Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దూకుడు మంత్రం!

2.1/2 సంవత్సరాలు బంగారు బాటలో..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏండ్లు. దశాబ్దాల పీడన నుంచి విముక్తమై ఇంటి పార్టీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం దిశగా సాగుతున్న పయనానికి 30 మాసాలు. ఉద్యమ కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షల సాధనకు కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్న తరుణం. ఒక రాష్ట్ర మహా పునర్ నిర్మాణంలో రెండున్నర ఏండ్లు పెద్ద సమయం కాదు. అయినా ఈ స్వల్పకాలంలోనే మనం అనేక విజయాలు సాధించుకున్నాం. మౌలికరంగ నిర్మాణం వేగంగా సాగుతున్నది. సంక్షేమం పరుగులు పెడుతున్నది. అసాధ్యమనుకున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్న తీరులో, నదీజలాల వివాదాలు కొలిక్కితెచ్చి ప్రాజెక్టులకు వేసుకుంటున్న పునాదిరాళ్లలో తెలంగాణ భవిష్యత్తు కండ్లకు కడుతున్నది. పాలమూరు బీళ్లను తడిపిన కల్వకుర్తి, భాగ్యనగరానికి తరలివచ్చిన గోదావరి, రాజేశుని పాదాలు కడిగిన ఎల్లంపల్లి ఆకుపచ్చ తెలంగాణకు భరోసా ఇస్తున్నాయి. మలిసంధ్యలో ఆదరణకు వృద్ధాప్యం ఆనందబాష్పాలు రాలుస్తుంటే.. సన్నబియ్యం అన్నం బాల్యాన్ని ముద్దాడుతున్నది. బీడీలు చుట్టే ఆడపడుచుల్లో ఆత్మగౌరవం తొణకిసలాడుతుంటే.. చెరువుల్లో ఎగిసిపడుతున్న చేప పిల్లలు మత్స్యకార్మికుల కండ్లలో తళుక్కుమంటున్నాయి. 9 గంటల కరెంటు రైతుకు భరోసా ఇస్తుంటే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదల ఇండ్లలో పెండ్లి వాద్యాలు వినిపిస్తున్నాయి. దళిత, మైనారిటీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురుకులాల్లో రూపుదిద్దుకుంటుంటే వరుసగా వెలువడుతున్న టీఎస్‌పీఎస్సీ ప్రకటనలు యువతను ఉద్యోగపర్వం వైపు నడిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణ నిండైన ఆత్మవిశ్వాసాన్ని రంగరించుకున్నది. విధ్వంసమైన తెలంగాణకు ప్రాణం పోసే మహాయజ్ఞం కొనసాగుతున్నది.

cm-kcr-press-meet-after-holding-a-cabinet-meeting

రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్ గత రెండున్నర ఏండ్లలో ఇటు ప్రభుత్వపరంగా ఘనవిజయాలు సాధిస్తూనే అటు పార్టీ పరంగా హిమాలయమంత ఎత్తుకు ఎదిగింది. స్వరాష్ట్ర సాధనకు ముందు అసెంబ్లీలో పది స్థానాలకే పరిమితమైన టీఆర్‌ఎస్ ఇవాళ 84స్థానాలకు ఎదిగింది. మొత్తం 40సీట్లున్న శాసనమండలిలో 29స్థానాలు సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 10 జడ్పీలతో పాటు జీహెచ్‌ఎంసీలోని150 డివిజన్లకుగాను 99 డివిజన్లలో విజయఢంకా మోగించింది. ఇవాళ ఆ జిల్లా.. ఈ జిల్లా, ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా రాష్ట్రం నలుమూలలా గ్రామగ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడుతున్నది.

టీఆర్‌ఎస్ ఇవాళ దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కల్గిన ప్రాంతీయ పార్టీ. మహామహులు అనదగిన అనేకమంది నాయకులు గులాబీసైన్యంలో భాగం. ఇతర పార్టీలేవీ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించనంత ఎత్తుకు టీఆర్‌ఎస్ ఎదిగింది. గత రెండున్నరేండ్లలో జరిగిన అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో కారు దూకుడు ప్రత్యర్థిపార్టీల అడ్రసులను గల్లంతు చేసింది. ఎన్నికలు ఏవైనా రికార్డుస్థాయి విజయాలు సాధిస్తూ ప్రజల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నది. 50 లక్షల గులాబీ సైన్యం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నది. ప్రజల ఆకాంక్ష అయిన బంగారు తెలంగాణ లక్ష్యసాధనకు ప్రభుత్వం వేసే అడుగులను అనుసరిస్తూ… యావత్తు తెలంగాణను సీఎం కేసీఆర్ వెంట నడిపిస్తున్నది.

