Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దసరాకు కొత్త జిల్లాలు

-60 కి.మీ వ్యాసార్థంతో 24 జిల్లాలు -జూన్ 2 తర్వాత వర్క్‌షాప్‌లో తుది నిర్ణయం -డిమాండ్లతో జిల్లాల ఏర్పాటు సాధ్యపడదు.. కార్యాలయాల నిర్మాణానికి జిల్లాకు వంద కోట్లు -కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు -అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు -భారీగా భూ రికార్డుల సంస్కరణ -సాదా బైనామాలన్నీ రిజిస్ట్రేషన్ -అన్యాక్రాంత అసైన్డ్ భూములు వెనక్కి -ఆడపిల్ల తల్లికి కల్యాణలక్ష్మి చెక్కులు -స్థానికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులు -కృష్ణా పుష్కరాల్లో మౌలిక వసతులపై దృష్టి -పత్తికి ప్రత్యామ్నాయాలపై రైతుల్లో చైతన్యం -ఖరీఫ్ లోపలే భగీరథ పైపుల పనులు పూర్తి -వివిధ అంశాలపై జిల్లాధికారులకు సీఎం దిశానిర్దేశం

CM KCR review meet with District Collectors

దసరా పండుగనుంచి రాష్ట్రంలో 24-25 కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పార్టీలు కోరుతున్నాయనో లేక నాయకులు డిమాండ్ చేస్తున్నారనో జిల్లాలు ఏర్పాటు చేయటం కుదరదని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని 60-70 కిలోమీటర్ల వ్యాసార్థంతో నూతన జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఈ విషయంలో పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, జూన్ 2 తర్వాత హైదరాబాద్‌లో వర్క్‌షాపు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ అలంకరించాలని, రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపించాలని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఘనంగా సత్కరించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయాలని సూచించారు. భూరికార్డుల నిర్వహణను ప్రస్తావిస్తూ జూన్ 2నుంచి ప్రత్యేక కార్యక్రమం తీసుకుని సాదా బైనామాల ద్వారా జరిగిన భూలావాదేవీలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయాలని, నిర్ణీత వ్యవధిలో వారసత్వ హక్కుల మ్యుటేషన్ చేయాలని సూచించారు. రెవెన్యూ విభాగంలో అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనపరుచుకోవాలని సీఎం ఆదేశించారు. కృష్ణా పుష్కరాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, ఖరీఫ్ ప్రణాళిక, కల్యాణ లక్ష్మి తదితర అంశాల్లో కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఘనంగా రాష్ట్ర అవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలి. అమరులకు నివాళి అర్పించిన తర్వాతే కార్యక్రమాలు ప్రారంభించాలి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకావిష్కరణ చేయాలి. అన్ని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ఆర్టీసి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులతో పాటు హోటల్స్, మాల్స్‌లో కూడా ఉత్సవ వాతావరణం కనిపించాలి. ప్రజలకు స్వీట్లు పంచాలి. అనాథ శరణాలయాలు, అంధ పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు మాంసాహార భోజనం ఏర్పాటు చేయాలి. ఉపాధి హామీ కూలీలకు కూడా పండ్లు, స్వీట్లు ఇవ్వాలి. ఆలయాలు, మసీదులు, చర్చిలలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వానల కోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయాలి. కవి సమ్మేళనాలు నిర్వహించాలి. ప్రభుత్వ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గొప్పగా గౌరవించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాన్ని అందించాలి. అర్హతలు సాధించడానికి ఐదేండ్ల సమయం ఇస్తూ అన్ని రకాల నిబంధనలను ప్రభుత్వం సడలిస్తుంది. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాం. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన ఉత్సవానికి ప్రతి జిల్లా నుంచి 50 మంది ప్రముఖులను పంపించాలి.

