– వరంగల్ నుంచి విస్తరణ మొదలు – త్వరలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో వచ్చే ఏడాది నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో ఐటీ క్యాంపస్‌లు – వరంగల్‌లో లాంఛనంగా సైయెంట్, టెక్ మహేంద్రా క్యాంపస్‌లు ప్రారంభం – యువతలో నైపుణ్యశిక్షణకు ఉమ్మడిజిల్లాకో కేంద్రం – తెలంగాణ నుంచి దేశంలో రెండోహరిత విప్లవం – మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు చర్యలు: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో అన్ని ద్వితీయశ్రేణి నగరాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తరిస్తామని, వరంగల్ నుంచి ఆ విస్తరణ ప్రారంభమయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. చారిత్రక వరంగల్ నుంచి ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ ప్రారంభం కావడం సంతోషంగా ఉన్నదన్నారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో త్వరలో ఐటీ క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వచ్చేఏడాది నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ పార్క్‌లో ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన సైయెంట్, ఇంక్యుబేషన్ సెంటర్లో టెక్ మహేంద్రా క్యాంపస్‌లను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీరంగ నిపుణులు, ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సదస్సులలో ఆయన ప్రసంగించారు. ‘రెండేండ్ల క్రితం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా టెక్ మహేంద్రా అధినేత ఆనంద్ మహేంద్రా, సైయెంట్ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డిని కలిశాను. ప్రపంచవ్యాప్తంగా మీరు ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు.. హైదరాబాద్ కేంద్రంగానూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.. సాంకేతికంగా, నైపుణ్యాలకు కొదవలేని వరంగల్ వంటి నగరాల్లోనూ కార్యకలాపాలు విస్తరించాలని కోరాను. ఒక్కక్షణం కూడా సంకోచించకుండా వారు అందుకు అంగీకరించారు’ అని కేటీఆర్ చెప్పారు.

తమ విన్నపాన్ని మన్నించి వరంగల్‌లో ఐటీ పరిశ్రమలను స్థాపించిన సైయెంట్, టెక్ మహేంద్రాకు రాష్ట్రప్రభుత్వం తరఫున, ప్రత్యేకించి ఐటీశాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అన్నిరంగాల్లోనూ పోటీపడే యువత, నైపుణ్యంఉన్న వరంగల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో మూడువందల కోట్లు ప్రత్యేకంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. నిట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలే కాకుండా విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటం వరంగల్‌లో ఐటీ అభివృద్ధికి సానుకూల అంశాలవుతాయని చెప్పారు. బెంగళూరుకు మైసూరు, ముంబైకి పూణె ఎలాగో.. హైదరాబాద్‌కు వరంగల్ అలాంటిదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీరంగంలో వస్తున్న మార్పులు, సౌకర్యాలు, సౌలభ్యాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరణ అనివార్యంగా మారిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, చైన్నై తదితర పట్టణాలతో పోల్చితే.. వరంగల్ వంటి ద్వితీయశ్రేణి పట్టణాల్లో నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా.. నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న యువత అందుబాటులో ఉంటుందని కేటీఆర్ వివరించారు.

మీరే సాంకేతిక దూతలుగా.. ‘మిమ్మల్ని చూసి మీ మిత్రులు వరంగల్‌కు రావాలి. వారిని తీసుకువచ్చే అంబాసిడర్లు మీరే కావాలి’ అంటూ మంత్రి కేటీఆర్ టెక్ మహేంద్రా సీఈవో సీపీ గుర్నానీ, సైయెంట్ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకొని ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకురావాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 1.32 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్ మహేంద్రా, ప్రస్తుతం 16 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సైయెంట్ సంస్థతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ ఉన్నదని.. ఈ నేపథ్యంలో టెక్ మహేంద్రా పదింతలు రెట్టింపుతో ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్ రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మక టీఎస్ఐపాస్ విధానంతో అనేకరకాల పరిశ్రమల స్థాపనకు నాంది పలికిందని.. అందులో భాగంగానే హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు ప్రాముఖ్యం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు వరంగల్ అతి చేరువగా ఉండడం వంటి అంశాలే కాకుండా వరంగల్ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకకార్యక్రమాలను అమలుచేస్తున్నారని వివరించారు. యాదాద్రిలో రిలీజియస్ టూరిజం హబ్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో లెదర్ పార్క్, జనగామలో కొత్త తరహా పరిశ్రమలు, భువనగిరిలో మరోరకమైన పరిశ్రమ ఇలా హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను నెలకొల్పుతూ, ఇక్కడి వనరులను వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకప్పుడు ఆజంజాహీ మిల్లుకు వరంగల్ ప్రతీతి అని.. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే దేశంలోనే అతిపెద్ద జౌళి పరిశ్రమను వరంగల్‌లో నెలకొల్పుతున్నామని వివరించారు.
నెరవేరుతున్న హరిత స్వప్నం సీఎం కేసీఆర్ కలలుగన్న హరితస్వప్నం నెరవేరుతున్నదని, దేశంలో తెలంగాణ నుంచి రెండో హరితవిప్లవం మొదలైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించే స్వప్నం సాకారమవుతుందని వివరించారు. ఒకరంగంపైనే దృష్టి పెట్టకుండా.. అన్నిరంగాల సర్వతోముఖాభివృద్ధికోసం పథకాలు అమలుచేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణపై త్వరలో నిర్ణయం చాలాకాలంగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణం సమయంలో జీఎమ్మార్‌తో కుదుర్చుకున్నందున ఆ సంస్థ ద్వారానే మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించడం లేదా మరో సబ్సిడైజ్ హెలీస్పాట్ సర్వీసులను ప్రారంభించేందుకు యత్నిస్తున్నామని కేటీఆర్ వివరించారు.