ప్రజల నాడి తెలిసిన నాయకత్వం.. టీఆర్‌ఎస్ తెలంగాణలో ఇవాళ ఇంటిపార్టీగా మారింది. టీఆర్‌ఎస్ అంటే మా పార్టీ అని చెప్పుకునే స్థాయి సాధించింది. 14 సంవత్సరాల మడమ తిప్పని ఉద్యమం.. ఉత్థానపతనాల్లో జెండా దించని కఠోరదీక్ష ప్రజల హృదయాలను గెలుచుకుంది. నాటి ఉద్యమనేత కేసీఆర్ రాష్ట్రంలో ఊరూవాడా కాలికిబలపం కట్టుకుని తిరిగిన తీరు తెలంగాణ అన్యాయాల మీద జరిపిన రాజీ లేని పోరాటం ప్రజల్లో విశ్వాసానికి పునాది వేసింది. తెలంగాణ సాధనకు ఆయన చేపట్టిన మార్గం ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన చాణక్యం నాలుగుకోట్ల ప్రజలను ఉద్యమంలో మమేకం చేసింది. టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని 2014కు ముందు ఆ తర్వాత అంటూ రాజకీయ విశ్లేష కులు బేరీజు వేస్తారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రయాణం 2014కు ముందు ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలు, భావోద్వేగాల ఆధారంగా సాగింది. అందుకే ఇవాళ తెలంగాణ బిల్లు పెట్టిన పార్టీని కాదని, మొదటినుంచీ నిలిచి గెలిచిన పార్టీకి పట్టం కట్టారు. ఇదొక భాగం. ఇక 2014 తరువాత టీఆర్‌ఎస్ అవలంబించిన విధానం అన్ని ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శకంగా నిలిచింది. పార్టీని దుర్భేద్యంగా రూపొందించుకున్నారు. ఉద్యమం సమయంలో జరిగిన ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో అలాగే ఇప్పుడూ కష్టపడుతున్నారు. అని ఒక నేత విశ్లేషించారు. తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే ఘనవిజయం సాధిస్తున్నారంటే దాని వెనుక ఈ సుశిక్షితులైన కార్యకర్తల కృషి ఉన్నది.

గ్రేటర్‌లో ధూం తడాఖా.. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ధూం తడాఖా చూపింది. మొత్తం 150 డివిజన్లలో 99 డివిజన్లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకోవడం అన్ని రాజకీయ పార్టీలను షాక్‌కు గురిచేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అసలు టీఆర్‌ఎస్ పార్టీకి బలమే లేదని, సీమాంధ్రులంతా టీడీపీ, కాంగ్రెస్ వెంట నిలుస్తారని వేసిన అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో పార్టీ క్యాడర్ 40రోజుల పాటు చేసిన కార్యక్రమాలు, పాదయాత్రలు ప్రతిపక్షాల అడ్రసులను గల్లంతు చేశాయి. హైదరాబాద్ నగరం మీద తమ విజన్‌ను పార్టీ చాలా స్పష్టంగా ప్రజలకు విడమరిచి చెప్పి వారి ఆశీర్వాదం పొందింది.

రాజకీయ సుస్థిరత.. ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ సుస్థిరతే అభివృద్ధికి బాటలు వేస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐదేండ్లలో ముగ్గురు నలుగురు సీఎంలు మారుతూ ఉంటే టీడీపీ పాలన యావత్తూ వెన్నుపోట్ల భయం వెంటాడేది. అసంతృప్తులు, తిరుగుబాట్లు కుట్రలతో పుణ్యకాలం హరించుకు పోయేది. ఫలితంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కేవి. తెలంగాణలో అటువంటి పరిస్థితికి సీఎం కేసీఆర్ చెక్ పెట్టారు. టీఆర్‌ఎస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. కొన్ని పార్టీలు అదృశ్యం కాగా మరికొన్ని నామమాత్రంగా మిగిలాయి. ఫలితంగా రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఒక చారిత్రక అవసరంగా మారింది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పథకాలు వాటిపట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న మద్దతు మహామహా నాయకులనే పునరాలోచనకు గురిచేశాయి. ఈ క్రమంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఫలితంగా 120 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్ పార్టీకి 84మంది ఎమ్మెల్యేల బలం సమకూరింది. ఇక శాసనమండలిలో టీఆర్‌ఎస్ 29 స్థానాలతో పటిష్టంగా మారింది. తెలంగాణ భవన్‌లో ప్రతి రోజూ ఏదో ఒక పార్టీకి చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరుతూనే ఉంటారు.

టార్గెట్ 2019.. టీఆర్‌ఎస్ 50లక్షలకుపైగా సభ్యత్వంతో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయికి లెక్క చూపేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. మరో రెండున్నరేళ్లలో వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఎక్కడ ఎన్నికలు జరిగినా కారే టాప్‌గేర్‌లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో 2019 సాధారణ ఎన్నికలు అసలు సమస్య కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సహజంగా ప్రభుత్వం ఏర్పడగానే సంబంధిత రాజకీయ పార్టీపై వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. కానీ రెండున్నరేళ్లలో అటువంటి పరిణామమేదీ ఇప్పటివరకు కనిపించలేదు. టీఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజల సంక్షేమం, ప్రజల దీర్ఘకాలిక అవసరాలు తీర్చేవే. ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఏం చెప్పిందో… ప్రజలు దేనికి ఆకర్షితులయ్యారో… వాటినే ప్రభుత్వం చేపట్టింది అని వారంటున్నారు.

కార్యకర్తల సంక్షేమం.. మ్యానిఫెస్టో అమలు రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్, పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నది. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల బీమా చేయించింది. ప్రమాదాలకు గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఎప్పటికప్పుడు పరిహారం అందుతున్నది. పార్టీ కార్యకర్తలకు బీమా చేయించడం టీఆర్‌ఎస్‌తోనే మొదలైందని చెప్తున్నారు. దీంతోపాటు 2014 ఎన్నికల సమయంలో రూపొందించిన మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్న పార్టీగా కూడా టీఆర్‌ఎస్ నిలుస్తున్నది. ప్రాజెక్టులు, ఆసరా, బీడీ కార్మికులకు పెన్షన్లు, ఉద్యోగులకు వేతనాల పెంపు, అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు, ఇంటింటికీ తాగునీరు, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నది. మ్యానిఫెస్టోలో పేర్కొనని పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్, టీహబ్ వంటి వినూత్న పథకాలు తెచ్చి ప్రజలకు అందించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.