Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్మార్ట్‌సిటీకి సై

కేంద్రం తలపెట్టిన స్మార్ట్‌సిటీల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని నగర శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్‌సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. హైదరాబాద్ వృద్ధిరేటు, రాష్ట్రప్రభుత్వ పారిశ్రామిక విధానాలు నచ్చిన దుబాయ్ హోల్డింగ్స్ సంస్థ.. రూ. ఐదు వేల కోట్లతో స్మార్ట్‌సిటీని ఏరాటుచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ మేరకు దుబాయ్ ప్రతినిధి బృందంతో రాష్ట్రప్రభుత్వం బుధవారం జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయి.

-దుబాయ్ హోల్డింగ్ కంపెనీ సంసిద్ధత -రూ. 5 వేల కోట్ల పెట్టుబడి.. వారంలో స్థలం ఖరారు -ఐటీఐఆర్, ఐటీ పాలసీలను వివరించిన మంత్రి కేటీఆర్ -పారిశ్రామిక విధానాన్ని విశదీకరించిన మంత్రి జూపల్లి

Smartcity-in-Hyderabad-Telanganaనగరంలోని ఓ హోటల్‌లో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, ఐటీ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, టీఎస్‌ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డితో దుబాయ్ హోల్డింగ్స్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ అధికారి అబ్దుల్ లతీఫ్, స్మార్ట్‌సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి అనిరుధ్ డామ్కీ, స్మార్ట్‌సిటీ ఎండీ బాజు జార్జ్ సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వం లక్ష్యాలు, పారిశ్రామిక విధానాలు, వృద్ధిరేటు, ఐటీలో హైదరాబాద్ స్థానం, ఎగుమతులు వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐటీ రంగానికి ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే ఈ రంగంలోని బెంగళూరుతో పోటీపడుతున్న హైదరాబాద్.. త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉన్నారని చెప్పారు. ఐటీ, ఐటీ ఉత్పాదక రంగాలకు అవసరమైన ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, వ్యాపారవేత్తలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి వివరించారు.

స్మార్ట్‌సిటీ వైపే ఐటీఐఆర్ దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, అది కూడా స్మార్ట్‌సిటీ కోసం ప్రతిపాదించిన కోహెడ, బోడుప్పల్, శంషాబాద్ ప్రాంతాల్లోనే విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ దుబాయ్ ప్రతినిధి బృందానికి తెలిపారు. దేశ, విదేశీ కంపెనీలు ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగానికి ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని, మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన రాయితీలు ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కొత్త వ్యాపారవేత్తలను, పెట్టుబడులను ఆహ్వానించేందుకు స్టైపెండ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

నెలవారీగా స్టైపెండ్ ఇస్తామని హామీఇచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ పద్ధతిని అమలు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఐటీ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడెక్కడ అమలవుతుందో మ్యాపుల ద్వారా ప్రతినిధి బృందానికి వివరించారు. రెండేండ్లలోనే మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో ప్రైవేటు పెట్టుబడులు విస్తృతంగా వచ్చే అవకాశాలు సమృద్ధిగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి బెంగళూరు కంటే హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతమని ఆధారాలతోపాటు వివరించారు. అలాగే తెలంగాణ పారిశ్రామిక విధానం, టీ-ఐడియా, టీ- స్విఫ్ట్, టీ-ప్రైడ్ తదితర అంశాల గురించి చెప్పారు.

కాలుష్య పరిశ్రమల తరలింపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాలుష్యకారక పరిశ్రమలపై ప్రభుత్వ విధానాన్ని దుబాయ్ బృందం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, జూపల్లి మాట్లాడుతూ.. కాలుష్యరహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, అదేస్థాయిలో ఫార్మా, బల్క్‌డ్రగ్ ఇండస్ట్రీని ఆదరిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తున్న అంశాన్ని వివరించారు. అక్కడ కూడా కంబైన్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనావాసాల మధ్య ఉన్న ఫార్మా కంపెనీలు నగర శివార్లకు వెళ్తాయని స్పష్టంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా ఐటీ రంగానికే ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రులు తెలిపారు.

