Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

‘దీక్షా దివస్‌’ యాదిలో..

అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో ఒక అస్తిత్వ పోరాటంగా 60 ఏండ్ల కిందట తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నది. ఈ తొలిదశ పోరాటంలో ఎందరో మహనీయులు రాష్ట్రం కోసం కొట్లాడారు. కానీ ప్రజలను చైతన్యం చేయడం, రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని సబ్బండవర్గాల వద్దకు తీసుకువెళ్లడం లాంటివి చేయలేకపోయారు. ఈ విషయంలో ఉద్యమ రథసారథి కేసీఆర్‌ విజయం సాధించారు. గాంధీజీ అహింసావాదాన్ని అస్త్రంగా చేసుకొని ఆయన పోరాటం చేశారు. యావత్‌ తెలంగాణను ఏకంజేసి, రాజకీయంగా ఒత్తిడి తెచ్చి దశాబ్దాల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి ‘తెలంగాణ బాపు’గా పేరు గడించారు.

చావు నోట్లో తలపెట్టి, స్వరాష్ట్ర స్వప్నాన్ని ముద్దాడిన వ్యక్తి కేసీఆర్‌. పద్నాలుగేండ్ల తర్వాత రాబోయే తెలంగాణను తన మనుసుతో చూశారు తప్ప, ఎదుటివారి వెకిలి మాటలకు కేసీఆర్‌ కుంగిపోలేదు. ఆ రోజు ఆయన అక్కడే ఆగిపోయి ఉంటే, ఈ రోజు తెలంగాణ ఇట్లా ఉండేది కాదేమో!

తెలంగాణ కంటే ముందు జార్ఖండ్‌ కోసం స్వరాష్ట్ర ఉద్యమం నడిచింది. శిబూ సోరెన్‌ నాయకత్వంలో ‘జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)’ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసి బీహార్‌ నుంచి కొత్త రాష్ట్రం తెచ్చుకున్నారు. గిరిజనుల భూములను విముక్తి చేయడంతో ఉద్యమం ప్రారంభించిన శిబూ సోరెన్‌ దాన్ని స్వరాష్ట్ర కాంక్షగా మార్చి 2000లో గమ్యం ముద్దాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ‘జేఎంఎం’ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన కుమారుడు హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవిలో కొనసాగుతున్నారు. జార్ఖండ్‌, తెలంగాణ రెండు స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాలే. కానీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఆసాంతం అహింసాయుతంగా సాగింది. ఆయన ఎలాంటి హింసకు తావులేకుండా ఉద్యమాన్ని గమ్యం వైపు నడిపించారు.

తమ ప్రాణాలతోనైనా రాష్ట్రం వస్తుందేమోనని విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే చూసి చలించిపోయారు. ఆఖరికి ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. కరీంనగర్‌ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షాస్థలి వద్దకు కేసీఆర్‌ బయల్దేరగా, ఆయన వాహనాన్ని ముట్టడించిన పోలీసులు, ఆమరణ నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కేసీఆర్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అక్కడినుంచి పోలీసులు కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైలులోనే కేసీఆర్‌ తన దీక్షను ప్రారంభించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఆమరణదీక్ష చేశారు. ‘ఆ పది రోజులు కేసీఆర్‌ మానేసిన అన్నం ప్రజలకు బోనం కుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు కైగట్టి ఇప్పటికీ పాడుతారు.

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. డిసెంబర్‌ 1న ‘నేను లేకున్నా సరే ఉద్యమం నడపాల’ని కేసీఆర్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 2న పార్లమెంట్‌లో కేసీఆర్‌ సాగిస్తున్న ఆమరణ నిరాహారదీక్షను అద్వానీ ప్రస్తావించారు. ఆరో గ్యం క్షీణించడంతో కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ‘డిసెంబర్‌ 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేకుంటే నా శవయాత్ర’ అని ఆయన ప్రకటించారు. ఎంతమంది దీక్ష విరమించాలని చెప్పినా ఒప్పుకోలేదు. ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. పసిపిల్లాడి నుంచి పండు ముసలిదాకా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా రాష్ట్ర ప్రజలు పోరుబాట పట్టారు.

కేసీఆర్‌ ఆమరణదీక్షతో తెలంగాణ అట్టుడికి ఢిల్లీ పెద్దలు దిగొచ్చారు. స్వరాష్ట్రం ఇస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ త్యాగానికి గుర్తు గా ఆయన దీక్ష చేపట్టిన నవంబర్‌ 29ని యావత్‌ తెలంగాణ ‘దీక్షా దివస్‌’గా జరుపుకొంటూ నాటి త్యాగాలను యాది చేసుకుంటున్నది.

వచ్చిన తెలంగాణను ఎవరి చేతిల పెట్టినా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తరో లేదో! ఎందుకోసం కొట్లాడినమో.. దాన్నే మరుగునపడేసే ప్రమాదం ఉన్నదని మేధావులు, నాయకుల కోరిక మేరకు కేసీఆర్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాను ఉద్యమంలో ఏయేవర్గాల ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూశారో.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వాటన్నింటికీ పరిష్కార మార్గాలు చూపారు. తన తొమ్మిదేండ్ల పాలన లో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతం పూర్తిచేయడమే గాక, ఇవ్వని హామీలను కూడా అమలుచేస్తున్నారు. చాలా అంశాల్లో తెలంగాణ ఇప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్నది. కేసీఆర్‌నే ఇవ్వాళ దేశం అనుసరిస్తున్నది. ఇది ఆయన దార్శనిక పాలనకు నిదర్శనం. ‘భారత్‌ రాష్ట్ర సమితి’ ద్వారా కూడా దేశాన్ని అస్థిరపరుస్తున్న స్వార్థశక్తులకు బుద్ధిచెప్పి, ఈ దేశ సమస్యలకు పరిష్కారం చూపనున్నది. మన తెలంగాణ బిడ్డ పీవీ దేశ ప్రధానిగా ఈ గడ్డకు కీర్తి తెచ్చినట్లే.. భారత యవనికపై కేసీఆర్‌ చెరిగిపోని సంతకం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.