జూన్ 2 నుంచి సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు.. గ్రామీణ ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు సాదాబైనామాల మీద( తెల్లకాగితంపై) జరుగుతున్నాయి. గ్రామీణుల్లో అవగాహన లేక పోవడం వల్ల కొంత, పేదరికం వల్ల మరికొంత ఇలా జరుగుతున్నది. మాట మీద నమ్మకంతో కూడా చాలా మంది పట్టా చేయించుకోవడం లేదు. ఇలా ఇరవై ముప్పై ఏండ్లు కాగితాల మీద ఉన్న భూములు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినపుడు అనవసర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు దీనికి ఒక పరిష్కారం కావాలి. వీటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయాలి. జూన్ 2వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఈ కార్యక్రమం తీసుకోవాలి. సాదాబైనామాల ద్వారా జరిగిన భూలావాదేవీలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయాలి. చిన్న రైతులకు మేలు జరిగేలా 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాల ద్వారా జరిగిన ఐదు ఎకరాలలోపు భూముల లావాదేవీలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ కార్యక్రమానికి మంచి ప్రచారం కల్పించి రైతులు ముందుకు వచ్చేలా ప్రోత్సహించండి. ఎనిమిది రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ఆ వివరాలన్నింటిని కంప్యూటరీకరణ చేసి అప్‌డేట్ చేయాలి. హెచ్‌ఎండీఏ, కుడా, మున్సిపల్ ప్రాంతాలు పక్కకు పెట్టి కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమం నిర్వహించండి. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడినా, నిర్లక్ష్యం వహించినా ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి.

10 రోజుల్లో వారసత్వ హక్కుల మార్పిడి.. వారసత్వ భూములకు సంబంధించి మ్యూటేషన్ (పేరుమార్పిడి)లో కూడా అధికారులు అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వనిదే పని చేయడం లేదు. ఈ పద్ధతి పోవాలి. పేరు మార్పిడి(పాతి) విషయంలో కూడా 10 రోజుల నిర్ణీత గడువు ఉండాలి.

దరఖాస్తు అందిన 10 రోజుల్లో పేరు మార్పిడి చేసి 11వ రోజు కలెక్టరేట్‌కు వివరాలు పంపించాలి. ఏ అభ్యంతరాలు ఉన్నా దరఖాస్తు చేసినపుడే చెప్పాలి. తెలియనివాళ్లకు, నిరక్షరాస్యులకు అవగాహన కలిగించాలి. మ్యుటేషన్ ప్రక్రియలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎలాంటి ప్రాంతంలోనైనా సరే, భూమి విక్రయం జరిగి రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలి. 16వ రోజు వివరాలు కలెక్టరేట్‌కు అప్‌లోడ్ కావాలి. ఈ వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి ఎక్కువ వాయిదాలు వేయకుండా త్వరగా విచారించి పరిష్కరించాలి.

15 రోజుల్లో నాలా మార్పిడి.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లో మార్పిడి జరగాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు బదలాయించే సందర్భంలో వసూలు చేసే(నాలా) పన్నును ఇటీవల సవరించారు. దాని ప్రకారం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులు ఇవ్వాలి.

కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు.. త్వరలో జరిగే కృష్ణాపుష్కరాల కోసం ఏర్పాటు ఘనంగా చేయాలి. గోదావరినదిలాగా మనకు కృష్ణా నదితో ఎక్కువ పొడవైన తీరం లేనందున వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పుష్కర ఘాట్స్, పార్కింగ్ ప్లేస్, అప్రోచ్ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. నదిలో పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. జోగుళాంబ దేవాలయం దగ్గర భక్తులకు వసతులు కల్పించాలి.

పత్తికి ప్రత్యామ్నాలపై ప్రచారం.. వచ్చే ఖరీఫ్ కోసం ఇప్పటినుంచే సిద్ధం కావాలి. పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రచారం చేసి రైతులను ప్రోత్సహించాలి. సోయాబీన్ విత్తనాలను ఎక్కువ మొత్తం రైతులకు అందుబాటులో ఉంచాలి. ఆయా ప్రాంతాల్లో రైతులు డిమాండ్ చేసే ఇతర విత్తనాలను కూడా వ్యవసాయశాఖ ద్వారా అందించాలి. డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఖరీఫ్ వస్తున్నందున ఈ లోపున మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణం వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి చేయాలి.

డబుల్‌బెడ్ పనుల్లో స్థానికులకు ప్రాధాన్యం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ టెండర్లు పిలవాలి. స్థానికులతో కట్టించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా అందించాలి. అలాగే విద్య విషయానికి వస్తే పదవ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు ఎలాంటి పరిమితి లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలి అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్‌లతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు.

జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయండి.. రాష్ట్రంలో చాలా పెద్ద జిల్లాలు ఉన్నాయి. పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాల అవసరం ఉంది. మెరుగైన పాలన అందించేందుకు హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలను ఎలా పునర్వ్యవస్థీకరించాలనే అంశంలో అనేక విధాల అలోచనలు చేస్తున్నాం. ప్రభుత్వం ముందుకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఆ మేరకు 24-25 జిల్లాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటు మీద కలెక్టర్లు కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలి. ఒక జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు మాత్రమే ఉండాలి. కొత్త జిల్లాల ఏర్పాటు మీద జూన్ 2 తరువాత హైదరాబాద్‌లో వర్క్‌షాప్ పెట్టుకొని తుది కసరత్తు చేసుకుందాం. ప్రభుత్వం ముందు అనేక ప్రతిపాదనలున్నాయి. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా జరగాలి. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి. అర్బన్ మండలాల ఏర్పాటు జరగాలి. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కూడా జరగాలి. ఈ మేరకు మండల కేంద్రానికి దగ్గరున్న గ్రామాలన్నింటినీ అదే మండలంలో చేర్చాలి. రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ఆర్డీఓ ఉండాలి.

పత్రికల కథనాలు పట్టించుకోవద్దు.. : జిల్లాల ఏర్పాటుపై పత్రికల్లో అనేక కథనాలు వస్తున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. కొత్త జిల్లాల ఏర్పాటు మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ కసరత్తు జరుపుతున్నది. కలెక్టర్లు కూడా కూలంకశంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించాలి. మ్యాపులు కూడా తయారు చేయించండి. వర్క్‌షాపులో అన్నింటినీ సమీక్షించి ఆ తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందాం. పార్టీలు కోరుతున్నాయనో.. నాయకులు డిమాండ్ చేస్తున్నారనే కాకుండా ప్రజలకు ఏది సౌలభ్యంగా ఉంటుందో ఆ మేరకే జిల్లాలు ఏర్పాటు కావాలన్నదే మా లక్ష్యం. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, కొత్త కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల నిర్మాణానికి వంద కోట్ల చొప్పున కేటాయిస్తాం. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలన్నదే లక్ష్యం. కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్లు ఏర్పాటు చేస్తున్నందువల్ల అదనంగా రెవెన్యూ అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఖాళీలతో పాటు కొత్త పోస్టులకు ప్రతిపాదనలు పంపాలి. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణలో కలెక్టర్లు శాస్త్రీయంగా ప్రతిపాదనలు పంపాలి.

ఆడపిల్ల తల్లికి కల్యాణలక్ష్మి చెక్కు.. ప్రజా సంక్షేమం కోసం జరిగే కార్యక్రమాల్లో అవినీతిని నిరోధించాలి. కల్యాణలక్ష్మితో పాటు ఇతర కార్యక్రమాల్లో లబ్ధిదారులకు అందించే సాయాన్ని చెక్కు రూపంలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అందించాలి. కల్యాణలక్ష్మి చెక్కులను ఆడపిల్ల తల్లికి అందించాలి. వివాహానికి 20 రోజుల ముందే దరఖాస్తు చేయాలి. పెండ్లికి ముందే సహాయం అందించాలి.

అన్యాక్రాంత అసైన్డ్ భూముల స్వాధీనం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి దాకా 25 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. కానీ చాలా వరకు ఆ భూముల్లో అసైన్డ్ దారులు కాస్తులో లేరు. భూమి వేరే వారి చేతుల్లో ఉంది. ఇచ్చిన భూమి కూడా శాస్త్రీయంగా పంపిణీ కాలేదు. కనీసం మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంటేనే అది ఆర్థికంగా ఉపయోగపడుతుంది. గతంలో వ్యవసాయయోగ్యం కాని రాళ్లురప్పలతో కూడిన భూమిని ఇవ్వటం వల్ల లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఆ పరిస్థితి మారాలి. అసైన్డ్ భూముల పూర్తి వివరాలు సేకరించండి. పంచిన భూమి అసైన్డ్ దారుల వద్దే ఉందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు భూమి ఎక్కడ ఉంది? అనే వివరాలు జూన్ 30లోగా సేకరించాలి. అసైన్డ్ భూముల వివరాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు కేటాయిస్తాం. అసైన్డ్ దారులు కాస్తులో ఉంటే వారు వ్యవసాయం చేసుకోవడానికి ఎస్సీ, ఎ స్టీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.