వృద్ధిరేటు ప్రశంసనీయం హైదరాబాద్, తెలంగాణలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వృద్ధిరేటును దుబాయ్ హోల్డింగ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబ్దుల్‌లతీఫ్ ప్రశంసించినట్లు టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను, ప్రోత్సాహకాలను వివరించినప్పుడు వారి నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రతిపాదిత స్థలాలపై కూడా వారు సంతృప్తి వ్యక్తంచేశారన్నారు. వచ్చే వారం, పదిరోజుల్లో వారి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కోచిలో వారు నిర్మిస్తున్న స్మార్ట్‌సిటీకి దాదాపు రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారని, ఇక్కడ అంతకంటే ఎక్కువ అంచనా వేస్తున్నామని జయేశ్‌రంజన్ అన్నారు. అభివృద్ధిలో కోచి కంటే హైదరాబాద్ ఎన్నోరెట్లు ముందున్నట్లు చెప్పారు. దుబాయ్ ప్రతినిధులతో స్మార్ట్‌సిటీపై జరిగిన సమావేశం సంతృప్తికరంగా సాగిందని, త్వరలోనే వారు పెట్టుబడులు పెట్టనున్నారని పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర చెప్పారు.

స్థలాలను మరోసారి పరిశీలించిన బృందం స్మార్ట్‌సిటీ ప్రతిపాదిత స్థలాలైన కోహెడ, బోడుప్పల్, శంషాబాద్‌లను దుబాయ్ హోల్డింగ్స్ ప్రతినిధి బృందం బుధవారం మరోసారి పరిశీలించింది. ఈ ప్రాంతాల్లోని సదుపాయాలను అంచనా వేశారు. సరూర్‌నగర్ మండలం రావిర్యాలలో గతంలో బ్రాహ్మణి ఇన్ఫోటెక్‌కు కేటాయించి రద్దుచేసిన స్థలాలు, ఫ్యాబ్‌సిటీలోని ఖాళీ స్థలాలను కూడా స్మార్ట్‌సిటీ కోసం పరిశీలించారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు దుబాయ్ బృందం ఆసక్తి చూపినట్లు టీఎస్‌ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి చెప్పారు. ఆదిబట్లలోని ఏరోస్పేస్ పార్కు, అక్కడే ఏర్పాటైన టాటా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ కంపెనీ, ఇతర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలను చూపినట్లు తెలిపారు. భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు తెలిపిన అంశాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి సరిపోల్చుకొని ప్రశంసించినట్లు చెప్పారు. స్మార్ట్‌సిటీని హైదరాబాద్‌లో నిర్మించడం ఖాయంగా కనిపిస్తున్నా.. ఎక్కడనేది ఫైనాన్షియల్ వయబిలిటీని బట్టి వారం, పదిరోజుల్లో ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.

స్మార్ట్‌సిటీ అంటే ఇదీ.. ప్రజలు అనుకుంటున్న స్మార్ట్‌సిటీకి, వాస్తవానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని దుబాయ్ స్మార్ట్‌సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అనిరుధ్ డామ్కీ, స్మార్ట్‌సిటీ ఎండీ బాజు జార్జ్ వివరించారు. దుబాయ్, మల్టాల్లోని స్మార్ట్‌సిటీలు, కోచి నిర్మిస్త్తున్న స్మార్ట్‌సిటీల గురించి సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్, బిల్డింగ్ క్యాంపస్ ప్లానింగ్, మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ, స్మార్ట్ సర్వీస్ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

నాణ్యత విషయంలో రాజీ పడబోమని దుబాయ్ హోల్డింగ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబ్దుల్‌లతీఫ్ హామీఇచ్చారు. కోచిలో మొదటిదశ ప్రాజెక్టును ఈ ఏడాది మే నెలలోనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీనికి దుబాయ్, అరబ్ దేశాల నుంచి అనేక మంది పెట్టుబడిదారులు వస్తారని.. వారంతా హైదరాబాద్‌లోనూ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని లతీఫ్ హామీఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.