Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఈ దశాబ్దం తెలంగాణదే

-2019 టీఆర్‌ఎస్‌దే.. 2020 కూడా టీఆర్‌ఎస్‌దే
-టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ
-మున్సిపల్‌ చట్ట సమర్థ అమలు ఈ సంవత్సర లక్ష్యం
-నెలాఖరు నుంచి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జిల్లాపార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవం
-పార్టీ నాయకులకు ఫిబ్రవరి నుంచి శిక్షణ
-ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పార్టీ
-ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా వారియర్స్‌
-మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాం
-కేసీఆర్‌ను మించిన హిందువు ఉన్నారా?
-రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని విస్మరించలేం
-ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం విశ్వాసంలోకి తీసుకోవాలి
-ఫార్మాసిటీని ఘనంగా ప్రారంభిస్తాం
-భద్రాచలం వరకు నౌకాయానానికి అవకాశం
-సీఎంగా కేసీఆరే.. ఊహాగానాలొద్దు
-ఇక్కడి రైతులంత సంతోషంగా దేశంలో ఎక్కడా లేరు
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు
-కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మీడియాతో ఇష్టాగోష్ఠి

ఈ దశాబ్దం తెలంగాణదేనని, టీఆర్‌ఎస్‌ నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా రాష్ట్రం నిలువబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మున్సిపల్‌ చట్టాన్ని సమర్థంగా అమలుచేయడమే ఈ సంవత్సరం తన లక్ష్యమని తెలిపారు. సంస్థాగతంగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు మున్సిపల్‌ ఎన్నికలు పూర్తికాగానే జనవరి చివరినుంచి జిల్లా పార్టీ కార్యాలయాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. మరో పదేండ్లు సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేస్తూ.. ఇంకా సీఎం మార్పుపై ఊహాగానాలు ఎందుకని ప్రశ్నించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్‌ బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేటీఆర్‌ స్పందన ఆయన మాటల్లోనే..

2020 కూడా టీఆర్‌ఎస్‌దే
2018 చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో 2019 సంవత్సరాన్ని ఆరంభించుకున్నాం. టీఆర్‌ఎస్‌ భారీసంఖ్యలో సీట్లు గెలిచి.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యారు. 2020 కూడా ఆదేరకమైన ఆరంభాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. 2019 టీఆర్‌ఎస్‌దే. 2020 కూడా టీఆర్‌ఎస్‌దే. 2020-2030 దశాబ్దం తెలంగాణది. ఈ దశకం తెలంగాణది కావాలని, దేశంలోనే ఒక ఆదర్శ, అగ్రశేణి రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకోవాలని, అందులోనూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ నాయకత్వంలోనే పురోగమించాలని కోరుకుంటున్నాం. ఈ నెలలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో సింహభాగం మున్సిపాలిటీలను, వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది. సర్పంచ్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో సింహభాగం గెలుచుకున్నాం. జెడ్పీ చైర్మన్లను వందశాతం గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించాం. అదేస్థాయిలో మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు వస్తాయి. మంచి శుభారంభం ఉంటుంది. 2019 చాలా ఉత్సాహంగా సాగింది. 2019లో ఏ ఎన్నిక వచ్చినా గెలిచాం. గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయాలు, పార్టీ సభ్యత్వ నమోదుద్వారా టీఆర్‌ఎస్‌ ఎంత బలంగా ఉన్నదో అంచనా వేయవచ్చు.

జిల్లా కార్యాలయాలు దాదాపు పూర్తి
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చి ఒక సంవత్సరం అయింది. ఈ బాధ్యతలో భాగంగా రెండేండ్లకోసారి నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా రికార్డుస్థాయిలో 60 లక్షలమందిని పార్టీ సభ్యులను చేయగలిగాం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి నేటివరకు ఇంత పెద్దసంఖ్యలో సభ్యత్వం జరుగలేదు. గ్రామ, వార్డు, పట్టణ, మండల కమిటీల ఏర్పాటు 95% పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌కు ఖమ్మం, మరో రెండుమూడుచోట్ల మాత్రమే శాశ్వత జిల్లాపార్టీ కార్యాలయాలుండేవి. ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో శాశ్వత కార్యాలయాల నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తికాగానే జనవరి చివరివారంనుంచి జిల్లా పార్టీ కార్యాలయాలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవాలు చేస్తారు. అత్యధిక కార్యాలయాలను ఆయనే ప్రారంభిస్తారు. జనవరి తర్వాత 11 నెలలపాటు టీఆర్‌ఎస్‌ నాయకులందరికీ శిక్షణ నిర్వహించనున్నాం. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కొన్ని సూచనలుకూడా చేశారు. శిక్షణకు అవసరమైన రిసోర్స్‌పర్సన్ల ఎంపిక పూర్తయింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతను దృష్టిలోపెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో సోషల్‌ మీడియా వారియర్స్‌ కూడా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాం.

