Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దుమ్ముగూడెం వద్ద బరాజ్

-37 టీఎంసీల నీటినిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి వీలుగా నిర్మాణం
-వచ్చే ఏడాదినుంచి మిడ్‌మానేరుకు 3 టీఎంసీల కాళేశ్వరం నీళ్లు
-రెండు పనులకు 14 వేల కోట్లు అంచనా.. నెలాఖరులోగా టెండర్లు
-మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ తరలింపు.. సీతారామ పెండింగ్ పనులకూ టెండర్లు
-వచ్చే మార్చి చివరికల్లా కంతనపల్లి పూర్తికావాలి
-ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా రాష్ట్రం విభజన
-సాగునీటివ్యవస్థ నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు
-త్వరలో రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్ వర్క్‌షాప్
-నాగార్జునసాగర్ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు
-అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
-ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడేలా బరాజ్ నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు పనులకు వెంటనే అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలువాలని చెప్పారు. వీటికి సుమారు రూ.14వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశారు. వీటితోపాటు మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంతనపల్లి బరాజ్ పనులను వచ్చే మార్చి చివరినాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

దుమ్ముగూడెం వద్ద పుష్కలమైన నీటి లభ్యత
దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నది. ఏడాదిలో 150 రోజులపాటు నీటిప్రవాహం ఉంటుంది. జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నది. ఈ సానుకూలతల నేపథ్యంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బరాజ్, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసేలా ప్లాంటు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీలైనంత తక్కువ భూసేకరణతో, నదిలోనే నీళ్లు ఆగేలా బరాజ్‌ను డిజైన్‌చేయాలని ఆదేశించారు. అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలువాలని కోరారు.

మిడ్‌మానేరుకు మూడు టీఎంసీలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు (శ్రీరాజరాజేశ్వర)కు ప్రస్తుతం రెండు టీఎంసీలు పంపుచేస్తున్నారు. వచ్చే ఏడాదినుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం నిర్ణయించారు. మిడ్‌మానేరుకు మూడు టీఎంసీలు లిఫ్టు చేసి, అక్కడినుంచి మల్లన్నసాగర్‌కు రెండు టీఎంసీలను ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఈ రెండు పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దుమ్ముగూడెం బరాజ్ నిర్మాణం, మిడ్‌మానేరుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టుచేసే పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు సంబంధించి ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.

నీటిపారుదలశాఖ అంతా ఒకటే విభాగం
మేజర్, మీడియం, మైనర్ అనే తేడాలేకుండా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ అంతా ఒకటే విభాగంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ర్టాన్ని ఆరు లేదా ఏడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్సీ ఇంచార్జిగా వ్యవహరించి, తన పరిధిలో నీటిపారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని కోరారు. నీటిపారుదలశాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్దిరోజుల్లోనే రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటిపారుదల విధానాన్ని ఖరారుచేయాలని చెప్పారు. ఈ వర్క్‌షాపులోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వలు, లిఫ్టులు, చెరువులకు సంబంధించిన అన్ని వివరాలతో సమగ్రజాబితా తయారుచేయాలని కోరారు. అన్ని ప్రాజెక్టులు, పంపుహౌస్‌లు, లిఫ్టులు, కాల్వలు, చెరువుల నిర్వహణకు అవసరమైన వ్యూహాన్ని, మాన్యువల్స్‌ను అదే వర్క్‌షాపులో ఖరారుచేయాలని చెప్పారు. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్టు సీఎం వెల్లడించారు.

విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయండి
దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లుచేయాలని విద్యుత్‌శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద అదనంగా ఇంపెల్లర్స్, పంపుసెట్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఉంచాలని కోరారు. నీటిపారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారైన తర్వాత, రాష్ట్రస్థాయి నీటిపారుదల సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు.

సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు
కృష్ణానదిలో నీటిప్రవాహం లేనిసమయంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిడ్‌మానేరుకు మూడు టీఎంసీల నీళ్లు వస్తాయి కాబట్టి.. పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. కాళేశ్వరం ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్‌పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్‌చేసి పానగల్ వాగులో కలుపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జునసాగర్ ఆన్‌లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలని సీఎం చెప్పారు. కృష్ణానదిలో నీటిప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించాలన్నారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటిపారుదలశాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజినీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలని కోరారు.

గోదావరి బేసిన్‌లో మల్లన్నసాగర్ వద్ద, కృష్ణాబేసిన్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటిపారుదలశాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.