ఉమ్మడి జిల్లాకొక ఉపాధి శిక్షణాకేంద్రం రాష్ట్రంలో ఉమ్మడిజిల్లాకు ఒకటి చొప్పున నైపుణ్య శిక్షణాకేంద్రాలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధిరంగాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలను స్థాపించేందుకు ప్రోత్సాహకాలు అందజేస్తూ వాటిలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా కృషిచేస్తున్నామని, ఇప్పటికే వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు.
గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టి కోసం నగరాల్లో ఐటీ, ఇతరత్రా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటూనే.. గ్రామీణప్రాంతాల్లో వృత్తి వికాసంకోసం పలు పథకాలను అమలుచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టి జరుగాలంటే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల్లో మార్పులు తీసుకురావాలని భావించిన సీఎం కేసీఆర్.. మత్స్య పరిశ్రమను, గొర్ల పెంపకాన్ని ప్రోత్సహించడంతోపాటు గ్రామీణ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపతుతున్నారని చెప్పారు.
ప్లాస్టిక్హ్రిత జాతర ప్రచార రథం ప్రారంభం ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజనజాతరను ప్లాస్టిక్హ్రితంగా నిర్వహించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ, ఆడియో విజువల్‌ను సందర్శించే ఎల్ఈడీ వాహనాన్ని మంగళవారం హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతరను వనదేవతల సాక్షిగా ప్లాస్టిక్హ్రితంగా నిర్వహించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించిందని మంత్రి వెల్లడించారు. మేడారానికి వెళ్లే భక్తులు స్వచ్ఛందంగా సహకరించి ప్లాస్టిక్ నిషేధంపై యుద్ధం ప్రకటించాలని కోరారు.
ముంబై, పుణె తరహాలో వరంగల్ ఐటీ: గుర్నాని, చైర్మన్, టెక్ మహేంద్రా వరంగల్ ఐటీ పరిశ్రమను భవిష్యత్‌లో ముంబై, పుణె తరహాలో చూడగలుగుతాం. డైనమిక్ ఐటీ మంత్రి కేటీఆర్ కృషితో అది సాధ్యమవుతుంది. మా కంపెనీ ద్వారా స్థానికంగా వేలమంది విద్యార్థులకు అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతోనే ఉన్నాం. వరంగల్‌కు విమాన సర్వీసులు అందిస్తే కంపెనీలు మరింతగా విస్తరిస్తాయి.
గ్రామీణులకు అవకాశం: బీవీఆర్ మోహన్‌రెడ్డి, సైయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల్లో నైపుణ్యం దాగి ఉంది. వారికి టాస్క్ వంటి కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తే మంచి అవకాశాలు దక్కుతాయి. సైయెంట్ క్యాంపస్‌లో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయి. కొన్నేండ్లలో వేలమందికి అవకాశాలు కల్పిస్తాం. వరంగల్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు, ఇంటెలిజెంట్ టెక్నాలజీ కూడా తీసుకువస్తున్నామని కేటీఆర్ చెప్పడం ఇక్కడ కంపెనీలు పెట్టాలనుకొనే ఐటీ సంస్థలకు ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు.
ఐటీ కంపెనీలకు పూర్తి సహకారం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌లో ఐటీ కంపెనీలకు పూర్తి సహాయసహకారాలను అందిస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను మంత్రి కేటీఆర్ ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఇచ్చి వరంగల్‌లో కంపెనీలను ఏర్పాటుచేయడంలో కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.
విద్యార్థులకు కంపెనీలు భరోసా కల్పించాలి: మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్లో త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీసెంటర్ ప్రారంభించబోతున్నాం. గ్రామీణప్రాంతాల్లో మొదటి జనరేషన్ పిల్లలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వారికి టెక్ మహేంద్రా, సైయెంట్ తదితర కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించేలా భరోసానివ్వాలి.
ఐటీ కంపెనీలు విస్తరించాలి: సత్యవతి రాథోడ్, శిశు సంక్షేమశాఖ మంత్రి వరంగల్‌లో ఐటీకంపెనీల స్థాపనకు మంత్రి కేటీఆర్ కృషి చేయడం అభినందనీయం. ఈ ప్రాంతంలో అనేకమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐటీ కంపెనీ నిర్వాహకులకు చెప్పడం సంతోషం. అందరి దృష్టి తెలంగాణ వైపు మళ్లేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు మరిన్ని కంపెనీలు, సంస్థలు రావాలి.
వరంగల్ ఐటీ పరిశ్రమను భవిష్యత్‌లో ముంబై, పుణె తరహాలో చూడగలుగుతాం. డైనమిక్ ఐటీ మంత్రి కేటీఆర్ కృషితో అది సాధ్యమవుతుంది. కేటీఆర్ ఆలోచనల మేరకు మా కంపెనీ ద్వారా స్థానికంగా వేలమంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తాం. – గుర్నానీ, చైర్మన్, టెక్ మహేంద్రా
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో నైపుణ్యం దాగి ఉంది. వారికి టాస్క్ వంటి కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తే మంచి అవకాశాలు దక్కుతాయి. వరంగల్‌కు ఐటీ మాత్రమే కాదు, ఇంటెలిజెంట్ టెక్నాలజీ కూడా తెస్తున్నామని కేటీఆర్ చెప్పడం ఐటీ పరిశ్రమలకు ఉత్సాహాన్నిస్తుంది. – బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సైయెంట్