విధుల్లో అలసత్వం వహిస్తే మొదటి చర్యలు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల మీదే
ఎన్నికల్లో పోటీచేసేవారు ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. వారి విధులు, నిధులు రెండూ చట్టంలో నిర్వచించాం. ఒకవేళ విధుల్లో అలసత్వం వహిస్తే మొదట చర్యలు తీసుకునేది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లమీదనే. ఈ విషయాన్ని సిరిసిల్ల పార్టీ సమావేశంలో మా నాయకులకు స్పష్టంగా చెప్పాను. ఇది నేను చేసి చూపిస్తాను. చైర్మన్‌ను తొలిగించే అధికారం కూడా చట్టంలో ఉన్నది. పంచాయతీలకు నెలకు రూ.339 కోట్లు ఏ విధంగా ఇస్తున్నామో అదేవిధంగా మున్సిపాలిటీలకు కూడా ఇస్తాం.

వారిని బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యేలదే
మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు టీఆర్‌ఎస్‌లో చాలా పోటీ ఉన్నది. ఒక్కో వార్డు, డివిజన్‌లో అత్యధికులు పోటీపడుతున్నారు. వారందరికీ సర్దిచెప్పి, పోటీలో ఒక్కరే ఉండేలా చేసే బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేదే. ఎందుకు టికెట్‌ ఇవ్వలేకపోతున్నామో వివరించి.. ఇతర అవకాశాలు కల్పిస్తామని చెప్పాలి. ఆ బాధ్యత అక్కడి ఎమ్మెల్యేదే. పార్టీ అభ్యర్థి గెలిచేలా ఎమ్మెల్యే, ఇంచార్జి బాధ్యత తీసుకోవాలి.

కేసీఆర్‌ ను మించిన హిందువు ఉన్నారా?
కేసీఆర్‌ను మించిన హిందువు ఉన్నారా? ఆయన కట్టిన దేవాలయం కంటే గొప్పది ఎవరైనా కట్టారా? ఆయన చేసినన్ని యాగాలు ఎవరైనా చేస్తారా? ఆయన సీఏఏను వ్యతిరేకించారు. సీఏఏను మతం ఫ్రేమ్‌లో చూడొద్దు. భారతదేశం సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం. మాకు రాజకీయంగా శత్రువులెవరూ లేరు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌.. ఇందిరాగాంధీని, రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్‌ ఏదైనా పనిచేస్తే అది చెప్పాం. చేయనిదానిని చేయలేదని చెప్పాం. సీఏఏపై పార్లమెంట్‌లో చెప్పిందే మా విధానం.

ఏపీలో పోటీచేయాలని అడుగుతున్నారు
ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ పోటీచేయాలని అడుగుతున్నారు. తెలంగాణ ఏర్పాటైతే రాష్ర్టానికి నాయకత్వ కొరత ఉంటుందని, అసలు నాయకత్వ లక్షణాలే లేవని అన్నవారితోపాటు దేశం మొత్తం ప్రశంసిస్తున్నదంటే దటీజ్‌ కేసీఆర్‌. ఐదేండ్లలో అద్భుత ఫలితాలు సాధించడం ఆషామాషీకాదు. ఇక్కడకు వచ్చిన కేంద్రమంత్రులు.. బీజేపీ నేత లక్ష్మణ్‌ వద్దని వారించినా తెలంగాణను పొగడకుండా ఉండలేకపో తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత గవర్నర్‌ తమిళిసై మంచిమాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నారు. సద్వి మర్శ చేస్తే తీసుకుంటాం. ప్రతికూలతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్‌ను మించినవారులేరని మీడియానే చెప్పింది. ఆర్టీసీ సిబ్బంది కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారు.

