-10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షలకు పైగా చెక్కుల పంపిణీ -నెలాఖరు వరకు చెక్కుల పంపిణీ -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గిరిజన రైతులకు పంట సాయం
రైతుబంధు కార్యక్రమం అధికారికంగా ముగిసినా.. పలుచోట్ల మిగిలిపోయిన గ్రామాల్లో చెక్కుల పంపిణీ కొనసాగుతూనే ఉంది. గ్రామసభలకు రాలేనివారి ఇండ్లకు వెళ్లి మరీ చెక్కులు, బుక్కులు అందిస్తుండటంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పండుగ పదోరోజు ఘనంగా జరిగింది. శనివారం పదోరోజు ముగిసేసరికి రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షలకుపైగా చెక్కుల పంపిణీ పూర్తిచేశారు. కొన్నిచోట్ల చెక్కుల పంపిణీ ఇంకా పూర్తికాకపోవడంతో.. ఈ నెలాఖరువరకు రైతుబంధు కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామసభలకు రాలేని రైతుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందిస్తున్నారు. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు తాజాగా పంట పెట్టుబడిని అందిస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావుపై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమకు అందిన పంటసాయం చూసుకుని మురిసిపోతున్నారు. శనివారం వివిధ గ్రామాల్లో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఛత్తీస్‌గఢ్ గిరిజనులకు సాయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కొన్నేండ్లకిందట వలస వచ్చిన గిరిజన రైతులు శనివారం పంట సాయం అందుకున్నారు. ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కనుకునూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులోని తండా రైతులకు రైతుబంధు సాయం అందింది. సుమారు 30 కుటుంబాలు ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చాయి. 2005లో వారికి 60 ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు దక్కాయి. దీంతో ఆ గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాయి. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకంలో భాగంగా అటవీ హక్కుల భూములకు కూడా సాయం అందిస్తున్నారు. దీంతో వారికి రూ.2.40 లక్షల పంట పెట్టుబడి సాయం అందింది. దీంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.