస్తులు ఇచ్చిన. పసుపుబోర్డు పెట్టవయ్యా అని స్వయంగా మోదీకి చెప్పిన. ఐదేండ్లు పెడచెవిన పెట్టిండు. బీజేపీ ఎంత సిగ్గులేని పార్టీ అంటే.. ఆ పార్టీ జాతీయ సెక్రటరీ నిజామాబాద్‌కు వచ్చి.. మమ్మల్ని గెలిపించండి.. మూడ్రోజుల్లో పసుపుబోర్డు పెడతా అంటున్నడు. మరి ఐదేండ్ల నుంచి అడుగుతుంటే ఎక్కడ పండుకున్నవ్? ఓట్లకోసం దిగజారి ఇంత నీచంగా మాట్లడవచ్చునా? ఐదేండ్లనుంచి అడుగుతున్నా.. ఎన్ని దరఖాస్తులిచ్చినా.. ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోకుండా ఎన్నికలప్పుడు వచ్చి.. మాకు గుద్దుర్రి అంటే! అవును. గట్టిగా గుద్దాలి. తొక్కుడు తొక్కితే పాతాళానికి తొక్కాలి.

తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్..
భారత్‌కు కశ్మీర్ ఎలాగో.. మన రాష్ట్రానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అలాంటిది. అద్భుతమైన పంటలు పండే గొప్ప సారవంతమైన భూములున్నయి. నీళ్లు కావాలి. పాత ప్రాజెక్టులను చాలావరకు బాగుచేశాం. మరికొన్ని కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతున్నం. అన్ని పనులు వేగంగా జరుగుతున్నయి. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ నింపుకొంటం కాబట్టి మంచి జరుగుతుంది. తమ్మిడిహెట్టి వల్ల మరో రెండులక్షల ఎకరాలకు నీరువస్తుంది. రెండుమూడేండల్లో కశ్మీర్‌లాగే ఆదిలాబాద్ పచ్చని పంటలతో కళకళలాడుతుంది. అలా చేసే బాధ్యత నాది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.