ఏపీసహా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు
ఏపీతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయి. అవి కొనసాగాలనేది మా విధానం. చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ పరిణతితో పరిష్కరించుకుంటాం. చంద్రబాబుతో కూడా సత్సంబంధాలే కొనసాగించాం. పొరుగువారిని ప్రేమించు అనే నినాదం కేసీఆర్‌ది. కాబట్టే కాళేశ్వరం పూర్తయింది. అంతర్రాష్ట్ర జల వివాదాలని చెప్పి తెలంగాణకు నీళ్లు రాకుండాచేసిన చరిత్ర గత ప్రభుత్వాలది. పక్క రాష్ట్రాలతో సయోధ్యతో మెలగాలని సీఎం కేసీఆర్‌ పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఒప్పందం చేసుకొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని విస్మరించలేం
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ పదవి వదులుకుంటారా.. ఉంచుకుంటారా అనేది ఆయన, వాళ్ల పార్టీ నిర్ణయించుకుంటాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీని ఇగ్నోర్‌ చేయలేం. చాలా చరిత్ర ఉన్న పార్టీ అది. అనేక ఆటుపోట్లను చూసింది. ఆషామాషీగా తీసివేయడానికిలేదు. రెండుమూడు విజయాలు రాగానే ఎగిరిపడటమనేది కరెక్టుకాదు. కాంగ్రెస్‌ తీసిపారేయదగ్గ పార్టీకాదు. రాష్ట్రంలో ఆ పార్టీయే మాకు ప్రధాన ప్రత్యర్థి. బీజేపీని నా చిన్నప్పటినుంచి చూస్తున్నా. అప్పుడు అంతే ఉన్నది.. ఇప్పుడూ అంతే ఉన్నది. అప్పుడప్పుడు అడ్డిమారి గుడ్డిదెబ్బన గెలుస్తది.

అధికారిపై వ్యాఖ్యలు తగదు
హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌పై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను ఐపీఎస్‌ల సంఘం, పోలీసు అధికారుల సంఘం ఖండించాయి. ఆరెస్సెస్‌, బీజేపీ, ఎంఐఎం సభలు పెట్టుకున్నాయి. వాళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు వీళ్లకు ఇచ్చేవారు. ఆ ప్రాం తంలో వద్దని చెప్పారు. సరూర్‌నగర్‌ లేదా మరోచోట అయితే ఇచ్చేవారేమో. తెలంగాణలో ఉన్నట్టు శాంతిభద్రతలు, ప్రశాంత పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. ర్యాలీకి అనుమతి ఇవ్వకుంటే అవినీతిపరుడు అనడం ఉత్తమ్‌కు సరికాదు. ఒక ఆఫీసర్‌పై దుర్భాషలాడటం మంచిపద్ధతి కాదు.

మున్సిపల్‌ చట్టం సమర్థ అమలే నా లక్ష్యం
కొత్త మున్సిపల్‌ చట్టం చాలా పదునుగా, సమర్థంగా అమలుచేయాలనేది ఈ సంవత్సరం మున్సిపల్‌శాఖ మంత్రిగా నా లక్ష్యం.. నా గోల్‌.. నా టాస్క్‌. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచే దిశగా, పురపాలనను కొత్తపుంతలు తొక్కించే దిశగా, మున్సిపల్‌ చట్టాన్ని అమలుచేస్తాం. మరో నాలుగేండ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటుంది. మున్సిపాలిటీ పాలకవర్గాలను టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టినట్టయితే మంచి సమన్వయంతో పనిచేస్తారు. అవినీతిరహితంగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. 75 గజాలలోపు ఇంటిస్థలం ఉంటే వారు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదు. స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) ద్వారా ఇల్లు నిర్మించుకోవచ్చు. 75 గజాల కంటే ఎక్కువస్థలం ఎంత ఉన్నా.. వారికి 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. దీనిలోని లోపాలు సవరించాం. ఏదైనా పత్రాలు లేకుంటే, షార్ట్‌ఫాల్‌ ఉంటే వారంలోపే యజమానికి తెలియజేయాలి.

ఆ తర్వాత 22వ రోజున అధికారుల సంతకంతో అనుమతి పత్రం సంబంధిత యజమానికి పంపించాలి. ఆస్తిపన్నులో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ విధానం తీసుకొచ్చాం. అయితే తప్పుడు అసెస్‌మెంట్‌ ఇస్తే దానిపై 25 రెట్లు అపరాధ రుసుం వేసే అవకాశం ఈ చట్టంలో ఉన్నది. ఎక్కడైనా, ఎవరైనా అక్రమ నిర్మాణం, అక్రమ లే అవుట్‌వేస్తే వారికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం ఈ చట్టం ద్వారా సంక్రమించింది. తప్పుడు అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏర్పాటుచేశాం. కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పించాం. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిషనర్లకు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. ఒకవైపు పల్లెప్రగతి, మరోవైపు పట్టణప్రగతి కార్యక్రమాలు అమలుచేస్తాం. రెండూ సమాంతరంగా సాగితే రాష్ట్రమంతటా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

