Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ద్రోహులే మీకు ముద్దా?

-అమరావతికి, ఢిల్లీకి గులాం కోదండరాం
-పిలిచి పీటవేస్తే పంగనామాలు పెట్టిండు
-కంటికి రెప్పలా కాపాడిన టీఆర్‌ఎస్ కాకుండా పోయిందా?
-కోదండరాంపై నిప్పులుచెరిగిన మంత్రి హరీశ్‌రావు
-టీఆర్‌ఎస్‌లో సంగారెడ్డి జిల్లా టీజేఎస్ నాయకులు, కార్యకర్తల చేరిక

స్వీయ అస్థిత్వం, స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూటమి ముసుగులో వలసాంధ్ర పాలకులను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన కోదండరాం.. ఇప్పుడు ఆ పార్టీ ఉన్న కూటమిలో ఎలా చేరుతారని హరీశ్ ప్రశ్నించారు. అమరావతికి, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్న కోదండరాం దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సంగారెడ్డి జిల్లా టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి నగేశ్‌తోపాటు పలువురు ప్రైవేటు ఉద్యోగులు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. నాడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ గౌరవంగా కోదండరాంను పిలిచి జేఏసీ చైర్మన్‌చేస్తే చివరికి ఆయన పంగనామాలు పెట్టాడని విమర్శించారు.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్‌గా ఆయన ప్రతిపాదించగానే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిమిషం ఆలోచించకుండా రాజీనామా చేశారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా చేయకపోగా ప్రొఫెసర్ ఉద్యోగానికి కోదండరాం రాజీనామా చేయాలంటూ అపహాస్యం చేశారని, అలాగే టీడీపీ తన ఎమ్మెల్యేలతో నాటకాలాడించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కోదండరాంకు ఎలా ముద్దయ్యాయని హరీశ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఐదారు సీట్ల కోసం గాంధీభవన్ మెట్లవద్ద పడిగాపులుకాస్తున్న కోదండరాంది అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండాయేనని, 2014లో ఒక్కసారిగా హైదరాబాద్‌లో అదృశ్యమై ఢిల్లీలో ప్రత్యక్షమైన ఆయన.. కాంగ్రెస్ నాయకులతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఇద్దరు ముగ్గురికి టికెట్లు తెచ్చుకున్నాడన్నారు. మహాకూటమి లక్ష్యమేమిటో కోదండరాం చెప్పాలన్నారు. తెలంగాణ ద్రోహల పార్టీ అని చెప్పిన కోదండరాం ఇప్పుడు ఆ ద్రోహులతో అంటకాగుతుండటాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌లోనే గౌరవం..
ఉస్మానియా విద్యార్థులపై మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ వారిని మోసగిస్తున్నదని అన్నారు. ఉద్యమకారులను సముచితంగా గౌరవిస్తున్నది టీఆర్‌ఎస్ మాత్రమేనని, ఉద్యోగ సంఘాల ఉద్యమనేత స్వామిగౌడ్‌కు శాసనమండలి చైర్మన్‌గా, విదార్థి సంఘాల నేత బాల్క సుమన్‌కు ఎంపీగా, గాదరి కిశోర్‌కు ఎమ్మెల్యేగా, డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ల తరఫున పోరాడిన సీతారాంనాయక్‌కు లోక్‌సభ సభ్యులుగా టీఆర్‌ఎస్ అవకాశమిచ్చిందని తెలిపారు. తెలంగాణకు పరాయిపాలన వద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లకుపైగా గెలువడం, కేంద్రంలోనూ చక్రం తిప్పడం ఖాయమన్నారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ, టీజేఎస్ పూర్తిగా ఖాళీ అయ్యాయని, సంగారెడ్డి దారులన్నీ కేసీఆర్ వైపేనని, సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. మహాకూటమికి డిపాజిట్లు కూడా దక్కకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చే 25 రోజులు శ్రమించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, మనోహర్‌గౌడ్, చంద్రశేఖర్, ప్రభ, తులసి, సుమంగళి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.