Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దొడ్డికొమురయ్య భవన్

తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్రరాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం ఎకరం, ఎకరన్నర స్థలంతోపాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాజధానికి వెళ్లగానే స్థలం కేటాయింపు, నిధుల మంజూరు జీవో ఇస్తానని, వీలైనంత త్వరలో భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తానని ఆయన గొల్లకురుమల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆదివారం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో జరిగిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

KCR-visits-Komuravelli-Mallanna-Temple -హైదరాబాద్‌లో ఒకటిన్నర ఎకరాల్లో.. ఐదు కోట్లతో నిర్మాణం: కేసీఆర్ -గొల్లకురుమలకు ముఖ్యమంత్రి కానుక -రాజకీయంగా వారిని ప్రోత్సహిస్తా -ఆధ్యాత్మిక కేంద్రంగా కొమురవెల్లి క్షేత్రం -ఎంత ఖర్చయినా వెనుకాడబోమన్న కేసీఆర్ -మల్లన్న కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం -పట్టుబట్టలు, ముత్యాల తలువాలు సమర్పణ ప్రభుత్వ లాంఛనాలతో స్వామి వారికి పట్టుబట్టలు, ముత్యాల తలువాలు సమర్పించారు. అనంతరం ఆ క్షేత్రంలో నూతనంగా నిర్మించిన కురుమ భవనానికి ప్రారంభోత్సవం చేసి జాతీయ కురుమ కుల సంఘం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నికులాలు బలపడాల్సి ఉంది.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి.

అందరం శక్తివంచన లేకుండా ఎవరి స్థాయిలో వారు పనిచేసి బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా ఆశీర్వదించాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుందాం. మనం చేసే మంచిపనికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా మనకు ఉంటాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా తెలంగాణ సబ్బండ కులాల, వృత్తుల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం అంకితమైందని ఆయన చెప్పారు. కురుమల మేధాసంపత్తి అపారం..: గొల్ల కురుమలలో విద్య అంతగా లేకపోయినా వారిలో మేధాసంపత్తికి లోటు లేదని సీఎం అన్నారు. అందువల్ల కురుమలు ప్రభుత్వం అందించే పథకాలు వినియోగించుకుని తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా దిద్దాలని కోరారు. మారుతున్న సమాజంలో గొర్రెల పెంపకం వృత్తిలో తగినంత రాబడి రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. గొర్రెల పెంపకం అత్యాధునిక పద్ధతుల్లో సాగేవిధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నీతి నిజాయితీలకు గొల్లకురుమలు మారుపేరని ఆయన కొనియాడారు.

తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బ్యాంకులు గొల్లకురుమలకు రుణాలు ఇవ్వడానికి జంకినపుడు తానే హామీగా ఉండి ఇప్పించానని కేసీఆర్ చెప్పారు. ఆ రుణాలను నాలుగు నెలలు ముందుగానే చెల్లించి వారు తమ నిజాయితీని చాటారని చెప్పారు. కురుమలు ఆడంబరాలకు పోరని పొదుపుగా జీవిస్తారని అన్నారు. కురుమలు సాంఘికంగా, రాజకీయంగా కూడా ముందంజ వేయాల్సి ఉందని ఆ దిశగా కురుమ నాయకులకు పదవులు కేటాయించి ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులతో చర్చించి కురుమలకు ప్రభుత్వం తరపున చేయగలిగిన సహాయం చేస్తానని చెప్పారు.

మల్లన్న క్షేత్రాన్ని తీర్చి దిద్దుతా.. కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొనడం ఒక మంచి కార్యం. మనసు సంతోషంగా ఉంది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉత్సవాలకు కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు ఇక్కడకు వచ్చారని, ఈ పవిత్ర దివ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు. కొమురవెల్లికి ఎకరం జాగ కూడా లేదని, అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రాన్ని సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇక్కడ భక్తుల వసతికోసం కాటేజీలు, విల్లాలు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. కొమురవెల్లిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సభ అయిపోయిన తరువాత జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ జాయింట్ కమిషర్‌తో సమీక్షించి అన్నిచర్యలు తీసుకుంటాం అని ఆయన హామీ ఇచ్చారు.

ఉన్ని పరిశ్రమ పెట్టండి: కేంద్రమంత్రి దత్తాత్రేయ మల్లన్న ఉత్సవాల్లో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్ర్తాలు సైతం సమర్పించడం చాలా ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కొమురెల్లికి తను చిన్నప్పుడు తల్లితో కలిసి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఈ క్షేత్ర అభివృద్ధికి సీఎం కృషి చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పారిశ్రామికంగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారని అన్నారు. గతంలో మెదక్ జిల్లాలో మంచి ఉన్నిపరిశ్రమ ఉండేదని, రాష్ట్రంలో ఇప్పుడు అనువైన చోట ఉన్నిపరిశ్రమను నెలకొల్పాలని ముఖ్యమంత్రిని కోరారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా రాష్ర్టానికి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

రాష్ర్టాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న కేసీఆర్: ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తపుంతలు తొక్కిస్తున్నారని, నూతన దృక్పథంతో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక, నైతికత ఆధారంగా సాగుతున్నదని అన్నారు. యాదగిరిగుట్టలాగే కొమురవెల్లిని సైతం అభివృద్ధి పరచాలని అభ్యర్థించారు. రాష్ట్ర గృహనిర్మాణ , దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కడియం శ్రీహరి, ఆజ్మీరా సీతారాంనాయక్,

వరంగల్, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు గద్దల పద్మ, తుల ఉమ, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కొండా సురేఖ, శంకర్‌నాయక్, అరూరి రమేష్, డీఎస్ రెడ్యానాయక్, కోనేరు కోనప్ప, సోమారపు సత్యనారాయణ, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ డీజీపీ పేర్వారం రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఏ ముఖ్యమంత్రి కూడా కొమురవెల్లి క్షేత్రాన్ని సందర్శించని నేపథ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఉద్యమసారథిగా, ప్రభుత్వ సారథిగా ఉంటూ మల్లన్న క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేకత చాటుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించారని, ఇది ఒక ఆనవాయితిగా కొనసాగాలని సభలో కురుమకుల పెద్దలు యెగ్గ మల్లేశం కొనియాడారు.

కొమురవెల్లి అభివృద్ధికి ప్రణాళికలు.. కొమురవెల్లి క్షేత్రాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచే దిశగా కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నది. కొమురవెల్లికి వచ్చిన సీఎం కేసీఆర్ కల్యాణోత్సవం, కురుమ కుల భవనం ప్రారంభ సమావేశం అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కొమురవెల్లి కొండలు, గుట్టలతో ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆకర్షణీయ ప్రాంతమని, ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలుకూడా ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు.

సాధ్యమైనంత తొందరగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఆయన అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సమీక్ష వివరాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. కొమురవెల్లి, ఐనాపూర్, రాంపూర్, వేచరేణి, కిష్టంపేట, గౌరాయపల్లి ఈ ఆరు గ్రామాల పరిధిలో దాదాపు 166 ఎకరాల స్థలంలో ఒక గొప్ప దివ్వక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తమ అంచనాలను సీఎంకు వివరించారని చెప్పారు. అన్ని విధాలుగా ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారని వివరించారు.

హైదరాబాద్ రూట్‌లో రాజీవ్ రహదారిపై రెండు స్వాగత తోరణాల నుంచి కొమురవెల్లిని కలుపుతూ ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. భక్తుల వసతికోసం సహజసిద్ధమైన గుట్టల మధ్య అతిథిగృహాలు, కాటేజీలు, విల్లాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారని చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఆలయ భూముల పట్టాల వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం చెప్పారన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.