ప్రపంచంతో పోటీపడాలంటే..
చైనాతో పోటీపడాలంటే భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేయాల్సి ఉన్నది. చిన్నచిన్న పార్కులు ఏర్పాటుచేస్తే పోటీపడలేం. అందుకే ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్కులు పెద్దఎత్తున ఏర్పాటుచేశాం. దీనిద్వారా ప్రపంచంతో పోటీపడొచ్చు. కేంద్రం మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ ప్రకటించకముందే ఇక్కడ ఏర్పాటుచేశాం. చైనా, వియత్నాం, ఇండోనేషియాలతో పోటీపడాలనుకున్నప్పుడు భారీఎత్తున ఫార్మాసిటీ అవసరం. సిరిసిల్లలో మెగాపవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటుచేయాలని నాలుగేండ్లనుంచి అడుగుతున్నా. ఇంతవరకు పురోగతిలేదు. డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌ను హైదరాబాద్‌- బెంగళూరుకు ఇవ్వాల్సిఉండే. కానీ ఏమీలేని బుందేల్‌ఖండ్‌కు ఇచ్చారు. వాస్తవంగా హైదరాబాద్‌, బెంగళూరులో రక్షణ సంబంధిత పరిశ్రమలు భారీఎత్తున ఉన్నాయి. దేశంలో ఢిల్లీ- ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (డీఎంఐసీ) ఒక్కటే ఎందుకు. సదరన్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (ఎస్‌ఐసీ)ను హైదరాబాద్‌ బెంగళూరు, చన్నైలతో కలిపి ఏర్పాటుచేయండి. నాలుగు రాష్ట్రాలకు లబ్ధి కలుగుతుంది.

పారిశ్రామికంగా ముఖ్యమైన సంవత్సరం..
పారిశ్రామికంగా 2020 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఇందులో మూడురంగాలున్నాయి. పరిశ్రమలశాఖ మంత్రిగా వీటిపై నా ప్రధాన దృష్టి ఉంటుంది. మ్యానుఫాక్చరింగ్‌ విభాగం. ఇందులో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగం ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌లో రాబోయే నాలుగేండ్లలో మూడులక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఉద్దేశం. టెక్స్‌టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో తెలంగాణలో రెండో హరిత విప్లవం వస్తుంది. సర్‌ప్లస్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ ఉంటుంది.

ఫార్మాసిటీని ఘనంగా ప్రారంభిస్తాం
2020లో ఫార్మాసిటీని ఘనంగా ప్రారంభిస్తాం. ఇప్పటికే దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. నిమ్జ్‌ హోదా వచ్చింది. పదివేల ఎకరాల భూమి సేకరించాం. మరో రెండువేల ఎకరాలు సేకరించాల్సి ఉన్నది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కాలుష్యం లేకుండా చూడాలని, అలాకాకుంటే ప్రాజెక్టును సస్పెండ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా చెప్పారు. అంత కఠినంగా సీఎం ఉన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముకానీయం. భూమి కేటాయిస్తే తీసుకోవడానికి అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ఇప్పటికే సబ్‌స్టేషన్‌, రోడ్లు నిర్మిస్తున్నారు. సీఈటీపీలు ఏర్పాటుచేయాల్సి ఉన్నది. అన్నిరకాల విభాగాలు అక్కడ ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఇటీవలే ముంబైలో అజయ్‌ పిరామిల్‌ కలిసినప్పుడు ఫార్మాకంపెనీల కంటే ప్రభుత్వమే ముందున్నదని అన్నారు. ఈ నెల 3న ముంబైలో జరిగే ఇండియన్‌ ఫార్మాసూటికల్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) బోర్డు సమావేశానికి హాజరవుతున్నాను. అక్కడ ఫార్మాసిటీ గురించి వివరిస్తాను.

భద్రాచలం వరకు నౌకలు..
ఎగుమతులకు బందరుపోర్టుతో ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన ఉండే. ఇంకా ఖరారుకాలేదు. ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ మూమెంట్‌ వస్తే నౌకలు భద్రాచలంవరకు తిరుగుతాయి. పోర్టు కూడా అవసరంలేదు. మిడ్‌మానేరు, మల్లన్నసాగర్‌ పూర్తయిన తర్వాత కొత్తగా ఎయిర్‌పోర్టులకన్నా సీపోర్టులు, సీప్లేన్లు విస్తృతం అయ్యే అవకాశమున్నది. ఇండియా జనాభా ఎక్కువ. డబ్బులు తక్కువ. ఎక్కువ ఎయిర్‌పోర్టులు పెట్టలేం. మల్లన్నసాగర్‌లో దిగొచ్చు. ఎల్లంపల్లి, శ్రీశైలం, వట్టెం, కరివెనలో దిగొచ్చు. రాబోయే దశకం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నది. విజయవాడ రహదారిలో డ్రైపోర్టుకు సంబంధించి ఇంకా స్థల అన్వేషణ కొనసాగుతున్నది.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పార్టీ
శాసనసభ ఎన్నికలకు మరో నాలుగేండ్లు ఉన్నది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీ ఉండాలి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరవేసేది కార్యకర్తలే. సోషల్‌, డిజిటల్‌ మీడియా ఉన్నా వాటన్నింటికంటే బ్రహ్మాండమైన మాధ్యమం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం, వారు సృష్టించే అపోహలను తిప్పికొట్టాలంటే పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు బాగా జరుగాలనేది ఆలోచన. దానిలోభాగంగానే శిక్షణ కార్యక్రమాలు మొదలుపెడుతాం. మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే ఇంచార్జిల నుంచి సమాచారం తెప్పించుకున్నాం. మున్సిపల్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఉన్నంత సన్నద్ధంగా మరే పార్టీ లేదు. ఇప్పటికే మూడుసార్లు నివేదికలు తెప్పించుకున్నాం. ఒకటిరెండు రోజుల్లో మరోసారి సర్వే నివేదికలు అందబోతున్నాయి. వాటన్నింటినీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నివేదిస్తాం. ఈ నెల మొదటివారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా పరిషత్తు అధ్యక్షుల సంయుక్త సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతుంది.

ఇక్కడి రైతులంత సంతోషంగా దేశంలో మరెక్కడా లేరు
తెలంగాణలో రైతులు ఉన్నంత సంతోషంగా దేశంలో ఎక్కడా లేరు. పాతబస్తీకి కచ్చితంగా మెట్రోరైలు వస్తుంది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోరైలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభిస్తారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ శంషాబాద్‌ అంత ర్జాతీయ విమానాశ్ర యం వరకు వస్తుంది. ఎంఐఎంతో గతంలో కలిసి పోటీచేయలేదు. ఇప్పుడు కూడా కలిసిపోటీచేయం. భారతీయులు, తెలంగాణవారు చాలా తెలివైనవారు. ఆషామాషీగా తీసుకోవడానికిలేదు. గతంలో బీజేపీ పార్లమెంట్‌లో పెట్టిన బిల్లులకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. సీఏఏ విషయంలో ముస్లింలను చేరిస్తే మద్దతు ఇస్తామని పార్లమెంట్‌లోనే చెప్పాం.

ఆ భూములు ఇవ్వడంలేదు…
కంటోన్మెంట్‌ ప్రాంతంలో ైస్కెవేలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అక్కడ భూములు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకురావడంలేదు. అనేకమార్లు కలిశాం. వినతిపత్రాలిచ్చాం. ఇంతవరకు స్పందన లేదు. లక్నో, బెంగళూరులో ఇచ్చారు. ఇక్కడ ఇవ్వలేదు. రసూల్‌పుర చౌరస్తాలో 1.6 ఎకరాలు అడిగాం. అదీ ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ తమ విధానంకాదని రవిశంకర్‌ప్రసాద్‌ చెప్పారు. కేంద్రం ప్రభుత్వపరంగా ఐటీకి పైసా సహా యం చేయకపోయినా ఈ రంగంలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుంటుంది. కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలేదు.

ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం విశ్వాసంలోకి తీసుకోవాలి
కేంద్రం మంగళవారం రూ.104 లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించింది. వాటి వివరాలు రావాల్సి ఉన్నది. రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం రాజకీయాలకు అతీతంగా విశ్వాసంలోకి తీసుకోవాలనుకుంటేనే మంచిది. ఇందులోనూ రాజకీయాలు చేస్తామంటే వాళ్లే దెబ్బతింటారు. దేశానికి కూడా నష్టం. దేశం అనుకున్నంత వేగంగా పురోగమించదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.